కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1999, మే 26.. రాత్రి 9.30కి భారత పదాతిదళ చీఫ్ జనరల్ వేదప్రకాశ్ మలిక్ గదిలోని సెక్యూర్డ్ ఇంటర్నల్ ఎక్ఛేంజ్ ఫోన్ మోగింది.
అవతలి వైపు భారత నిఘా ఏజెన్సీ 'రా' సెక్రటరీ అరవింద్ దవే ఉన్నారు. ఆయన జనరల్ మలిక్‌కు తమ వాళ్లు పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు టాప్ జనరల్‌ల మాటలు రికార్డ్ చేశారని చెప్పారు.
ఇద్దరిలో ఒక జనరల్ బీజింగ్ నుంచి మాట్లాడారు. తర్వాత ఆయన ఆ సంభాషణలను చదివి జనరల్ మలిక్‌కు వినిపించారు. వాటిలో ఉన్న సమాచారం మనకు చాలా కీలకం కావొచ్చన్నారు.

ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్‌ను గుర్తు చేసుకున్న జనరల్ మలిక్ "దవే నిజానికి డైరెక్టర్ జనరల్ మిలిట్రీ ఇంటెలిజెన్స్‌కు ఫోన్ చేయాలనుకున్నారు. కానీ ఆయన సెక్రటరీ పొరపాటున ఆ ఫోన్ నాకు కలిపారు. డీజీఎంఐ బదులు నేను ఫోన్లో ఉన్నట్లు ఆయనకు తెలీగానే చాలా సిగ్గుపడిపోయారు. నేను ఆయనతో ఆ సంభాషణల ట్రాన్స్-స్క్రిప్ట్ త్వరగా నాకు పంపించమని చెప్పాను" అన్నారు.
నాకు అందిన మొత్తం ట్రాన్స్-స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను అరవింద్ దవేకు ఫోన్ చేశాను. "నాకెందుకో ఈ మాటలు ప్రస్తుతం చైనాలో ఉన్న జనరల్ ముషారఫ్, చాలా సీనియర్ అయిన మరో జనరల్ మధ్య జరిగినవి అనిపిస్తోంది. మీరు ఈ టెలిఫోన్ నంబర్ల మధ్య 'రికార్డింగ్' కొనసాగించండి" అని చెప్పాను.

ఫొటో సోర్స్, Getty Images
"మూడు రోజుల తర్వాత ఆ రెండు నంబర్ల మధ్య జరిగిన మరో సంభాషణను 'రా' రికార్డ్ చేసింది. కానీ ఈసారీ డైరెక్టర్ జనరల్ మిలిట్రీ ఇంటెలిజెన్స్‌కు, లేదా నాకు చెప్పకుండా ఆ సమాచారాన్ని దవే నేరుగా జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా, ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి పంపించారు. జూన్ 2న నేను ప్రధాన మంత్రి వాజ్‌పేయి, బ్రజేష్ మిశ్రాతో కలిసి ఒక నౌకాదళం కార్యక్రమం కోసం ముంబయి వెళ్లి తిరిగొస్తున్నప్పుడు ప్రధానమంత్రి నన్ను తాజా 'ఇంటర్‌సెప్ట్స్' గురించి అడిగారు.
నన్ను అడిగేశాక, ఆయనకు నేను వాటిని చూడలేదనే విషయం గుర్తొచ్చింది. దాంతో తిరిగి వెళ్లగానే బ్రజేష్ మిశ్రా నాకు ఆ సంభాషణల ట్రాన్స్-స్క్రిప్ట్ పంపించారు.
ఈ ఘటనను బట్టి మన నిఘా ఏజెన్సీలు సమాచారాన్ని అందరితో పంచుకోవని, 'టర్ఫ్ వార్'లో తమ ఆధిపత్యం కొనసాగేలా అగ్రస్థానంలో ఎంచుకున్న కొందరికే వాటిని పంపిస్తారనే విషయం అర్థమవుతుంది.

ఆ టేపుల్లో ఏముంది?
