స్టాక్ మార్కెట్ భారీ పతనానికి కారణమేంటి?

దలాల్ స్ట్రీట్

గత సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి భారత స్టాక్ మార్కెట్లలో అలజడి మొదలైంది. సెప్టెంబర్ 26న సెన్సెక్స్ 85,836 పాయింట్లకు చేరుకుంది. ఇప్పుడు అది 75,366 పడిపోయింది.

కొత్త సంవత్సరంలో దలాల్ స్ట్రీట్ ఒడిదొడుకులకు లోనవుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) షేర్లను విక్రయించడంతో పతనమవుతోంది.

జనవరిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ.69 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (మ్యూచువల్ ఫండ్స్) అదే సమయంలో రూ.67 వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్‌కు మద్దతుగా నిలిచారు.

మార్కెట్‌

ఫొటో సోర్స్, Getty Images

ఏ స్టాక్స్ అమ్మేస్తున్నారు?

మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతున్నప్పటికీ చిన్న, మధ్య తరహా స్టాక్‌లు (మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) భారీగా పతనమయ్యాయి. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4 శాతం పడిపోయింది.

మార్కెట్ ప్రస్తుతం రెండు ముఖ్యమైన సంఘటనలపై దృష్టి సారిస్తోంది. మొదటిది, జనవరి 29న జరిగే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. రెండోది, ఫిబ్రవరి 1న భారత పార్లమెంట్‌లో సమర్పించే కేంద్ర బడ్జెట్.

అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు సమస్యలు పెరగడం ఖాయం. విదేశీ పెట్టుబడిదారులు భారత్‌తో సహా పలు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇన్వెస్టర్లు అధిక, సురక్షితమైన రాబడి కోసం అమెరికాను ఎంచుకోవడంలో ఆలస్యం చేయరు.

అయితే, డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం చాలా తక్కువగా ఉందని డీఆర్ చోక్సీ ఫిన్‌సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవన్ చోక్సీ అభిప్రాయపడ్డారు.

"ట్రంప్ వైఖరి ప్రకారం ఆయన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇష్టపడరు" అని బీబీసీ హిందీతో చోక్సీ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

మార్కెట్లు ఎందుకు పతనమవుతున్నాయి?

ప్రస్తుత భారత స్టాక్ మార్కెట్ పరిస్థితికి కారణాలు చాలానే ఉన్నాయని మార్కెట్ విశ్లేషకుడు అంబరీష్ బాలిగా అంటున్నారు.

"దేశంలో గత కొద్దికాలంగా ఆర్థిక పరిస్థితులు మారాయి. ప్రైవేట్ ఏజెన్సీలే కాదు, భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ కూడా జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. ఆహార ద్రవ్యోల్బణం రేటు చాలా ఎక్కువగా ఉంది. త్రైమాసిక కంపెనీల ఫలితాలు కూడా చాలా నిరాశాజనకంగా ఉన్నాయి" అని అంబరీష్ అన్నారు.

ఫ్యూచర్స్ మార్కెట్‌కు సంబంధించి సెబీ కొత్త మార్గదర్శకాలు కూడా మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్‌కు కారణయ్యాయని చోక్సీ ఆరోపించారు.

"ఇటీవల ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం సెబీ కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని రూ. 15 లక్షలకు పెంచింది" అని చోక్సీ గుర్తుచేశారు.

"ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌ (ఎఫ్ అండ్ ఓ)లో రిటైల్ ఇన్వెస్టర్ల నిర్లక్ష్యపు కార్యకలాపాలను అరికట్టడమే సెబీ ఉద్దేశం. కాంట్రాక్ట్ పరిమాణాన్ని పెంచడం ద్వారా మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి రెగ్యులేటర్ ప్రయత్నిస్తోంది" అని ఆయన అన్నారు.

2022-2024 ఆర్థిక సంవత్సరాలలో కోటి మందికి పైగా వ్యాపారులు ఎఫ్ అండ్ ఓలో నష్టాలను చవిచూశారని ఇటీవల సెబీ నివేదిక విడుదల చేసింది. ఒక్కో వ్యాపారికి నష్టం గురించి మాట్లాడినట్లయితే అది సగటున రూ. 2 లక్షలు.

స్టాక్ మార్కెట్ పతనం

ఫొటో సోర్స్, Getty Images

బడ్జెట్ ప్రభావమా?

అంటే ఫిబ్రవరి 1న సమర్పించబోయే బడ్జెట్‌ కారణంగానే మార్కెట్ ఇలా వ్యవహరిస్తోందా? అంటే దీనిని అంబరీష్ అంగీకరించడం లేదు.

''ఏదేమైనా గత 8-10 ఏళ్లుగా బడ్జెట్‌ నాన్‌ ఈవెంట్‌గా మారింది. అందులో చేసిన ప్రకటనల ప్రభావం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం కూడా విధానపరమైన ప్రకటనలు ఎప్పటికప్పుడు చేస్తోంది. బడ్జెట్ కోసం వేచి ఉండటం లేదు. ఇది కాకుండా జీఎస్టీ రేట్లపై నిర్ణయం కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు'' అని అన్నారు అంబరీష్.

క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే గత బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుందని, మళ్లీ మార్పు ఉండే అవకాశం లేదని అంబరీష్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో మార్కెట్‌కు ప్రతికూలంగా ఏమీ ఉండబోదని దేవెన్ చోక్సీ అంటున్నారు.

పెట్టుబడిదారులు భయపడుతున్నారా?

గత సంవత్సరం స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని పెంచారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మార్కెట్‌లోకి చాలా డబ్బు వచ్చింది, షేర్ ధరలు చాలా పెరిగాయి.

''ఫండ్ మేనేజర్లకు పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో వారు తమ వద్ద నగదును ఉంచుకోలేక షేర్లు కొన్నారు. షేర్ల విలువ చాలా పెరిగిందని చెబుతున్నారు'' అని అంబరీష్ అన్నారు.

అయితే, ఈ పతనం కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురవుతారా లేదా మార్కెట్ నుంచి వైదొలుగుతారా?

ఈ ప్రశ్నకు అంబరీష్ స్పందిస్తూ "విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు షేర్లు విక్రయించి, మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరిగింది. గత నాలుగు సంవత్సరాలలో మార్కెట్లోకి ప్రవేశించిన ఈ పెట్టుబడిదారులలో చాలామంది మొదటిసారిగా ఇంత సుదీర్ఘమైన పతనాన్ని చూస్తున్నారు" అని అన్నారు.

చిన్న ఇన్వెస్టర్లు భయపడి పెట్టుబడులు నిలిపివేస్తున్నారా, లేదా? అనేది జనవరి నెల డేటాను బట్టి అధికారికంగా తెలుస్తుందని, అయితే గత కొంతకాలంగా మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఇన్వెస్టర్లు ఆందోళనపడటం సహజమేనని అంబరీష్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)