టర్కీ: ఈ 'డ్రాకులా' రక్తం తాగడు... శత్రువులను ఈటెలకు గుచ్చి కాకులు, గద్దలకు వదిలేసేవాడు

డ్రాకులా

ఫొటో సోర్స్, FAUSTO ZONARO

    • రచయిత, అసద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మైలు దూరం వరకు సువిశాలంగా కనిపిస్తున్న ఆ మైదానంలో అర్థ చంద్రాకారంలో దాదాపు 20 వేల ఈటెలు భూమిలో పాతి ఉన్నాయి. ఒక్కో ఈటెకు ఒక్కో శవం గుచ్చి ఉంది. అవన్నీ టర్కీ సైనికులవి.

వాటిలో ఎత్తుగా కనిపిస్తున్న రెండు ఈటెలకు ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన ప్రాంతీయ అధికారి హమ్జా పాషా, గ్రీకు కెటావోలినోస్ శవాలు ఉన్నాయి.

వారంతా చనిపోయి చాలా నెలలైంది. వారి శరీరాలపై ఉన్న విలువైన దుస్తులు పీలికలుపీలికలుగా మారి గాల్లో ఎగురుతుంటే అక్కడంతా కుళ్లిన శవాల దుర్గంధం వ్యాపించింది.

1462 జూన్‌లో యూరప్‌ రాజ్యం ట్రాన్సిల్వేనియా నగరం టార్గోవిస్తేకు 60 మైళ్ల దూరంలో ఉన్న ఉస్మానియా సామ్రాజ్యపు ఏడో సుల్తాన్ మొహమ్మద్-2 సైన్యానికి స్వాగత పలికిన దృశ్యం ఇదేనని గ్రీకు చరిత్రకారుడు చాలకోండిల్స్ రాశారు.

సుల్తాన్ మొహమ్మద్-2 1462 మే 17న ఇస్తాంబుల్ నుంచి యూరప్‌లో డాన్యూబ్ నదిని దాటి వాలీచియా రాజు, వ్లాద్-3 డ్రాకులాకు గుణపాఠం చెప్పాలని బయల్దేరినప్పుడు ఆయన ఆ దృశ్యాన్ని చూశాడు.

చరిత్రకారుడు రాదో ఫ్లోరెస్కో, రెమండ్ మెక్‌కలీ తమ ‘డ్రాకులా: ప్రిన్స్ ఆఫ్ మెనీ ఫేసెస్, హిజ్ లైఫ్ అండ్ టైమ్స్’ పుస్తకంలో గ్రీకు చరిత్రకారుల వివరాలను ప్రస్తావించారు.

“ఈ దృశ్యం సుల్తాన్ మహమ్మద్‌ మీద ఎంత ప్రభావం చూపిందంటే, ఆయన నోట “ఇంత క్రూరుడైన వ్యక్తి నుంచి అతడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం” అనే మాట వచ్చింది.

ఆయన భయపడి ఆ రాత్రి తాము విడిది చేస్తున్న తమ శిబిరానికి నలువైపులా చాలా లోతుగా కందకం తవ్వించారు. అంతేకాదు.. “ఈ ప్రాంతానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, రేపు తిరిగి వెళ్లిపోదాం” అని సైనికులకు ఆదేశాలు ఇచ్చాడు.

వాలీచియా అంతకు ముందు కూడా ఉస్మానియా సామ్రాజ్యం అధీనంలో ఉంది. ఈ ముట్టడి తర్వాత కూడా ఉంది.

సుల్తాన్ అక్కడి నుంచి తిరిగి వచ్చేసినా, వ్లాద్ డ్రాకులాపై పోరాటం మాత్రం ఆగలేదు.

డ్రాకులా

ఫొటో సోర్స్, AFP

సుల్తాన్ సామ్రాజ్యంపై యుద్ధం

ఆ యుద్ధం ఫలితంగా డ్రాకులా తన రాజ్యం వదిలి పరారయ్యాడు. అతడి స్థానంలో ఉస్మానియా సామ్రాజ్యం మద్దతుదారుడైన అతడి తమ్ముడు ‘రాదో ది హాండ్సమ్’ ప్రాంతీయ అధికారి అయ్యాడు. తర్వాత ఆయన డ్రాకులా అరాచకాలకు బలైనవారి మద్దతుతో దానికి రాజయ్యాడు.