పాకిస్తాన్ మాజీ జనరల్ అజీజ్ ఖాన్-జనరల్ పర్వేజ్ ముషారఫ్ మధ్య ఫోన్ సంభాషణ
అజీజ్-ఇది పాకిస్తాన్ నుంచి, రూం నంబర్ 83315కు కనెక్ట్ చేయండి.
ముషారఫ్-హలో అజీజ్.
అజీజ్-గ్రౌండ్ సిచువేషన్ ఓకే. ఎలాంటి మార్పులూ లేవు. వాళ్ల ఒక ఎంఐ 17 హెలికాప్టర్‌ను కూల్చేశాం. మీరు నిన్నటి వార్తలు విన్నారా. మన ప్రధాని భారత ప్రధానితో మాట్లాడారు. "పరిస్థితి చేజారిపోయేలా మీరే చేస్తున్నారు. వైమానిక దళాన్ని ఉపయోగించే ముందు మీరు ఇంకాస్త వేచిచూడాల్సింది" అన్నారు. మన ప్రధాని ఆయనతో "ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి మేం మా విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్‌ను దిల్లీ పంపించగలం" అని చెప్పారు.
ముషారఫ్-ఓకే, ఆ ఎంఐ-17 మన ప్రాంతంలో కూలిందా?
అజీజ్-లేదు సర్, అది వాళ్ల ప్రాంతంలోనే కూలింది. మేం దాన్ని కూల్చామని చెప్పుకోలేదు. మేం ముజాహిద్దీన్లతో దాన్ని కూల్చామని చెప్పించాం.
ముషారఫ్-మంచిపని చేశారు.
అజీజ్-కానీ అది చూడాల్సిన దృశ్యం. మా కళ్ల ముందే ఆ హెలికాప్టర్ కూలిపోయింది.
ముషారఫ్-వెల్‌డన్, ఆ తర్వాత కూడా వాళ్లు మన సరిహద్దుల దగ్గర ఎగరడానికి ఇబ్బందులు పడుతున్నారా, భయపడ్డారా లేదా. దానిపైన కూడా నిఘా పెట్టు. వాళ్లిప్పుడు మన సరిహద్దులకు దూరంగా ఎగురుతున్నారా.
అజీజ్-అవును, ఇప్పుడు వాళ్లపై చాలా ఒత్తిడి ఉంది. ఆ తర్వాత వాళ్ల విమానాలు రావడం తగ్గాయి.
ముషారఫ్-చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్.


ఫొటో సోర్స్, PAk army
టేపులు నవాజ్ షరీఫ్‌కు వినిపించాలని నిర్ణయం
జూన్ 1 కల్లా ప్రధానమంత్రి వాజ్‌పేయి ఆ టేపును భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి కూడా వినిపించేశారు.
జూన్ 4న భారత్ ఆ టేపులను, వాటి ట్రాన్స్-స్క్రిప్ట్‌లతోపాటు ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు పంపించాలని నిర్ణయించింది. ముషారఫ్ సంభాషణలు రికార్డ్ చేయడం భారత ఇంటెలిజెన్స్ సాధించిన గొప్ప విజయం అయితే, ఆ టేపులను నవాజ్ షరీఫ్ వరకూ చేర్చడం కూడా చిన్న పనేం కాదు.
అయితే ఆ టేపులను ఇస్లామాబాద్ ఎవరు తీసుకెళ్తారనే ప్రశ్న ఎదురైంది.

ఫొటో సోర్స్, orf
ఇస్లామాబాద్‌కు రహస్యంగా టేపులు
పేరు బయటపెట్టకూడదనే షరతుతో ఒకరు ఆ టేపులు పాకిస్తాన్ ఎలా వెళ్లాయో చెప్పారు. ఆ పనికోసం ప్రముఖ జర్నలిస్ట్ ఆర్కే మిశ్రాను ఎంచుకున్నారు. ఆయనప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. భారత్ పిలిపించి మిశ్రాకు ఈ బాధ్యతను అప్పగించారు.
ఇస్లామాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేస్తారేమోననే అనుమానంతో, ఆయనకు 'డిప్లమాటిక్ ఇమ్యూనిటీ' లభించేలా మిశ్రాకు 'డిప్లొమాట్' హోదా ఇచ్చారు.
