డచ్ ప్రజలు ఎందుకంత పొడుగ్గా ఉంటారు... వారిది రిచ్ కంట్రీ కావడమే అందుకు కారణమా?

క్లాగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డచ్ వ్యవసాయదారులు వేసుకునే పాదరక్షలు
    • రచయిత, గవిన్ హైనెస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రోటర్‌డామ్ నుంచి పశ్చిమ దిశగా వెళ్తున్నాను. ఎర్రని ఇటుకల పేవ్‌మెంట్లు, స్వచ్ఛమైన నీరు పారుతున్న కాలువలు, సువాసనలు వెదజల్లుతున్న సురినామీ రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లు దాటుకుంటూ సాగిపోతూ చివరకు ఓడరేవు దగ్గరకు చేరుకున్నాను.

అక్కడ సముద్రంలోని ఫ్లోటింగ్ ఫామ్‌లోని ఆవులు నెమ్మదిగా నెమరువేస్తున్నాయి.

ఆ ఫ్లోటింగ్ ఫామ్ ఒక గోదాములా కనిపిస్తోంది. దాని పైకప్పు సముద్రపు అలల్లానే వంపులు తిరిగి కనిపిస్తోంది.

దూరంగా కనిపిస్తున్న ఓడల్లోకి క్రేన్లు సరకు నింపుతున్నాయి.

ఆ పారిశ్రామిక పరిసరాలలో ఈ పశువుల మంద ఉండడం ఏమాత్రం సంబంధం లేని అంశంగా కనిపిస్తోంది.

నీటిని తోడే విండ్ మిల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీటిని తోడే విండ్ మిల్స్

మారుతున్న ప్రపంచంలో పాడి పరిశ్రమ మనుగడకు ఊతమిచ్చేలా రూపొందిన ఈ రోటర్ డామ్ ఫ్లోటింగ్ ఫామ్‌ను సముద్ర వాతావరణంలోని ఆటుపోట్లను తట్టుకునేలా నిర్మించారు. అంతేకాదు.. పాడి పరిశ్రమ నుంచి వచ్చే కర్బన ఉద్గారాలను తగ్గించేలా కూడా దీన్ని రూపొందించారు.

ఫ్లోటింగ్ ఫామ్‌పై ఉండే సోలార్ ప్యానళ్లు దాని విద్యుత్ అవసరాలు తీరుస్తుండగా వర్షపు నీటినే శుద్ధి చేసి పశువులకు తాగునీరుగా ఇస్తున్నారు.

అంతేకాదు, ఇక్కడి ఆవులకు ఇచ్చే గడ్డిని కూడా పార్కులు, గోల్ఫ్ కోర్సుల నుంచి తెస్తున్నారు. రోటర్‌డామ్‌లోని బంగాళదుంప చిప్స్ పరిశ్రమల్లో మిగిలిపోయిన తొక్కలూ వీటికి ఆహారంగా వేస్తున్నారు.

తమ ఆవులు రోటర్‌డామ్ బయోమాస్ అవశేషాలను తిని ఆరోగ్యకరమైన పాలను ఇస్తున్నాయని ఫ్లోటింగ్ ఫామ్ యాజమాన్య భాగస్వామి మింకీ వేన్ వింగర్డన్ చెప్పారు.

అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్వాటెమాలా మహిళలు ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఎత్తు ఉంటారు. వారి సగటు ఎత్తు 150.9 సెంటిమీటర్లు

2019లో ప్రారంభించినప్పటి నుంచి ఈ ఫ్లోటింగ్ ఫామ్ రోటర్‌డామ్‌కు ప్రత్యేకమైన ఆకర్షణగా మారిపోయింది.

ప్రపంచంలోనే తొలి ఫ్లోటింగ్ ఫామ్‌గా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెండు డచ్ సంప్రదాయాలను పాటించింది. మొదటిది సముద్రంపై ఆధిపత్యమైతే.. రెండోది పాడి పరిశ్రమకు పట్టం కట్టడం.

