స్వాతంత్ర్య దినోత్సవం: నెహ్రూ, జిన్నాల మధ్య దూరం ఎలా పెరిగింది?

నెహ్రూ, జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెహ్రూ, జిన్నా
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

జవహర్ లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా.. వీరిద్దరిపైనా ఆంగ్లేయుల ప్రభావం కాస్త ఎక్కువే కనిపిస్తుంది. ఇద్దరూ లండన్‌లో బారిస్టర్ చదువుకున్నారు. వీరికి మాతృభాష కంటే ఇంగ్లిష్‌లో మాట్లాడటమే కాస్త సౌకర్యంగా ఉండేది.

నెహ్రూలా జిన్నా నాస్తికులు కారు. అయితే, ఇస్లాం నిషేధించిన మద్యాన్ని రాత్రి పూట ఒకటి రెండు పెగ్గులు తీసుకోవడానికి జిన్నా వెనుకాడేవారు కాదు. ఇద్దరిలోనూ అహంకారం, మొండితనం, చాలా త్వరగా అపార్థం చేసుకునే లక్షణాలు ఉండేవి.

ఇద్దరూ తమను అభిమానులు చుట్టుముట్టి ఉండడాన్ని ఇష్టపడేవారు. అయినా ఇద్దరూ ఏకాంత జీవితం గడిపేవారు.

ప్రముఖ జర్నలిస్ట్ నిసీద్ హజారీ తన మిడ్ నైట్స్ ఫ్యూరీస్, ద డెడ్లీ లెగెసీ ఆఫ్ ఇండియన్ పార్టిషన్ పుస్తకంలో ఇద్దరు నేతల గురించీ రాశారు.

70ల వయసులో జిన్నా సన్నంగా, బలహీనంగా ఉంటే.. నెహ్రూ ఆయనకు భిన్నంగా చాలా చలాకీగా ఉండేవారు.

జీవితాంతం సిగరెట్లు తాగిన జిన్నా తరచూ ఆయాస పడుతూ ఉండేవారు. జిన్నా ఆరడుగుల పొడవున్నా 63 కిలోలే ఉండేవారు. ఒకప్పుడు ఆయన జుట్టును ప్రముఖ నటుడు జెరాల్డ్ డూ మారియేతో పోల్చేవారు. కానీ 40వ దశకం మధ్య నాటికి ఆయన జుట్టు తెల్లగా అవుతూ వచ్చింది. నెహ్రూ జుట్టు కూడా రాలిపోవడంతో ఆయన దాన్ని కవర్ చేయడానికి గాంధీ టోపీ పెట్టుకునేవారు.

మిడ్ నైట్స్ ఫ్యూరీస్, ద డెడ్లీ లెగెసీ ఆఫ్ ఇండియన్ పార్టిషన్

ఫొటో సోర్స్, Penguin Books Ltd

ఫొటో క్యాప్షన్, మిడ్ నైట్స్ ఫ్యూరీస్, ద డెడ్లీ లెగెసీ ఆఫ్ ఇండియన్ పార్టిషన్

నెహ్రూ, జిన్నా మధ్య వ్యత్యాసాలు

జిన్నా వ్యక్తిత్వంలో కాస్త ఉత్సాహం కూడా కనిపించేది కాదు. ఒకప్పుడు ఆయనకు సన్నిహితురాలైన సరోజినీ నాయుడు ఆయన గురించి చెబుతూ “జిన్నా చల్లగా ఉండేవారు. ఆయనను కలిసినప్పుడు అప్పుడప్పుడూ మనకు కోటు అవసరేమేమో అనిపించేది” అన్నారు.

ఒక కంటికి కళ్లజోడు(మోనోకల్) పెట్టుకునే జిన్నా సుదీర్ఘ చర్చలను ఎంత ఆస్వాదిస్తే, నెహ్రూ వాటిని అంత అసహ్యించుకునేవారు.

జిన్నా తరచూ తన ప్రత్యర్థుల లోటుపాట్లను పసిగట్టి, వారు తనకు లొంగిపోయేలా చేసేవారు. అంతకు ముందు కంటే ఎక్కువ ఆఫర్ చేసేవరకూ ఆయన ఎలాంటి ఒప్పందాలకు సిద్ధమయ్యేవారు కాదు.