ఆయనతోపాటు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ వివేక్ కాట్జూ కూడా పాక్ వెళ్లారు.
ఆర్కే మిశ్రా ఉదయం 8.30కు టిఫిన్ టైంలో నవాజ్ షరీఫ్‌ను కలిశారు. ఆయనకు టేపులు వినిపించడంతోపాటు ట్రాన్స్-స్క్రిప్టులు అందించారు.
మిశ్రా, కాట్జూ ఆ పని పూర్తి చేసుకుని, అదే సాయంత్రం దిల్లీ తిరిగొచ్చారు. ఈ పర్యటనను ఎంత రహస్యంగా ఉంచారంటే, దాని గురించి ఎక్కడా చర్చించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
కోల్‌కతాలో ప్రింటయ్యే 'టెలిగ్రాఫ్' వార్తాపత్రిక మాత్రం 1999, జులై 4న ప్రణయ్ శర్మ రాసిన ఒక రిపోర్ట్ ప్రచురించింది. దానికి 'ఢిల్లీ హిట్స్ షరీఫ్ విత్ ఆర్మీ టేప్ టాక్' అనే హెడ్డింగ్ పెట్టింది.
భారత్ ఈ టేపులను నవాజ్ షరీఫ్‌కు వినిపించడానికి విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ వివేక్ కాట్జూను ఇస్లామాబాద్ పంపించారని ఆ రిపోర్టులో చెప్పారు.
'రా' మాజీ అడిషనల్ సెక్రటరీ బి.రమణ్ 2007 జూన్ 22న 'అవుట్‌లుక్' పత్రికలో రాసిన 'రిలీజ్ ఆఫ్ కార్గిల్ టేప్-మాస్టర్‌పీస్ ఆర్ బ్లండర్' అనే ఆర్టికల్‌లో "నవాజ్ షరీఫ్‌కు టేపులు వినిపించిన తర్వాత వాటిని తిరిగి తీసుకొచ్చి తమకు అప్పగించాలని వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని" రాశారు.
తర్వాత మిశ్రా తాను ఆ పని చేయలేదని ఖండించారు. వివేక్ కాట్జూ కూడా బహిరంగంగా ఈ విషయాన్ని ఎప్పుడూ ధ్రువీకరించలేదు.
వీటన్నిటి వెనుక భారత్ పెద్దలు ఉన్నారు. వారిలో 'రా' సెక్రటరీ అరవింద్ దవే, జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా, జశ్వంత్ సింగ్ ఉన్నారు. ఇలాంటివి భారత్ దగ్గర మరిన్ని టేపులు ఉంటాయేమోనని భయం పుడితే, కార్గిల్‌పై పాకిస్తాన్ నాయకత్వం మరింత ఒత్తిడిలో పడుతుందని భావించారు.

ఫొటో సోర్స్, ORF
టేపులను బయటపెట్టారు
ఈ టేపులను నవాజ్ షరీఫ్‌కు వినిపించిన సుమారు వారం తర్వాత, పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ భారత పర్యటనకు కొన్నిరోజుల ముందు 1999 జూన్ 11న భారత్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. రికార్డు చేసిన టేపులను బయటపెట్టింది.
ఆ టేపులను చాలా కాపీలు తయారు చేసి, దిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ముషారఫ్ నిర్లక్ష్యం
భారత నిఘా ఏజెన్సీ వర్గాలకు ఈ పనిని ఎలా పూర్తి చేశారో ఇప్పటికీ తెలీదా?
ఈ విషయంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ లేదా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోస్సాద్ భారత్‌కు సాయం చేసుంటుందని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ టేపుల్లో ఇస్లామాబాద్ నుంచి మాటలు స్పష్టంగా ఉన్నాయని, అందుకే దీని సోర్స్ ఇస్లామాబాద్ అయ్యుంటుందని వీటిని విన్నవారు భావించారు.
