9 రోజుల్లో 22 మందిని చంపిన మగ ఏనుగు, అది ఎందుకంత క్రూరంగా మారింది?

ఏనుగు దాడి, ఝార్ఖండ్

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

    • రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలం
    • హోదా, బీబీసీ కోసం

ఝార్ఖండ్‌ పశ్చిమ సింగ్‌‌భమ్ జిల్లాలోని చైబాసా, కోల్హాన్ అటవీ డివిజన్లలో ఒక ఏనుగు 22 మందిని చంపడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ వార్త రాసే సమయానికి ఆ ఏనుగును అటవీ శాఖ అధికారులు పట్టుకోలేదు.

జిల్లా కలెక్టర్ చందన్ కుమార్ ఈ మరణాలను ధ్రువీకరించారు. ''ఒక మగ ఏనుగు వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారి'' అని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ఓ) కుల్దీప్ మీనా చెప్పారు.

మరింత ప్రాణ, ఆస్తినష్టాన్ని నివారించేందుకు ఈ ప్రాంతాన్ని హై అలర్ట్‌లో ఉంచుతున్నట్లు కుల్దీప్ మీనా తెలిపారు.

ఏనుగును పట్టుకుని, దాన్ని సురక్షితంగా అడవిలో వదిలి పెట్టడం తమ తొలి ప్రాధాన్యమని అటవీ శాఖ అధికారులు అంటుండగా, అటవీ శాఖ చర్యలపై స్థానిక సామాజిక కార్యకర్త మాన్కీ తుబీద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తొలి మరణం సంభవించిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే, ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు ఉండేవికావని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక అటవీ శాఖ సిబ్బంది చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించినట్లు జిల్లా కలెక్టర్ చందన్ కుమార్ తెలిపారు. ఈ మరణంతో మృతుల సంఖ్య 22కి పెరిగింది.

''మృతుల కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల కోసం తక్షణ సాయంగా రూ.20 వేల చొప్పున అటవీ శాఖ అందించింది'' అని కలెక్టర్ చెప్పారు.

ఈ ఏనుగును బంధించేందుకు బెంగాల్, ఒడిశా నుంచి వచ్చిన టీమ్‌ల సాయంతో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.

‘ఇంటి వరండాలోకి వచ్చి మరీ దాడి చేసింది’

ఈ ఏనుగు దాడిలో చనిపోయిన మొత్తం 22 మందిలో..మొదటి మరణం 34 ఏళ్ల మంగళ్ సింగ్ హెంబ్రమ్‌ది.

కొత్త సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు సాయంత్రం 6 గంటలకు టోంటో బ్లాక్‌లోని బాడీజారీ గ్రామంలో తన ఇంటికి వస్తున్నారు మంగళ్ సింగ్. దాదాపు ఇంటికి దగ్గరగా వచ్చిన సమయంలోనే ఈ ఏనుగు ఆయనపై దాడి చేసి, చంపేసింది.

అదే రోజు రాత్రి 10 గంటలకు.. టోంటో బ్లాక్‌లోని బిర్సింగ్ హాతు గ్రామంలోని 62 ఏళ్ల వ్యక్తిపై దాడి కూడా ఏనుగు చేసింది. ఈ సమయంలో ఆయన తన పొలానికి కాపలాగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

అదే బ్లాక్‌కు చెందిన 22 ఏళ్ల జగ్‌మోహన్ సవయ్యను మూడో మృతుడిగా గుర్తించారు. కుయిల్‌సుతే గ్రామంలో జనవరి 5న రాత్రి 10 గంటలకు జరిగిన ఏనుగు దాడిలో ఈయన మరణించారు.

కుష్ణు సుండి

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, పంటకు కాపలా కాస్తున్న సమయంలో ఏనుగు దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు.

సదర్ బ్లాక్‌లోని రోడో గ్రామంలో నివసించే 42 ఏళ్ల విష్ణు సుండి జనవరి 1న రాత్రి 11.30కు తన ఇంటి వరండాలో నిద్రిస్తుండగా జరిగిన ఏనుగు దాడిలో మరణించారు.

