భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. ఈ పతనానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కరిష్మా వస్వానీ
- హోదా, ఆసియా బిజినెస్ కరస్పాండెంట్, బీబీసీ
చైనా కరెన్సీ యువాన్ బలహీనపడుతోంది. ఒక్క అమెరికా డాలర్‌కు ఏడు యువాన్ల మార్కును చేరుకునేలా కనిపిస్తోంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలోనే యువాన్ ఇంతగా పతనమైంది. ఆ తర్వాత మళ్లీ యువాన్ విలువ ఈ స్థాయికి చేరుతుండటం ఇదే మొదటిసారి.
యువాన్ హెచ్చుతగ్గుల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంటారు. అలా గమనించడానికి.. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో ఇది కీలకమైన అంశం కావటంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
చైనా తన ఎగుమతుల్ని పెంచుకునేందుకు కరెన్సీ విలువ తక్కువగా ఉంచుతోందని, ఇది అనుచితమని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ యంత్రాంగం అంటోంది. అది నిజం కాదని చైనా ప్రభుత్వం అంటోంది. యువాన్‌ను ఒడిదుడుకులకు గురి కాకుండా స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోంది.
మరి నిజం ఏంటి?
మొదట గమనించాల్సింది ఏంటంటే.. చైనా కరెన్సీ మిగతా కరెన్సీల్లాగా పనిచేయదు. దీని వర్తకం సులభంగా జరగదు.
యువాన్ వర్తకానికి సంబంధించి చైనా సెంట్రల్ బ్యాంకు ప్రతిరోజూ ఒక గైడింగ్ పాయింట్‌ను నిర్ణయిస్తుంది. యువాన్ ప్రయాణం ఎటన్నది అంచనా వేసేలా మార్కెట్లకు ఇదొక సంకేతం.
ప్రస్తుతం యువాన్ 7కు దగ్గరగా వెళుతోంది. అంటే.. ఒక అమెరికన్ డాలర్‌తో ఏడు యువాన్లను కొనుగోలు చేయవచ్చన్నమాట.

చివరిసారిగా ఒక అమెరికా డాలర్‌తో ఏడు చైనా యువాన్లను కొనుగోలు చేసింది పదేళ్ల కిందట ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలోనే. (2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చైనాను డోనల్డ్ ట్రంప్ విమర్శించినప్పుడు కూడా ఏడు మార్కుకు చాలా దగ్గరగా యువాన్ వచ్చింది. ఎగుమతుల్ని పెంచుకునేందుకు కరెన్సీ విలువను మోసపూరితంగా మారుస్తోందని అప్పట్లో చైనాను ట్రంప్ విమర్శించారు. చైనాతో అమెరికా వర్తక లోటుపై కూడా ట్రంప్ విమర్శలు చేశారు.)
ఇప్పుడు మళ్లీ ఆ మార్కుకు యువాన్ చేరుకుంటోంది. అమెరికా డాలర్‌కు ఎన్ని ఎక్కువ యువాన్లు వస్తే.. యువాన్ అంత ఎక్కువగా బలహీనపడినట్లు.
అయితే, ఏడు మేజిక్ నంబరేమీ కాదు. ట్రేడర్లకు ఇదొక సైకలాజికల్ పాయింట్ మాత్రమే.
కానీ, యువాన్ ప్రయాణానికి సంబంధించి మాత్రం ఇదొక శుభ సూచకం: అదే దాని పతనం.
లండన్‌కు చెందిన ఎకనమిక్ రీసెర్చి సంస్థ క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన జూలియన్ ఇవాన్స్-ప్రిచర్డ్ సహా చాలామంది విశ్లేషకులు చెప్పేదేమంటే.. ‘రాబోయే నెలల్లో చైనా కరెన్సీ మరింత ఒత్తిడికి లోనవుతుంది. ఏడు మార్కును కూడా చేరుతుంది’ అని.
దీనికి కొన్ని కారణాలు..

ఫొటో సోర్స్, Getty Images
చైనా బలహీనపడుతోంది.. అమెరికా బలపడుతోంది
యువాన్ బలహీనపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా డాలర్ బలపడటం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో విశ్వాసం పెరగడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ క్రమంగా వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల డాలర్ బలపడింది.
అదే సందర్భంలో చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2009 తర్వాత చైనా నమోదు చేసిన అత్యంత నెమ్మదైన వృద్ధిరేటు ఇది.
క్యాపిటల్ ఎకనమిక్స్ సంస్థ ప్రకారం.. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రమంగా ద్రవ్య విధానంలో పరస్పర వైరుధ్యాలకు దారితీస్తాయి.
ఇది తరచుగా చైనా నియంత్రిత మారకం విలువలో ఉద్యమాలకు పురికొల్పుతుంది.

