దూది కోట రహస్యం: స్వర్గంలాంటి ప్రదేశానికి ‘నరక ద్వారం’ అని పేరెందుకు వచ్చింది

హీరాపాలిస్

ఫొటో సోర్స్, Getty Images

'నరకానికి ముఖద్వారం'గా పిలిచే ప్రాచీన నగరం హీరాపాలిస్ వెనుక ఓ రహస్యం దాగివుంది.

ఆధునిక సైన్స్, ఈ రోమన్ మూఢనమ్మకాల వెనుక నిజాన్ని వెలికితీసింది.

పశ్చిమ టర్కీలోని పముక్కలేలో ఎటుచూసినా ఎత్తైన తెల్లటి రాళ్లు కనిపిస్తాయి.

వాటి మధ్య ఎగుడు దిగుడు సున్నపురాయి నిర్మాణాలు. వాటిలో నిర్మల ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేసే నీటితో ఆ ప్రాంతమంతా నిండివుంటుంది.

హీరాపాలిస్

ఫొటో సోర్స్, Getty Images

అందమైన 'దూది కోట'

ఇదంతా ఒక్క రోజులో ఏర్పడిన ప్రాంతం కాదు.

దాదాపు నాలుగు లక్షల ఏళ్లుగా ఇక్కడి భూమిలో నుంచి నెమ్మదిగా బయటకు ఉబికివస్తున్న వేడి నీటి ఊటలే ఈ మనోహర ప్రకృతి అందాలకు కారణం.

భూమిలో నుంచి బయటకు వచ్చే వేడి నీరు ఇక్కడి రాళ్లపై నెమ్మదిగా ప్రవహిస్తూ, అందులోని వాయువులు వాతావరణంతో కలిసిపోయి మెల్లగా కాల్షియం కార్బొనేట్‌గా మారిపోయి, తెల్లని వస్త్రంలా ఆ ప్రాంతమంతా పరుచుకుంటుంది.

ఇలా దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున, 160 మీటర్ల ఎత్తున కాల్షియం కార్బొనేట్ పరచుకుంది ఇక్కడ. ఇలాంటి కాల్షియం కార్బొనేట్ దిబ్బలు చైనాలోని హువాంగ్లాంగ్‌లోనూ, అమెరికాలోని ఎల్లోస్టోన్ పార్కులో కూడా ఏర్పడ్డాయి.

అయితే, వీటి కంటే పముక్కలే అతి పెద్దది. అంతేకాదు ప్రపంచంలోని మిగతా కాల్షియం కార్బొనేట్ దిబ్బల కంటే అందమైనది కూడా.

టర్కీ వచ్చే టూరిస్టుల్లో ఎక్కువ మంది ఈ అందాలను ఆస్వాదించడానికే వస్తారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దీనికి 'దూది కోట' అని పేరుపెట్టింది.

వీడియో క్యాప్షన్, భూమి మీదున్న నరక ద్వారాన్ని చూశారా

ఇక్కడ ప్రవహించే నీరు జబ్బులను నయం చేస్తుందని నమ్మకం

కరోనా మహమ్మారికి ముందు ఏటా దాదాపు 25 లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేవారు.

ఈ తెల్లటి పీఠభూమిపై కాలుపెట్టిన వాళ్లంత చూడటానికి భారీ చక్కెర పోగులపై వరుసగా నడుస్తున్న చీమల బారుల్లా కనిపిస్తారు.

ఈ ప్రాంతాన్ని చూసిన తర్వాత బోడ్రమ్ బీచ్, చారిత్రక స్థలమైన ఎఫెసస్కికి ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లేవారు. ఇక్కడి నీటిలో కాళ్లు పెట్టి సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోతున్న టూరిస్టులంతా ఓ అద్భుతాన్ని చూడటం మిస్ అవుతున్నారు.

అదే పముక్కలే శిఖరాగ్రం మీదున్న అతి ప్రాచీన నగరం హీరాపాలిస్ శిథిలాలు.

పేరుకి శిథిలాలైనా వాటి అందాన్ని వర్ణించలేం.

క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం ముగుస్తుందనగా పెర్గామాన్‌కు చెందిన అటాలిడ్ రాజులు హీరాపాలిస్‌ను నిర్మించారు. ఆ తర్వాత క్రీస్తు శకం 133లో రోమన్ల ఆధీనంలోకి వచ్చింది.

