కేరళ వరదలు: 'ఆ కన్నీళ్ళను ఆపడం నావల్ల కాలేదు...' మూడు జిల్లాల నుంచి బీబీసీ ప్రతినిధుల అనుభవాలు

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Reuters

కేరళలో వరదలు సృష్టించిన బీభత్సం, సహాయక చర్యలను రిపోర్ట్ చేయడానికి బీబీసీ ప్రతినిధులు ప్రమీలా కృష్ణన్, సల్మాన్ రావి, యోగితా లిమాయే రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వెళ్ళారు. అక్కడి పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు ప్రత్యేక కథనాలు అందించారు. గత కొద్ది రోజులుగా ఆ వరదల్లో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఈ ముగ్గురు జర్నలిస్టులు తమ అనుభవాలను ఇలా వివరించారు:

ప్రమీలా కృష్ణన్, కోచి నుంచి

(బీబీసీ ప్రతిధి ప్రమీలా కృష్ణన్, వీడియో జర్నలిస్ట్ ప్రవీన్ అన్నామలై ఆగస్టు 12 నుంచి కేరళలోనే ఉంటున్నారు)

నిన్న మా నాన్న అన్న మాట నా హృదయాన్ని తాకింది. "కేరళలో విషాదం గురించి ప్రపంచానికి తెలియజెప్పే అవకాశం రావడం, నీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతి అమ్మా" అని మా నాన్న అన్నారు.

మా సహచరుడు వీడియో జర్నలిస్ట్‌ ప్రవీన్‌ అన్నామలైతో కలిసి ఎనిమిది రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగాను, సహాయక కేంద్రాలకు వెళ్లాను.

మేం కూడా మూడు రోజులపాటు కోచిలోని ఓ హోటల్‌లో చిక్కుకుపోయాం. కోచి నగరాన్ని వరద ముంచెత్తడంతో హోటల్‌ నుంచి బయటకు వెళ్లవద్దని మాకు సూచించారు. మాతో పాటు ఆ హోటల్‌లో మరో 120 మంది ఉన్నారు. వాళ్లంతా చుట్టుపక్కల వాళ్లే. వాళ్ల ఇళ్లల్లోకి వరదనీరు చేరడంతో వాళ్లు వచ్చి హోటల్‌లో తలదాచుకున్నారు. వాళ్లే కాదు, కేరళలో ప్రతి వ్యక్తీ వరద బాధితుడే అని చెప్పగలను.

ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద నీరు తగ్గుతోంది.

ఆదివారం కోచి నుంచి త్రివేండ్రం వెళ్తుండగా మధ్యలో ఓ సహాయక కేంద్రం వద్ద ఆగాను. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడాను. వర్షాలతో వాళ్ల ఇళ్లు పాడైపోయాయి. కొందరు తమ ఇళ్లను చూసుకునేందుకు వెనక్కి వెళ్లారు. కానీ, వరదలు సృష్టించిన విధ్వంసానికి అవి గుర్తుపట్టరాకుండా తయారయ్యాయి.

కేరళ వరదలు

మేం కోలుకునేదెలా?

వరదల్లో మునిగి తేలిన ఇళ్లకు వెళ్తే పాములు ఉంటాయని చాలామంది భయపడుతున్నారు.

"మా ఇంట్లో పెద్ద పెద్ద పాములు కనిపించాయి. ఇప్పుడు ఆ ఇంటికి నా పిల్లలను ఎలా తీసుకెళ్లాలో అర్థం కావడంలేదు. వెళ్దామంటే పిల్లలు భయపడుతున్నారు" అని 40 ఏళ్ల జోసెఫ్ అన్నారు.

ఇద్దరు ప్రాణ స్నేహితులను కోల్పోయిన 70 ఏళ్ల అపుకుట్టమ్ ఈ క్యాంపులోనే ఉంటున్నారు. "మా ఊరివాళ్లంతా సహాయక కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. వరదలు మా ఇళ్లను నాశనం చేశాయి. మాకు ఏమీ మిగల్లేదు. ఇక మేం కోలుకునేదెలా? సాధారణ జీవితం గడిపేదెలా?" అంటూ దీనంగా రోదిస్తున్నారాయన.

