బంగారం ధర రూ.50,000 దాటింది... ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా? కొనాలా, అమ్మాలా?

బంగారం కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగారం ధర ఆకాశాన్ని అంటుతోంది. సోమవారం ఒక దశలో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రికార్డు స్థాయిలో రూ.50,580 పలికింది.

జులై 2వ తేదీన హైదరాబాద్‌లో బంగారం రూ.50,070 వద్ద ట్రేడ్ అవుతోంది.

నెల రోజుల కిందట దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.40వేల స్థాయిలో ఉంది. అంటే నెల రోజుల్లో దాదాపు 25 శాతం పెరిగింది.

బ్యాంక్ బజార్ వార్తా వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం గత ఏడాదిలో 10 గ్రాముల బంగారం(24 క్యారట్ల) సగటు ధర రూ.35,220.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 1,750 అమెరికన్ డాలర్లకు అటూఇటుగా ఉంది.

గోల్డ్ ప్రైస్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో నెల రోజుల్లో 1.28 శాతం, ఆరు నెలల్లో 24.24 శాతం, ఏడాదిలో 35.55 శాతం వృద్ధి నమోదైంది.

మరోవైపు వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.49,800 పలుకుతోంది.

బంగారం గాజులు

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకు పెరుగుతున్నాయి

కరోనావైరస్ సంక్షోభం, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం, ఇతర విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టడమే క్షేమమని మదుపరులు భావించడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.

అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు అధిక స్థాయిల్లో కొనసాగుతుండటం, కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వివిధ దేశాలు నగదు లభ్యత పెంచే చర్యలు చేపట్టడం బంగారం ధర పెరగడానికి కారణాలని ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ కె.నాగేంద్ర సాయి చెప్పారు.

‘‘కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా, యూరప్‌ల్లో ప్రభుత్వాలు ప్యాకేజీలతో నగదు లభ్యతను పెంచుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నాయి. వాస్తవ ఆర్థిక పరిస్థితికి, మార్కెట్లకు పొంతన లేదు. పెద్దపెద్ద ఫండ్స్, మదుపరుల్లో మార్కెట్లు పడిపోతాయన్న భయం ఉంది. రిస్క్‌ను తగ్గించుకునేందుకు వాళ్లు బంగారం సహా విలువైన లోహాలవైపు వస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

రాబోయే కొద్ది రోజుల్లో నగదు లభ్యత పెరిగి, డాలర్ మరింత బలహీనపడే అవకాశాలున్నాయని నాగేంద్ర సాయి అభిప్రాయపడ్డారు.

వారెన్ బఫెట్ లాంటి పెద్ద పెట్టుబడిదారులు కూడా మార్కెట్‌ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారని ఆయన అన్నారు.

‘‘అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉందని ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ చెబుతోంది. ఆ దేశ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దాన్ని అంగీకరించడం లేదు. మార్కెట్లు బావుంటే పరిస్థితి అంతా బావున్నట్లేనని ఆయన భావిస్తున్నారు. కానీ ఆర్థికవ్యవస్థలో సత్తువ లేకపోయినా, మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉండటంతో ఈ బుడగ ఎప్పుడైనా పేలొచ్చన్న భయం పెట్టుబడిదారుల్లో ఉంది. ఈక్విటీ మార్కెట్లకు, బంగారానికి ఒక పరస్పర వ్యతిరేక సంబంధం ఉంటుంది. బంగారాన్ని ఒక ‘హెడ్జింగ్ టూల్’లా, ‘రిజర్వ్ కరెన్సీ’లా చూస్తారు’’ అని నాగేంద్ర సాయి అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో ఆరు నెలల్లో 24.24 శాతం, ఏడాదిలో 35.55 శాతం వృద్ధి కనిపించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో ఆరు నెలల్లో 24.24 శాతం, ఏడాదిలో 35.55 శాతం వృద్ధి కనిపించింది.

ఎప్పుడు కొంటే మంచిది?

ఏడాది కన్నా ఎక్కువ సమయం ఆగగలిగేవాళ్లైతే వేచి చూడటం మంచిదేనని, అప్పుడు బంగారం రూ.30 వేల స్థాయిలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని కమోడిటీస్ అనలిస్ట్ పుట్టి రమేశ్ అన్నారు.

అయితే, షార్ట్ టెర్మ్‌లో మరింత పెరిగే సూచన ఉండంతో తక్షణ అవసరాలున్నవారు ఇప్పుడే కొనడం నయమని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ప్రతి 2 నుంచి 5 ఏళ్లకు ఓసారి బంగారం ధరలో పతనం వస్తుంది. ఇదివరకటి ర్యాలీలో బంగారం రూ.48వేల వరకూ వెళ్లి, మళ్లీ తగ్గింది. ఇది రెండో ర్యాలీ. ఇప్పుడు ధర ఇంకా 20-22 శాతం పెరగొచ్చు’’ అని రమేశ్ చెప్పారు.