ఒకసారి నెహ్రూ గురించి బ్రిటిష్ రచయిత బెవర్లీ నికోల్స్‌తో జిన్నా ఇలా అన్నారు. “ఈ జీవితంలో మా ఇద్దరినీ కలిపేది ఏదీ లేదు. మా పేరు, మా బట్టలు, మా ఆహారపు అలవాట్లు అన్నీ పరస్పరం భిన్నంగా ఉంటాయి. మా ఆర్థిక జీవితం, మా విద్యా దృక్పథం, మహిళలు, మనుషుల పట్ల మా ఆలోచన ఇలా ప్రతి ఒక్కటీ ఒకరినొకరు సవాలు చేస్తున్నట్లు కనిపిస్తాయి’’ అన్నారు.

జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

జిన్నాతో నెహ్రూ సైద్ధాంతిక విరోధం

పాకిస్తాన్ ఏర్పాటు అనే లక్ష్యం తొలుత జిన్నా మనుసులో నుంచి రాలేదు. కానీ అప్పట్లో పాక్ పేరు చెప్పగానే జిన్నానే అందరికీ గుర్తొచ్చేవారు.

ముస్లిం లీగ్ నాయకుడైన జిన్నా ఒక ముస్లిం దేశం ఏర్పాటు గురించి ఆలోచించడం ప్రారంభించినప్పటి నుంచి, జవహర్ లాల్ నెహ్రూ ఆయనకు సైద్ధాంతిక విరోధి అయిపోయారు.

హిందూ-ముస్లిం ఇద్దరూ వేరువేరు అనే ఆలోచనను నెహ్రూ మొదట్నుంచీ వ్యతిరేకిస్తూనే వచ్చారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు పరస్పరం కలిసిమెలిసి ఉండడమే భారత్‌కు అసలైన గుర్తింపని ఆయన భావించేవారు. ఆయన భారత్‌ను అమెరికాలానే చూసేవారు. ఆ దేశంలాగే వేరు వేరు సంస్కృతులను స్వీకరించే అద్భుత సామర్థ్యం భారత్‌కు ఉందని భావించేవారు.

మతం ఆధారంగా ఒక కొత్త దేశం ఆవిర్భవించగలదనే ఆలోచనకు నెహ్రూ సిద్ధాంతాలు వ్యతిరేకం. ఆయన వాటిని మధ్యయుగం నాటి ఆలోచనలుగా భావించేవారు.

ముస్లిం సమస్యలపై ఏమాత్రం ఆందోళన లేనివారు, అసలు అణచివేతనే ఎదుర్కోని వారు ఒక ముస్లిం దేశం ఏర్పాటు కోసం వాదించడం అనేది నెహ్రూ దృష్టిలో ఒక గొప్ప విచిత్రం.

జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

మాటల బాణాలు

నెహ్రూ, జిన్నా ఒకరికిఒకరు 30 ఏళ్ల ముందునుంచీ తెలుసు. కానీ 40వ దశకంలో వీరి మధ్య దూరం పెరిగింది. ఈ విభేదాలను ఇద్దరూ వ్యక్తిగతంగానూ తీసుకునేవారు.

‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమంలో జైల్లో ఉన్న సమయంలో నెహ్రూ తన జైలు డైరీలో “ముస్లిం లీగ్‌కు చెందిన ఈ నేత.. మనసు లేనివారికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ” అని రాశారు.

నెహ్రూ అన్న దానికి జిన్నా అంతే కఠినంగా సమాధానం ఇచ్చారు.

‘‘భారత్‌లో మతపరమైన ఐకమత్యం, అన్ని వర్గాల మధ్య సోదరభావం అనే ఈ యువనేత ఆలోచనలోనే ప్రాథమిక లోపం ఉంది. నెహ్రూ పీటర్ పాన్ లాంటి వాడు. కొత్తగా ఏం నేర్చుకోరు, ఏ పాత దాన్నీ వదలరు” అన్నారు.

జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

నెహ్రూ ఘాటు వ్యాఖ్యలు

1937 ఎన్నికల్లో ముస్లిం లీగ్‌కు ఐదు శాతం కంటే తక్కువే ముస్లిం ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ ముస్లింలు అందరికీ ప్రాతినిధ్యం వహించే ఏకైక పార్టీ తమదేనని జిన్నా చెప్పేవారు. మొదట్లో జిన్నాను నెహ్రూ సీరియస్‌గా తీసుకోలేదు.

