కరోనావైరస్: ఒమిక్రాన్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు ఏంటి, ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లఘర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆ లక్షణాలేంటి?
- ఆగకుండా దగ్గురావడం, గంటల తరబడి దగ్గు కొనసాగడం, 24గంటల్లో అలాంటి పరిస్థితులు రెండు మూడుసార్లు ఏర్పడటం
- జ్వరం విపరీతంగా ఉండటం, శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్‌హీట్ దాటడం
- వాసన గుర్తించడంలో మార్పులు లేదా పూర్తిగా వాసన గుర్తించలేకపోవడం.
ఇవీ ఈ వైరస్ సోకిన వారిలో కనిపించే ప్రధానమైన లక్షణాలు.

ఫొటో సోర్స్, Getty Images
మరోవైపు కొన్ని దేశాల్లో ఈ వైరస్ కొత్త వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. కొత్త వేరియంట్లు సోకిన వారిలో ఎక్కువగా దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నట్లు తాజా సర్వేలో తేలింది.
ఈ లక్షణాలున్న వారు మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉన్నారంటే వెంటనే వారిని దూరంగా ఉండమని సలహా ఇవ్వాలి. అంతేకాదు వీలైనంత త్వరగా కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని సూచించాలి.
చలిగా ఉండటం, తరచూ వణికడం, ఒళ్లు నొప్పులు కూడా ఈ వైరస్ సోకినవారిలో కనిపించే లక్షణాలుగా గుర్తించారు నిపుణులు.
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం ఐదు రోజుల సమయం పడుతుంది. మరికొందరికి ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు. ఈ వైరస్ 14 రోజులవరకు శరీరంలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

చిన్నారుల్లో కనిపించే లక్షణాలు ఏమిటి?
పిల్లల్లో వాంతులు, విరేచనాలు, పొట్ట నొప్పి లాంటివి కరోనా లక్షణాలు కావచ్చని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.
''మనం ఇప్పుడు చూస్తున్న కరోనా లక్షణాలలో వీటిని కూడా చేర్చాల్సిన అవసరం ఉంది'' అని పిల్లలపై పరిశోధనలు చేస్తున్న క్వీన్స్ యూనివర్సిటీ బెల్‌ఫాస్ట్ పరిశోధకులు చెబుతున్నారు.
ప్రస్తుతం కరోనావైరస్‌కు మూడు ప్రధాన లక్షణాలు ఉన్నాయి. జ్వరం, దగ్గు, రుచి లేదా వాసన తెలీకపోవడం. వీటిలో ఏ లక్షణాలు ఉన్నా వారు ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. వారికి పరీక్షలు కూడా చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, పిల్లలపై బ్రిటన్ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం ఫలితంగా.. ఈ జాబితాలోని లక్షణాల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. దాదాపు వెయ్యి మంది పిల్లల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. మెడ్‌రెక్సిలో ప్రచురించిన ఆ అధ్యయనంలో 992 మంది పిల్లల్లో 68 మంది శరీరంలో వైరస్ యాంటీబాడీస్ కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.
యాంటీబాడీస్ ఉన్న పిల్లల్లో సగం మందికి కోవిడ్-19 నిర్ధారిత లక్షణాలు కూడా కనిపించాయని చెప్పారు. అయితే ఈ పిల్లల్లో ఎవరినీ ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం రాలేదు.
''పిల్లలు వైరస్ వల్ల అనారోగ్యానికి గురికాకపోవడం ఉపశమనం కలిగించే విషయం. కానీ వారి నుంచి ఎంత మంది పిల్లలకు ఆ వైరస్ వ్యాపించిందో మాకు తెలీడం లేదు. మా అధ్యయనంలో పిల్లల్లో వాంతులు, విరేచనాలు లక్షణాలుగా ఉండడం చూశాం. మేం వీటిని ప్రధాన కరోనా లక్షణాల్లో చేర్చడం గురించి ఆలోచిస్తున్నాం'' అని ఈ అధ్యయన బృందం చీఫ్ డాక్టర్ టామ్ వాట్‌ఫీల్డ్ చెప్పారు.
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సైతం.. కోవిడ్-19 వైరస్ లక్షణాల జాబితాలో వికారం, వాంతులు, విరేచనాలను కూడా చేర్చింది.
