టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? తాజా వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చిన్న చిన్న వీడియోలను షేర్ చేసుకునే వేదిక అయిన టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలంటూ ట్విటర్‌లో #Tiktokbanindia, #Tiktokdown లాంటి హ్యాష్‌ట్యాగ్‌లను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.
జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) సైతం ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రముఖ యూట్యూబ‌్ ఫాలోవర్లు కూడా టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ యూజర్ రేటింగ్ కూడా 4.5 నుంచి 1.3కి పడిపోయింది.
ఇంతకీ తాజాగా టిక్‌టాక్ వివాదాల సుడిలో మునగడానికి కారణం ఏమిటి? దీన్ని బ్యాన్ చేయాలంటున్న కొందరు నెటిజన్ల డిమాండ్‌కు ఎన్‌సీడబ్ల్యూ ఎందుకు మద్దతు పలుకుతోంది?
భారత్‌లో టిక్ టాక్ డౌన్‌లోడ్లు 60 కోట్లు
చైనాకు చెందిన ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్ భారత్‌లోని టీనేజర్ల నుంచి అన్ని వయసులవారినీ ఆకట్టుకుంటోంది.
గ్రామాల నుంచీ పెద్ద పెద్ద నగరాల వరకూ ఈ యాప్ ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది.
టిక్‌టాక్ వివరాల ప్రకారం.. 2020 ఆరంభంనాటికి ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ డౌన్‌లోడ్ల సంఖ్య రెండు వందల కోట్లకు చేరింది. ఒక్క భారత్ నుంచే 60 కోట్ల డౌన్‌లోడ్లు జరిగాయి.
గత అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో టిక్‌టాక్ దాదాపు రూ.25 కోట్ల రెవెన్యూను ఆర్జించినట్లు వెల్లడించింది. ఈ జులై-సెప్టెంబరులో రూ.వంద కోట్లు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది.
యూజర్ల కోసం ఏఆర్ ఫిల్టర్లు, లెన్స్‌లు లాంటి సరికొత్త హంగులను ప్రవేశపెడుతూ ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్ల ప్రకటనలను ఇది ఆకర్షిస్తోంది.
2018లో ప్రపంచంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌లో టిక్‌టాక్ నంబర్ వన్‌గా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
వివాదాలు
పాపులారిటీ పెరగడంతోపాటే భారత్‌లో ఈ యాప్‌ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.
టైమ్ మ్యాగజైన్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ 2019లో చోటు సంపాదించిన పది మందిలో ఒకరైన భారత యూట్యూబర్ క్యారీ మినాటీ (అజయ్ నాగర్) వీడియోతో తాజాగా ఈ వివాదం మొదలైంది.
నెల రోజుల క్రితం టిక్‌టాక్‌లో 3.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఆమీర్ సిద్దిఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. దానిలో తమ టిక్‌టాక్ వీడియోలను రోస్ట్ చేస్తున్న యూట్యూబర్ క్యారీ మినాటీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు.
తమ టిక్‌టాక్ కంటెంట్‌ను క్యారీ మినాటీ చౌర్యం చేస్తున్నారనీ అంటూ.. యూట్యూబర్ల కంటే టిక్ టాకర్లే ఎంతో ప్రత్యేకమైనవారని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోను ఆమీర్ డిలీట్ చేశారు.
దీనికి స్పందనగా యూట్యూబ్‌లో 16.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్లున్న క్యారీ మినాటీ ఓ వీడియో చేశారు. దీనిలో ఆమీర్ చెసిన ప్రతి వ్యాఖ్యపైనా క్యారీ మినాటీ స్పందించారు. వ్యాకరణ దోషాలతోపాటు ఇతర లోపాలనూ ఎత్తిచూపుతూ మరోసారి తీవ్రంగా రోస్ట్ చేశారు. ఈ వీడియో మే 7న క్యారీ మినాటీ అప్‌లోడ్ చేశారు.
అయితే క్యారీ మినాటీ వీడియో తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని యూట్యూబ్ దానిని తొలగించింది. దీంతో చాలా మంది నెటిజన్లు క్యారీ మినాటీకి మద్దతుగా ట్వీట్లు చేశారు. ఆమీర్‌తోపాటు టిక్‌టాక్ మొత్తాన్ని నిషేధించాలని హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేశారు.

యాసిడ్ వీడియోతో తీవ్ర స్థాయికి...
ఇదే సమయంలో ఆమీర్ సోదరుడు ఫైజల్ సిద్ధిఖీ చేసిన ఓ వీడియో బయటకు వచ్చింది.