అప్పట్లో జిన్నాకు నెహ్రూ లేఖలు రాసేవారు. ‘‘నా ఆలోచనలను మీకు వివరించడం చాలా కష్టంగా ఉంటోంది’’అని ఓ లేఖలో జిన్నా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వీరి మధ్య లేఖలు ఆగిపోయాయి.

స్వాతంత్ర్యానికి సరిగ్గా నాలుగేళ్ల ముందు, అంటే 1943లో తన జైలు డైరీలో జిన్నా గురించి నెహ్రూ ప్రస్తావించారు. జిన్నాకు పాకిస్తాన్ ఇచ్చేందుకు దాదాపుగా ఒప్పుకున్నట్లే దీనిలో నెహ్రూ వివరించారు.

‘‘ఆ చిన్న దేశాన్ని జిన్నాకు వదిలెస్తే, భారత్ అభివృద్ధి పథంలో ఆయన సృష్టించే అడ్డంకులు తగ్గిపోతాయి’’అని నెహ్రూ వ్యాఖ్యానించారు. అయితే, అప్పటికి పాకిస్తాన్‌ ఏర్పాటుకు బహిరంగంగా నెహ్రూ అంగీకారం తెలపలేదు.

1944లో ముస్లిం లీగ్ కాన్ఫెరెన్స్‌లో మూడు గంటలపాటు జిన్నా ప్రసంగించారు. దీని గురించి జైలు డైరీలో నెహ్రూ ప్రస్తావించారు.

‘‘జిన్నా.. ఎంత నీచమైన, అహంకారపూరిత ప్రసంగం ఇదీ. ఇతడి ప్రభావం ఇక్కడి ప్రజలపై ఉండటం భారతీయులకు, ముస్లింలకు దురదృష్టకరం. భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఈయన ఏకంగా హిందూ, ముస్లింల మధ్య మతపరమైన పోరాటంగా మార్చేశారు’’అని నెహ్రూ అన్నారు.

ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ అండ్ ఆఫ్టర్

ఫొటో సోర్స్, Rupa & Co

ఫొటో క్యాప్షన్, ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ అండ్ ఆఫ్టర్

సంతోషంగా బ్రిటన్‌..

జిన్నా-నెహ్రూల మధ్య విభేదాలను తన పుస్తకం ‘‘ఇండియా ఫ్రమ్ కర్జన్ టు నెహ్రూ అండ్ ఆఫ్టర్’’లో సీనియర్ జర్నలిస్టు దుర్గా దాస్ ప్రస్తావించారు.

‘‘ముస్లిం లీగ్‌కు అధ్యక్షుడి హోదాలో 1938లో జిన్నా ప్రసంగించారు. అప్పట్లో భారత్‌లో రెండే పవర్లు (బ్రిటిష్, కాంగ్రెస్) ఉండేవన్న నెహ్రూ వాదనను జిన్నా వ్యతిరేకించారు. భారత్‌లో రెండు కాదు, నాలుగు పవర్లు (బ్రిటిష్ రాజ్, స్వతంత్ర రాజ్యాలు, హిందువులు, ముస్లింలు) ఉన్నాయని జిన్నా అన్నారు’’అని దుర్గా దాస్ వివరించారు.

‘‘కాంగ్రెస్‌ను జిన్నా ఫాసిస్టు సంస్థగా అభివర్ణించేవారు. తమ ప్రధాన విరోధిగా భావించే కాంగ్రెస్‌పై జిన్నా ఇలా ధ్వజమెత్తడాన్ని చూసి బ్రిటిష్‌వారు సంతోషించేవారు. ఈ వ్యాఖ్యలు గాంధీజీ మనసును గాయపరుస్తాయని నేను చెప్పినప్పుడు, జిన్నా ధోరణి మరింత కఠినంగా మారేది. గాంధీకి కూడా ఈ భాష అర్థం అవుతుందని జిన్నా అనేవారు’’అని దాస్ రాసుకొచ్చారు.

సినియర్ జర్నలిస్టు నిసీద్ హజారీ
ఫొటో క్యాప్షన్, సినియర్ జర్నలిస్టు నిసీద్ హజారీ

అగ్గి పెట్టంత అయినా సరే...