చైనా ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య యుద్ధం గురించి మా ఇతర కథనాలు..
- చైనా: 2009 తర్వాత అత్యల్ప వృద్ధి రేటు నమోదు
- 40 ఏళ్లలో చైనా నంబర్ వన్ ఎలా అయింది?
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మరింత పేదరికంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంలో గెలుపు ఎవరిది?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?

వాణిజ్య యుద్ధం
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం పట్ల ఆందోళనలు కూడా చైనా ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల కరెన్సీ విలువ దిగజారుతోంది. వాస్తవానికి.. ఈ ఏడాది మొదట్లో చైనాపై డోనల్డ్ ట్రంప్ పెంచిన తీవ్రమైన ఒత్తిడి తర్వాతే యువాన్ పతనం తీవ్రమైంది.
చైనా మారకం విలువ ఒక సమస్యగా మారిందని, వాణిజ్య యుద్ధంలో భాగంగా దీన్ని కూడా పరిష్కరించాలంటూ అమెరికా అధికారులు చేసిన వ్యాఖ్యలు కూడా జతకలవటంతో.. యువాన్‌పై ఒత్తిడి ఎక్కువైంది.
విచిత్రం ఏంటంటే.. బలహీనమైన యువాన్ ప్రపంచ వ్యాప్తంగా చైనా ఎగుమతులు ఆకర్షణీయంగా ఉండేలా చేసి.. ఆర్థిక వృద్ధికి సహకరిస్తుంది.
బీజింగ్ డైలమా
ఈ నేపథ్యంలో.. చైనా అధికార కేంద్రం బీజింగ్ - యువాన్ పతనం, ఎగుమతుల పెరుగుదల - ఈ రెండింటి మధ్య చిక్కుకుంది.
యువాన్ మరింత బలహీనపడేలా దాన్ని వదిలేస్తే.. ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. తద్వారా వాణిజ్య యుద్ధం మరింత ముదురుతుంది.
వాణిజ్య యుద్ధాన్ని పరిష్కరించుకునేందుకు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జింగ్‌పింగ్ ఈ నెలలో భేటీ కానున్నారు. యువాన్ మరింత పతనమైతే ఈ చర్చలను పక్కదారి పట్టించినట్లే, చైనా కష్టాలను మరింత పెంచినట్లే అవుతుంది.
అయినప్పటికీ.. విశ్లేషకులు చెప్పేదేమంటే.. యువాన్ మరింత పతనం అయ్యేలా దానిని వదిలేయటం తప్ప చైనాకు మరో ప్రత్యామ్నాయం లేదని. అన్ని రకాల చైనా ఎగుమతులపై సుంకాలను వేస్తామని డోనల్డ్ ట్రంప్ గతంలో చేసిన హామీని నిలబెట్టుకుంటే.. యువాన్ మరింత పతనం చైనాకు తప్పనిసరి.
ట్రంప్ అన్నంతపనీ చేస్తే చైనా వృద్ధి మరింత నెమ్మదిస్తుంది. ఈ పరిస్థితి చైనా రాజకీయ, ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలా జరగకుండా చూడాలని చైనా ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకోసం ఏమైనా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- రిజర్వు బ్యాంకుకూ కేంద్రానికీ మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది?
- చైనా అంటే ఆఫ్రికా దేశాలకు ఎందుకంత భయం?
- జీడీపీ: అంచనాలను మించి అత్యధిక ఆర్థిక వృద్ధి సాధించిన భారత్
- ఆస్ట్రేలియా: పెరుగుతున్న చైనా ప్రాబల్య వివాదం.. 'జాతివివక్ష'తో మరింత ముదురుతుందా?
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- తెలంగాణ ఎన్నికలు 2018: పరభాషా ఓటర్లే పెన్నిధి
- ట్రంప్ ఫోన్ ట్యాప్ అవుతోందా? ‘మీరు ఐఫోన్‌ను వదిలేసి హువాయి వాడండి’ : చైనా
- ‘టెస్ట్ ట్యూబ్ చెట్లు’: చెట్లు అంతరించిపోకుండా ఉండడానికి ఇదే పరిష్కారమా?
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