రోమన్ల పాలనలో హీరాపాలిస్‌ను 'స్పా టౌన్'గా పిలిచేవారు. మూడో శతాబ్దం నాటికి ఇక్కడ ప్రవహించే నీరు జబ్బులను నయం చేస్తుందని ప్రజల్లో నమ్మకం ఏర్పడింది.

హీరాపాలిస్

ఫొటో సోర్స్, Getty Images

'సూర్యుడి కిరణాలతో ఈ ప్రాంతం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది'

రాజ్యం నలుమూలల నుంచి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చేవారు. ఈ నగరానికి ప్రారంభంలో ఉన్న గేటును చూస్తే, ఆ కాలంలో హీరాపాలిస్ ఎంత గొప్పగా వెలుగొందిందో అర్థమవుతుంది.

హీరాపాలిస్‌లోని ప్రధాన వీధి, యాంఫీథియేటర్ కూడా ఇక్కడి కాల్షియం కార్బొనేట్‌తో ఏర్పడిన గుట్టల నుంచి సేకరించిన పదార్థాలతో నిర్మించినవే.

సూర్యుడి కిరణాలతో ఈ ప్రాంతమంతా బంగారు వర్ణాన్ని పులుముకుని, మిలమిలా మెరిసిపోతుంది.

'ఈ నగర నిర్మాణానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న వేడి నీరే' అని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్కియాలజిస్టు డా. సారా యోమన్స్ వెల్లడించారు.

ఆమెకు రోమన్ సామ్రాజ్య చరిత్రపై మంచి పట్టుంది.

'రెండో శతాబ్దం మధ్య కాలం నాటికి, హీరాపాలిస్ స్పా టౌన్‌గా గుర్తింపు పొందింది. సందర్శకులు అధికంగా రావడం వల్ల ఇక్కడ నా ఊహ ప్రకారం రకరకాల జాతుల ప్రజలు నివసించేవారు' అని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, చెట్లు రహస్యంగా ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

'ఈ ఆలయంలోకి వెళ్లిన జీవులు ఆ దేవుడే ఆజ్ఞాపించినట్లు ప్రాణాలను వదిలేస్తాయి'

రోమన్ ప్రపంచానికి హీరాపాలిస్ నగరం మరో విధంగా కూడా తెలుసు. ఈ నగరాన్ని 'నరకానికి ద్వారం' అని కూడా పిలిచేవారు.

ఈ ప్రాంతంలో పాతాళ లోక దేవుడు ప్లూటో ఆదేశాల మేరకు మూడు తలల వేట కుక్క 'సెర్బెరస్' విష వాయువులను వదిలి అమాయకుల ప్రాణాలను బలి తీసుకునేదని నమ్మేవారు.

దీంతో ఈ ప్రాంతంలో ది ప్లూటోనియన్ అనే ఆలయాన్ని నిర్మించారు. రాజ్యం నలుమూలల నుంచి దీన్ని సందర్శించడానికి వచ్చే యాత్రికులు ఇక్కడి పూజారులను కలిసి ప్లూటోకి తమ ప్రాణాలను ఆత్మార్పణ చేసేవారు.

ఇదే కాలానికి చెందిన ప్లీనీ ది ఎల్డెర్, గ్రీకు భూగోళ శాస్త్రవేత్త స్ట్రాబో ఈ ఆత్మార్పణలను ఓ అరుదైన విషయంగా చెప్పారు. ఈ ఆలయ పూజారులు గొర్రె, ఎద్దు లేదా ఇతర జీవాలను తమతో పాటు ఆలయంలోకి తీసుకెళ్తారు. కానీ, అందులోకి అడుగుపెట్టిన జీవులు ఆ దేవుడే ఆజ్ఞాపించినట్లు వెంటనే ప్రాణాలను వదిలేస్తాయి.

ఆలయ పూజారి మాత్రం ప్రాణాలతో తిరిగి బయటకు వస్తాడు. 'నేను మూడు పిచ్చుకలను ఆలయం లోపలికి విసిరాను. అవి వెంటనే మరణించి, కింద పడిపోయాయి. అది చూసి నేను ఆశ్చర్యపోయాను' అని స్ట్రాబో తాను రాసిన ఎన్‌సైక్లోపీడియా జాగ్రఫీలో చెప్పుకొచ్చారు.

కానీ ప్లూటోనియన్ దేవాలయాన్ని మీరు ఈ రోజు సందర్శిస్తే నిజంగా ఆ సంఘటనలు ఇక్కడ జరిగాయా అని అనిపించకమానదు.

హీరాపాలిస్

ఫొటో సోర్స్, Getty Images

జంతువులు మాత్రమే చనిపోయి, పూజారులుప్రాణాలతో ఎలా బయటకు వచ్చారు?