టిక్‌టాక్‌లో 13 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఫైజల్ నెల రోజుల క్రితం ఓ వీడియో చేశారు.
"అతడి కోసమేనా నన్ను వదిలేశావు? ఇప్పుడు అతడు నిన్ను వదిలేశాడు.." అని వీడియోలో ఫైజల్ వ్యాఖ్యానించాడు. అనంతరం చేతిలో ఉన్న ఓ పానీయాన్ని అమ్మాయిపై అతడు పోసాడు.. దీంతో ఆమె మొహం వికృతంగా మారుతుంది.
ఈ వీడియో.. యాసిడ్ దాడులను ప్రోత్సహించేలా ఉందని తాజాగా దుమారం చెలరేగింది.
‘ఫాలోవర్ల కోసమే బతుకుతున్నారు’ - ఎన్‌సీడబ్ల్యూ
ఈ వీడియో వైరల్ అవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ రేఖా శర్మను ట్యాగ్‌చేస్తూ బీజేపీ నాయకుడు తేజేందర్ సింగ్ బగ్గా ట్వీట్‌చేశారు. అనంతరం కొద్దిసేపటికే ఈ వీడియోను డిలీట్ చేయాలని టిక్‌టాక్‌ను కోరుతూ ఎన్‌సీడబ్ల్యూ ట్విటర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది.
"ఫైజల్ సిద్దిఖీపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర డీజీపీని కోరాం. ఎన్‌సీడబ్ల్యూ స్పందించడంతో ఫైజల్ వీడియోను టిక్‌టాక్ డిలీట్ చేసింది. అయితే అతన్ని బ్లాక్ చేయాలని సూచించాం" అని రేఖ కూడా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఫైజల్‌పై సైబర్ పోలీసులకు ఆశిష్ అనే నెటిజన్ ఫిర్యాదు కూడా చేశారు.
ఫైజల్ వీడియో అనంతరం అత్యాచారాలను ప్రోత్సహించేలా కనిపించే మరొక వీడియోను షేర్‌చేస్తూ.. ట్విటర్‌లో రేఖను బగ్గా ట్యాగ్‌చేశారు. దీనిపై రేఖ స్పందించారు.
"అసలు ఈ టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నా. అభ్యంతరకర వీడియోలతోపాటు యువతను వ్యర్థంగా జీవితాన్ని గడిపేందుకు టిక్‌టాక్ కారణమవుతోంది. కొందరు ఫాలోవర్స్ కోసమే బతుకుతున్నారు. ఫాలోవర్స్ తగ్గితే చచ్చిపోతున్నారు కూడా"అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ వివాదాల నడుమ టిక్‌టాక్ ఇండియా స్పందించింది.
"సురక్షితమైన, సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించడమే టిక్‌టాక్ మొదటి ప్రాధాన్యం. సామాజిక మార్గదర్శకాల విషయంలో మా బృందాలు కచ్చితంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో మేం అసలు రాజీపడం. మా నిబంధనలకు వినియోగదారులు కట్టుబడి ఉండాలి"
"గత కొన్ని రోజులుగా మా నిబంధనలకు విరుద్ధమైన కొంత సమాచారం మాకు కనిపించింది. దాన్ని తొలగించడంతోపాటు ఆ వినియోగదారుల్నీ బ్లాక్‌చేశాం. ఈ విషయంలో శాంతి భద్రతల పరిరక్షణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం" అని వివరించింది.
ఈ పరిణామాల నడుమ టిక్‌టాక్‌ను బ్యాన్‌చేయాలంటూ ట్విటర్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
ఇప్పటికే కోర్టు ఆదేశాలు
టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు రావడం, ట్విటర్‌లో టిక్‌టాక్ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ కావడం ఇదేమీ తొలిసారి కాదు.
చిన్నారులు లైంగిక వేధింపులు ఎదుర్కొనేందుకు టిక్‌టాక్ కారణమవుతోందని, దీన్ని బ్యాన్ చేయాలని గత ఏడాది ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది.
దీంతో టిక్‌టాక్ డౌన్‌లోడ్ చేసుకోకుండా తాత్కాలికంగా నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది. అయితే, వేధింపుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ హామీ ఇవ్వడంతో ఈ నిషేధం ఎత్తివేసింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- బైట్‌డాన్స్: సొంతంగా స్మార్ట్‌ఫోన్ తయారు చేస్తున్న టిక్‌టాక్ కంపెనీ
- స్మార్ట్ ఫోన్లనే డ్రగ్స్‌లాగా మార్చితే..
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- నేపాల్ కొత్త మ్యాప్‌కు గట్టిగా సమాధానం ఇచ్చిన భారత్
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








