కేరళ వరద బాధితుల దాహం తీరుస్తున్న తెలుగువాళ్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శరత్ బెహరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రతి వరదల్లో ఎదురయ్యే పరిస్థితే ప్రస్తుతం కేరళలోనూ ఉంది. చుట్టూ నీళ్లు కనిపిస్తున్నా, గొంతు తడుపుకోవడానికి అవి పనికిరావు. కానీ ఆ నీళ్లనే అప్పటికప్పుడు శుద్ధి చేసి వరద బాధితుల దాహార్తి తీరుస్తున్నారు కరుణాకర్.
రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం 50 నీటి శుద్ధి ప్లాంట్లను కేరళకు పంపించింది. వాటి సాయంతో రోజుకు దాదాపు 10లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేయొచ్చు. వరదనీరు, మురికినీరు అన్న తేడా లేకుండా ఎలాంటి నీటినైనా అప్పటికప్పుడు శుద్ధి చేసే సామర్థ్యం ఆ యంత్రాల సొంతం. ఆ యంత్రాల్ని పంపింది తెలంగాణ ప్రభుత్వమైనా, వాటిని తయారు చేసింది హైదరాబాద్‌లో మర్ది కరుణాకర్ రెడ్డికి చెందిన స్మాట్ ఇండియా సంస్థ.
కేరళ ప్రభుత్వ ఆహ్వానంపై ఆయన ఇటీవలే అక్కడికి వెళ్లొచ్చి ఆ రాష్ట్రంలో మంచినీటి సరఫరా కోసం తక్షణం చేయాల్సిన పనులేంటో అధికారులతో చర్చించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత శిబిరాల్లోని లక్షలాది వరద బాధితులకు మంచి నీటిని అందించేందుకు ఆయన తన బృందంతో కలిసి పనిచేస్తున్నారు.
'నాలుగైదు రోజుల క్రితం కేరళ ప్రజాపనుల శాఖ ప్రధాన కార్యదర్శి కమలవర్ధన్ రావు నాతో మాట్లాడారు. గతంలో హుద్ హుద్ తుపాను, జమ్మూ కశ్మీర్, బెంగాల్ వరదల సమయంలో మేం చేసిన పనుల గురించి ఆయనకు తెలుసు. ప్రస్తుతం కేరళలో సురక్షిత నీటి కరవు నెలకొందని, శిబిరాల్లో ప్రజలకు మంచినీటిని అందించడం కష్టంగా మారిందని చెప్పారు. ఆ అవసరాలు తీర్చడానికి ఏం చేయాలో సూచించమని అడిగారు.
నేను వెంటనే బయల్దేరి త్రివేండ్రం వెళ్లా. అక్కడ అప్పటికే అధికారుల సమావేశం జరుగుతోంది. 13జిల్లాల్లో తీవ్ర మంచినీటి కొరత నెలకొంది. దాంతో ఉన్నఫళంగా మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని అన్నారు. నా తరఫున నేనొక 10 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను అందించగలనని, వాటితో రోజూ దాదాపు లక్ష లీటర్ల నీటిని శుద్ధి చేసి ఇవ్వొచ్చని చెప్పా. అంతకంటే ఎక్కువ కావాలంటే మాత్రం కొంత ఆర్థిక సాయం అవసరమవుతుందని అడిగా. దాంతో కేరళ అధికారులు తెలంగాణ అధికారులకు ఫోన్ చేసి సాయం కోరారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఆ తరువాత తెలంగాణ సీఎస్ నాకు ఫోన్ చేసి కేరళకు అవసరమైన సాయం అందించమని అడిగారు. ఆ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. దాంతో వేర్వేరు ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసుకున్న నీటి శుద్ధి యంత్రాలను వెనక్కు రప్పించి కేరళ పంపడానికి సిద్ధం చేశా. వాటిని విమానం ద్వారా తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ప్రస్తుతం ఆ శుద్ధి యంత్రాలు కేరళలోని వివిధ జిల్లాల్లో రోజూ లక్షల లీటర్ల సురక్షిత నీటిని అందిస్తున్నాయి' అంటూ కరుణాకర్ వరద బాధితులకు తమ యంత్రాలు ఎలా ఉపయోగపడుతోందీ వివరించారు.

