ఏనుగులు మద్యం వాసనకు ఆకర్షితులవుతాయా? తీపి రుచి కోసమే గ్రామాల్లోకి వచ్చి చెరకు పంటను తింటాయా

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల దాడులు పెరిగాయి.
ఇన్నాళ్లు ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయనే వార్తలు వచ్చేవి. కానీ ఇటీవల ఏనుగుల దాడిలో మనుషుల ప్రాణాలు పోతున్న కేసులు కూడా పెరుగుతున్నాయి.
జనవరి 18న నారావారిపల్లె సమీపంలో ఒక గ్రామ ఉప సర్పంచ్‌ను ఏనుగులు చంపేశాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయనే సమాచారంతో ఆ గ్రామ ఉప సర్పంచ్, చంద్రగిరి మండల టీడీపీ అధ్యక్షుడు 33 ఏళ్ల రాకేష్ చౌదరి కొంతమంది రైతులతో కలిసి వాటిని తరమడానికి పొలాల దగ్గరకు వెళ్లారు.
కానీ అవి వారిని వెంబడించాయి. కొందరు చెట్లపైకి ఎక్కారు.రాకేష్ తప్పించుకునేందుకు పరుగులు తీస్తుండగా ఏనుగులు ఆయనను వెంబడించి తొక్కి చంపేశాయి.
రైతుల పంటలను కాపాడటానికి వెళ్లి రాకేష్ తమను వదిలి వెళ్లిపోయాడని ఆయన భార్య లక్ష్మి బీబీసీతో చెప్పారు.

వద్దని వారించినా వెళ్లారు
ఏనుగుల దాడి గురించి చంద్రగిరి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనిత బీబీసీకి వివరించారు.
ఏనుగులు వచ్చాయనే సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు తాము చెబుతున్నా వినకుండా వాటి కోసం పరుగులు తీశారని అనిత చెప్పారు. ఏనుగులు వాసన పసిగడతాయని, లైట్ వేస్తే అవి మనుషులను గుర్తించి వెంబడిస్తాయని చెప్పినా వారు పట్టించుకోలేదని అటవీ అధికారులు తెలిపారు.
''మీరు వాటి దగ్గరికి వెళ్లొద్దు. అవి వాసన పసిగడతాయని ఫోన్ చేసి చెప్పాం. మా పొలాల పైకి వస్తున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉందంటూ వారు వెళ్లారు. మేం పక్కనే ఉన్న మామిడి తోపులో ఉన్నాం. అప్పుడే మాకు శబ్దాలు వినిపించాయి. దగ్గరికి వెళ్లి చూడగా రాకేష్ చనిపోయి కనిపించారు'' అని అనిత చెప్పారు.
చిత్తూరు జిల్లాలోని దట్టమైన అడవుల్లో వృక్షసంపద పుష్కలంగా ఉన్నప్పటికీ ఏనుగులు గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవడానికి బీబీసీ ప్రయత్నించింది.

చిత్తూరులో ఏనుగుల బెడద
రెండేళ్లుగా పాకాల మండలం, పుదిపట్ల బైలు, భాకరాపేట ప్రాంతాల్లో రైతులకు, అటవీ శాఖకు ఏనుగులు నిద్రలేకుండా చేశాయని అటవీ అధికారులు చెబుతున్నారు. 15 ఏనుగులు ఒక గుంపుగా ఆ ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి.
ఈ ఏనుగుల గుంపు కౌండిన్య అభయారణ్యం నుంచి, కళ్యాణి డ్యామ్ ప్రాంతానికి వచ్చిందని అధికారులు తెలిపారు. అక్కడ దట్టమైన అడవిలో పగలంతా విశ్రాంతి తీసుకుని చీకటి పడ్డాక పొలాలపైకి వస్తున్నాయని వెల్లడించారు.
ఏనుగులు అడవుల్లోని చెట్లు, మొక్కలు తినకుండా గ్రామాలపైకి, పంట పొలాల్లోకి ఎందుకొస్తున్నాయని అటవీ అధికారి అనితను ప్రశ్నిస్తే..
