కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాలు ఎలా పాటించాలి?

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వలన మన జీవన విధానం, సమాజంతో మనకున్న సంబంధాలు ఎంతో మారిపోయాయి. వైరస్ బారినపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి, ఇతరులకు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఎన్నో రకాల సలహాలు, సూచనలు వెల్లువెత్తుతున్నాయి. ఏవి ముఖ్యమైనవి, ఏవి కావు, ఏవి పాటించాలి, ఏవి పాటించక్కర్లేదు అనేది తేల్చుకోవడం కష్టమే.
అందుకే మీకోసం కొన్ని చిట్కాలు.
మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనల ప్రకారం కరోనావైరస్ సోకకుండా ఉండడానికి పాటించవలసిన అతి ముఖ్యమైన, ప్రాథమికమైన ప్రమాణం 'పరిశుభ్రత'.
- చేతులను తరచూ సబ్బుతో రుద్దుకుని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవడం. లేదా ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ చేతులకు బాగా రుద్దుకోవడం. చేతులపై వైరస్ చేరి ఉంటే ఈ రెండు పద్ధతుల ద్వారా అవి నశిస్తాయి.
- కళ్లు, ముక్కు, నోరు మాటిమాటికీ ముట్టుకోవడం, తుడుచుకోవడం మానేయాలి. ఒకవేళ మన చేతులపై వైరస్ చేరి ఉంటే కళ్లు, ముక్కు, నోటి ద్వారా ఆ వైరస్ మన శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా అరికట్టాలి?
- తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు తప్పనిసరిగా చేతులు అడ్డం పెట్టుకోవాలి లేదా చేతిని లోపలికి మడిచి మోచేతి భాగం ముక్కుకి, నోటికి అడ్డం పెట్టుకోవాలి.
- టిష్యూ పేపర్లు దగ్గర పెట్టుకుని తుమ్మిన వెంటనే లేదా దగ్గిన వెంటనే వాటిని చెత్తబుటలో వెయ్యాలి. ముక్కు లేదా నోటి ద్వారా రాలే తుంపర్లలో వైరస్ ఉండొచ్చు. వాడిన టిష్యూలను వెంటనే పారెయ్యకపోతే అది ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
- ఇదే కారణంగా భౌతికదూరం పాటించమని చెప్తున్నారు. మనిషికీ మనిషికీ మధ్య కనీసం 2 మీటర్ల దూరం అంటే సుమారు రెండు చేతులు చాచితే ఏర్పడే దూరం ఉండేట్టు చూసుకోవాలి.
- అందుకే చాలా చోట్ల లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ప్రజలను ఇళ్లనుంచీ బయటకి రావొద్దని, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడవద్దని చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకపోవడమే మంచిది.
- బయటకి వెళ్లి ఇతరులను కలవవలసి వస్తే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇతర పద్ధతుల ద్వారా పలకరించడం మేలు. నమస్కారం చేయడం, చెయ్యి ఊపడం, తల పంకించడం లేదా కొంచెం ముందుకు వంగి పలకరించడం చెయ్యొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ముఖానికి మాస్కులు, చేతులకు తొడుగులు ఉపయోగపడతాయా?
బయట సూపర్‌మార్కెట్‌లో దొరికే మాస్కుల వలన పెద్దప్రయోజనం ఉండదు. అవి వదులుగా ఉండడమే కాకుండా కళ్లను కవర్ చెయ్యవు. అంతేకాకుండా వాటిని ఎక్కువసేపు ధరించి ఉండలేము.
కానీ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లు ఇతరులకు చేరకుండా ఉండడానికి ఈ మాస్కులు కొంతవరకూ ఉపయోగపడతాయి.
గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సార్స్-CoV-2 వైరస్ సోకినవాళ్లకు వ్యాధి లక్షణాలు బయటకు కనిపించవు. ఎవరికి వ్యాధి ఉందో, ఎవరికి లేదో మనకు తెలీదు. అందుచేత మాస్కులు వేసుకుని ఉండడం వల్ల నష్టం లేదు.