డచ్ ప్రజలు సముద్రయానానికి ప్రసిద్ధులు.. అలాగే పాడిపరిశ్రమే ఆ దేశాన్ని అభివృద్ధిలో నడిపింది. ఈ ఫ్లోటింగ్ ఫామ్ ప్రాజెక్టుతో సముద్రంలో డెయిరీ ఫాం ఏర్పాటు చేయడంతో నెదర్లాండ్స్‌కి సంబంధించి రెండు సంప్రదాయాలను పాటించినట్లయింది.

ఆజానుబాహుల గడ్డ నెదర్లాండ్స్ ఈ భూమ్మీద పొడగరులు ఎక్కువగా ఉండే దేశం. డచ్ పురుషుల సగటు ఎత్తు 182.5 సెంటీమీటర్లు(6 అడుగులు) కాగా డచ్ మహిళల సగటు ఎత్తు 168.7 సెంటీమీటర్లు(5.5 అడుగులు).

వీడియో క్యాప్షన్, నెదర్లాండ్స్: ఇది ప్రపంచ పూల రాజధాని... ఇక్కడ రోజూ నాలుగు కోట్ల పూలు అమ్ముతారు

అదే అమెరికన్ పురుషుల సగటు ఎత్తు 177.1 సెంటీమీటర్లు, అమెరికా మహిళల సగటు ఎత్తు 163.5 సెంటీమీటర్లు.

అయితే, అంతకుముందు నెదర్లాండ్స్ ప్రజలు ఇంత ఎత్తుగా ఉండేవారు కాదని మిలటరీ రికార్డుల ఆధారంగా చేసుకుని రూపొందించిన 'రాయల్ సొసైటీ ఆఫ్ లండన్' నివేదిక ఒకటి చెబుతోంది.

1850ల ప్రాంతంలో యూరప్‌లో పొట్టిగా ఉండే ప్రజల్లో డచ్‌వారూ ఉండేవారట.

''1860లో డచ్ సైనికుల ఎత్తు సాధారణంగా సుమారు 165 సెంటీమీటర్లు ఉండేది'' అని కెనడాలోని లెథ్‌బ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లూయిస్ బారెట్ చెప్పారు. అప్పటికి అమెరికా సైనికుల పొడవు అంతకంటే అయిదారు సెంటీమీటర్లు ఎక్కువగా ఉండేదని.. దాంతో ప్రపంచంలో అమెరికన్లనే పొడగరులుగా గుర్తించేవారని చెప్పారు.

నెదర్లాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెదర్లాండ్స్‌లో 33 శాతం మంది ప్రజలు సముద్ర మట్టం కంటే తక్కువ ఎత్తులో నివసిస్తున్నారు

కానీ, ఆ తరువాత 160 ఏళ్లలో డచ్ పురుషుల సగటు ఎత్తు 20 సెంటీమీటర్లు పెరగగా.. అమెరికన్ మగవారి సగటు ఎత్తులో 6 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుదల నమోదైంది.

దీనంతటికీ జన్యు ప్రభావాలే కారణమైనా కొన్ని ఇతర కారణాలూ ఉన్నాయని ప్రొఫెసర్ లూయిస్ బారెట్ చెప్పారు.

''నెదర్లాండ్స్‌లో సంతాన సాఫల్యత ఎక్కువగా ఉన్న అంటే ఎక్కువ మంది పిల్లలను కన్న జంటలను పరిశీలిస్తే వారిలో పురుషులు పొడగరులు, మహిళలు ఒక మోస్తరు ఎత్తు ఉన్నవారు. అదే అమెరికాలో అధిక సంతాన సాఫల్యత ఉన్న జంటల్లో పొట్టి మహిళలు, ఒక మోస్తరు ఎత్తు గల పురుషులు ఉన్నారని నా అధ్యయనంలో తేలింది'' అన్నారు లూయిస్ బారెట్.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య వసతులు, సంపాదనలో అసమానతలు అంతగా లేకపోవడం, అత్యద్భుతమైన సామాజిక సంక్షేమ విధానాల కారణంగా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. పిల్లల ఎత్తు తగ్గడానికి కారణమైన ఏ ఇబ్బందులు లేకపోవడం వల్ల పొడవుగా, ఆరోగ్యవంతంగా జన్మిస్తున్నారని లూయిస్ అభిప్రాయపడ్డారు.