''అరటి, చెరకు, వరి, కొబ్బరి లాంటి తీపి పదార్థాలు ఏనుగులకు చాలా ఇష్టం. కాబట్టే పంట పొలాల మీదికి వస్తున్నాయి. ఈ రుచికి అలవాటుపడిన కొన్ని ఏనుగులు పంటపొలాలపై దాడి చేస్తుంటే, మరికొన్ని దారి తప్పి ఇటు వస్తున్నాయి'' అని ఆమె చెప్పారు.

''ఫాస్ట్ ఫుడ్''కు అలవాటుపడ్డాయా?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్న ఏనుగు మందలు ''ఫాస్ట్ ఫుడ్''కు అలవాటు పడ్డాయన్నారు తిరుపతి డీఎఫ్ఓ వివేక్.
''అడవుల్లో సరైన ఆహారం దొరకక అవి బయటకు వచ్చి పొలాలపై పడుతున్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏనుగులకు మన పంట పొలాలు ఫాస్ట్‌ఫుడ్ వంటివి. వాటికి సిద్ధంగా ఉంచిన ఆహారంలా పంటపొలాలు కనిపిస్తాయి. అవి ఒక్కసారి ఇలాంటి ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడితే, అవే తినాలనుకుంటాయి. ’’ అని చెప్పారు
‘‘ఏనుగుల అలవాట్లు కూడా మారిపోయాయి. అవి అడవిలో ఆహారం కోసం అన్వేషించాలి. కానీ పంటపొలాలు వాటికి సిద్ధంగా ఉన్న ఆహారం. వరి, చెరకు లాంటి పంటలు కోతకు వచ్చిన దశలోనే ఈ ఏనుగుల దాడి ఎక్కువగా జరుగుతుంటుంది. ఏనుగులు చాలా తెలివైనవి. ఒక కాయను చూసి అది ఎన్నిరోజులకు పండుతుందో అంచనా వేసి సరిగ్గా అదే సమయానికి వస్తాయి. మొత్తంగా మనం పంటలు వేసే తీరు మారకపోతే ఏనుగులను కట్టడి చేయలేం. పంట ధ్వంసం కాకుండా చూసుకోవాలంటే, మనం ఆ పంటల్నే మార్చుకోవాలి'' అని వివేక్ వివరించారు.

వ్యూహాత్మక దాడి
వేడిగా ఉండే పగటి వేళ ఏనుగులు బయటకు రావని, రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అవి పంటలపైకి వెళ్లే పద్ధతి కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటుందని వివేక్ తెలిపారు.
''ఏనుగులు మొదట మూడు, నాలుగు గుంపులుగా విడిపోతాయి. ఆహారం ఎక్కువగా ఎక్కడ అందుబాటులో ఉందో గుర్తిస్తాయి. తర్వాత మందతో కలిసి అక్కడికి వెళ్లి తింటాయి. వాటి ప్రవర్తనలో ఇదొక భాగం. మనం ఏనుగులు ఒక ప్రాంతానికి వస్తున్నాయని అక్కడికి వెళితే, అవి మన వాసన గుర్తించి ఆ ప్రాంతానికి రాకుండా మరో దారి గుండా వేరే ప్రాంతాలకు వెళ్లిపోతాయి'' అని వివేక్ అన్నారు.
ముఖ్యంగా బయటి ఆహారానికి అలవాటు పడటం వల్లే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు పెరుగుతున్నాయని వివేక్ చెప్పారు.
' ఏనుగులకు ఇష్టమైన పంటలు వేయకూడదు. ముఖ్యంగా తియ్యగా ఉండే చెరకు, వరి, ఏనుగులకు చాలా ఇష్టం'' అని వివేక్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మద్యం వాసనను పసిగడతాయి
మందలో గున్న ఏనుగులు ఉన్నప్పుడు ఆ మంద ఇంకా ప్రమాదకరంగా మారుతుందని డీఎఫ్ఓ వివేక్ చెప్పారు.