స్వాతంత్ర్యానికి ముందుగా, లండన్‌లో జరిగిన చర్చల్లో నెహ్రూను అవమానించేందుకు దొరికిన ఏ అవకాశాన్నీ జిన్నా వదిలిపెట్టలేదు. సిక్కు నాయకుడు బల్‌దేవ్ సింగ్‌ను కూడా తన వెంట తిప్పుకునేందుకు జిన్నా తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ విషయాన్ని నెహ్రూ జీవిత చరిత్రలో ప్రముఖ రచయిత ఎస్ గోపాల్ ప్రస్తావించారు. ‘‘ఒక రోజు జిన్నా నన్ను కలిశారు. ఆ రోజు అక్కడ బల్లపై ఉన్న అగ్గిపెట్టెను నాకు చూపించారు. అంత చోటులో పాకిస్తాన్‌ను ఏర్పాటుచేసినా తనకు ఓకేనని జిన్నా అన్నారు’’అని బల్‌దేవ్ చెప్పినట్లు గోపాల్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘మీరు సిక్కుల్ని ముస్లిం లీగ్‌లో చేరేలా ఒప్పిస్తే, మనం అద్భుతమైన పాకిస్తాన్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు. మన దేశం దిల్లీ వరకూ ఉంటుంది’’అని జిన్నా తనతో అన్నట్లు బల్‌దేవ్ వివరించారు.

నెహ్రూ

ఫొటో సోర్స్, Getty Images

తాత్కాలిక ప్రభుత్వంలో ఇద్దరూ కలిస్తే..

నెహ్రూ, జిన్నా కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో కొన్నాళ్లు కొనసాగితే, వారి మధ్య విభేదాలు తొలగిపోతాయని అప్పటి వైస్రాయ్ లార్డ్ వావెల్ భావించారు.

దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తాత్కాలిక ప్రభుత్వానికి ఆరుగురు కాంగ్రెస్ ప్రతినిధులు, ఐదుగురు ముస్లిం లీగ్ సభ్యులు, ముగ్గురు మైనారిటీ ప్రతినిధులను నామినేట్ చేశారు.

జిన్నా, నెహ్రూల మధ్య విభేదాలపై భారత స్వాతంత్ర్యం ఆధారపడి ఉంటుందనే సంకేతాన్ని వావెల్ ఇచ్చారు. దీంతో మళ్లీ ఆగస్టు 15, 1946న బొంబయిలో తనను కలవాలని భావిస్తున్నట్లు జిన్నాకు నెహ్రూ లేఖ రాశారు. అయితే, జిన్నా నుంచి సానుకూల స్పందనలను ఆశించొద్దని అప్పటికే నెహ్రూతో వావెల్ అన్నారు.

అంతా అనుకున్నట్లే జరిగింది కూడా. ‘‘మీకు, వైస్రాయ్‌కు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కింద నేను పనిచేయాలని మీరు భావిస్తున్నారా? అయితే, ఆ ఆలోచనను వెంటనే మీ మనసు లోనుంచి తీసేయండి’’అని జిన్నా ప్రత్యుత్తరం ఇచ్చారు.

ఆగస్టు 15న బొంబయికి చేరుకున్నాక నెహ్రూకు జిన్నా మరొక లేఖ రాశారు. ‘‘మీరు ఇచ్చిన కొన్ని వివరణలు నాకు ఆమోద యోగ్యంగా లేవు. అయితే, మీరు నన్ను కలవాలని భావిస్తున్నట్ల చెప్పారు. సాయంత్రం ఆరు గంటలకు మీరు వస్తే కలుద్దాం’’అని జిన్నా వ్యాఖ్యానించారు.

నెహ్రూ, జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

చర్చలు విఫలం

జిన్నాను కలిసేందుకు సాయంత్రం 5.50 గంటలకే ఆయన నివాసానికి నెహ్రూ వచ్చారు. న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాక, మలబార్ హిల్స్‌లో మార్బుల్‌తో జిన్నా విలాసవంతమైన ఇల్లును కట్టించుకున్నారు. 17ఏళ్ల క్రితం భార్య మరణించడంతో, తన సోదరి ఫాతిమా, మరికొందరు పనివారితో ఆ ఇంట్లో జిన్నా ఉండేవారు.