ఉస్మానియా సామ్రాజ్యం గురించి చరిత్రకారుడు కెరోలైన్ ఫింకల్ ఉస్మాన్ కా ఖ్వాబ్(ఉస్మాన్ కల) అనే పుస్తకంలో వాలీచియాతో జరిగిన యుద్ధాన్ని సంక్షిప్తంగా రాశారు. అందులో ఉస్మానియా సామ్రాజ్యానికి వాలీచియా ఏటా పన్నులు చెల్లించకపోవడం, వ్లాద్ డ్రాకులా సైన్యం అరాచకాలకు పాల్పడడంతో 1462లో డాన్యూబ్ నది దాటి వెళ్లి అతడికి బుద్ధి చెప్పాలని సుల్తాన్ మొహమ్మద్ ఆదేశించాడు. యుద్ధంలో విజయం సాధించాక వ్లాద్ డ్రాకులా తమ్ముడు రాదోను అతడి స్థానంలో కూర్చోపెట్టాడు.

సుల్తాన్ ఈ యుద్ధానికి దాదాపు పదేళ్ల ముందు, శతాబ్దాలపాటు కొనసాగిన బైజాంటియన్ సామ్రాజ్యం అంతిమ గుర్తుగా మిగిలిన కుస్తుంతునియా(ఇస్తాంబుల్)ను గెలిచి ‘ఫతే సుల్తాన్’ బిరుదు పొందాడు.

ఆయన సామ్రాజ్యం ఎన్నో మహాసముద్రాల అవతలకు వ్యాపించింది.

1462లో జరిగిన ఈ యుద్ధంలో సుల్తాన్ ఉస్మానియా సామ్రాజ్యం అధీన రాజ్యమైన వాలీచియా రాజు వ్లాద్ డ్రాకులాతో పోరాడాడు.

వాలిచీయాను తమ రాజ్యంలో కలుపుకోడానికి ఆయన జర్మనీ నుంచి తూర్పుగా చాలా దేశాల మీదుగా ప్రయాణిస్తూ నల్లసముద్రంలో కలిసే డాన్యూబ్ నది ప్రాంతాల్లో యుద్ధానికి సిద్ధమయ్యారు.

తూర్పులో విజయం సాధించాక పశ్చిమం వైపు వచ్చేవారికి డాన్యూబ్ నది ప్రధాన మార్గం. వాలీచియా రాజ్యం అదే నదికి ఉత్తరంగా ఉంది. పది లక్షల లోపు జనాభా ఉన్న దాని పాలకులకు, ఉస్మానియా సామ్రాజ్యం మధ్య తరాల నుంచీ సంబంధాలు అటూఇటూ అవుతూ వచ్చాయి.

డ్రాకులా విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

డ్రాకులాపై పోరాటానికి సిద్ధం

ప్రస్తుతం ఆ రాజ్యానికి కొత్త పాలకుడైన యువరాజు వ్లాద్-3 డ్రాకులా విధానాల పట్ల అసంతృప్తి చెందిన సుల్తాన్ అతడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అని ఫ్లోరెస్కో, మెక్‌నలీ రాశారు.

సుల్తాన్ మొహమ్మద్-2, డ్రాకులా మధ్య యుద్ధం తప్పదు. అది ఎప్పుడు అనేదే ప్రశ్న. సుల్తాన్ మొహమ్మద్‌లో ఉన్న విజయ కాంక్ష గురించి డ్రాకులాకు బాగా తెలుసు.

మహమ్మద్-2 సామ్రాజ్యంతో పోలిస్తే డ్రాకులా రాజ్యం చాలా చిన్నది.

కానీ, దానికి పాలకుడుగా ఉండడం సుల్తాన్ మొహమ్మద్-2 కంటే తక్కువేం కాదని రాశారు. ఆ కాలంలో ‘డ్రాకులా’ అనే బిరుదు ఒక గౌరవంగా ఉండేది.

చరిత్రలో ఇద్దరు డ్రాకులాల గురించి ప్రస్తావన ఉంది. వారిలో ఒకటి ఇటీవల మే 26న జరుపుకొన్న ‘డ్రాకులా డే’కు సంబంధించినవారు.

దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా డ్రాకులా ప్రస్తావన వచ్చింది. డ్రాకులా ఫొటోలు షేర్ అయ్యాయి.

కథల్లో ఉండే ఆ డ్రాకులా తను వేటాడేవారి మెడ దగ్గర కోర పళ్లను గుచ్చుతాడు. ఆ పళ్ల నుంచి రక్తం కారుతుంటే, ఆకాశం వైపు చూస్తాడు.