కరువట్టా గ్రామం వద్ద ఏర్పాటు చేసిన క్యాంపులో ఉంటున్న దాదాపు 3000 మందిలో ఆయన ఒకరు.

ఆయన కన్నీళ్లను ఆపడం మావల్ల కాలేదు. ఆయనకు టీ ఇచ్చాం. వణుకుతున్న చేతులతో నా చెయ్యి పట్టుకుని "ధన్యవాదాలు అమ్మా" అన్నారు.

ఆ క్యాంపులో ఉంటున్న మరో బాధితుడు రతన్మాల్‌తో మాట్లాడాను. ఆయనకు ఏడు ఆవులు ఉన్నాయి. వరదల నుంచి అవి ప్రాణాలతో బయటపడ్డాయి, కానీ, వాటికి ఇప్పుడు మేత కరవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

త్రివేండ్రం వెళ్లే దారిలో ప్రకృతి రమణీయతతో కళకళలాడాల్సిన ప్రాంతంలో ధ్వంసమైన ఇళ్లు కనిపించాయి.

ఓ ఇంటికి ఒక గోడ, దానికో తలుపు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగతావి అన్నీ వరదల్లో తుడిచిపెట్టుకుపోయాయి.

భారీ వరదలకు అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఫొటో సోర్స్, Image copyrightAFP/GETTY

ఉపాధి కరవు

సహాయక కేంద్రాల వద్ద చాలామంది ఆహారం, బట్టలు, సబ్బుల్లాంటి వస్తువుల కోసం బారులు తీరి కనిపించారు.

గాలి, నీటి ద్వారా ప్రబలే వ్యాధులను నియంత్రించేందుకు చాలా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

మరోవైపు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన చాలామంది కార్మికులకు ఉపాధి కరవైంది.

"మాకు మళ్లీ మంచి కూలీ దొరకాలంటే నెల, రెండు నెలలు ఆగాల్సిందే. ఇప్పుడు ఖాళీ చేతులతో మా సొంత రాష్ట్రం బెంగాల్ వెళ్లలేను. బెంగాల్‌లో కూడా వరదలు వస్తుండేవి. కానీ, కేరళలో ఇప్పుడు చూస్తున్నంత భయంకరమైన వరదలు మాత్రం ఎన్నడూ రాలేదు" అని కేరళలో రెండేళ్లుగా పనిచేస్తున్న నిత్యానంద్ పరమాన్ అన్నారు.

నేను ఇది రాస్తుండగానే, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులకు కూడా అన్ని సరకులూ అందేలా చూడాలని కేరళ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు ట్విటర్‌లో ఓ అలర్ట్ వచ్చింది.

వరద నీరు తగ్గుతుండటంతో సరకుల రవాణా మెరుగుపడింది. బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా సేవలు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

సల్మాన్ రావి

సల్మాన్ రావి, ఎర్నాకుళం నుంచి

ఎర్నాకుళం జిల్లాలోని ముత్తకున్నమ్ ప్రాంతంలో సోమవారం వర్షాలు ఆగిపోయాయి. వరద నీరు తగ్గుతోంది. దాంతో వరదల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు, సహాయకులు ప్రయత్నిస్తున్నారు.

ఇక్కడ కొన్ని భవనాల్లో 15 అడుగుల ఎత్తు వరకూ నీరే ఉంది. ఆరు రోజులుగా చాలామంది ఆ ఇళ్ల పై అంతస్తులలో, మిద్దెల మీద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

నీటి ఉధృతి తగ్గినప్పటికీ, అలువా, ఇడుక్కి, అళ్ళపూజ ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది.

వరద ప్రభావం తీవ్రంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని బాధితులను రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ముంపు ప్రాంతంలో ఇంకా 5000 మందికి పైగా ప్రజలు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, AFP

ఎర్నాకుళం జిల్లా ముత్తకున్నమ్‌లో స్థానిక జాలర్లే బోట్లు, డ్రమ్ములతో సహాయక చర్యలు చేపట్టారు. వరదలో చిక్కుకున్నవారిని రక్షించారు.

