చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులు ఏంటి? ఎగుమతి చేసే వస్తువులు ఏంటి? ఎక్కువ ఆధారపడేది ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్‌లో చైనా ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా బ్యాన్‌చైనాప్రోడక్ట్స్, బ్యాన్‌చైనా, బ్యాన్‌చైనాయాప్స్ లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
ఇలాంటి డిమాండ్లు రావడం ఇదేమీ తొలిసారి కాదు. అయితే గత 40ఏళ్లలో ఎన్నడూలేని స్థాయిలో లద్దాఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో విధ్వంసకర ఘర్షణల నడుమ ఈ డిమాండ్లు ప్రస్తుతం ఎక్కువయ్యాయి.
ఇంతకీ భారత్‌కు చైనా ఎలాంటి వస్తువులు ఎగుమతి చేస్తోంది. వేటిని దిగుమతి చేసుకుంటోంది? ఎవరిపై ఎవరు ఎక్కువ ఆధారపడుతున్నారు?
నిషేధం విధిస్తే ఎవరి ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ప్రభావితం అవుతుంది? అసలు ఈ నిషేధం సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
ఆసియాలో 14.14 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో చైనాదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అమెరికా (21.44 ట్రిలియన్ డాలర్లు) తర్వతి స్థానం చైనాదే. 2.94 ట్రిలియన్ డాలర్ల పరిమాణంతో భారత్ ఐదో స్థానంలో ఉంది.
వాణిజ్యం విషయానికి వస్తే... భారత్‌కు అమెరికా తర్వాత అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనానే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సమాచారం ప్రకారం.. భారత్ చేసుకునే దిగుమతుల్లో చైనా వాటా 14.09 శాతం వరకు ఉంది.
ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం సాధనాలు, కంప్యూటర్ విభాగాలు (హార్డ్‌వేర్, ఇతర విడిభాగాలు), ఫార్మా ఉత్పత్తులు, ప్లాస్టిక్ బొమ్మలు.. భారత్‌కు చైనా నుంచి ఎక్కువ దిగుమతి అవుతున్నాయి.
భారత్ ఎగుమతుల విషయానికి వస్తే.. చైనా మూడో స్థానంలో ఉంది. 5.33 శాతం ఎగుమతులు చైనాకే వెళ్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుప ముడి ఖనిజం, రసాయనాలను చైనా ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.
ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. చైనాకు భారత్ 11వ అతిపెద్ద భాగస్వామి. చైనాకు వచ్చే దిగుమతుల్లో భారత్ వాటా 0.88 శాతం వరకు ఉంది. భారత్ నుంచి కంటే ఆఫ్రికా దేశం అంగోలా నుంచి చైనా ఎక్కువ వస్తువులు దిగుమతి చేసుకుంటోంది.
చైనా చేసే ఎగుమతుల్లో 3.08 శాతం భారత్‌కు వస్తున్నాయి. ర్యాంకుల వారీగా చూస్తే.. చైనా ఎగుమతి భాగస్వాముల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది.
అంటే నిషేధంతో.. 3.08 శాతం మాత్రమే చైనా ఎగుమతులు ప్రభావితం అవుతాయి. అదే భారత్ విషయానికి వస్తే 5.33 శాతం ఎగుమతులు ప్రభావితం అవుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
నేరుగా వచ్చే పెట్టుబడులు తక్కువే
భారత్‌కు చైనా నుంచి నేరుగా వచ్చే పెట్టబడులు చాలా తక్కువ. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సమాచారం ప్రకారం.. గత 20ఏళ్లలో మొత్తం పెట్టుబడుల్లో కేవలం 0.51 శాతం (2.3 బిలియన్ డాలర్లు) మాత్రమే చైనా నుంచి వచ్చాయి.
అయితే, భారత్‌లోని తొలి 30 దిగ్గజ అంకుర సంస్థల్లో(స్టార్టప్‌లలో)ని 18 సంస్థల్లో చైనా పెట్టుబడులున్నట్లు విదేశీ వ్యవహారాల మేధోమథన సంస్థ గేట్ వే హౌస్- ఇండియన్ కౌన్సిల్ ఆన్ గ్లోబల్ రిలేషన్స్ నివేదిక చెబుతోంది.
కొన్ని అంకుర సంస్థల్లో నేరుగా.. మరికొన్నింట్లో సింగపూర్, మారిషస్ లాంటి దేశాల గుండా చైనా సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్లు వివరిస్తోంది.
అంకుర సంస్థల్లో ఇలా ..
చైనాకు చెందిన వివిధ సంస్థలు, అవి పెట్టుబడులు పెట్టిన భారత స్టార్టప్‌లు..
- అలీబాబా గ్రూప్ - పేటీఎం, బిగ్‌బాస్కెట్, స్నాప్‌డీల్, జొమాటో, డైలీ హంట్, ర్యాపిడో
- టెన్సెంట్ - బైజూస్, డ్రీమ్-11, ఫ్లిప్‌కార్ట్, హైక్, ఓలా, ఉడాన్, స్విగ్గీ, ప్రాక్టో, ఎంఎక్స్ ప్లేయర్, గానా, ఖాతాబుక్
- స్టెడ్‌వ్యూ క్యాపిటల్ - డ్రీమ్-11, ఫ్లిప్‌కార్ట్ ఓలా, పాలసీ బజార్, క్వికర్
- సైఫ్ పార్ట్‌నర్స్ - రివీగో, స్విగ్గీ, పేటీఎం
- ఫోసున్- డెల్హీవరీ, దీదీ చుక్సింగ్ - ఓయో
- సీట్రిప్- మేక్‌మైట్రిప్
(ఆధారం గేట్ వే హౌస్ నివేదిక)

ఫొటో సోర్స్, Getty Images
75 శాతం స్మార్ట్‌ఫోన్లు చైనావే..