కార్గిల్‌పై 'ఫ్రం కార్గిల్ టు ద కూ' పుస్తకం రాసిన పాకిస్తాన్ జర్నలిస్టు నసీమ్ జెహ్రా అందులో "పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌తో ఇంత సున్నితమైన విషయాన్ని ఫోన్లో మాట్లాడిన జనరల్ ముషారఫ్, తనెంత నిర్లక్ష్యంగా ఉంటాడో నిరూపించారు. కార్గిల్ ఆపరేషన్లో పాకిస్తాన్ అగ్ర నాయకుల హస్తం ఏ స్థాయిలో ఉందో ఈ మాటలే చెబుతున్నాయి" అని రాశారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన ఆత్మకథ 'ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్'లో పర్వేజ్ ముషారఫ్ ఈ విషయాన్ని వదిలేశారు. ఈ సంభాషణలను అందులో ప్రస్తావించలేదు. అయితే తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడైన తర్వాత భారత జర్నలిస్ట్ ఎంజే అక్బర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముషారఫ్ ఈ టేపుల్లో వాస్తవాలను అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ వచ్చిన సర్తాజ్ అజీజ్
ఈ టేపులను నవాజ్ షరీఫ్‌కు వినిపించిన దాదాపు వారం తర్వాత పాకిస్తాన్ విదేశీ మంత్రి సర్తాజ్ అజీజ్ దిల్లీ వచ్చినపుడు, పాకిస్తాన్ హై కమిషన్ ప్రెస్ కౌన్సిలర్ చాలా కంగారుగా దిల్లీ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఆయన కోసం వేచిచూస్తున్నారు.
ఆయన చేతుల్లో దాదాపు ఆరు భారత వార్తాపత్రికలు ఉన్నాయి. అందులో ముషారఫ్-అజీజ్ మాటలను హెడ్‌లైన్స్ పెట్టారు. జశ్వంత్ సింగ్ అజీజ్‌తో చాలా ముభావంగానే చేయి కలిపారు.
ఈ టేపులతో ప్రపంచమంతా, ముఖ్యంగా భారత్‌లో కార్గిల్ చొరబాట్ల వెనుక పాకిస్తాన్ ప్రధాన మంత్రి ప్రత్యక్ష ప్రమేయం లేదని.. పాక్ సైన్యం కార్గిల్ ఆపరేషన్ గురించి ఆయనకు తెలీకుండా గుట్టుగా ఉంచిందని అనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
టేపులను బయటపెట్టడంపై విమర్శలు
భారత నిఘా వర్గాల్లో కొందరు ఈ టేపులను బహిరంగపరచడంపై విమర్శలు కూడా చేశారు.
'రా' అడిషనల్ సెక్రటరీగా పనిచేసి, దానిపై 'ఇండియాస్ ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్-సీక్రెట్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్' రాసిన మేజర్ జనరల్ వీకే సింగ్ బీబీసీతో "ఆ టేపులను బయటపెట్టడం వల్ల అమెరికా, ఐక్యరాజ్యసమితి నుంచి భారత్‌కు ఎన్ని 'బ్రౌనీ పాయింట్స్' దక్కాయో నాకు తెలీదు. కానీ దాని వల్ల బీజింగ్, ఇస్లామాబాద్ మధ్య ఉన్నఆ 'ప్రత్యేక ఉపగ్రహ లింక్' గురించి పాకిస్తాన్‌కు తెలిసింది. 'రా' 'ఇంటర్‌సెప్ట్' చేసిన దానిని అది వెంటనే మూసేసింది. ఆ లింక్ అలాగే ఉంటే ఆ తర్వాత కూడా మనకు ఎంత కీలక సమాచారం అందుండేదో ఊహించడం కూడా కష్టం" అన్నారు.

