వరద భారతం: 500 మంది ప్రాణాలు తీసిన వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. దాదాపు 500 మంది ఈ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఇల్లూ, వ్యాపారాలు కోల్పోయి వీధిన పడ్డారు.
అసోంలో దాదాపు లక్షమంది వరదల్లో చిక్కుకున్నారు. చాలామంది గ్రామాల్లో ఇల్లు పొలాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
కేరళలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 18 మంది మరణించారు.
అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు.. కొండచరియలు విరిగిపడడంతో ఇడుక్కిలో 10 మంది, మలప్పురంలో ఐదుగురు, కన్నూరులో ఇద్దరు, వేనాడు జిల్లాలో ఒకరు మరణించారు. ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
ఇడుక్కి డ్యామ్‌లో నీరు 2,398 అడుగులకు చేరడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
కోజికోడ్, వేనాడు జిల్లాలలో భారీ వర్షాలు, వరదల కారణంగా జాతీయ విపత్తు నివారణ బృందాన్ని కోజికోడ్‌కు తరలించారు.
అసోంలో బిరెన్ గోగోయ్ లాంటి కొందరు వ్యక్తులు మాత్రం వరదల్లో ఇబ్బందులు పడుతున్నారే తప్ప, తమ ఊరొదిలి రావడానికి ఇష్టపడట్లేదు. ‘నా ఇల్లు, పొలాలు ఇక్కడే ఉన్నాయి. వీటిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్లాలి? ఒకవేళ వెళ్లినా నన్నెవరూ గుర్తించరు. అక్కడ నాకంటూ ఏమీ ఉండదు. ఇక్కడైతే కనీసం నా ఇంటిని, సామగ్రినైనా రక్షించుకోగలను’ అంటున్నారు బిరెన్.

ప్రతి వర్షాకాలంలో తమది ఇదే పరిస్థితి అని, తమనెవరూ పట్టించుకోరని అసోంలోని కొన్ని గ్రామాల ప్రజలు అంటున్నారు. బిహార్‌లో అయితే ఆస్పత్రులు కూడా వరదల్లో చిక్కుకుపోయాయి. ఆ నీటిలోనే వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు.

దేశంలోని అనేక ప్రాంతాల్లో మరో నెల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాటిని ఎదుర్కోవడమే ఇప్పుడు అందరిముందూ ఉన్న సవాల్.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