ఆ రోజు ఇద్దరి మధ్యా దాదాపు 80 నిమిషాలపాటు చర్చలు జరిగాయి. దీని గురించి తన ఆత్మకథలో వావెల్ ప్రస్తావించారు.

‘‘ఇద్దరూ పట్టుదలతోనే ఉన్నారు. సర్దుకుపోవడానికి ఎవరూ అంగీకరించలేదు. వయసులో జిన్నా కంటే నెహ్రూ చిన్నవారు. దీంతో నెహ్రూ కింద పనిచేసేందుకు జిన్నా అంగీకరించలేదు. అదే సమయంలో ముస్లిం కోటా కింద మంత్రి పదవి తీసుకునేందుకు సిద్ధపడలేదు.’’

మరోవైపు తన ప్రభుత్వంలో తనను ప్రశ్నించే ముస్లిం లీగ్ ప్రతినిధులు ఉండకూడదని నెహ్రూ భావించేవారు. బ్రిటిష్ నుంచి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం జరుగుతున్న పోరాటం వీరి వల్ల నీరుగారి పోకూడదని ఆయన అనుకునేవారు. ‘‘కాంగ్రెస్ చేతులు, కాళ్లకు సంకెళ్లు వేయకూడదని నెహ్రూ అనుకునేవారు’’అని తన పుస్తకంలో వావెల్ వివరించారు.

జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

జిన్నా గురించి నెహ్రూ ఏం చెప్పారు?

మౌంట్‌బ్యాటన్ వైస్రాయ్‌గా బాధ్యతలు తీసుకునే సమయానికి, నెహ్రూతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ సింగపూర్‌లో కలిశారు.

భారత్‌లో ఏం జరుగుతుందో నెహ్రూ ద్వారా మౌంట్‌బ్యాటన్ తెలుసుకునేవారు. ‘‘జిన్నా గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు?’’అని ఒకసారి నెహ్రూను ఆయన అడిగారు.

ఈ విషయాన్ని తన పుస్తకం ‘‘మౌంట్‌బ్యాటన్’’లో క్యాంప్‌బెల్ జాన్సన్ ప్రస్తావించారు. ‘‘జిన్నా గురించి మౌంట్‌బ్యాటన్‌కు నెహ్రూ ఆసక్తికర సంగతులు చెప్పారు. ‘60ఏళ్లు దాటిన తర్వాతే జిన్నాకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది. ఆయన కంటూ భారత రాజకీయాల్లో ఎలాంటి ప్రత్యేక హోదా లేదు. కానీ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన విజయానికి కారణం ఏమిటంటే.. ఎప్పుడూ నెగిటివ్‌గా ఆలోచించడమే’అని మౌంట్‌బ్యాటన్‌తో నెహ్రూ అన్నారు.’’

జిన్నా ఆఫ్ పాకిస్తాన్

ఫొటో సోర్స్, Oxford University Press

ఫొటో క్యాప్షన్, జిన్నా ఆఫ్ పాకిస్తాన్

ప్రధాన మంత్రిని చేస్తానని జిన్నాకు గాంధీ ఆఫర్

1947 మార్చి 31 నుంచి ఏప్రిల్ 4ల మధ్య మౌంట్‌బ్యాటన్‌తో గాంధీ ఐదుసార్లు చర్చలు జరిపారు.

ఈ విషయాలను తన ఆత్మకథలో మౌంట్‌బ్యాటన్ రాసుకొచ్చారు. ‘‘ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే తొలి అవకాశాన్ని జిన్నాకే ఇవ్వాలని గాంధీ నాతో ప్రతిపాదించారు. ‘ఈ ప్రతిపాదనకు జిన్నా ఒప్పుకుంటే, కాంగ్రెస్ ఆయనకు మద్దతు ఇస్తుంది. జిన్నా మంత్రి వర్గంలో అందరూ భారతీయులే ఉంటే ఆయనకు మద్దతు తెలుపుతుంది’అని గాంధీ నాతో అన్నారు. ఆ ప్రతిపాదన వినగానే నేను షాక్‌కు గురయ్యాను’’అని మౌంట్‌బ్యాటన్ వివరించారు.

దేశ విభజనను అడ్డుకునేందుకు గాంధీ ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. అయితే, ఇది జిన్నా వరకు చేరలేదు.