''వరిచేనుకి కాపలాగా అందరం బయట వరండాలో నిద్రిస్తుండగా.. హఠాత్తుగా ఏనుగు వచ్చింది. అందరం ఇంట్లోకి పరిగెత్తాం. కానీ, నాన్న మాత్రం బయటికి పరిగెత్తారు. పరిగెత్తలేక కింద పడిపోయారు. ఏనుగు ఆయన కాలు పట్టుకుని లాక్కెళ్లింది. నాన్న చనిపోతున్నప్పుడు ఆయన కళ్లల్లో కనిపించిన భయం మేమందరం చూశాం'' అని విష్ణు కుమారుడు చెప్పారు.

గోయిల్‌ కెరా ప్రాంతంలో చనిపోయిన ఆరుగురిలో సాయితబా గ్రామానికి చెందిన 13 ఏళ్ల రేగా కాయం ఒకరు. జనవరి 2న కొట్టంలో నిద్రిస్తుండగా.. రాత్రి 11 గంటలకు ఏనుగు వస్తోన్న పెద్ద శబ్దం వినిపించింది. తన ఇంటికి వైపుకు పరిగెత్తారు. కానీ, ఏనుగు దాడి నుంచి తప్పించుకోలేకపోయారు.

ఝార్ఖండ్, ఏనుగు దాడి

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, తన కళ్ల ముందే ఏనుగు దాడిలో భర్తను, కూతుర్ని పోగొట్టుకున్న పుండీ

''ముందే తెలిస్తే నా కుటుంబం బతికి ఉండేది''

జనవరి 4న రాత్రి 11 గంటలకు బిలా గ్రామానికి చెందిన 56 ఏళ్ల జోంగా కుయ్‌ ఏనుగు దాడిలో మరణించారు.

‘‘ఏనుగు కొట్టంలో ఉన్న వరి ధాన్యాలను తింటున్నట్లు జోంగా కుయ్ చూశారు. దాన్ని తరిమి కొట్టడానికి టార్చి లైట్ తీసుకుని అక్కడకు పరిగెత్తారు. కానీ, ఆ ఏనుగు జోంగా కుయ్‌ను పట్టుకుని, నేలకేసి కొట్టింది’’ అని కుటుంబ సభ్యులు తెలిపారు.

గోయిల్‌కెరా బ్లాక్‌లోని గమ్హారియా పంచాయతీలో సోవం గ్రామానికి చెందిన కుందరా బహోదా, తన ఆరేళ్ల కూతురు కోదమ బహోదా, ఎనిమిదేళ్ల కొడుకు సాము బహోదాలు ఏనుగు దాడిలో మరణించారు.

పుండీ టోప్నే

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, గాయాలు పాలైన తన కూతురికి ప్రస్తుతం రౌర్కెలా ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు పుండీ.

ఇంటి బయట నిల్వ ఉంచిన వరి ధాన్యాలకు కాపలాగా కుందరా, ఆయన కుటుంబ సభ్యులు జనవరి 5 రాత్రి ఆరు బయట పడుకున్నారు.

''చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏనుగు దాడులు జరుగుతున్నాయని మాకు తెలియదు. కొంచెం తెలిసినా, నా కుటుంబం ఈ రోజు ప్రాణాలతో ఉండేది'' అని ఆయన భార్య పుండీ టోప్నే అన్నారు.

''ఈ రోజు రాత్రి అకస్మాత్తుగా ఏనుగు దాడి చేసింది. నా రెండేళ్ల కూతురు జింగీని తీసుకుని పరిగెత్తాను. జింగీ కింద పడిపోయి, గాయాలు పాలైంది'' అని పుండీ తెలిపారు.

ఆరేళ్ల కూతురు, ఎనిమిదేళ్ల కొడుకుని కాపాడే సమయంలో కుందరాపై ఏనుగు దాడి చేసింది.