1897 మే 26న బ్రెమ్ స్టోకర్ నవలతో ఈ డ్రాకులా పరంపర మొదలైంది. అందులో రక్తం తాగే ఒక కల్పిత పాత్రను డ్రాకులాగా పరిచయం చేశారు.

డ్రాకులా పాత్ర కల్పితం కావచ్చు, కానీ డ్రాకులా అనే పేరు మాత్రం కల్పితం కాదు. చరిత్రలో డ్రాకులాగా పేరు పొందిన ఒక యువరాజు తన కాలంలో అత్యంత బలవంతుడైన సుల్తాన్‌ను ఎదుర్కున్నాడు. ఒక వైపు అరాచకాల వల్ల చెడ్డపేరు మూటగట్టుతున్నా. రొమేనియా జాతీయ కథానాయకుడి హోదానూ దక్కించుకున్నాడు.

ఒక చిన్న రాజ్యం వాలీచియాకు చెందిన అతడిని యువరాజు వ్లాద్-2 అనేవారు. డ్రాకులా అంటే డ్రాకుల్ కొడుకు అని అర్థం. చరిత్రలో ఇతడి పేరు ఇంత ప్రముఖం కావడానికి ఒక భయంకరమైన కారణం ఉంది.

రాజ్యంలోవారిని, ఇతరులను ఎన్నో వేల మందిని శరీరాల్లో ఈటెలు దించి చంపిన పాలకుడు కావడం వల్లే వ్లాద్-3 డ్రాకులాను ‘వ్లాద్ ది ఇంపేలర్’ అన్నారు.

విగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

‘వ్లాద్ ది ఇంపేలర్’ ఎవరు...

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరాల ప్రకారం డాన్యూబ్ నది ప్రాంతంలోని విలాచియాను చాలాసార్లు పాలించిన యువరాజు ‘వ్లాద్ ది ఇంపేలర్’ పూర్తి పేరు వ్లాద్-3 డ్రాకులా

1431లో పుట్టిన ట్రాన్సిల్వేనియాలో పుట్టిన ఇతడు అతడు 1476లో ప్రస్తుత రొమేనియా రాజధాని బుకారెస్ట్ లో చనిపోయాడు.

డ్రాకులా కాలంలో ఉస్మానియా సామ్రాజ్యంలో ఇద్దరు మురాద్-2, మొహమ్మద్-2 అనే ఇద్దరు సుల్తానుల కాలం నడిచిందని రొమేనియా చరిత్రకారులు ఫ్లోరెస్కో, మెక్‌నలీ రాశారు. మా యువరాజు (డ్రాకులా) సుల్తాన్ మొహమ్మద్ టూతో కలిసే పెరిగాడు అని చెప్పారు.

రొమేనియా చరిత్రకారులు వివరాల ప్రకారం ఇద్దరు సుల్తానులు మంచి వ్యక్తిత్వం కలవారు.

రోమన్ కాథలిక్ చర్చి వారిని (మైనారిటీలను) హింసించే సమయంలో యూదులను, ఇతర మతపరమైన మైనారిటీలకు ఆశ్రయం ఇచ్చి యూరప్‌కు పరమత సహనం నేర్పించిన దూరదృష్టిగల నేతలు.

బ్రిటానికా ప్రకారం 15వ శతాబ్దంలో యూరప్‌లో వ్లాద్ తన శత్రువులపై అరాచకాలకు పాల్పడడంతో వెలుగులోకి వచ్చాడు. బ్రెమ్ స్టోకర్ పాపులర్ నవలలో డ్రాకులా పాత్ర నిజానికి ఈ వ్లాద్ గురించే అని చరిత్రకారులు చెబుతున్నారు.

డ్రాకులా 1442 నుంచి 1448 వరకూ ఉస్మానియా సామ్రాజ్యంలో ఉన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

డ్రాకుల్ కొడుకే డ్రాకులా

వ్లాద్ తండ్రి పేరు వ్లాద్-2 డ్రాకుల్. ఆయనకు డ్రాకుల్ బిరుదు అప్పటి రోమన్ సామ్రాజ్యం ఫెర్మరావన్(హోలీ రోమన్ ఎంపరర్) సిగిస్మండ్ నుంచి లభించింది. యూరప్‌లో టర్కీ దాడులను ఆపడానికి ఏర్పాటు చేసిన ‘ఆర్డర్ ఆఫ్ డ్రాగన్‌’లో చేర్చినందుకు అతడికి ఇది ఇచ్చారు.

