కొట్టేసిన క్రెడిట్, డెబిట్ కార్డులను కరెన్సీనోట్లుగా మార్చేందుకు సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే..

క్రెడిట్, డెబిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

'వర్చువల్ మనీ'ని నగదు రూపంలో పొందడం సైబర్ నేరగాళ్లు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య.

కొట్టేసిన కార్డులను డబ్బు రూపంలో చలామణిలో తేవడానికి సైబర్ నేరగాళ్లు అప్పుడప్పుడు సృజనాత్మకంగా ఆలోచిస్తారని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు.

సైబర్ ల్యాబ్స్ సెక్యూరిటీ రీసెర్చ్ అధినేత జివ్ మడర్ బీబీసీతో మాట్లాడుతూ, ''ఉదాహరణకు క్రెడిట్ కార్డు దొంగిలించే నేరగాళ్లను తీసుకుంటే.. దాన్ని నగదు రూపంలో మార్చుకోడానికి వారికి కొంత సమయమే ఉంటుంది. ఎందకంటే బాధితుడు ఆ కార్డు పనిచేయకుండా చర్యలు తీసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో దొంగిలించిన క్రెడిట్ కార్డులను బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసి సొమ్ము చేసుకుంటారు'' అని తెలిపారు.

''కార్డులను అమ్మడానికే వారు ప్రయత్నిస్తారు. దాని వల్ల పెద్దగా డబ్బు రాదు'' అని అన్నారు.

సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డులను ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లు తదితర విలువైన వస్తువులను కొనడానికి కూడా ఉపయోగిస్తున్నారు. సెకెండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్మినా వాటికి మంచి లాభమే వస్తుండటంతో ఈ మార్గాన్ని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది.

సైబర్ క్రైం నేరగాళ్లు

ఫొటో సోర్స్, Reuters

యాంటీ సైబర్ సిస్టమ్‌కు దొరకకుండా..

''కొట్టేసిన కార్డులతో వందల కొద్ది ఐఫోన్‌లను సైబర్ నేరగాళ్లు ఒకేసారి కొనరు. వేర్వేరు కార్డులను ఉపయోగించి వేర్వేరు సమయాల్లో కొనుగోళ్లు జరుపుతారు'' అని జివ్ మడర్ అన్నారు.

''ఒకే కంప్యూటర్ మీద వివిధ కార్డులతో కొనగోళ్లు జరిపితే యాంటీ సైబర్ వ్యవస్థకు చిక్కే అవకాశం ఉంటుంది. దీన్ని అడ్డుకోవడానికి కూడా ఆర్థిక నేరగాళ్లు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు'' అని ఆయన తెలిపారు.

కార్డులో డబ్బును ఖాళీ చేసేందుకు వీరు చేసే మరో ప్రయత్నం.. అమెజన్, వాల్‌మార్ట్‌ల గిఫ్ట్ కార్డ్‌లను ఉపయోగించడం.

కొట్టుకొచ్చిన కార్డుతో వీరు మొదట గిఫ్ట్ కార్డులు కొంటారు. తర్వాత ఆ కార్డులను పెద్ద డిస్కౌంట్‌లతో బయటవాళ్లకు అమ్ముతారు.

ఇంకా చాలా సృజనాత్మకంగా కార్డులను కరెన్సీ రూపంలో మార్చుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు.

ఉబర్, ఇతర సర్వీసింగ్ రైడ్లను ఉపయోగించి కార్డులను నగదు రూపంలో మార్చుకుంటారు.

అమెరికా, స్పెయిన్‌లలో ఇలాంటి నేరగాళ్లకు సహకరించే డ్రైవర్లను గుర్తించినట్లు మడర్ చెప్పారు.

మోసపూరిత చెల్లింపులు జరిపేందుకు కొంతమంది ఉబర్ డ్రైవర్ల కోసం చూస్తున్నారని ఆయన అన్నారు.

''డ్రైవర్ అకౌంట్‌లోకి కార్డుతో చెల్లింపులు జరిపి ఆ మొత్తాన్ని నగదు రూపంలో మార్చుకుంటారు. కొంతమొత్తాన్ని సహకరించిన డ్రైవర్లకు అందిస్తారు'' అని ఆయన వివరించారు.

సైబర్ క్రైం వరల్డ్‌లో ఇవన్నీ మార్కెట్‌లుగా ఉంటున్నాయని సర్రే యూనివర్సిటీలోని క్రిమినాలజిస్ట్ డాక్టర్ మైక్ మెక్ గ్యురీ వివరించారు.

''నేర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పరిశీలించగా డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయో అర్థమైంది'' అని ఆయన బీబీసీకి తెలిపారు.

''ప్రతియేటా చీకటి మార్కెట్‌లోకి వేలకోట్ల సొమ్ము ప్రవహిస్తోంది. ఇలా అక్రమంగా వచ్చిన డబ్బును కొంతమంది మాదక ద్రవ్యాలు, వివిధ దేశాలు నిషేధించిన వస్తువులను కొనడానికి ఉపయోగిస్తున్నట్లు మా పరిశోధనలో తెలిసింది'' అని మెక్ గ్యురి వెల్లడించారు.

సైబర్ క్రైం నేరగాళ్లు

ఫొటో సోర్స్, Reuters

బ్యాంకులే నయం

''హవాలా నగదు, నకిలీ స్థిర, చరాస్తులను గుర్తించడంలో బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయి'' అని మోసాలను గుర్తించి ఆర్థిక సంస్థలకు సహకరించే బీఏఈఎస్ అప్లైడ్ ఇంటలిజెన్స్‌కు చెందిన రాబ్ హర్టన్ తెలిపారు.

సైబర్ నేరగాళ్లు ఇచ్చే ఫేక్ డ్యాకుమెంట్లను గుర్తించడానికి కూడా చాలా సమయం పడుతుందని, వాటిని విశ్లేషించడం అంత సులువుకాదని అన్నారు.

‘‘ఒక సంస్థ మరొక సంస్థతో సమాచారాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇలాంటి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించవచ్చు. ఒక నెట్‌వర్క్‌ను నాశనం చేయడానికి ఇలాంటి నెట్‌వర్క్ ఉండాలి’’ అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)