రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి

ఫొటో సోర్స్, MOSCOW ZOO
రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ మీద బాంబుల వర్షం కురిసినపుడు బతికి బయటపడ్డ ఒక మొసలి ఇటీవల మాస్కో జూలో చనిపోయింది. ఇది నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ పెంపుడు మొసలి అనే వదంతులు కూడా ఉన్నాయి.
“నిన్న(22న) మా జూలో ఉన్న మిసిసిప్పీ అలిగేటర్ శాటర్న్ చనిపోయింది. దాని వయసు 84 ఏళ్లు. అది గౌరవప్రదమైన వయసులోనే మరణించింది” అని జూ అధికారులు చెప్పారు.
1936లో అమెరికాలో పుట్టిన శాటర్న్ మొసలిని, వెంటనే బెర్లిన్ జూకు బహుమతిగా ఇచ్చారు. 1943లో ఈ నగరంపై జరిగిన బాంబుపేలుళ్ల నుంచి అది క్షేమంగా తప్పించుకోగలిగింది.
మూడేళ్ల తర్వాత ఆ మొసలిని కనుగొన్న బ్రిటిష్ సైనికులు దాన్ని సోవియట్ యూనియన్‌కు అప్పగించారు.
ఆ మూడేళ్లు అది ఎలా జీవించింది అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. కానీ, 1946 జులై నుంచి ఈ మొసలి మాస్కోలో ఉన్న జూలో సందర్శకులను ఆకట్టుకుంటూ వచ్చింది.
శాటర్న్ ను 74 ఏళ్ల పాటు క్షేమంగా కాపాడిన గౌరవం మాస్కో జూకు దక్కిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
“మా వరకూ శాటర్న్ ఒక యుగం అంటే అతిశయోక్తి కాదు. అది మాలో చాలా మందిని పిల్లలుగా ఉన్నప్పుడు చూసింది. మేం దాన్ని నిరుత్సాహపరచలేదనే అనుకుంటున్నాం” అన్నారు.
శాటర్న్ తన సంరక్షకులను గుర్తుపట్టేదని, బ్రష్‌తో మసాజ్ చేయించుకోవడం అంటే దానికి చాలా ఇష్టమని జూ అధికారులు చెప్పారు.
ఆ అలిగేటర్‌కు చిరాకుగా ఉంటే ఆహారం అందించే పట్టకారులను, కాంక్రీట్ ముక్కలను తన పళ్లతో గట్టిగా పట్టుకునేదని తెలిపారు.
ఎక్కువ కాలం బతికిన అలిగేటర్
మిసిసిపీ అలిగేటర్స్ అడవుల్లో సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల వరకూ జీవిస్తాయి.
శాటర్న్ ప్రపంచంలో ఎక్కువకాలం బతికిన అలిగేటర్‌గా నిలిచింది. సెర్బియా జూలో ఉన్న మూజా అనే మరో మగ అలిగేటర్ కూడా ఇప్పుడు 80ల్లో ఉంది. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది.
కానీ ఏ మిసిసిపీ అలిగేటర్ అయినా శాటర్న్ బతికినంత కాలం జీవించడం కష్టమే.
ఈ శాటర్న్ మొసలిని హిట్లర్ పెంచుకున్నాడనే వదంతులు ఎన్నోసార్లు పతాక శీర్షికల్లో నిలిచాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు.
“ఈ మొసలిని ఇక్కడకు తీసుకురాగానే, అది బెర్లిన్ జూలోది కాదని, హిట్లర్ పెంపుడు జంతువుల్లో ఒకటి అయ్యుంటుందని వదంతులు వచ్చాయి. అవి ఎలా మొదలయ్యాయో తెలీదు” అని ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.
కానీ, అలాంటి వాదనలను మాస్కో జూ కొట్టిపారేసింది. జంతువులతో రాజకీయం చేయకూడదు. మనుషుల పాపాలను వాటికి అంటించకూడదు” అన్నారు.
శాటర్న్ 1943లో బాంబు దాడుల నుంచి ఎలా తప్పించుకుందో ఎవరూ చెప్పలేకపోయారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
మూడేళ్లు యుద్ధంలోనే జీవించింది
1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసేముందు నాజీ జర్మనీ రాజధాని బెర్లిన్‌పై మిత్రదళాలు బాంబుల వర్షం కురిపించాయి.
బాటిల్ ఆఫ్ బెర్లిన్‌గా చెప్పే ఈ యుద్ధం 1943లో ప్రారంభమైంది. నవంబర్ 22-23 రాత్రి పశ్చిమ బెర్లిన్‌లో బాంబు దాడుల వల్ల తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ మొసలిని ఉంచిన జూ ఉన్న టైరగార్టెన్ జిల్లా కూడా అందులోనే ఉంది.
ఆ బాంబు దాడుల్లో వేలాది మంది చనిపోయారు, ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. జూలో ఉన్న చాలా జంతువులు చనిపోయాయి.
బాంబులు నేరుగా బెర్లిన్ జూలోని అక్వేరియం భవనాన్ని తాకాయి. పేలుడు ధాటికి అందులోని జీవులన్నీ చెల్లాచెదురై వీధుల్లో పడ్డాయి. అప్పుడు అక్కడ ఉన్న కొందరు తాము చనిపోయిన నాలుగు మొసళ్లను చూశామని చెప్పారు.
అదే సమయంలో శాటర్న్ ఎలాగోలా తప్పించుకుంది. మూడేళ్ల పాటు నగరాన్ని యుద్ధం కుదిపేస్తుంటే, ఆ ప్రతికూల వాతావరణంలోనే ప్రాణాలు కాపాడుకుంది.
శాటర్న్ కళేబరాన్ని రసాయనాలతో పాడవకుండా చేసి, మాస్కోలో ఉన్న ప్రముఖ చార్లెస్ డార్విన్ మ్యూజియంలో ప్రదర్శిస్తారని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








