టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది? దలైలామాకు ఆశ్రయమిచ్చిన భారత్.. చైనా వాదనకు అంగీకరించిందా?

టిబెట్

ఫొటో సోర్స్, Getty Images

లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలకు మూడేళ్ల ముందు డోక్లాంలో కూడా రెండు దేశాల సైనికులు తలపడ్డారు.

భారత్ - చైనాల మధ్య సరిహద్దు వివాదం పరిధి లద్దాఖ్, డోక్లాం, నాథులా మీదుగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లోయ వరకూ విస్తరించింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతం తమదేనని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. తవాంగ్‌ను టిబెట్‌లో భాగమని.. తవాంగ్, టిబెట్‌ సంస్కృతి, సంప్రదాయాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయని చెబుతోంది.

తవాంగ్ బౌద్ధుల ప్రముఖ ఆరామం. దలైలామా తవాంగ్ ఆరామాన్ని సందర్శించిన సమయంలో కూడా చైనా ఆ పర్యటనను చాలా వ్యతిరేకించింది.

ఈ ఏడాది ఫ్రిబవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లినపుడు కూడా చైనా ఆయన పర్యటన గురించి అధికారికంగా వ్యతిరేకత తెలియజేసింది.

టిబెట్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్‌ కూడా తమదేనని చైనా చెబుతోంది. దానిని దక్షిణ టిబెట్ అంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌కు చైనాతో 3,488 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉంది.

1938లో ఏర్పాటు చేసిన మెక్‌మోహన్ లైన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగం. చైనా టిబెట్‌ను 1951లోనే తన నియంత్రణలోకి తెచ్చుకుంది.

టిబెట్ మ్యాప్

ఫొటో సోర్స్, Getty Images

టిబెట్ చరిత్ర

ఇక్కడి జనం ప్రధానంగా బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. ఈ మారుమూల ప్రాంతం ‘ప్రపంచానికి పైకప్పు’ అని కూడా పేరుపడింది. చైనాలో టిబెట్‌ స్వయంప్రతిపత్తి హోదా గల ప్రాంతంగా చెప్తారు.

ఈ ప్రాంతంపై శతాబ్దాల నుంచి తమకు సర్వాధికారాలు ఉన్నాయని చైనా చెబుతోంది. అటు టిబెట్ ప్రజలు చాలా మంది బహిష్కరణకు గురైన తమ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు అనుచరులుగానే ఉన్నారు.

దలైలామాను ఆయన అనుచరులు గౌతమ బుద్ధుడి అంశగా చూస్తారు. చైనా మాత్రం ఆయన వల్ల వేర్పాటువాద ప్రమాదం ఉందని భావిస్తోంది.

టిబెట్ చరిత్ర చాలా అల్లకల్లోలాలను చవిచూసింది. ఒకప్పుడు అది స్వీయ పాలనలో ఉన్న అందమైన ప్రాంతం. కొన్నాళ్లు మంగోలియా రాజులు, మరి కొన్నాళ్లు చైనాలో బలమైన రాజవంశాలు ఆ ప్రాంతంపై అధికారం చెలాయించాయి.

కానీ 1950లో చైనా ఈ ప్రాంతంలో తమ జెండా ఎగరేయాలని వేలాది సైనికులను పంపించింది. టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలను అది స్వయంప్రతిపత్తి గల ప్రాంతాలుగా మార్చింది. మిగతా ప్రాంతాలను వాటి పక్కనే ఉన్న చైనా రాష్ట్రాల్లో కలిపేసింది.

కానీ, 1959లో చైనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలం కావడంతో దలైలామా టిబెట్ వదిలి భారత్‌ను శరణుకోరారు. భారతదేశంలో ఆయన ఒక ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్నికూడా ఏర్పాటుచేశారు.

1960, 70వ దశకంలో చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన సమయంలో టిబెట్‌లోని ఎన్నో బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేశారు. ఈ అణచివేత, సైనిక పాలన సమయంలో వేలాది టిబెటన్లు ప్రాణాలు కోల్పోయారని చెబుతారు.

భారత్‌ను శరణు కోరిన దలైలామా

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత్‌ను శరణు కోరిన దలైలామా

చైనా టిబెట్ వివాదం ఎప్పుడు మొదలైంది?

చైనా, టిబెట్ మధ్య గొడవ.. టిబెట్ చట్టబద్ధ హోదాకు సంబంధించినది. టిటెబ్ 13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ తమ దేశంలో భాగంగా ఉందని చైనా చెబుతుంది.

కానీ టిబెటన్లు మాత్రం తమ దేశం ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉందని, తమపై చైనా అధికారం నిరంతరంగా లేదని చెబుతారు.