''ఏనుగు చాలా తెలివైన జంతువు. చాలా శక్తిమంతమైనది కూడా. దాని కదలికలు వేగంగా ఉంటాయి. అది ముందుకు ఎంత వేగంగా కదలగలదో, వెనక్కు కూడా అంతే వేగంగా కదులుతుంది. ఏనుగుల మందను అడ్డుకోవాలని చూడకూడదు. ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు మిగతా ఏనుగులన్నీ వాటి చుట్టూ ఉంటాయి'' అని ఆయన అన్నారు.
మద్యం వాసనను ఏనుగులు పసిగడతాయని, ఒక్కోసారి అది కూడా ఏనుగుల దాడికి కారణం అవుతుందని వివేక్ చెప్పారు.
''ఏనుగును మద్యం వాసన ఆకర్షిస్తుంది. బెల్లం వాసన, లిక్కర్ వాసన ఒకేలా ఉంటాయి కాబట్టి మందు తాగిన మనుషుల వైపు ఏనుగులు వస్తాయి'' అని వివేక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామస్థుల సహకారం ఉంటే...
గ్రామస్థుల సహకారం ఉంటే ఏనుగుల బెడదను తగ్గించవచ్చని వివేక్ చెబుతున్నారు.
''ఏనుగులను అడవి వైపు తీసుకెళ్లాలంటే మధ్యలో చాలా గ్రామాలమీదుగా వెళ్లాలి. ఈ గ్రామాల నుంచి మాకు సహకారం కావాలి. ఏనుగులను తమ గ్రామం వైపు తీసుకు రావొద్దని ఎవరూ అడ్డుపడకూడదు. ఏనుగులను తరిమేస్తాం అంటూ ప్రజలు వెళుతుంటారు. కానీ, అలా కుదరదు. అటవీ శాఖకు అవి ఎలా వెళతాయో ఒక రూట్ తెలిసుంటుంది. వాటిని అడవిలోకి ఎలా పంపాలో తెలిసినవారు, అందుకోసం శిక్షణ పొందిన వారు అటవీ విభాగంలో ఉంటారు'' అని వివేక్ తెలిపారు.
ఎవరైనా తమకు ఏదైనా నష్టం కలిగిస్తే వారిని ఏనుగు గుర్తు పెట్టుకుంటుందని, ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తుందని వివేక్ తెలిపారు.
''మనం మామూలు నేలలో బాగా నడవగలుగుతాం. కానీ ఏనుగులు ఎలాంటి ప్రాంతంలోనైనా ఒకే వేగంతో నడవగలవు. ఒకసారి వాటి పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అది వారిని బాగా గుర్తు పెట్టుకుంటుంది. ఎంతమంది ఉన్నా వారిపైన మాత్రమే దాడి చేస్తుంది. ఇలాంటి ఘటన చిత్తూరు జిల్లాలో మేం చూశాం. అటవీ శాఖకు చెందిన ఒక వ్యక్తి చనిపోయారు. అతను ఏనుగులతో దురుసుగా ప్రవర్తించినట్లు రిపోర్ట్ వచ్చింది. అక్కడ 20 మంది ఉన్నప్పటికీ ఏనుగు అతనొక్కడినే చంపడం అనేది దాని జ్ఞాపకశక్తి గురించి చెబుతుంది'' అని ఆయన వివరించారు.
గంటకు పది కిలోమీటర్ల వేగంతో నడిచే ఏనుగు, పరిగెత్తితే 40 కిలోమీటర్లు వేగాన్ని అందుకోగలదు. తొండంతో కొట్టినా ఆ దెబ్బకు మన శరీరంలో ఎముకలన్నీ విరిగేంత బలం ఉంటుందని వివేక్ వివరించారు. ఏనుగులను తరమాలనుకునేవారికి పలు జాగ్రత్తలు సూచించారు.