నీటి శుధ్ధి యంత్రాలే ఎందుకు?
ప్రకృతి విపత్తుల సమయంలో సురక్షిత నీటి ప్రాధాన్యం ఎంతో తమకు తెలుసని, అందుకే ఆర్థిక సాయం అందించడంతో పాటు నీటి శుద్ధి ప్లాంట్లను కూడా పంపామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
‘గతంలోనూ విపత్తుల సమయంలో ఇతర రాష్ట్రాలకు నీటి శుద్ధి యంత్రాలను పంపిన అనుభవం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం కేరళకు అత్యవసరంగా వీటిని పంపాల్సి రావడంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగ కార్యదర్శి, రెవన్యూ కార్యదర్శితో చర్చించి గతంలో ఇలాంటి సేవలను అందించిన సంస్థ నుంచే వాటిని సేకరించాం. మొత్తం 50 యూనిట్లతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కూడా కేరళకు పంపించాం. ఇప్పటికే ఆ శుద్ధి యంత్రాలను అమర్చి, నీటిని సేకరిస్తున్నట్లు కేరళ అధికారులు మాతో చెప్పారు’ అని జోషి వివరించారు.
కరుణాకర్ పంపిన 'స్మాట్' శుద్ధి యంత్రాలు వరద నీరు, మురికి నీరు అన్న తేడా లేకుండా ఎలాంటి నీటినైనా మంచినీళ్లగా మార్చగలవు. గతంలో ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ వరదల సమయంలో కరుణాకర్ బృందం సంచార నీటిశుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి, అప్పటికప్పుడు మురుగునీటిని శుద్ధి చేసి సైనికుల నుంచి సామాన్యుల వరకు అందరికీ వాటినే అందించింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వమే తమ సాయం కోరిందని చెబుతారు కరుణాకర్.
'ప్రస్తుతం కేరళలో నాకు అందిన సమాచారం మేరకు ఎర్నాకులంలో 263, అలప్పుజాలో 232, పతనంతిట్టలో 201, త్రిశూర్‌లో 286, కోజికోడ్‌లో 202, వాయనాడ్‌లో 163 సురక్షిత శిబిరాలను ఏర్పాటు చేశారు. వాటిలో వేలాది బాధితులు తలదాచుకుంటున్నారు. వాళ్లందరి తాగు నీటి అవసరాలను మా యంత్రాలు తీరుస్తాయి' అని కరుణాకర్ వివరిస్తున్నారు.
శిబిరాల్లో ప్రజల దాహార్తి తరువాత, కాలనీలకు నీటిని సరఫరా చేయడం ప్రస్తుతం అధికారుల ముందున్న మరో సవాలు. చాలా కాలనీలకు నీటిని సరఫరా చేసే మినీ ప్రాజెక్టులు, మోటార్లు నీటి మునిగాయి. రోడ్లు తెగిపోవడంతో పైపులైన్లు పగిలిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. కాబట్టి మంచినీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాలి. ఆ సమస్యను పరిష్కరించడానికీ తమ బృందం పనిచేస్తోందని కరుణాకర్ చెబుతున్నారు.

'కేరళలో చాలా భాగం కొండ ప్రాంతమే. కాబట్టి నీటి పీడనం ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. దాంతో నీటి సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడం అంత సులువు కాదు. వరద ప్రవాహం తగ్గడానికి కూడా మరో పది రోజులు పట్టొచ్చు. గతంలో కేరళలో మేం కొన్ని నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశాం. దాంతో అక్కడి నీటి సరఫరా వ్యవస్థ గురించి మాకు అవగాహన ఉంది. ప్రస్తుతం మా ఇంజినీర్లు అక్కడే సేవలందిస్తున్నారు.