ఆ తరువాత వారి ఆహారం గురించి కూడా చెప్పుకోవాలి. నెదర్లాండ్స్ ప్రజలకు పాడి ఉత్పత్తులంటే ఎనలేని మక్కువ. వారి ఎత్తు పెరగడానికి కూడా ఇదే కారణమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ''శరీరానికి కాల్షియం పుష్కలంగా దొరికితే ఎముకలు బలంగా ఉంటాయి, పెరుగుదల ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది'' అన్నారామె.

ఆవులు

ఫొటో సోర్స్, Getty Images

డచ్ ప్రజలు పాడి పరిశ్రమకు ఎందుకంత ప్రాధాన్యమిస్తారనేది బెన్ కోట్స్ అనే రచయిత తన 'వై ది డచ్ ఆర్ డిఫరెంట్: ఏ జర్నీ ఇంటూ ది హిడెన్ హార్ట్ ఆఫ్ ది నెదర్లాండ్స్' పుస్తకంలో రాశారు.

నెదర్లాండ్స్ ప్రజలు చేసుకున్న ఆ దేశ భౌగోళిక మార్పుల ఫలితంగానే అక్కడ పాడి పరిశ్రమ వృద్ధి చెందిందంటారు బెన్ కోట్స్.

ఒకప్పుడు పక్షులు మాత్రమే తిరుగాడే తీర ప్రాంత చిత్తడి నేలల్లోకి పోటెత్తే నీటికి విండ్ మిల్స్ ఉపయోగించి, కాలువలు తవ్వి తిరిగి సముద్రంలోకి పంపించి మరీ ఆ భూమిని ఉపయోగించుకుంది నెదర్లాండ్స్. అందుకే ''దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. నెదర్లాండ్స్‌ని మాత్రం డచ్ ప్రజలు సృష్టించుకున్నారు'' అనే సామెత అక్కడ ప్రాచుర్యంలోకి వచ్చింది.

నెదర్లాండ్స్‌ మధ్యలోనూ నీటి వనరుల మధ్య 1620 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసుకోగలిగారు వారు. 1920లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో భాగంగా ఆనకట్టలు, కరకట్టలు నిర్మిస్తూ 1620 చదరపు కిలోమీటర్ల అదనపు భూమిని సృష్టించుకున్నారు. సుదీర్ఘకాలం సాగిన ఈ ప్రాజెక్ట్ 1997లో పూర్తయింది.

నెదర్లాండ్స్‌లోని అల్కమార్ చీజ్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెదర్లాండ్స్‌లోని అల్కమార్ చీజ్ మార్కెట్

చిత్తడి నేలలను సాధారణ నేలలుగా మార్చినప్పటికీ వాటిలో ఆమ్ల గాఢత అధికంగా ఉండడం వల్ల కూరగాయలు, తిండిధాన్యాలు పండించడానికి ఉపయోగపడలేదని.. కానీ, గడ్డి పెంపకానికి అవి యోగ్యమైనవని వూర్డెన్ నగరానికి చెందిన చీజ్ సైంటిస్ట్ మెవిస్ హెటింగా చెప్పారు. చీజ్ వ్యాలీగా పిలిచే వూర్డెన్ రోటర్‌డామ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఇలా భూమిని పంటలకు కాకుండా గడ్డి పెంపకానికి ఉపయోగించడం పాడి పరిశ్రమ వృద్ధికి దారి తీసింది.

పాలు, పాల ఉత్పత్తుల వినియోగంలో నెదర్లాండ్స్ ముందుంది ఇప్పుడు. తమ అవసరాలకు మించిన పాలతో గౌడ, ఎడామ్ వంటి రకాల చీజ్ తయారు చేసి ఎగుమతి చేస్తారు.

ప్రపంచంలో పేరుమోసిన చీజ్ మార్కెట్లు నెదర్లాండ్స్‌లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)