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోనూ చైనా ఫోన్లదే ఆధిపత్యం. దాదాపు 75 శాతం వరకూ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు చైనావేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ చెబుతోంది.
2020 మొదటి త్రైమాసికం విక్రయాల్లో షియోమి (30), వీవో (17), రియల్‌మీ (14), ఒప్పో (12) లాంటి ప్రముఖ చైనా బ్రాండ్లు ఆధిపత్యం ప్రదర్శించినట్లు వివరిస్తోంది.
టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో, లైక్, బ్యూటీ ప్లస్ తదితర యాప్‌లు కూడా చైనావే. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు చైనాలోనూ కొన్ని భారత సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. 54 ప్రధాన సంస్థలు.. షాంఘై, బీజింగ్, గువాంగ్‌డాంగ్ లాంటి ప్రధాన నగరాల్లో పనిచేస్తున్నట్లు కన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ నివేదిక చెబుతోంది.
వస్తూత్పత్తి, ఆరోగ్య రంగం, ఆర్థిక సేవలు, ఐటీ, టెలీ కమ్యూనికేషన్లు తదితర రంగాల్లో ఈ సంస్థలు సేవలు అందిస్తున్నాయి.
"మేం ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాం"
చైనా ఉత్పత్తులపై నిషేధం దిశగా ఇప్పటికే తాము చర్యలు మొదలుపెట్టినట్లు కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చెబుతోంది.
40,000 వాణిజ్య సంఘాల సమాఖ్యే సీఏఐటీ. ఏడు కొట్ల వర్తకులకు తాము ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు సీఏఐటీ పేర్కొంది.
450 కేటగిరీల్లోని 3,000 చైనా ఉత్పత్తులను నిషేధించాలని తాము తీర్మానించినట్లు సీఏఐటీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్.. వివరించారు. వీటన్నింటికీ భారత్‌లో ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పారు.ఎలక్ట్రానిక్ పరికరాలు, బొమ్మలు, వస్త్రాలు, పిల్లల ఆహారం, హ్యాండ్ బ్యాగ్‌లు, సంగీత పరికరాలు, వంట సామగ్రి, ఇతర ఇంటి సామగ్రి, నగలు, గడియారాలు, కళ్లద్దాలు, ఫర్నీచర్, కొన్ని వైద్య పరికరాలు, కొన్ని స్పోర్ట్స్ సామగ్రి, దేవుడు బొమ్మలు, దీపావళి సామగ్రి తదితర వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి."డిసెంబరు 2021కల్లా లక్ష కోట్ల రూపాయల చైనా దిగుమతులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని రాష్ట్రాల సీఏఐటీ వ్యాపార, వర్తక ప్రతినిధులతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నాం. చైనా ఉత్పత్తులకు ప్రచారం నిర్వహించొద్దని ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులను అభ్యర్థించాం"అని బీబీసీతో ఆయన చెప్పారు."చైనా ఉత్పత్తులను నిషేధిస్తే ఏర్పడే అంతరాన్ని భారత వ్యాపారులు భర్తీ చేయగలరు. ఎందుకంటే ఇక్కడ నైపుణ్యాలు, సాంకేతికత, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. తయారీదారులకు తగిన ప్రోత్సాహక వాతావరణం కల్పిస్తే.. చైనా దిగుమతులను అడ్డుకోవచ్చు"అని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఏం అంటోంది?
కొన్ని చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని త్వరలో పెంచేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుంకం పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే వస్తువులను తగ్గించొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వంతోపాటు ప్రైవేటు టెలికాం ప్రొవైడర్లు ఇకపై చైనా సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని, కొత్త టెండర్లలోనూ చైనా సంస్థలను అనుమతించొద్దని టెలికాం శాఖ ఆదేశించింది.
కేంద్ర మంత్రి రామ్‌దాస్ అఠావలే అయితే.. చైనా వస్తువులతోపాటు చైనా ఫుడ్, చైనా రెస్టారెంట్లను కూడా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు.
చైనా ఉత్పత్తులపై సంపూర్ణ నిషేధం విధించడం కుదరదని ఇదివరకే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరించారు. సుంకాల పెంపు, ఇతర చర్యలతో కొన్ని ఉత్పత్తులను అడ్డుకోవచ్చని ఆమె అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.అయితే, సుంకాలు, ఇతర చర్యలతో చైనా ఉత్పత్తులను అడ్డుకుంటే ప్రతిచర్యలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.
"దీర్ఘకాలంలో కొన్ని ఎంపికచేసిన ఉత్పత్తులపై కావాలంటే ప్రభుత్వం నిషేధం విధించొచ్చు. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే ఆలోచనలో.. భారత రైల్వే, బీఎస్ఎన్ఎల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా నుంచి వచ్చే దిగుమతులను పూర్తిగా నిషేధించడం అనేది అసాధ్యమనే చెప్పాలి"అని దిల్లీ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం అధ్యాపకుడు అనుభవ్ రాయ్ వివరించారు.
"ఒకవేళ సుంకాలు పెంచి దిగుమతులను అడ్డుకుంటే భారత్ ఎక్కువ ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ప్రతిచర్యలతో చైనా కూడా మన ఎగుమతులను అడ్డుకుంటుంది. మనకు చైనా మూడో అతిపెద్ద ఎగుమతుల మార్కెట్. అనే విషయం గుర్తుపెట్టుకోవాలి." <bold>ఇవి కూడా చదవండి:</bold>
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- కరోనావైరస్: వినోద రంగం భవిష్యత్తేంటి?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