చర్చిల్ ఉదాహరణ
టేపుల గురించి మాట్లాడిన మేజర్ జనరల్ వీకే సింగ్ "బహుశా 'రా' లేదా ప్రధానమంత్రి కార్యాలయంలో అప్పుడున్న వారు 1974లో పబ్లిష్ అయిన ఎఫ్.డబ్ల్యు.వింటర్‌బాథమ్ పుస్తకం 'అల్ట్రా సీక్రెట్' పుస్తకం చదవలేదేమో. అందులో రెండో ప్రపంచ యుద్ధంలో ఒక కీలక నిఘా సోర్స్ గురించి మొదటిసారి ప్రస్తావించారు. యుద్ధం ప్రారంభమైన మొదట్లో జర్మనీ ఇన్సైఫరింగ్ డివైస్ 'ఎనిగ్మా' కోడ్‌ను బ్రిటన్ బ్రేక్ చేసింది. ఆ సమాచారాన్ని చివరి వరకూ రహస్యంగా ఉంచింది. జర్మనీ యుద్ధం జరిగినంత కాలం ఎనిగ్మా ఉపయోగించడం కొనసాగించింది. దానివల్ల బ్రిటిష్ నిఘా విభాగానికి చాలా అమూల్యమైన సమాచారం అందేది. ఒకసారి తర్వాత రోజు ఉదయం 'లుఫ్త్‌వఫే' అంటే జర్మనీ వైమానికదళం కావెంట్రీపై బాంబులు వేయబోతున్నాయనే విషయం బ్రిటన్‌కు తెలిసింది. అప్పుడు, ఆ నగరంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి ప్రాణాలు కాపాడచ్చు. కానీ చర్చిల్ అలా చేయకూడదని నిర్ణయించారు. ఎందుకంటే దానివల్ల జర్మనీకి సందేహం వస్తే, ఎనిగ్మాను ఉపయోగించడం ఆపేస్తుందని ఆయన భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
మానసిక యుద్ధంలో భారత్‌కు లాభం
కానీ మరో వైపు 'రా' మాజీ అడిషనల్ సెక్రటరీ రమణ్ మాత్రం ఈ టేపులను బయటపెట్టడం అనేది భారత్ చేసిన మానసికయుద్ధానికి అతిపెద్ద ఉదాహరణ అంటారు. "అలా చేయడం వల్ల చొరబాటుదారులు పాకిస్తాన్ 'రెగ్యులర్' సైనికులేనని, ముషారఫ్ మాటిమాటికీ చెప్పినట్లు వారు జీహాదీలు, వేర్పాటువాదులు కారని మన సైన్యం గట్టిగా వాదించగలిగింది" అన్నారు.
ఈ టేపులు పొక్కడం వల్లే, పాకిస్తాన్ కశ్మీర్‌లో నియంత్రణ రేఖను ఉల్లంఘించిందని, వారు ఎట్టి పరిస్థితుల్లో భారత భూభాగం వదిలి వెళ్లిపోవాలని అమెరికా కూడా సులభంగా ఒక నిర్ణయానికి రాగలిగిందని ఆయన చెప్పారు.
ఈ టేపులు పాకిస్తాన్ సైన్యం, ముషారఫ్ విశ్వసనీయతపై కూడా ఆ దేశ ప్రజల్లో సందేహాలు ఏర్పడేలా చేసింది. పాకిస్తాన్‌లో ఇప్పటికీ చాలా మంది కార్గిల్ గురించి అప్పట్లో ముషారఫ్ వినిపించినవి కథలుగా కొట్టిపారేస్తుంటారు.
ఈ టేపులను బయటపెట్టడం వల్ల పాకిస్తాన్‌పై ప్రపంచ దేశాల ఒత్తిడి పెరిగిందని, అందుకే అది కార్గిల్ నుంచి తమ సైనికులను ఖాళీ చేయించిందనేది కూడా తోసిపుచ్చలేం.
ఇవి కూడా చదవండి:
- దూది కోట రహస్యం: స్వర్గంలాంటి ప్రదేశానికి ‘నరక ద్వారం’ అని పేరెందుకు వచ్చింది
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- ‘డ్రగ్స్ ఇచ్చి, మంచానికి కట్టేసి అత్యాచారం చేశాడు, ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నానంటే..’
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- 'భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు సిన్నబ్బా'
- అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రోదసి యాత్ర విజయవంతం
- బ్రిటిష్ పాలకులు మొదటి భారత క్రికెట్ జట్టును ఎలా తయారు చేశారు...
- 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంప్ తీసి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