''ఎంత అత్యవసరం అయినా ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో సాయంత్రం అయిదు గంటల తర్వాత బయటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఫ్లాష్ లైట్ తీసుకొని వెళ్ళాలి. 100 మీటర్లకు ఒకసారి చూస్తూ వెళ్లాలి. ఏనుగు నల్లగా ఉంటుంది కాబట్టి అది మన పక్కనే ఉన్నా చీకట్లో మనకు తెలీదు. ఏనుగు నుంచి శబ్దం కూడా ఏదీ రాదు. చాలా ప్రమాదం. మందలో పిల్లలు ఉంటే అవి మెల్లగా నడుస్తాయి. లేదంటే అవి చాలా వేగంగా దాడి చేస్తాయి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వందకు పైగా ఏనుగులు
ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంఖ్య 130 వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో 15-20 ఏనుగులు ఉండగా, శ్యామలవ్యాలీ అటవీ ప్రాంతంలో మరో 20 ఏనుగులు జీవిస్తున్నాయని చెప్పారు.
తిరుపతి జిల్లాలో ఏనుగుల వల్ల గత మూడేళ్లలో రూ.50 లక్షల విలువైన పంట నష్టం జరిగింది. అందులో రైతులకు రూ.30 లక్షల వరకు పరిహారం చెల్లించాం. మిగతా రూ.20 లక్షలు ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది వివేక్ చెప్పారు.
అటవీ శాఖ ఇప్పుడు డ్రోన్లు కూడా ఉపయోగిస్తోంది. ప్రత్యేకంగా దీనికోసం డ్రోన్ టీమ్స్ ఏర్పాటు చేశారు.
''గ్రామస్థుల సహకారం చాలా అవసరం. మాకు ఎక్కువ ఫేక్ కాల్స్ వస్తున్నాయి. దీంతో ఏనుగులను గుర్తించడం కూడా ఆలస్యం అవుతుంది'' అని వివేక్ తెలిపారు.
కందకాలు, సోలార్ ఫెన్సింగ్...
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగు దాడుల ప్రమాదం ఉండడంతో కందకాలు తవ్వించామని, వర్షాకాలంలో అవి పూడిపోయాయని తిరుపతి సీసీఎఫ్ఓ సెల్వం బీబీసీతో చెప్పారు.
మళ్లీ కందకాలు నిర్మించడానికి, రైతులు సోలార్ ఫెన్సింగ్ వేసుకోడానికి వీలుగా అంచనాలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.
''కొన్ని ప్రాంతాల్లో సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ పని చేస్తుంది. ఒక కిలోమీటరు ఫెన్సింగుకు రూ.8-10 లక్షలు ఖర్చు అవుతుంది. తిరుపతి ప్రాంతంలో ఈ కంచెల ఏర్పాటుకు అంచనా వేస్తున్నాం. కందకాల తర్వాత మేం దీన్ని రెండో రక్షణగా చూస్తున్నాం. ఈ రెండు ఏర్పాటు చేసుకుంటే ఏనుగులు ఈ వైపు రావడం తగ్గుతుంది'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏనుగులు పొలాలపైకి రాకుండా..
ఏనుగులు పంటపొలాల వైపు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం చెప్పారు.
''పంటల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేసుకోవచ్చు. అది ఏనుగులను ఆపడానికి ఉపయోగ పడుతుంది. తేనెటీగలు ఏనుగుకు చికాకు కలిగిస్తాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్లు పొలాల చుట్టూ తేనెటీగలు పెంచే బాక్సులు పెట్టుకుంటే అది ఒక సెక్యూరిటీలా పనిచేస్తుంది.
ఎండు మిరపకాయలను కాల్చినప్పుడు ఆ పొగతో వచ్చే ఘాటు ఏనుగులను ఆ వైపు రాకుండా చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అలాంటి పద్ధతులను ఉపయోగించవచ్చు.
అడవుల దగ్గరగా ఉన్న పంట పొలాల్లో మిర్చి, మల్బరీ, నిమ్మ లాంటి పంటలు వేసుకుంటే ఏనుగులు ఆ పంటల వైపు రావు. రైతులు వీలైనంత వరకు కొబ్బరి, అరటి, చెరకు లాంటి పంటలు వేయడం ఆపేస్తే ఆయా ప్రాంతాలకు ఏనుగులు రావడం తగ్గుతుంది'' అని సెల్వం సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