అంతకుముందు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ మూడు కరోనావైరస్ లక్షణాలను గుర్తించింది. ఈ లక్షణాలు కనిపించగానే, మనం అప్రమత్తం కావాల్సి ఉంటుంది. అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో వైద్యుల సలహాలు తీసుకోవడం ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
వాసన చూసే శక్తి కోల్పోవటం ప్రధాన లక్షణం
కోవిడ్-19 లక్షణాలలో దగ్గు, జ్వరం కన్నా గానీ.. వాసన చూసే శక్తి కోల్పోవటమనేది మరింత స్పష్టమైన లక్షణంగా పరిగణించవచ్చునని ఓ పరిశోధనలో తేలింది.
దీనికి సంబంధించి యూనివర్సిటీ కాలేజ్ లండన్ 590 మందిపై అధ్యయనం నిర్వహించింది. వీరందరూ ఈ ఏడాది ఆరంభంలో వాసన శక్తి కానీ, రుచి శక్తిని కానీ కాల్పోయామని చెప్పారు. వీరిలో 80 శాతం మందిలో కరోనావైరస్ యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించారు.
ఈ యాంటీబాడీస్ ఉన్న వారిలో 40 శాతం మందిలో మరే ఇతర లక్షణాలూ లేవు.
వాసన, రుచి శక్తులు కోల్పోవటం.. కరోనావైరస్ లక్షణాలు కావచ్చు అనేందుకు ఏప్రిల్ నెల నుంచి ఆధారాలు వెలుగు చూడటం మొదలయింది. మే నెల మధ్యలో.. కరోనా లక్షణాల అధికారిక జాబితాలో ఈ రెండిటినీ చేర్చారు.
ఎవరైనా వాసన, రుచి కోల్పోవటం కానీ, అందులో మార్పులు కానీ కనిపిస్తే.. సెల్ఫ్-ఐసొలేట్ అయి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రస్తుత మార్గదర్శకాలు చెప్తున్నాయి.
అయితే.. ఇప్పటికీ కోవిడ్ ప్రధాన లక్షణాలుగా చాలా మంది దగ్గు, జ్వరాలనే పరిగణిస్తున్నారని యూసీఎల్ అధ్యయన సారధి ప్రొఫెసర్ రాచెల్ బాటర్హామ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కంటి సమస్యలు కూడా...
కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకున్న కొందరిలో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు అంటున్నారు.
కరోనావైరస్ నుంచి కోలుకున్న తర్వాత రెటీనా వ్యాస్కులర్ బ్లాక్ అంటే కంటి రక్త నాళాల్లో అడ్డంకి ఏర్పడటం వంటి సమస్య ఎదురవుతోందని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలోని సువెన్ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రాజా నారాయణ బీబీసీతో అన్నారు.
"కరోనా సోకిన వారిలో వెంటనే ఈ రోగ లక్షణాలు ఉండవని అంటున్నారు. కానీ, రోగి కోలుకున్న నెల రోజుల తర్వాత కంటి చూపు మసక బారడం వంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి" అని ఆయన చెప్పారు.
"అందరికీ ఈ సమస్య వస్తుందని లేదు. నేను చూసిన వారిలో ప్రతి 100 మందిలో ఒకరికి ఈ ఇబ్బంది వస్తోంది. దీనికి చికిత్స ఉంది" అని రాజా నారాయణ అంటున్నారు.

ఒమిక్రాన్ సోకితే...
కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికాలో తొలిసారి కనుగొన్నారు. దీన్ని ఆందోళనకర రూపాంతరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది.
ఈ వేరియంట్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, ప్రాథమిక లక్షణంగా రీఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఒక ప్రకటనలో డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
ఒమిక్రాన్‌తో రిస్క్ ఎక్కువే, తీవ్ర పరిణామాలు తప్పవని తాజాగా డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. తొలుత ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ గుర్తించారు.
ఇప్పటివరకు ఈ వేరియంట్ బారిన పడిన ప్రజల్లో ''చాలా స్వల్ప స్థాయిలో కోవిడ్ లక్షణాలు'' కనబడ్డాయని ఆమె బీబీసీతో చెప్పారు.