స్థానిక జాలర్లు, సహాయక సిబ్బందితో కలిసి నేను, మా కెమెరామ్యాన్ దీపక్ ముత్తకున్నమ్‌‌ సమీపంలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్లాం. ఆ ప్రాంతాలు ఇంకా నీటిలో మునిగే ఉన్నాయి.

అక్కడ చాలా మంది దుకాణ సముదాయంలో తలదాచుకుంటున్నారు. తొలిసారిగా మంచినీళ్లు, ఆహార పదార్థాలు అందించగానే వారి ముఖాల్లో ఆనందం కనిపించింది.

వారిలో కొందరిని సహాయక కేంద్రాలకు తరలించారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, Reuters

సహాయక బృందాలు మారుమూల ప్రాంతాలకు చేరుకుంటుండటంతో పునరావాస కేంద్రాల్లో ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

కేరళలోని త్రిస్సూర్, ఎర్నాకుళం జిల్లాల నుంచి అనేకమంది ఉద్యోగాల కోసం మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్తుంటారు.

దుబాయిలో పనిచేసే సవ్వాబ్ అలీ సెలవు మీద ఇటీవల సొంతూరికి వచ్చారు. తమ ప్రాంతంలో వరదల వల్ల అనేక వాహనాలు చెడిపోయాయని, ఆస్తులు ధ్వంసమయ్యాయని, పశు సంపదకు కోలుకోలేని నష్టం సంభవించిందని ఆయన చెప్పారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, స్థానిక కార్యకర్తలు కొన్ని జీవాలను రక్షించగలిగారు. చాలావరకు వరదల్లో కొట్టుకుపోయాయి.

వరదల్లో జంతువులు చనిపోవడంతో ఆ నీటివల్ల వ్యాధులు విజృంభించే ప్రమాదముందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

bbc

యోగితా లిమాయే, కుజిప్పురం నుంచి

ఉత్తర కేరళలోని కుజిప్పురం పట్టణం సమీపాన నదిపై ఉన్న ఆనకట్టకు వారం కిందట గండిపడింది. ఆ నదిపై ఉన్న వంతెన వద్దకు వెళ్తుంటే కిలోమీటరు దూరానికి పైగా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లన్నీ నీటిలోనే ఉన్నాయి.

కేవలం ఆ ఇళ్ల పైకప్పులు, అరటి చెట్ల పై భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎత్తయిన కొబ్బరి చెట్లకు పెట్టింది పేరు కేరళ. అందుకే అవి మాత్రం బాగానే కనిపిస్తున్నాయి.

పట్టణవాసులంతా కొద్దిరోజుల క్రితం ఇళ్లను ఖాళీ చేసి వెళ్లారు. వారిలో కొందరు తమ ఇళ్లు ఎలా ఉన్నాయో అని వెళ్లి చూసుకుంటున్నారు. నీటిలో ఈదుకుంటూ ఇంట్లోకి వెళ్తున్నారు. మరమ్మత్తులు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్‌ను పట్టుకుని మిద్దెమీద కూర్చున్న ఓ వ్యక్తి కనిపించారు.

కేరళ వరదలు

ఫొటో సోర్స్, EPA

భారీ వరదల వల్లే ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది. అలాగే కుండపోత వర్షాల కారణంగా ఇంకా అనేక సమస్యలు తలెత్తాయి. మలప్పురంలో కొండచరియలు విరిగిపడటంతో ఓ ఇంటిని బురద కప్పేసింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో అధికశాతం కొండప్రాంతాలే. దాంతో, సహాయక చర్యలకు ఇబ్బందికరంగా ఉంది.

భారత వైమానిక దళం, నావికాదళం, ఎన్‌డీఆర్‌ఎఫ్, కోస్ట్ గార్డ్స్, స్థానిక జాలర్లు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినా, ఇప్పటికీ వేల మంది వరదల్లోనే ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.