ఈ శిథిలమైన ఆలయంలో చాలా భాగాలను తవ్వి తీసి, తిరిగి నిలబెట్టారు. దీని ప్రవేశ ద్వారానికి ఒకవైపు 25 సెంటీమీటర్ల మేర ప్రవహిస్తున్న నీరు, దానిపై మెరిసే ఖనిజ లవణాల నురగ కనిపిస్తాయి.

ఎదురుగా ప్లూటోను పోలిన భారీ విగ్రహం ఆ ప్రాంతాన్నంతా తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది.

'నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ప్రాంతాన్ని అందరూ ఓ చావు ప్రదేశంగా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. అవన్నీ కట్టుకథలని భావించాను. జంతువులు చనిపోవడం ఏంటి? పూజారులు ప్రాణాలతో బయటకు రావడం ఏంటి? అనే సందేహాలు కలిగాయి' అని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ సారా యోమన్స్ చెప్పారు.

సరిగ్గా ఇవే తరహా ప్రశ్నలు మరో మెదడునూ తొలిచాయి. ఆయనే బయాలజిస్టు హార్డీ ఫ్యాన్జ్.

జర్మనీలోని డూయిస్బర్గ్-ఎస్సెన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఈయన జియోజెనిక్ వాయువుల గురించి అధ్యయనం చేస్తున్నారు. భూమి పొరల్లో జరిగే చర్యల వల్ల విడుదలయ్యే వాటిని జియోజెనిక్ వాయువులని అంటారు.

వీడియో: చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదే. ఎందుకో కిందున్న వీడియోలో చూడండి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

అక్కడి గాలిలో 80 శాతం కార్బన్ డయాక్సైడ్

'ప్రాచీన రచయితలు ఈ ప్రాంతం గురించి రాసిన వాటిని చదివిన తర్వాత దీనికి సంబంధించి శాస్త్రీయ వివరణ దొరుకుతుందా అని ఆలోచించాను. నరకానికి ద్వారంగా పిలుస్తున్నది అగ్నిపర్వతానికి చెందిన సొరంగ ద్వారం కావొచ్చనీ అనుకున్నాను' అని హార్డీ చెప్పారు.

ఈ విషయాలు తెలుసుకునేందుకు 2013లో హార్డీ హీరాపాలిస్ వచ్చారు.

'మేం ఏం కనుక్కుంటామో మాకు తెలీదు. ఏదైనా ఉండొచ్చు. ఏమీ ఉండకపోవచ్చు. కానీ అంత త్వరగా సమాధానం దొరుకుతుందని మేం అనుకోలేదు' అని ఆయన చెప్పుకొచ్చారు.

'మేం ఇక్కడికి వచ్చిన కొత్తలో పెద్ద సంఖ్యలో జంతువుల కళేబరాలు హీరాపాలిస్ నగర ప్రవేశ ద్వారం వద్ద కనిపించాయి. వాటిలో ఎలుకలు, పిచ్చుకలు, నల్ల పక్షులు, ఈగలు, తెనెటీగలు, ఇతర కీటకాలు ఉన్నాయి. దాంతో ఆ కథలన్నీ నిజమేనని మాకు అర్థమైంది' అని వివరించారు.

ఇక్కడున్న గాలిని పరిశీలించేందుకు ద్వారం వద్ద చిన్న గ్యాస్ అనలైజర్ ఉంచి హర్డీ చెక్ చేశారు. కార్బన్ డయాక్సైడ్ ఆనవాళ్లు విషపూరితమైన స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.

మామూలుగా గాలిలో కార్బన్ డయాక్సైడ్ 0.04 శాతం ఉంటుంది. కానీ, ప్లూటోనియన్ గుడి చుట్టూ ఉన్న గాలిలో కార్బన్ డయాక్సైడ్ 80 శాతం ఉంది.

'పది శాతం కార్బన్ డైయాక్సైడ్ ఉన్న గాలిలో కొద్ది నిమిషాలు ఉన్నా ప్రాణాలుపోతాయి. కాబట్టి, ఇక్కడ ఉన్న గాలి నిజంగా ప్రాణాలు తీసేస్తుంది' అని ఆయన పేర్కొన్నారు.

పముక్కల్

ఫొటో సోర్స్, Getty Images

సున్నపురాతి దిబ్బలకు, కార్బన్ డయాక్సైడ్‌కూ ఒకటే కారణం

వేడి నీటి ఊటల వల్ల అందమైన సున్నపురాతి దిబ్బలు ఎలా అయితే ఏర్పడ్డాయో, అదే భౌగోళిక వ్యవస్థ వల్ల ఈ ఆల్ట్రా-హైలెవెల్‌ కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోంది.