"నా భర్త, కొడుకు, కూతురు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతుంటే గాయపడిన జింగితో నేను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను" అని పుండీ చెప్పారు. ఈ దాడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకున్నారు.

''నా కూతురికి చికిత్స చేయిస్తున్నందువల్ల, నా భర్త, కొడుకు, కూతురిని కడసారి చూసుకోలేకపోయాను'' అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

చనిపోయిన ఆ ముగ్గురికి గ్రామస్థుల సాయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామపెద్ద ఉదయ్ చెర్వా చెప్పారు.

సనాతన్ మెరెల్ కుటుంబం

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

జనవరి 6 రాత్రి ఆరుగురు మృతి

నోవాముండి బ్లాక్‌లో దాదాపు 2500 మంది జనాభా ఉన్న బాబాడియా గ్రామ శివారులో సనాతన్ మెరెల్‌కు మట్టి ఇల్లు ఉంది.

వారి ఇంటికి సమీపంలో ఒక పశువుల కొట్టం నిర్మించుకున్నారు. జనవరి 6న ఆరుగురు కుటుంబ సభ్యులు గుడిసెలో నిద్రిస్తున్నారు.

రాత్రి 11 గంటలకు అకస్మాత్తుగా ఏనుగు వచ్చింది. 50 ఏళ్ల సనాతన్ మెరెల్‌ను, ఆయన భార్య జోల్కో కుయ్‌ను, వారి తొమ్మిదేళ్ల కూతురు దమయంతిని, ఐదేళ్ల కొడుకు ముంగాడు మెరెల్‌ను ఏనుగు చంపేసింది.

ఈ ఘటనలో వారి పదకొండేళ్ల జైపాల్ మెరెల్, ఐదేళ్ల చిన్న కూతురు సుశీలా ఎలాగోలా బయటపడ్డారు.

గురుచరణ్ తల్లి జెమా కుయ్, ఆయన కొడుకు మోరన్ సింగ్

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, గురుచరణ్ తల్లి జెమా కుయ్, ఆయన కొడుకు మోరన్ సింగ్

మరోవైపు బాబాడియా గ్రామంలో రాత్రి 11.30 గంటల సమయంలో జరిగిన ఏనుగు దాడిలో 28 ఏళ్ల గురుచరణ్ లగురి మరణించారు. ఆ దాడిలో గురుచరణ్ మేనల్లుళ్లు గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.

ఈ ఐదు మరణాల తర్వాత, బాబాడియా గ్రామానికి సమీపంలోని బడా పసేయా గ్రామంలో 25 ఏళ్ల మంగళ్ బోబోంగా కూడా మృతి చెందారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగిన ఏనుగు దాడిలో ఆయన మరణించారు.

ఆ తర్వాత జనవరి 7న ఉదయం 6 గంటలకు జగన్నాథ్‌పూర్ బ్లాక్‌లోని సియాల్‌జోడా గ్రామానికి చెందిన తిప్రియా హెంబ్రమ్.. మలవిసర్జనకు వెళ్లినప్పుడు, వెనుకాల నుంచి ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో ఆమె మరణించారు.

డీఎఫ్ఓ ఆదిత్య నారాయణ్

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, డీఎఫ్ఓ ఆదిత్య నారాయణ్

ఎందుకంత క్రూరంగా దాడి చేస్తుంది?

మొత్తం 22 మందిని చంపిన ఏనుగు ఎందుకింత క్రూరంగా దాడులు చేస్తోంది? దీనికి కారణం ఏమై ఉంటుంది?

దీనిపై కోల్హాన్ డీఎఫ్ఓ కుల్దీప్ మీనా మాట్లాడుతూ, '' ఈ మగ ఏనుగు సంభోగ దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో, రీప్రొడక్టివ్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఎక్కువగా పెరగడం వల్ల ఒంటరి మగ ఏనుగు చాలా దూకుడుగా మారుతుంది. పదిహేను నుంచి ఇరవై రోజుల్లో కాలక్రమేణా ఇది తగ్గిపోతుంది'' అని చెప్పారు.