డ్రాకుల్ అనే మాటకు లాటిన్ పదం ‘డ్రాకు’ మాట నుంచి వచ్చింది. అంటే ‘డ్రాగన్’ అని అర్థం. డ్రాకులా అంటే డ్రాకుల్ కొడుకు. అలా విలాద్-2 డ్రాకుల్ కొడుకు పేరు విలాద్-3 డ్రాకులా అయ్యింది. డ్రాకులా అనే బిరుదుకు చరిత్రకారులు చాలా కారణాలు చెబుతారు. వాటిలో ఒకటి రొమేనియా భాషలో ‘డ్రాకుల్’ అంటే ‘డెవిల్’ అనే అర్థం కూడా ఉంది.

డ్రాకులా 1442 నుంచి 1448 వరకూ ఉస్మానియా సామ్రాజ్యంలో ఉన్నాడు. తర్వాత ఆయన తన తండ్రి, అన్న హత్యకు గురైన తర్వాత తిరిగి వాలీచియాకు వచ్చాడు.

డ్రాకులా తన తండ్రి గద్దెపై కూర్చోడానికి అషరాఫియా అనే వర్గాన్ని, ఉస్మానియా సామ్రాజ్యం అండ ఉన్న తన తమ్ముడిని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

1448లో మొదటిసారి రాజైన డ్రాకులా త్వరలోనే గద్దె దిగాడు. మళ్లీ సింహాసంపై కూర్చోడానికి అతడికి 8 ఏళ్లు పట్టింది. రెండోసారి రాజైన తర్వాత అతడు చేసిన అరాచకాల వల్లే అతడికి ‘వ్లాద్ ది ఇంపేలర్’ అంటే ‘ఈటెను కింది నుంచి గుచ్చి చంపే వ్లాద్’ అనే పేరు వచ్చింది.

సామ్రాజ్యం

ఫొటో సోర్స్, Getty Images

డ్రాకులా, సుల్తాన్-2 స్నేహం

ఇద్దరు యువరాజులు మొదటిసారి బహుశా 1442లో కలిశారు. డ్రాకులా తండ్రి అతడిని, అతడి తమ్ముడు ది హాండ్సమ్ ఇద్దరినీ ఉస్మానియా సామ్రాజ్యంపై తమ విశ్వాసాన్ని చూపించడానికి వారి దగ్గరే వదిలేశాడు. అప్పట్లో మొహమ్మద్, డ్రాకులా ఒకే వయసులో ఉండేవారని చరిత్రకారులు చెబుతారు.

వ్లాద్-2 డ్రాకుల్ రోమన్ కాథలిక్కులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ‘ఆర్డర్ ఆఫ్ డ్రాగన్’ సభ్యుడైనా, చాలా తెలివైన రాజకీయ వేత్త అని చరిత్రకారులు చెబుతారు. వాలీచియాలో అధికారంపై పట్టు సాధించగానే ఉస్మానియాకు పోటీ ఇవ్వగల బలం తనకుందని ఆయనకు అర్థమైంది.

దాంతో రోమన్ సుల్తాన్ సిగిస్మండ్ చనిపోగానే ‘వ్లాద్-2 డ్రాకుల్’ వెంటనే టర్కీతో సంధి చేసుకున్నాడని చెబుతారు.

డ్రాకుల్ తన మూడు వందల మంది అనుచరులతో బర్సాలో ఒక పెద్ద వేడుకలో సుల్తాన్ మురాద్ దగ్గరికి వెళ్లి వారికి తమ విధేయతను ప్రకటించాడు.

కొంతకాలం తర్వాత సుల్తాన్ మురాద్ మనసులో వ్లాద్-2 గురించి సందేహం రావడంతో, వ్లాద్ తన కొడుకులు డ్రాకులా, రాదోలను బాల్యంలోనే సుల్తాన్‌కు అప్పగించాడు. టర్కీ సైన్యం పిల్లలిద్దరినీ గొలుసులతో కట్టి దూరంగా కొండమీద కోటలోకి చేర్చింది.

వ్లాద్-2 డ్రాకుల్ దాదాపు ఏడాది సుల్తాన్ ఖైదీగా ఉన్నాడు. అదే సమయంలో అతడి పెద్ద కొడుకు సుల్తాన్‌తో మంచి సంబంధాలు ఉండడంతో వాలీచియా సింహాసనంపై కూర్చున్నాడు.

డ్రాకుల్ చివరికి సుల్తాన్లకు నమ్మకంగా ఉంటానని బైబిల్, ఖురాన్లపై ప్రమాణం చేసిన విడుదలయ్యాడు. తనపై నమ్మకం కలగడానికి ఇద్దరు కొడుకులనూ అక్కడే వదిలేశాడు.