ఒక మినీ నీటి సరఫరా ప్రాజెక్టును పునరుద్ధరించాలంటే 10-20మంది కావాలి. కానీ ఆ నీటిలో పనిచేయడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎక్కడ ఏ విద్యుత్ తీగ తెగిపడిందో తెలీడం లేదు. దాంతో పనులకు కాస్త ఆటంకం కలుగుతోంది' అని ఆయన అన్నారు.
ప్రజలకు సురక్షిత నీటిని అందించడానికి ఇలాంటి నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయడం కరుణాకర్‌కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఆయన సీఎండీగా ఉన్నా 'స్మాట్ ఇండియా' సంస్థ ఆరున్నర వేలకు పైగా సామాజిక మంచినీటి కేంద్రాలను నిర్వహిస్తోంది.
'గతంలో ఓసారి రాష్ట్రపతి భవన్‌లో మేం మురుగునీటిని మంచినీటిగా మారుస్తున్న పద్ధతి నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు బాగా నచ్చింది. దాంతో ఆయన నన్ను పిలిపించి మాట్లాడారు. నన్ను అభినందిస్తూనే, మా పనులు పేదలకు ఎలా ఉపయోగపడగలవో ఆలోచించమని చెప్పారు. ఆ సూచన ప్రకారమే కమ్యూనిటీ వాటర్ ప్లాంట్ల వ్యవస్థను మొదలుపెట్టా. స్థానికంగా దొరికే నీటినే ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా శుద్ధి చేసి, నామమాత్రపు ధరకు ప్రజలకు మంచినీటిని అందించడమే వాటి ఉద్దేశం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అవి పనిచేస్తున్నాయి. నా ప్రగతి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్న కలాం స్వయంగా నన్ను 'బ్యాంక్ ఆఫ్ ఇన్నొవేషన్స్ అండ్ ఐడియాస్‌లో సభ్యుణ్ణి చేశారు' అని గుర్తుచేసుకుంటారు కరుణాకర్.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో తాను ఎన్నో వరదలను చూశానని, కానీ కేరళ పరిస్థితి వాటికంటే కాస్త భిన్నమని కరుణాకర్ అంటున్నారు. 'కేరళ ప్రజలు ఈ విపత్తుకు మానసికంగా సిద్ధంగా లేరు. అక్కడ చాలామంది యువత విదేశాల్లో స్థిరపడ్డారు. దాంతో పెద్దవాళ్లు, పిల్లల జనాభానే ఎక్కువగా ఉంది. పైగా ఏవో డ్యాములు కూలిపోతాయని, ఊళ్లు మునిగిపోతాయని స్థానికంగా కొన్ని వదంతులు పుడుతున్నాయి. దాంతో మానసికంగా వారంతా చాలా బలహీనంగా ఉన్నారు.
నేను తిరిగిన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. కేరళకు చాలామంది బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్ వస్తువుల లాంటివి పంపిస్తున్నారు. కానీ నాకు తెలిసీ అక్కడ చాలామంది ప్రజల ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంది. ఈ వస్తువుల వల్ల చెత్త పేరుకుపోవడం మినహా ఎక్కువ మందికి అవి ఉపయోగపడకపోవచ్చని నా అభిప్రాయం. కేరళకు ప్రస్తుతం మానవ వనరుల అవసరం చాలా ఉంది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ల లాంటి పనివాళ్లు కావాలి.
అక్కడ కుక్కలు, గొర్రెల లాంటి చాలా జీవాలు చచ్చిపోయాయి. వాటిని నీళ్లలో నుంచి త్వరగా తొలగించకపోతే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియాలో పుడుతున్న వదంతులు పరిస్థితులను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి' అంటూ కేరళలో పర్యటించిన బయటి రాష్ట్రం వ్యక్తిగా కరుణాకర్ తన అనుభవాలను వివరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