ఈ ఏనుగు తన మంద నుంచి తప్పిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

''అందుకే, ఈ ఏనుగును గుర్తించడం చాలా ఇంపార్టెంట్. దాన్ని పట్టుకుని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టాలి. అప్పుడు అది తన మందతో కలుస్తుంది'' అని చెప్పారు.

అయితే, శుక్రవారం సాయంత్రం వరకు ఈ మగ ఏనుగు ఆచూకీ లభ్యం కాలేదని చైబాసా ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ ఆదిత్య నారాయణ్ తెలిపారు.

'' ఈ ఏనుగు చిన్నది, చాలా చురుకైనది. అందుకే, చాలా వేగంగా అక్కడికి ఇక్కడికి తిరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో.. '' అని కుల్దీప్ మీనా తెలిపారు.

‘‘ప్రస్తుతం ఏనుగు గురించి ఏ సమాచారం వచ్చినా వెంటనే మా బృందం ఆవైపుకు వెళ్తుంది'' అని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ ఆదిత్య నారాయణ్ చెప్పారు.

''మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. రాత్రిపూట ఇళ్ల నుంచి బయటకు రావద్దని డప్పు ద్వారా మా బృందం ప్రచారం చేస్తోంది’’ అని ఆదిత్య నారాయణ్ చెప్పారు.

ఏనుగును పట్టుకునే ఆపరేషన్‌లో 10 స్పెషల్ టీమ్‌లతో 100 మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దింపింది అటవీ శాఖ. డ్రోన్ల సాయం కూడా తీసుకుంటోంది.

బాధితులకు పరిహారంగా చనిపోయినవారి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున, గాయాలు పాలైన వారికి గరిష్ఠంగా రూ.లక్షన్నర చొప్పున ఇవ్వనున్నట్లు డీఎఫ్ఓ కుల్దీప్ మీనా తెలిపారు.

''చనిపోయిన వారి కుటుంబాలు చాలా పేదవి. మట్టి ఇళ్లల్లో నివసిస్తున్నారు. వారికి వెంటనే గృహనిర్మాణ పథకం కింద తక్షణ ప్రయోజనాలను అందిస్తాం'' అని స్థానిక జిల్లా కలెక్టర్ చందన్ కుమార్ బీబీసీకి చెప్పారు.

అటవీ శాఖ నుంచి పరిహారం మాత్రమే కాక.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల కింద బాధిత కుటుంబాలకు సాయం అందిస్తామని తెలిపారు.

ఝార్ఖండ్, ఏనుగు దాడి

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam/BBC

ఏనుగులు-ప్రజల మధ్య సంఘర్షణలు

అటవీ శాఖ సమాచారం ప్రకారం.. చైబాసా, కోల్హాన్ అటవీ ప్రాంతాల్లో వివిధ మందల్లో 53 ఏనుగులు ఉన్నాయి.

ప్రభుత్వ డేటా ప్రకారం.. ఏనుగుల దాడి వల్ల 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఝార్ఖండ్‌లో 474 మంది మరణించారు. 1976 నుంచి ఏనుగులపై రీసెర్చ్ చేస్తోన్న రాంచీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీఎస్ శ్రీవాస్తవ ప్రస్తుత మరణాలపై మాట్లాడుతూ.. ''రాబోయే సంవత్సరాల్లో ఏనుగులు-ప్రజలకు మధ్య సంఘర్షణ ఘటనలు పెరుగుతాయి'' అని తెలిపారు.

''అటవీ నిర్మూలన కారణంగా ఏనుగులకు ఆహార సమస్య పెరుగుతోంది. ఏనుగులు తిరిగే మార్గాల్లో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తున్నారు. రైల్వే లైన్లు వేస్తున్నారు. కాలువలు తవ్వుతున్నారు. అవి వెళ్లే కారిడార్లలో అడ్డంకులు ఎదురైనప్పుడు, అవి దూకుడుగా మారడం సహజం'' అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)