ఉస్మానియా సభలో డ్రాకులా

డ్రాకులా ఆరేళ్లు తల్లిదండ్రులకు దూరంగా ఉస్మానియా సామ్రాజ్యంలోనే గడిపాడు. భాష తెలియని రాజ్యంలో అయినవాళ్లే తనను ఒంటరిగా వదిలేశారని కుమిలిపోయాడు. డ్రాకులా, అతడి తమ్ముడు 1448 నుంచి 1462 వరకూ అక్కడే ఉన్నారు.

ఉస్మానియా సభలో చిన్న రాజ్యాల రాకుమారులు బందీలుగా వచ్చినపుడు, వారిని తమ నమ్మకస్తులుగా చేసుకునేవారు. వారిలో ఎవరు భవిష్యత్తులో తమ రాజ్యానికి రాజు అయినా వారు తమకు విశ్వాసపాత్రులుగా ఉండేలా రాకుమారులకు శిక్షణ ఇచ్చేవారు.

డ్రాకులా, అతడి తమ్ముడితోపాటూ సెర్బియా రాకుమారులు ఇద్దరు సుల్తాన్ సభలో ఉండేవారు. కానీ తండ్రికి రహస్య సమాచారం పంపించారని సెర్బియా యువరాజులకు కళ్లు పీకేశారు.

డ్రాకులాకు నిపుణులైన వారు శిక్షణ ఇచ్చారు. చరిత్రకారుల వివరాల ప్రకారం ఆయనకు మొదటి నుంచే చాలా యూరోపియన్ భాషలు తెలుసు. టర్కీ కూడా నేర్చుకున్నాడు.

డ్రాకులా తమ్ముడు అందంగా ఉండడంతో దర్బారులో ఉన్న పురుషులు, మహిళలు అతడిని మెచ్చుకునేవారు. డ్రాకులాతో భిన్నంగా ప్రవర్తించేవారు. దీంతో ఇద్దరి మధ్య ఒకరంటే ఒకరిపట్ల ద్వేషం పెరిగిపోయింది అని చరిత్రకారులు చెప్పారు.

అలా సుదీర్ఘకాలం ఉండిపోవడం వల్ల డ్రాకులా మనసులో లోతైన గాయంలా అయ్యింది. తండ్రి, సోదరుడిపై అతడిలో కసి పెరిగింది.

1477లో విలాద్ డ్రాకులా తండ్రి, అతడి అన్న యూరప్ రాజకీయాలకు బలయ్యారు. డ్రాకులాకు విముక్తి లభించింది. అతడిని ఉస్మానియా సైన్యంలో అధికారిగా చేశారు. తర్వాత తమ సామ్రాజ్యం తరఫున అతడిని తండ్రి సింహాసనంపై కూర్చోపెట్టింది. సుల్తాన్ మొహమ్మద్-2పై డ్రాకులా ప్రభావం చాలా ఉందని చరిత్రకారులు రాశారు.

వ్లాద్ డ్రాకులా వాలీచియా పాలన

1456లో ఆకాశంలో ఒక నక్షత్రం నుంచి వెలుగులు రావడంతో ప్రజలు యుద్ధాలు, మహమ్మారిలు, ప్రకృతి వినాశనాలు జరుగుతాయని భావించారు.

అదే ఏడాది 8 ఏళ్ల సుదీర్ఘ ప్రయత్నం తర్వాత డ్రాకులా 25 ఏళ్ల వయసులో వాలీచియా సింహాసనంపై కూర్చున్నాడు అని ఫ్లోరెస్కో, మెక్‌నలీ రాశారు.

వ్లాద్ రాజ్యం అంత పెద్దది కాదు. కానీ అందమైన పర్వతాలు, దట్టమైన అడవులు, సరస్సులు సారవంతమైన మైదాన ప్రాంతాలు ఉండేవి. అతడి మహలు అవశేషాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయని చరిత్రకారుల చెబుతారు. టర్కీ సైన్యాలు దానిని చాలాసార్లు ధ్వంసం చేశాయి. అయినా మళ్లీ కట్టారు.

వ్లాద్ డ్రాకులా అరాచకాలు

వ్లాద్ డ్రాకులా అన్ని విధానాల ఉద్దేశం అధికారం తన చేతుల్లోకి తీసుకోవడం. పశ్చిమ యూరప్‌లోని కొన్ని దేశాల్లాగే అతడు ఒక సైన్యం తయారు చేశాడు. అది అతడు చెప్పినట్టు వినేది.