మంగోల్ రాజు కుబ్లాయ్ ఖాన్ యువాన్ రాజవంశాన్ని స్థాపించి.. తన రాజ్యాన్ని టిబెట్‌తో పాటు, చైనా, వియత్నాం, కొరియా వరకూ విస్తరించాడు.

తర్వాత 17వ శతాబ్దంలో చైనా చింగ్ రాజవంశానికి టిబెట్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 260 ఏళ్ల బంధం తర్వాత చింగ్ సైన్యం టిబెట్‌ను ఆక్రమించింది. కానీ మూడేళ్లలోనే టిబెటన్లు వారిని తరిమికొట్టి.. 1912లో 13వ దలైలామా టిబెట్ స్వతంత్ర దేశమని ప్రకటించారు.

1951లో చైనా సైన్యం మరోసారి టిబెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్‌ ప్రతినిధి బృందంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టిబెట్ సౌర్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగించారు.

దలైలామా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆయన టిబెట్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉన్నారు.

టిబెట్

ఫొటో సోర్స్, SEAN CHANG

లాసా- ఒక నిషేధిత నగరం

చైనా 1949లో టిబెట్‌ను ఆక్రమించినపుడు ఆ ప్రాంతానికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. టిబెట్‌లో చైనా సైన్యం మోహరించింది. రాజకీయంగా జోక్యం చేసుకుంటోంది. దాంతో టిబెట్ నేత దలైలామా పారిపోయి భారత్‌ శరణుకోరాల్సి వచ్చింది.

తర్వాత నుంచి టిబెట్‌లో చైనీకరణ ప్రారంభమైంది, టిబెట్ భాష, సంస్కృతి, మతం, సంప్రదాయం అన్నిటినీ లక్ష్యంగా చేసుకున్నారు.

బయటి నుంచి వచ్చేవారికి, టిబెట్, దాని రాజధాని లాసా వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. అందుకే దానిని నిషేధిత నగరం అంటారు. 1963లో విదేశీయులు టిబెట్ రావడాన్ని నిషేధించారు. అయితే 1971లో మళ్లీ విదేశీయుల కోసం టిబెట్ తలుపులు తెరిచారు.

దలైలామా

ఫొటో సోర్స్, Getty Images

దలైలామా పాత్ర

జే సింఖాపా 1409లో జేలగ్ స్కూల్ స్థాపించారు. ఆ స్కూలు ద్వారా బౌద్ధ మత ప్రచారం జరిగేది. ఆ ప్రాంతం భారత్, చైనా మధ్య ఉండేది. దానిని టిబెట్ అని పిలిచేవారు. అదే స్కూల్లో విద్యార్థి గెందూన్ ద్రుప్ గురించి చాలా చర్చ జరిగేది. తర్వాత ఆ గెందునే మొదటి దలైలామా అయ్యారు.

బౌద్ధ మతాన్ని అనుసరించేవారు దలైలామాను బుద్ధుడి రూపంగా చూసేవారు. ఆయనను కరుణకు ప్రతీకగా భావించేవారు. మద్దతుదారులు ఆయన్ను తమ నేతగా కూడా భావించేవారు.

ముఖ్యంగా దలైలామాను ఒక బోధకుడుగా చూసేవారు. లామా అంటే గురువు అని అర్థం. లామా తన వారు సరైన మార్గంలో వెళ్లేలా స్ఫూర్తి నింపేవారు. టిబెట్‌లో బౌద్ధ మతానికి నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్దులందరికీ మార్గదర్శకుడుగా నిలిచేవారు.

1630వ దశకంలో టిబెట్ ఏకీకరణ సమయం నుంచి బౌద్ధులు, టిబెట్ నాయకత్వం మధ్య గొడవ మొదలైంది. మాంచూ, మంగోల్, ఓయిరాత్ గుంపుల మధ్య టిబెట్‌లో అధికార కోసం యుద్ధాలు జరిగేవి. చివరికి ఐదో దలైలామా టిబెట్‌ను ఏకం చేయడంలో విజయవంతం అయ్యారు. ఆ తర్వాత నుంచీ టిబెట్ సాంస్కృతిక గుర్తింపు సాధించింది. టిబెట్ ఏకీకరణతో అక్కడ బౌద్ధ మతం వృద్ధి చెందింది.

జెలగ్ బౌద్ధులు 14వ దలైలామాకు కూడా గుర్తింపు ఇచ్చారు. దలైలామాను ఎంచుకునే ప్రక్రియ గురించి కూడా వివాదం ఉంది. 13వ దలైలామా 1912లో టిబెట్‌ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత చైనా టిబెట్‌పై దాడి చేసింది.