ఇంక చేతులకు తొడుక్కునే గ్లౌవ్స్ విషయానికొస్తే ఇవి వేసుకున్నా కూడా వైరస్ మనకు సోకే ప్రమాదం ఉంది అని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. గ్లౌవ్స్ తో ముఖాన్ని ముట్టుకుంటే వైరస్ శరీరంలోకి ప్రవేశించొచ్చు.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం గ్లౌవ్స్ వాడడం కన్నా, ఒట్టి చేతులు తరచూ సబ్బు, నీళ్లతో శుభ్రపరుచుకుంటూ ఉంటే ఈ వైరస్‌నుంచి రక్షించుకునే అవకాశాలు ఎక్కువ.
మనకు కోవిడ్-19 సోకిందని తెలుసుకోవడం ఎలా?
జ్వరం, పొడిదగ్గు కరోనావైరస్ ముఖ్య లక్షణాలు. వీటిని గమనిస్తూ ఉండాలి.
గొంతునొప్పి, తలనొప్పి లేదా విరేచనాలు కూడా కొన్ని కేసుల్లో కరోనావైరస్ లక్షణాలుగా కనిపించాయి. అంతేకాకుండా నోటి రుచి కోల్పోవడం, వాసన తెలియకపోవడం కూడా ఈ వైరస్ లక్షణాలు కావొచ్చు అంటున్నారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్‌డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?


ఫొటో సోర్స్, Getty Images
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే మనమేం చెయ్యాలి?
- డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా ముందు ఇంటినుంచి బయటకి వెళ్లడం మానేయాలి. జలుబు, చిన్న తలనొప్పి లాంటి తేలికపాటి లక్షణాలు కనిపించినా వాటినుంచి పూర్తిగా కోలుకునేవరకూ ఇంట్లోనే ఉండడం మేలు.
- గుర్తుంచుకోండి, 80% కేసుల్లో కోవిడ్-19 చిన్న ఇన్‌ఫెక్షన్‌గానే ఉండొచ్చు. అయినా కూడా ఇతరులను కలవకుండా ఐసొలేషన్‌లో ఉండడం అనేది ప్రధానంగా పాటించవలసిన విషయం.
- జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ లేదా ఇంకేదైనా తీవ్ర ఆరోగ్య సమస్య కావొచ్చు. ఆలస్యం చెయ్యకుండా పరీక్ష చేయించుకోవాలి.
- మీ డాక్టర్‌కు లేదా హాస్పిటల్‌కి వెంటనే ఫోన్ చేసి వారి సలహా తీసుకోండి.
కోవిడ్-19 ఎంత ప్రమాదకరం?
మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్ (The Lancet Infectious Diseases) లో ప్రచురించిన సరి కొత్త అధ్యయనం ప్రకారం, వైరస్ సోకినవారిలో 0.66% మరణిస్తారని అంచనా.
ఇది సీజనల్ ఫ్లూ సోకడం ద్వారా మరణించే 0.1% కన్నా ఎక్కువే కానీ ఇంతకుముందు అంచనా వేసిన కరోనావైరస్ మరణాల శాతం కన్నా చాలా తక్కువ.
అయితే, మొత్తం ఎన్ని కరోనావైరస్ కేసులున్నాయో స్పష్టంగా తెలిసేవరకూ మరణాల శాతం ఎంత ఉంటుంది అనేది అంచనా వెయ్యడం అసాధ్యం.
ఇలాంటి మహమ్మారి వ్యాపించినప్పుడు మరణాల శాతం లెక్క వెయ్యడం క్లిషమైన పని. ఎందుకంటే వ్యాధి సోకడానికి, మరణించడానికి మధ్య సమయ అంతరం ఉంటుంది.
ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రస్తుత అంచనాల ప్రకారం 80 వయసు పైబడినవారిలో మరణాల రేటు సగటుకన్న 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. 40 లోపు వయసు ఉన్నవారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుంది.
చైనాలో 44,000 కన్నా ఎక్కువ కేసుల మీద చేసిన మొట్టమొదటి పెద్ద అధ్యయనంలో మధుమేహం(డయాబెటిస్), అధిక రక్తపోటు లేదా హృదయరోగ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో మరణాల సంఖ్య 5 రెట్లు ఎక్కువగా ఉన్నదని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పటికైనా దీనినుంచి కోలుకోగలమా?
- కరోనావైరస్‌కు ప్రత్యేకమైన మందుకానీ, వాక్సిన్ గానీ లేదు. ఏంటీబయొటిక్స్ పనిచెయ్యవు.