‘‘దీనిపై మొదట నెహ్రూతో మౌంట్‌బ్యాటన్ మాట్లాడారు. దీంతో నెహ్రూ నుంచి ప్రతికూల స్పందన వచ్చింది’’అని జిన్నా జీవితచరిత్ర ‘‘జిన్నా ఆఫ్ పాకిస్తాన్’’లో స్టాన్లీ వాల్పెర్ట్ రాసుకొచ్చారు.

‘‘తనకు బదులుగా జిన్నాను ప్రధాన మంత్రిని చేస్తానని గాంధీ చెప్పడంపై నెహ్రూ మనసు చాలా గాయపడింది. అయితే, జిన్నాను గాంధీ బాగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి ప్రతిపాదనతో ఆయన మనసు మార్చొచ్చని గాంధీ భావించారు. అయితే, నెహ్రూ, మౌంట్‌బ్యాటెన్ కలిసి ఈ ప్రతిపాదనను అటకెక్కించారు.’’

జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

స్వాంత్ర్యానికి వారం రోజుల ముందు కరాచీకి..

ఏప్రిల్ 7, 1947న జిన్నా తన సోదరితో కలిసి దిల్లీ నుంచి కరాచీకి వెళ్లారు. అప్పుడు జిన్నాకు స్వాగతం పలుకుతూ వేల మంది మద్దతుదారులు నినాదాలు చేశారు. విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లేవరకు దారి పొడవునా ఆయన ప్రజలు స్వాగతం పలికారు.

‘‘నా జీవితంలో పాకిస్తాన్ కల నెరవేరుతుందని నేను అనుకోలేదు’’అని తన పక్కనున్న లెఫ్టినెంట్ ఎస్ఎం హసన్‌తో జిన్నా అన్నారు.

ఆగస్టు 14న పాకిస్తాన్ అవతరణను పురస్కరించుకొని ఆ రోజు రాత్రి ఏర్పాటుచేసిన విందులో జిన్నా సోదరి ఫాతిమా, పాక్ ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్‌ల మధ్య మౌంట్‌బ్యాటన్ కూర్చుకున్నారు.

‘‘దిల్లీలో అర్ధరాత్రి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడంపై జిన్నా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జ్యోతిష్యులు పెట్టే ముహూర్తాలతో దేశాన్ని నడపడమేంటని అన్నారు’’అని మౌంట్‌బ్యాటన్ రాసుకొచ్చారు.

మౌంట్‌బ్యాటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మౌంట్‌బ్యాటన్

జిన్నా మరణించిన మరుసటి రోజు ‘‘హైదరాబాద్‌కు’’

ఆ తర్వాత నెహ్రూ, జిన్నా కేవలం ఒకసారి మాత్రమే కలిశారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన రెండు వారాలకు పెరుగుతున్న శరణార్థుల సమస్యకు పరిష్కారం చూపేందుకు జిన్నా లాహోర్‌కు చేరుకున్నారు.

ఆగస్టు 29న ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు నెహ్రూ, జిన్నాలతోపాటు భారత్, పాకిస్తాన్‌ల నాయకులు చర్చలు జరిపారు. నెహ్రూ, జిన్నా కూర్చుని చర్చలు జరపడం ఇదే చివరిసారి. ఈ సమావేశానికి సంవత్సరం 13 రోజుల తర్వాత జిన్నా మరణించారు.

1948 సెప్టెంబరు 11న జిన్నా మరణించారు. ఆ మరుసటి రోజే జిన్నాతో తన విరోధ భావంపై నెహ్రూ చివరి దెబ్బ కొట్టారు.

‘‘పాకిస్తాన్ జాతిపితకు అంత్యక్రియలు జరుగుతుండగా... హైదరాబాద్‌పైకి నెహ్రూ తన సైన్యాన్ని పంపించారు’’అని సర్దార్ పటేల్ జీవిత చరిత్రలో రాజ్‌మోహన్ గాంధీ రాసుకొచ్చారు.

జిన్నాకు గౌరవందనం సమర్పిస్తూ మన జెండాలను అవనతం చేద్దామా? అని సర్దార్ పటేల్‌ను అప్పటి బెంగాల్ గవర్నర్ కైలాశ్‌నాథ్ కట్జూ అడిగారు. దీనికి పటేల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘‘ఆయన ఏమైనా మీకు బంధువా?’’అని అడిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)