మరోవైపు ఒకసారి కాకుండా, విడతలవారీగా కొంచెం కొంచెం బంగారం కొనడం మంచి పద్ధతని నాగేంద్ర సాయి అభిప్రాయపడ్డారు.

‘‘ఇప్పుడే పూర్తిగా ఒకేసారి కొనేయడమో లేదా తగ్గాక ఒకేసారి కొనేద్దామని అనుకోవడమో మంచిది కాదు. విడతలవారీగా బంగారం కొనుక్కోవడం మేలు. ఇప్పుడు కొంత, మళ్లీ తగ్గినప్పుడు ఇంకాస్త... సమయం ఉంటే అలా కొనుక్కోవాలి’’ అని చెప్పారు.

ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు, కొనుగోలు చేసే దేశాలు భారత్, చైనాలే.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు, కొనుగోలు చేసే దేశాలు భారత్, చైనాలే

‘మదుపరులు ఇలా చేయండి’

బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆభరణాలను కొనుగోలు చేయొద్దని నిపుణులు అంటున్నారు.

‘‘బంగారం పెట్టుబడి పెట్టేందుకు చాలా అనుకూలమైన వస్తువు. 80 ఏళ్లుగా దాని ధర ఎప్పుడూ 40 శాతానికి మించి పడిపోయింది లేదు. అయితే, పెట్టుబడులకు ఆభరణాలు అనుకూలం కాదు. అలా కొన్నవారు, వాటిని తిరిగి అమ్మే సమయంలో తరుగు పేరుతో నష్టపోవాల్సి వస్తుంది’’ అని పుట్టి రమేశ్ చెప్పారు.

ఆభరణాల కొనుగోలుకు బదులుగా బంగారం ఈటీఎఫ్‌ల్లో, ఆర్బీఐ జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్‌ల్లో మదపు చేయడం ఉత్తమమని నాగేంద్ర సాయి సలహా ఇచ్చారు.

‘‘ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్‌ల్లో మదుపు చేయడం ద్వారా మనకు కావాల్సిన బంగారాన్ని బాండ్ల రూపంలో కొనుగోలు చేయొచ్చు. దానిపై వడ్డీ కూడా పొందొచ్చు. కాలపరిమితి పూర్తయిన తర్వాత ఆ బంగారానికి అప్పుడు మార్కెట్‌లో ఉన్న విలువ ప్రకారం నగదు తీసుకోవచ్చు. తరుగు, తయారీ ఛార్జీల వంటి ఇబ్బందులు ఉండవు’’ అని ఆయన అన్నారు.

‘‘పెట్టుబడులకు ఇప్పుడు స్థిరాస్తి రంగం అనుకూలంగా లేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఐదు శాతానికి మించడం లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ల వడ్డీ రేట్లు కూడా 46 ఏళ్ల కనిష్ఠంలో ఉన్నాయి. ఇక పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది బంగారం, స్టాక్ మార్కెట్లలోనే. ప్రస్తుతమున్న కఠినమైన పరిస్థితుల్లో పెట్టుబడిలో కొంత వాటాను బంగారంలో పెట్టడం మంచిదే’’ అని నాగేంద్ర సాయి చెప్పారు.

విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టడమే క్షేమమని మదుపరులు భావించడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విలువైన లోహాల్లో పెట్టుబడులు పెట్టడమే క్షేమమని మదుపరులు భావించడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు

భారత్-చైనా ఉద్రిక్తతలు పెరిగితే...

ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్, చైనాలది ముందువరుస.

ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాల విషయమై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇవి మరింత ముదిరితే బంగారం ధర పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని పుట్టి రమేశ్ అంటున్నారు.

ఏడాది కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లకు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాక్స్ ఇదివరకు అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ అంచనాను 1800 డాలర్లకు తగ్గించింది.

భారత్-చైనా ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధర 30 శాతం వరకూ పతనం కావొచ్చని రమేశ్ అభిప్రాయపడ్డారు.

‘‘నిజానికి అనిశ్చిత పరిస్థితుల్లో ధర పెరగాలి. మిగతా దేశాల్లో బంగారం, వెండిని అనిశ్చిత పరిస్థితుల్లో కొనుగోలు చేస్తారు. కానీ, భారత్, చైనాల్లో యుద్ధ పరిస్థితులు వస్తే బంగారం ఎవరూ కొనరు. ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు కూడా రావొచ్చు. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు వస్తేనే ఈ పరిస్థితి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

1962 యుద్ధ సమయంలో బంగారం ధర 30 శాతం, స్టాక్ మార్కెట్లు 16 శాతం పడిపోయాయని ఆయన గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)