హీరాపాలిస్ నగరం 35 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న యాక్టివ్‌ టెక్టోనిక్ ఫాల్ట్ జోన్‌లో ఉంది.

ఈ జోన్లో అక్కడక్కడా ఉన్న ఖాళీల ద్వారా భూపటలం నుంచి ఖనిజ లవణాలతో కూడిన నీరు, భయంకరమైన వాయువులు విడుదలై వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాయి.

వీటిలో ఒక చిన్న మార్గం నగరం నడిబొడ్డున ఉన్న ప్లూటోనియన్ ఆలయంలోకి ఉంది.

'ఇక్కడ వాయువులు విడుదలవుతున్నాయని తెలిసే ప్లూటోనియన్ ఆలయాన్ని నిర్మించారు' అని యోమన్స్ పేర్కొన్నారు. కానీ ఇలాంటి ప్రదేశాల్లో భూకంపాలు సంభవించే అవకాశాలు ఎక్కువ. ఎన్నోసార్లు భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఆ తర్వాత నుంచి మెల్లగా హీరాపాలిస్ నగరం నిర్మానుష్యంగా మారిపోయింది.

తనకు దొరికిన సమాచారంతో హార్డీ సంతృప్తి చెందలేదు. నిజంగా ఆ ప్రాంతం ప్రాణాంతకమైతే, ప్లూటోనియన్‌లోని పూజారులు ఎలా బతికారనే ప్రశ్న ఆయనలో ఉత్పన్నమైంది. దీని గురించి తెలుసుకునేందుకు 2014లో మళ్లీ హీరాపాలిస్ వెళ్లారు.

వీడియో: ఇది మీరు చూసిన యాదగిరిగుట్ట కాదు. ఇప్పుడు ఎలా మారిపోయిందో కింది వీడియోలో చూడండి

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

గుడిలోకి వెళ్లిన జంతువులు చనిపోవడానికి అసలు కారణం ఇదే

ఈసారి ఒక రోజులో వివిధ సమయాల్లో ఆలయంలో ఉండే వాయువుల స్థాయిని గుర్తించారు.

'పగటి పూట సూర్యుడి వేడి వలన ఇక్కడి నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ వేగంగా విచ్ఛిన్నం చెందుతోంది. గాలి కంటే ఎక్కువ బరువు ఉండే కార్బన్ డయాక్సైడ్ రాత్రుళ్లు చల్లగా ఉండటం చేత ఆలయ పరిసర ప్రాంతాల్లోనే గూడుకట్టుకుంటోంది. ఫలితంగా ఇక్కడి నేలపై విషపూరితమైన కార్బన్ డయాక్సైడ్ పేరుకుని ఉంటోంది' అని కనుగొన్నారు.

జంతువుల ఎత్తు తక్కువగా ఉండటంతో గుడిలోకి వెళ్లిన మరుక్షణమే మరణించాయని, ఎత్తు ఎక్కువగా ఉన్న పూజారులు తక్కువ కార్బన్ డయాక్సైడ్ పీల్చి ప్రాణాలతో బయటపడేవారని హార్డీ వెల్లడించారు.

అయితే పూర్వం ఈ కారణంతో దేవుడిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించారా లేదా తాము దేవుడితో మాట్లాడగలమని పూజారులు భావించారా అన్న దానిపై స్పష్టత లేదు.

'హీరాపాలిస్‌లోని ప్లూటోనియన్ ఆలయంలో పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. అయితే, నిజంగా ఏం జరుగుతుందో పూజారులకు కూడా తెలియదు. జంతువులు చనిపోయి, పూజారులు మాత్రమే బతకడాన్ని కొందరు తమకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకోవడానికి ఉపయోగపడింది' అని యోమన్స్ తెలిపారు.

ప్రస్తుతం హీరాపాలిస్‌ను సందర్శకులు వీక్షించేందుకు విషవాయువుల జాడ లేని ప్రాంతంలో చిన్నపాటి రహదారిని నిర్మించారు.

'మూడు తలల వేట కుక్క సెర్బెరస్ తన ముక్కు నుంచి వదిలిన వాయువు కార్బన్ డయాక్సైడ్ అని తెలిసిన తర్వాత నేను ఈ ప్రాంతపు రహస్యాన్ని చేధించానని నాకు అనిపించింది' అని హార్డీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)