జీడీపీ: అంచనాలను మించి అత్యధిక ఆర్థిక వృద్ధి సాధించిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కింజల్ పాండ్య వాఘ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయిలో రూ.71కి పడిపోయిన సమయంలో.. భారతదేశ వృద్ధి ఆర్థిక వేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆశించిన గణాంకాలకన్నా అత్యధికంగా నమోదైంది.
ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం గడచిన ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి గాను 8.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
తాజా జీడీపీ గణాంకాలు.. అంతకు ముందు త్రైమాసిక వృద్ధి రేటు 7.7 శాతం కంటే ఎక్కువ. ఈ పెరుగుదల అందరి అంచనాలనూ తలకిందులు చేసింది.
ఒకపక్క అధిక చమురు ధరలు, ప్రపంచ వర్తక ఆందోళనల వంటి ప్రమాదాల నేపథ్యంలో భారతదేశం ఈ వృద్ధిని సాధించింది.
ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్న.. 184,041,000,000,000 రూపాయల భారత ఆర్థిక వ్యవస్థ గతేడాది ఇదే సమయంలో.. అంటే 2017 ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి గాను 5.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.7 శాతంగా నమోదైంది.
కాగా, ఈ ఏడాది భారతదేశ ఆర్థికాభివృద్ధి వృద్ధి రేటు 7.4 శాతం ఉంటుందని ఆశిస్తున్నట్లు బుధవారం రిజర్వు బ్యాంకు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వృద్ధి స్థిరమేనా?
''ఉత్పత్తి, నిర్మాణం, వ్యవసాయం వంటి రంగాల్లో వృద్ధి మెరుగవటం కీలకమైన విషయం. కాబట్టే ఆశించినదానికన్నా అధిక వృద్ధి రేటు నమోదైంది'' అని రేటింగ్స్ సంస్థ 'కేర్ రేటింగ్స్'లో ముఖ్య ఆర్థిక వేత్త అయిన మదన్ సబ్నవీస్ తెలిపారు.
అయితే, ఈ వృద్ధి రేటు పెరుగుదల స్థిరంగా ఉంటుందా అని ఆయన్ను ప్రశ్నిస్తే.. రాబడి ద్వారా ఈ వృద్ధికి తగినంత మద్దతు లభించకపోతే ద్రవ్య లోటుపై ఒత్తిళ్లు పెరుగుతాయని అన్నారు.
ఈ ఆర్థిక సంవత్సర ప్రథమ త్రైమాసికంలో ''అధిక ధరలు, బలహీన రూపాయి, చమురు ధరలపై ఆందోళనల వంటి సవాళ్ల నేపథ్యంలో ఆర్థిక మార్కెట్లలో పెట్టుబడి గణనీయంగా పెరగలేదు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి రేటులో సర్దుబాట్లను ఆశించొచ్చు'' అని ఆయన చెప్పారు.
రిజర్వు బ్యాంకు గత రెండు భేటీల్లో కీలకమైన రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచి 6.5 శాతం చేసింది. గత తొమ్మిది నెలలుగా తన లక్ష్యాన్ని మించి 4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకే ఆర్బీఐ ఇలా చేసింది.
జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం గతేడాదితో పోలిస్తే కొంత తగ్గి 4.17గా నమోదైంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో 4.8 శాతంగా కొనసాగొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది.
రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 10 శాతం బలహీనపడింది. గురువారం రికార్డు స్థాయిలో బలహీనపడి 70.8250 గా నమోదైంది. ఆసియా దేశాల్లో అత్యంత దారుణంగా పడిపోతున్న కరెన్సీ రూపాయే.
ఈ వారానికి ముందే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. పెరుగుతున్న చమురు ధరలు, వడ్డీ రేట్ల ఒత్తిళ్లు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపైన, భారతదేశ కరెంట్ ఖాతాపైన పడుతుందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
- #లబ్‌డబ్బు: భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర
- రిచర్డ్ థేలర్: వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలపై రచనలకు నోబెల్
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
- చరిత్రలో కనిష్ఠ స్థాయికి రూపాయి: ఈ పతనం ఎందుకు?
- మనం ఖర్చు చేసే విధానాన్ని క్రెడిట్ కార్డులు ఇలా మార్చేశాయి
- ఈ ఎన్ఆర్ఐ రూ.1300 కోట్లను విరాళంగా ఎందుకిచ్చారు?
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- వెనెజ్వేలా: శృంగార జీవితంపై సంక్షోభం ప్రభావం
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
- 'కార్డు'లను కరెన్సీనోట్లుగా మార్చేందుకు సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే..
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