- చికిత్స మార్గాలు కొన్ని ఉన్నాయి. కానీ ఏ చికిత్సా లేకుండానే ఎక్కువమంది కోలుకోగలరు.
కరోనావైరస్ నివారణకు వాక్సిన్ కనుక్కోవడం కోసం ప్రపంచం నలుమూలలా శాస్త్రవేతలు కృషి చేస్తున్నారు. కానీ వాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి అనేక పరీక్షలు, ప్రయోగాలు జరపాలి. ఇది పూర్తిస్థాయిలో తయారుకావడానికి సమయం పట్టొచ్చు.
ఈ కష్ట సమయంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడుతూ ఒత్తిడిని ఎదుర్కోవడమెలా?
ఒత్తిడి ఉంటుంది అనడానికి ఏ సందేహం లేదు. ఆందోళన పెరగడం, తెలియని దుఃఖం, బాధ, నిరాశ నిస్ఫృహలకు లోనవ్వడం జరగొచ్చు.
ఇలాంటి మానసిక సమస్యలనుంచీ బయటపడడానికి ది బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ అందించిన 10 ముఖ్యమైన సూచనలు.
తరచూ కుటుంబ సభ్యులకూ, స్నేహితులకూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండండి. వీడియో కాల్స్‌లో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడడం లేదా సోషల్ మీడియాలో తరచూ పలకరించుకోవడం ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
మీకు ఆందోళన, ఒత్తిడి కలిగిస్తున్న విషయాల గురించి మాట్లాడండి.
ఇతరుల భయాలు, ఆందోళనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఇప్పుడు రోజువారీ పద్ధతి మారిపోయింది. ఇంట్లోంచి పనిచెయ్యడం, కావలసిన సరుకులు ఎక్కువగా ఆల్‌లైన్‌లో తెప్పించుకోవడం లేదా ఒకేసారి బయటికెళ్లి సరుకులన్నీ తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ సక్రమంగా ప్లాన్ చేసుకోండి.
మీ శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఇంట్లోనే ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి. సమతుల ఆహారం తీసుకోండి. నీళ్లు ఎక్కువ తాగండి. సిగరెట్, ఆల్కాహాల్ తీసుకోవడం తగ్గించండి.
కరోనావైరస్ అప్డేట్స్ తెలుసుకోవడానికి నమ్మకమైన సోర్స్ ఎంచుకోండి. ఈ వైరస్ గురించి విస్తృత సమాచారం అందుబాటులో ఉంది. అవన్నీ చదివితే మనసు మరింత కృంగిపోతుంది. ఎంత అవసరమో అంతవరకే తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
ఒత్తిడిని, కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి: కొన్ని మన చేతుల్లో ఉండవు అనే విషయాన్ని అంగీకరించండి. మన చేతుల్లో ఉన్న విషయాలు, మన ప్రవర్తన, నడవడికలాంటివి మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చెయ్యగలం అనేది ఆలోచించండి. వర్తమానంపై దృష్టి పెట్టండి. ఒడిదుడుకులు తాత్కాలికమే అని గ్రహించండి.
సరిగ్గా సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఒక రొటీన్ పెట్టుకోండి. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, పడుకునేముందు మొబైల్ లేదా టీవీ చూడడం తగ్గించండి.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- తమ సరిహద్దు గ్రామాలు 60 ఏళ్లుగా చైనా అధీనంలోనే ఉన్నా నేపాల్ ఎందుకు మాట్లాడడం లేదు?
- చైనాతో పోరులో భారత్‌కు అమెరికా అండగా ఉంటుందా లేక ముఖం చాటేస్తుందా?
- రూ.50,000కి చేరిన బంగారం ధర.. ఇప్పుడు కొంటే లాభమా.. అమ్మితే మంచిదా
- 50 యేళ్లుగా అంతు తేలని ఓ గణిత శాస్త్ర సమస్యకు వారంలోనే పరిష్కారం చూపిన విద్యార్థి
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
- కరోనావైరస్తో తల్లి మృతి.. ఆస్పత్రిలో నానమ్మ అదృశ్యం... 8 రోజుల తర్వాత అదే ఆస్పత్రి టాయిలెట్లో విగతజీవిగా లభ్యం
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