''చాలా మంది రోగులు ఒళ్లు నొప్పులు, విపరీతమైన అలసటతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అంటే నేను ఇక్కడ యువత గురించే మాట్లాడుతున్నా. ఆసుపత్రిలో చేరిన వారి గురించి చెప్పడం లేదు''
''ప్రమాదంలో ఉన్న వ్యక్తులపై కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రతను అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుంది'' అని ఆమె చెప్పుకొచ్చారు.
''మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది'' అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు.
ఒమిక్రాన్‌లో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయి. ఇందులో 30 మ్యుటేషన్లు స్పైక్ ప్రోటీన్‌లో సంభవించాయి''
''మన శరీరంలోని కణాలతో ఈ వైరస్ సంబంధం ఏర్పరచుకునే అంశం గురించి మాట్లాడాలంటే ఇది 10 మ్యుటేషన్లను ఉపయోగించుకుంటుంది. డెల్టా వైరస్‌లోని 2 మ్యుటేషన్లే ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి కారణమయ్యాయి'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొద్దిపాటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన కంగారు పడి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదని ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ కావడం ప్రధానమైన చర్యగా చెబుతోంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).
ఐసీఎంఆర్ విడుదల చేసిన సూచనల ఆధారంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలు ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లకు సూచనలు చేస్తున్నాయి. కరోనా లక్షణాలుగా కనిపించిన వెంటనే ఇంట్లో తగినంత స్థలం ఉన్నవారు హోమ్ క్వారంటైన్ కావాలని ఐసీఎంఆర్ సూచించింది.
కొద్దిపాటి జ్వరం, ఒళ్లు, నొప్పులు లాంటి లక్షణాలున్నవారు నొప్పులను, జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్ వంటి మాత్రలు వాడి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి?
తట్టుకోలేని జ్వరం, దగ్గుతో ప్రధానంగా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడేవారు మాత్రమే ఆసుపత్రికి రావాలని సూచించింది ఐసీఎంఆర్.
ఊపిరితిత్తులు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో పరిశీలించి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సాయంతో డాక్టర్లు వైద్యం అందిస్తారు.
వైరస్ వల్ల ఏర్పడ్డ ఆరోగ్య సమస్యలు రోజువారి పనులు చేసుకోలేనంత ఇబ్బందిగా మారినప్పుడు కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు (కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104)కు కాల్ చేయాలి. లేదంటే సమీపంలోని ఆరోగ్యకార్యకర్తలకు పరిస్థితి వివరించి తక్షణం చికిత్స పొందాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటెన్సివ్ కేర్‌లో ఏం జరుగుతుంది?
తీవ్రంగా జబ్బుపడిన వారికి చికిత్స అందించే ప్రత్యేక వార్డు ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
ఈ వార్డుల్లో కరోనావైరస్ పేషెంట్లకు ఫేస్ మాస్కు ద్వారా కానీ, ముక్కు ద్వారా గొట్టం వేసి కానీ ఆక్సిజన్ అందిస్తారు.
ఇంకా తీవ్రంగా జబ్బుపడిన పేషెంట్లకు వెంటిలేటర్ ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా గొంతులో గొట్టం వేసి ఆక్సిజన్ అందిస్తారు. అవసరాన్ని బట్టి గొంతుకు రంధ్రం కూడా చేయాల్సి ఉంటుంది.
వృద్ధులు, ఇప్పటికే పలు రకాల జబ్బుల (ఆస్తమా, డయాబెటిస్, హృద్రోగాలు, బీసీ) బారిన పడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. మహిళలకంటే ఎక్కువగా పురుషులు ఈ వైరస్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

మీలో ఆ లక్షణాలుంటే మీరేం చేయాలి?
కరోనావైరస్ మిగిలిన ప్రమాదకరమైన వైరస్‌ల మాదిరిగా గాలిలో ప్రయాణించలేదు. కానీ, వైరస్ బారినపడ్డ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుంటే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తుంపర్లలో కరోనావైరస్ కణాలు ఉంటాయి.
