కేరళ వరదలు: 26 సెకన్లలో చిన్నారిని కాపాడిన జవాను

బిడ్డను కాపాడిన జవాను
ఫొటో క్యాప్షన్, కన్హయ్య కుమార్
    • రచయిత, ప్రమీలా క్రిష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వరదలతో కేరళ అతలాకుతలం అవుతోంది. వరద బాధితులను కాపాడేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. అలాంటి సమయంలో కన్హయ్య కుమార్ అనే ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ చేసిన సాహసం అతడిని ఇప్పుడు ఒక ప్రముఖుడిగా మార్చేసింది.

ఇడుక్కి జిల్లాలోని సెరిధాని దగ్గర పెరియార్ నది పొంగి ప్రవహిస్తోంది. అదే సమయంలో నదీ తీరంలో ఒక తండ్రి చేతిలోని పసిబిడ్డతో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు. తమను కాపాడేవారికోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు.

అప్పుడు అక్కడే ఉన్న ఎన్డీఆర్ఎఫ్‌ కానిస్టేబుల్ కన్హయ్య కుమార్, ఆ తండ్రి భయాన్ని అర్థం చేసుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా అక్కడకు పరిగెత్తాడు. వేగంగా నదీ తీరానికి చేరుకుని తండ్రి చేతుల్లోని బిడ్డను తీసుకుని పరిగెత్తాడు.

పక్కనే నది ఉద్ధృతంగా దూసుకొస్తోంది. చిన్నారిని తీసుకున్న కన్హయ్య వేగంగా వంతెన దాటేశాడు. అతడి వెనకాలే పరిగెత్తిన బిడ్డ తండ్రి, మిగతావారు కూడా సురక్షితంగా వంతెన దాటారు. అంత సాహసానికి తెగించడానికి అతడికి ఎక్కువ సమయం లేదు.

బిడ్డను కాపాడిన జవాను

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, కన్హయ్య బిడ్డను కాపాడుతున్న దృశ్యాలు

క్షణంలో వంతెనను ముంచెత్తిన నది

కన్హయ్య బిడ్డను తీసుకుని దాటగానే, వంతెనను వరదనీళ్లు ముంచెత్తాయి. క్షణంలో అక్కడ వంతెన ఉన్న జాడలే కనిపించలేదు. నది సముద్రంలా మారిపోయింది. వంతెన నీళ్లలో మునిగిపోయే ముందు కన్హయ్య శిశువును 26 సెకన్లలో రక్షించాడని ఇడుక్కిలోని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.

కన్హయ్య తన బిడ్డను సురక్షితంగా కాపాడడంతో ఆ తండ్రి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కన్హయ్య చిన్నారిని కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతడు ఒక్కసారిగా సోషల్ మీడియా హీరో అయిపోయాడు. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

కన్హయ్య కుమార్ బిహార్‌కి చెందినవాడు. పేదరికం వల్ల త్వరగా ఉద్యోగం వెతుక్కోవాలని అతడు స్కూల్ చదువు పూర్తికాగానే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.

బిడ్డను కాపాడిన జవాను

ఫొటో సోర్స్, EPA

వరద బాధితులందరూ నా కుటుంబమే

తన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరుల కోసమే స్కూలు తర్వాత ఉద్యోగం వెతుక్కున్నానని కన్హయ్య చెప్పాడు. గత ఆరేళ్ల నుంచి కన్హయ్య ఎన్డీఆర్ఎఫ్‌లో పనిచేస్తున్నాడు. బీబీసీ కన్హయ్య కుమార్‌తో మాట్లాడింది.

"కుటుంబానికి అండగా నిలిచేందుకు నేను ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. నా ముగ్గురు సోదరుల్లో ఇద్దరు సైన్యంలో ఉన్నారు. ఒకరు కశ్మీర్‌లో ఉన్నారు. మేం ముగ్గురం ఎప్పుడో ఒకప్పుడు కలుస్తుంటాం. కానీ దేశం కోసం సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా అమ్మానాన్నలు కూడా మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కేరళలో వరద విషాదానికి గురైనవారు కూడా నా కుటుంబంతో సమానమే" అన్నాడు కన్హయ్య.

కేరళలో కొనసాగుతున్న సహాయక చర్యల గురించి మాట్లాడిన కన్హయ్య "మేం కేరళలో వరద బాధితులను కాపాడ్డానికి వెళ్తున్నామని మాకు తెలుసు. కానీ ఇక్కడకు చేరుకున్న తర్వాత, అనుకున్న దానికంటే చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుందని మాకు అర్థమైంది" అని కన్హయ్య అన్నాడు.

"ఇడుక్కి జిల్లాలో కొండచరియల ప్రమాదం చాలా ఎక్కువ. ఈ నదిలో 26 ఏళ్ల తర్వాత వరద వచ్చింది. ఇక్కడే ఒక బస్ స్టాప్ ఉండేది. ఇప్పుడు దాని ఛాయలు కూడా లేవు. కొబ్బరితోటలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి"

బిడ్డను కాపాడిన జవాను

ప్రకృతిని ముందే ఊహించలేం

ఎన్డీఆర్ఎఫ్ బృందంలోని మరో సభ్యుడు కృపాల్ సింగ్ కూడా కేరళ వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో ఉన్నారు. ఆయన కూడా బీబీసీతో మాట్లాడారు.

"ప్రకృతి విపత్తుకు సంబంధించిన వాటిలో ఎక్కువ ఘటనలు భవిష్యత్ అంచనాలు తప్పని నిరూపించాయి. మేం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటాం. అదే మా సిద్ధాంతం. చాలా ప్రాంతాల్లో తక్షణ సాయం అందించడం కష్టం అవుతుంది. కానీ ప్రజల ఆశలు సజీవంగా ఉంచడం మా విధి. ప్రజలు కూడా మాతోపాటూ పనిచేయడం ప్రారంభించారు".

కేరళలో వర్షాలు మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఎన్డీఆర్ఎఫ్ భావిస్తోంది. అవసరమైన ప్రాంతాలకు రెస్క్యూ మెటీరియల్, మందులు తరలించడానికి సన్నద్ధం అవుతోంది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)