యూరప్‌లో త్వరత్వరగా పాలకులు మారడంతో అధికారం అషరాఫియా చేతికి వచ్చింది. వారిని బుయార్ అనేవారు.

బుయార్లు ఉస్మానియన్లతో సఖ్యంగా ఉంటారని డ్రాకులా భావించాడు.

17వ శతాబ్దంలో గ్రీకు చరిత్రకారుడు చాల్కిండైలజ్ ఒక ఘటన గురించి రాశారు. 1457లో బుయార్ కుటుంబం, కొంతమంది ప్రత్యేక అధికారులను దాదాపు రెండు వందల మంది ఈస్టర్ వేడుక కోసం తన మహలుకు వచ్చినపుడు, డ్రాకులా సైన్యం వారిని పట్టుకుంది. అందరికీ శరీరం కింది నుంచి ఈటెను ఎక్కించి నగరం గోడ బయట స్తంభాలకు వేలాడదీశారు.

వారిలో ఆరోగ్యంగా ఉన్నవారిని, తమ పూర్వీకుల ఒక పాత కోటను మరమ్మత్తులు చేసే పనికి బలవంతంగా పంపించారు. దానిని డ్రాకులా కోట అనేవారు.

1462లో అధికారం పోయినప్పుడు ఈ కోటలో ఉన్న ఒక రహస్య మార్గం నుంచే డ్రాకులా తప్పించుకున్నాడని చెబుతారు.

శత్రువులను ఈటెలకు గుచ్చడం

ఫొటో సోర్స్, UNIVERSALIMAGESGROUP

శత్రువులను ఈటెలకు గుచ్చడం

డ్రాకులా ఆరమాజీ అనే ఒక కొత్త పదవిని సృష్టించాడు. వీరు డ్రాకులా ఆదేశాలను అక్షరాలా పాటించేవారు. వారిలో రోమన్లు తప్ప హంగరీ, టర్కీ, సెర్బ్ ఇంకా చాలా మంది ఉండేవారు. వారికి మంచి జీతం ఇచ్చేవారు.

వీరు డ్రాకులా కోసం ‘గొడ్డళ్ల’లా పనిచేసేవారు. ఈటెలకు జనాలను వేలాడదీయంలో నిపుణులు. వీరు డ్రాకులా కంటే ఎక్కువ తమ సొంత ప్రయోజనాల కోసమే పనిచేసేవారు.

వారి మనసులో అరాచకం, మతం ఒకటైపోయింది. చాలాసార్లు తమ నేరాలను కాపాడుకోడానికి మతం ముసుగు వేసుకునేవారు.

వ్లాద్

ఫొటో సోర్స్, Getty Images

దౌత్యవేత్తల తలల్లో మేకులు దించిన ఘటన

ఫ్లోరెస్కో, మెక్‌నలీ తమ పుస్తకంలో అప్పటి చరిత్రకారుడు జర్మన్ మైకెల్ బేహమ్ చెప్పిన సందర్భం గురించి రాశారు. ఇటలీ నుంచి డ్రాకులా సభకు వచ్చిన కొంతమంది దౌత్యవేత్తల గురించి ఆయన చెప్పారు.

ఆ దౌత్యవేత్తలు డ్రాకులా ఎదురుగా నిలబడి గౌరవంగా తమ తలలపై ఉన్న టోపీలు తీశారు. కానీ వాటి కింద ఉన్న ‘స్కల్ కాప్’ లాగే ఉంచుకున్నారు. తమ సంప్రదాయం ప్రకారం ‘స్కల్ కాప్‌’ను సుల్తాన్ ముందు కూడా తీయడం కుదరదని చెప్పారు.

దాంతో స్కల్ కాప్‌ మీద నుంచే వారి తలలోకి మేకులు దించాలని డ్రాకులా ఆదేశించాడు. అలా చేస్తున్నప్పుడు “దౌత్యవేత్తలతో నన్ను నమ్మండి నేను మీ సంప్రదాయాన్ని మరింత బలంగా చేస్తున్నా” అన్నాడు.

డ్రాకులా ఎవరికి హీరో

డ్రాకులా రైతులకు అండగా ఉన్నాడని చెబుతారు. 1459 తర్వాత ఉస్మానియా సామ్రాజ్యానికి పన్నులు కట్టడం ఆపేశాడు. దాంతో రైతులు పన్నులు లేకుండా విముక్తి పొందారు. ఉస్మానియా సామ్రాజ్యానికి సైన్యం కోసం 500 మంది యువకులను పంపించడానికి కూడా ఒప్పుకోలేదు.