ఈ వైరస్ ఏదైనా వస్తువుకు అంటిపెట్టుకుని సజీవంగా చాలా కాలంపాటు ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో కొన్ని రోజులపాటు ఇది బతికుండే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

ఆ వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేసిన వాళ్లకూ అది సోకే ప్రమాదం ఉంది. అందుకే, మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్ల హ్యాండ్ రెయిల్స్, మెట్రో రైళ్లలో నిలబడేటప్పుడు పట్టుకునే హ్యాండిళ్లు, బస్సుల్లో సీట్ల వెనుక ఉండే హ్యాండిళ్లు వంటి వాటిపై చేతులు వేయకుండా ఉంటే మంచిది. ఆ వస్తువులను పట్టుకుని, తర్వాత ఆ చేతితో ముఖాన్ని, నోటిని, ముక్కు, కళ్లను తాకితే వైరస్ నేరుగా శరీరంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకినట్లు అనుమానం వస్తే వెంటనే హోమ్ క్వారంటైన్ కావాలని వైద్య ఆరోగ్య శాఖలు చెబుతున్నాయి. మనకు వైరస్ సోకినట్లు తెలియగానే, అది ఇతరలకు సోకకుండా జాగ్రత్త పడాలి.
సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవడం, ఇతరకు కనీసం ఒకటి నుంచి మూడు మీటర్ల దూరం పాటించడం, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం ముఖ్యమైన చర్యలు.
దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటి నుంచి తుంపరాలు గాల్లోకి లేదా ఇతరుల మీదికి వెళ్లకుండా మాస్క్, కర్ఛీఫ్, టిష్యూపేపర్లను అడ్డంగా పెట్టుకోవాలి. గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్కుల వల్ల ఉపయోగంలేదన్నా, తర్వాత అవి వాడటం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని, అందరూ వాడేలా చూడాలని వివిధ దేశాలకు సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
వైరస్ సోకిన లక్షణాలు కనిపించగానే ఆసుపత్రులు, మెడికల్ షాపులకు పరుగెత్తకూడదు. అందరికీ దూరంగా ఉంటూ ప్రభుత్వ హెల్ప్ లైన్‌కు, ఆరోగ్య కార్యకర్తలకు ఫోన్ చేసి సూచనలు, సలహాలు తీసుకోవాలి.
మనం వివిధ వస్తువులను, ప్రదేశాలను తాకినప్పుడు అక్కడున్న వైరస్ మనల్ని అంటుకుంటే చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వాటిని మన శరీరంలోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. 20 సెకండ్ల నుంచి ఒక నిమిషంపాటు సబ్బుతో గట్టిగా రుద్దుతూ చేతులు కడుక్కోవాలని, చేతులు పైకెత్తి గాలిలో ఆరబెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మనలో వైరస్ ఉన్నప్పుడు మన నుంచి మరొకరికి వైరస్ ప్రసారం కాకుండా నోటికి చేతిని, రుమాలను లేదా మాస్కును అడ్డుపెట్టుకోవాలి. తుమ్ము, దగ్గు వల్ల ఏర్పడే తుంపరల్లో వైరస్ ఉంటుందని, ఆ తుంపరలు మరొకరి ముక్కు, నోరు, కళ్లలోకి వెళ్లినప్పుడు వారికి వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చేతులు ముఖానికి తాకుండా జాగ్రత్త పడటం కూడా వైరస్‌ను నిరోధించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఒకవేళ చేతికి వైరస్ అంటుకున్నా అది శరీరంలోకి వెళ్లకుండా ఉండాలంటే ముఖానికి, ముఖ్యంగా నోరు, కళ్లు, ముక్కులకు చేతులు తగలకుండా జాగ్రత్తపడాలి. ముఖానికి మాస్కు ధరించాలి.
కరోనావైరస్‌కు కళ్లెం వేయడమే లక్ష్యంగా ఇప్పటికే చాలా సంస్థలు మార్కెట్లోకి టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వం కూడా 2020 జనవరి 16 నుంచి టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. వ్యాక్సీన్ల కోసం ప్రజలు రిజిస్టర్ చేయించుకునేందుకు కోవిన్ పేరుతో ప్రత్యేక యాప్‌ను కూడా సిద్ధంచేసింది.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