అక్కడ 14వ దలైలామా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఆ యుద్ధంలో టిబెట్‌ ఓడిపోయింది. కొన్నేళ్ల తర్వాత టిబెట్ ప్రజలు చైనా పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తమ సౌర్వభౌమాధికారాన్ని డిమాండ్ చేశారు.

కానీ తిరుగుబాటుదారులకు విజయం దక్కలేదు. దాంతో, తాము చైనా గుప్పిట్లో ఘోరంగా చిక్కుకుపోయామని దలైలామాకు అనిపించింది. అప్పుడు ఆయన భారత్ శరణు వేడారు. 1959లో దలైలామాతోపాటు టిబెటన్లు భారీ సంఖ్యలో భారత్ వచ్చారు. ఆయనకు భారత్ ఆశ్రయం ఇవ్వడం చైనాకు నచ్చలేదు.

అప్పట్లో చైనాను మావో సేటుంగ్ (Maotse Tung) పరిపాలిస్తున్నారు. దలైలామా, చైనా కమ్యునిస్టు పాలన మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగాయి. దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి లభించింది. కానీ ఇప్పటికీ ఆయన ప్రవాస జీవితాన్నేగడుపుతున్నారు.

చైనా చేతికి టిబెట్ ఎలా చిక్కింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చైనా చేతికి టిబెట్ ఎలా చిక్కింది?

టిబెట్ చైనాలో భాగమా?

టిబెట్ చైనాలో భాగమా? చైనా నియంత్రణలోకి రాకముందు టిబెట్ ఎలా ఉండేది? ఆ తర్వాత ఏమేం మారింది? అని చైనా-టిబెట్ బంధానికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు వస్తాయి.

వీటికి సమాధానంగా టిబెట్ ప్రవాస ప్రభుత్వం “చరిత్రలో రకరకాల సమయాల్లో టిబెట్ వివిధ విదేశీ శక్తుల ప్రభావంలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంగోలులు, నేపాల్ గూర్ఖాలు, చైనా మంచు రాజవంశం, భారత్‌లో అధికారం చెలాయించిన బ్రిటన్ పాలకులు అందరూ టిబెట్ చరిత్రలో పాత్ర పోషించారు, కానీ చరిత్రలోని మిగతా కాలాల్లో టిబెట్ తమ పొరుగు దేశాలపై అధికారం, ప్రభావం చూపించింది. ఆ పొరుగు రాజ్యాల్లో చైనా కూడా ఉంది” అని చెప్పింది.

“చరిత్రలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విదేశీ శక్తుల ప్రభావం లేదా ఆధిపత్యంలో లేని ఒక దేశాన్ని వెతకడం ఇప్పుడు చాలా కష్టం. వాటితో పోలిస్తే, టిబెట్ విషయంలో విదేశీ ప్రభావం లేదా జోక్యం చాలా పరిమితంగానే ఉండేది”.

కానీ చైనా మాత్రం.. “700 ఏళ్లకు పైగా టిబెట్ మీద మాకు సౌర్వభౌమాధికారం ఉంది. టిబెట్ ఎప్పుడూ స్వతంత్ర దేశంగా లేదు. ప్రపంచంలో ఎప్పుడూ, ఏ దేశమూ టిబెట్‌కు ఒక స్వతంత్ర దేశంగా గుర్తింపు ఇవ్వలేదు” అంటోంది.

టిబెట్‌ను చైనాలో భాగంగా భారత్ గుర్తించిందా?

2003 జూన్‌లో టిబెట్‌ను చైనాలో భాగంగా భారత్ అధికారికంగా గుర్తించింది. చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్‌తో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సమావేశమైన తర్వాత భారత్ మొదటిసారి టిబెట్‌ను చైనాలో భాగంగా అంగీకరించింది.

అయితే అప్పుడు ఆ గుర్తింపు పరోక్షంగా మాత్రమే అని చెప్పారు. కానీ రెండు దేశాల మధ్య బంధాల్లో దీనిని ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తారు.

వాజ్‌పేయి-జియాంగ్ జెమిన్ చర్చల తర్వాత చైనా కూడా సిక్కిం మార్గంలో భారత్‌తో వ్యాపారం చేసుకునే షరతుకు అంగీకరించింది. అప్పుడు దానిని సిక్కింను భారత్‌లో భాగంగా చూస్తున్నట్లు చైనా కూడా అంగీకరించినట్టే భావించారు.

చైనాలో ఒక పెద్ద భాగమైన మొత్తం టిబెట్‌కు తాము గుర్తింపు ఇవ్వలేదని భారత అధికారులు అప్పట్లో చెప్పారు. స్వయంప్రతిపత్తి గల టిబెట్‌గా భావించే ప్రాంతానికి మాత్రమే గుర్తింపు ఇచ్చినట్లు భారత్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)