డ్రాకులా కాలంలో సంపన్నులు డబ్బు ఇచ్చినా శిక్షల నుంచి తప్పించుకోలేకపోయేవారని చరిత్రకారులు చెబుతారు. అందుకే 1462లో ఉస్మానియా సైన్యం వాలీచియాపై దాడి చేసినపుడు రైతులు డ్రాకులాకు అండగా నిలిచారు.

రైతుల పరిస్థితి తెలుసుకోడానికి డ్రాకులా మారువేషంలో రాజ్యంలో పర్యటించేవారు. ఒకసారి ఒక రైతు సరైన దుస్తులు లేకుండా ఉండడం చూసిన డ్రాకులా, అతడిని పిసినారి అనే కారణంతో అతడి భార్యకు ఈటెను గుచ్చి చంపే శిక్ష వేసి చంపేశాడని చరిత్రకారులు చెప్పారు.

అతడి కాలంలో పెళ్లికి ముందు సెక్స్ కానీ, వివాహేతర సంబంధాలు కానీ ఉన్న మహిళలను కఠినంగా శిక్షించేవాడని రాశారు.

ఒకసారి డ్రాకులా కొంతమంది భిక్షగాళ్లకు బాగా సేవ చేశాక, వారిని అదే గదిలోనే ఉంచి నిప్పు పెట్టి సజీవదహనం చేశాడట. వారంతా ఇతరుల కష్టం మీద జీవిస్తున్నారని ఆగ్రహించాడట.

మొహమ్మద్-2 వర్సెస్ డ్రాకులా

డ్రాకులా ఉస్మానియా సామ్రాజ్యానికి పన్నులు కట్టకుండా అతడిని సంప్రదించడం కూడా ఆపేశాడు. ఇద్దరు ఉస్మానియా సామ్రాజ్యం అధికారులను చంపేశాడు. టర్కీ భాషలో పట్టు ఉండడంతో ఉస్మానీ అధీనంలో ఉన్న ఒక కోటను తగలబెట్టి, యుద్ధానికి కాలుదువ్వాడు.

డ్రాకులా మతం పేరుతో యూరప్‌లోని మిగతా రాజ్యాల సాయం కూడా అడిగాడు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. అయినా, ఉస్మానియా సామ్రాజ్యంపై అతడు యుద్ధం చేయడాన్ని ఆపలేకపోయారు.

ఆ సమయంలో పోప్‌కు డ్రాకులా రాసినట్లు చెబుతున్నలేఖ గురించి కూడా చరిత్రకారులు ప్రస్తావించారు. అందులో .. “మేం 23,884 మంది తుర్కులను చంపేశాం. వారిలో మేం ఇళ్లలోనే కాల్చి చంపినవారు, మా సైనికులు తలలు నరికినవారు లేరు” అని చెప్పాడు.

ఈ మారణకాండ విని స్వయంగా సుల్తాన్ మొహమ్మద్ 1462 మే 17న వాలీచియాపై యుద్ధానికి వెళ్లాడు. డ్రాకులా వెంటనే యూరప్ సాయం అడిగాడు. నేను ఓడిపోతే క్రైస్తవులందరికీ ప్రమాదం అని చెప్పాడు. కానీ అతడికి సాయం లభించలేదని చరిత్రకారులు చెప్పారు.

1462లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. డ్రాకులా రాజ్యంలో మొత్తం జనాభాను కొండలపైకి, అడవుల్లోకి పంపించాడు. చాలాదూరం ప్రయాణించాక అలసిపోయిన టర్కీ సైనికులపై గెరిల్లా యుద్ధానికి ఉసిగొల్పాడు. దాంతో సుల్తాన్ చాలా సైన్యం నష్టపోయాడు.

అతడు స్వయంగా సుల్తాన్‌ను చంపడానికి అతడి శిబిరంపై కూడా దాడి చేయించాడు. కానీ విఫలం అయ్యాడు. చివరికి సుల్తాన్ సైన్యం డ్రాకులా కోటకు దగ్గరగా వచ్చేసరికి వారికి ఒక భయానక దృశ్యం కనిపించింది. దానినే చరిత్రలో అత్యధికంగా ప్రస్తావించారు.

అర్థచంద్రాకృతిలో ఒక మైలు వరకూ కొన్ని వేల ఈటెలు భూమిలో బలంగా పాతి ఉన్నాయి. వాటికి దాదాపు 20 వేల మంది టర్కీ సైనికుల కుళ్లిన శవాలు వేలాడుతున్నాయి.

మొహమ్మద్-2 తర్వాత రోజే వెనక్కు తిరిగి వచ్చేశారు. కానీ సుల్తాన్ సైన్యం సాయంతో డ్రాకులా తమ్ముడు రాదో ది హాండ్సమ్‌ అన్నను ఓడించి సింహాసనం సొంతం చేసుకున్నాడు.

అరాచకాలు సృష్టించే డ్రాకులాపై కోపంతో స్థానిక ప్రజలు రాదోకే మద్దతు ఇచ్చారు.

డ్రాకులా పరారీ

డ్రాకులా పారిపోయిన తర్వాత హంగరీ చక్రవర్తి మద్దతు అడిగాడు. కానీ అతడు రాదోకు అండగా నిలిచాడు. డ్రాకులాను బంధించాడు. కానీ కొన్ని రోజుల క్రితమే సుల్తాన్ మొహమ్మద్-2తో యుద్ధం చేయడం, ఓడిపోవడంతో అతడు ఒక హీరో అయిపోయాడు.

కానీ డ్రాకులా మిగతా ఖైదీల్లా ఉండేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత అతడు నేరుగా హంగరీ సభలోనే కూర్చోవడం మొదలుపెట్టాడు. అతడు 12 ఏళ్లు హంగరీలోనే ఖైదీగా ఉన్నాడు.

డ్రాకులా ఆఖరి యుద్ధం

ఈలోపు డ్రాకులా తమ్ముడు రాదో చేతి నుంచి వాలీచియా అధికారం పోయింది. 1475లో అతడు చనిపోయాడు. దాంతో హంగరీ డ్రాకులాను మళ్లీ సింహాసనం ఎక్కించింది.

డ్రాకులా 1476 నవంబరులో చివరిసారి రాజు అయిన తర్వాత నెలలోనే టర్కీ చేతుల్లో చనిపోయాడు. అతడి ఆఖరి క్షణాల గురించి చాలా విషయాలు చెబుతారు.

ఈటెలపై మనుషులను గుచ్చే మైదానం

చరిత్రకారులు 1463లో ‘హిస్టరీ ఆఫ్ వ్యూవ్డ్ డ్రాకులా’ అనే పుస్తకం గురించి చెప్పారు. ఈ పుస్తకంలో ఒక అజ్ఞాత రచయిత డ్రాకులాను చరిత్రలో అత్యంత క్రూరుడుగా, శత్రువులను దారుణంగా హింసించి చంపిన పాలకుడుగా వర్ణించాడు.

ఈ పుస్తకంలో “డ్రాకులా మనిషి శరీరంలో ఈటెను గుచ్చి చంపే శిక్షను మరింత భయానకంగా మార్చాడు. ఆ ఈటెల చివర మొనదేలినట్లు కాకుండా గుండ్రంగా ఉండేవి, వాటిని భూమిలో పాతి వాటిపై మనుషులను కూర్చోపెట్టేవారు. వారి బరువుకు అవి మెల్లమెల్లగా శరీరంలోకి దిగుతుండేవి. దాంతో, వారి ప్రాణాలు పోవడానికి రెండు, మూడు రోజులు పట్టేది. ఈలోపు వారు బతికుండగానే కాకులు, గద్దలు వారి కళ్లు పొడిచి తినడం, మాంసం తినడం చేస్తుండేవి.

వాలీచియా గురించి రాసిన రచయిత అక్కడ కాలంతోపాటూ వ్లాద్-3 డ్రాకులాను కూడా మర్చిపోయారని చెప్పారు. అతడి గురించి 19వ శతాబ్దంలో జర్మన్, రష్యా, హంగరీ చరిత్రకారులు తమ పుస్తకాల్లో, రచనల్లో ప్రస్తావించారు.

డ్రాకులా చాలా క్రూరుడైనప్పటికీ ఉస్మానియా సామ్రాజ్యాన్ని ఎదిరించిన సాహసికుడుగా అతడిని రొమేనియా చరిత్రకారులు వర్ణిస్తారు.

చివరికి రొమేనియా (1918లో వాలీచియా, మాల్డోవియా, ట్రాన్సిల్వేనియా కలిసి కొత్త దేశంగా ఆవిర్భవించింది)ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాల కోసం డ్రాకులా అంటే వ్లాద్-3 నేషనల్ హీరోగా భావించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)