‘నేను రెండేళ్లే బతుకుతానని డాక్టర్లు చెప్పి 20 ఏళ్లు గడిచాయి’

ఫొటో సోర్స్, Supplied
- రచయిత, కెవిన్ ఫిలెమాన్, డాన్ లింబు
- హోదా, బీబీసీ న్యూస్, బ్రిస్టల్
మార్షాకు 39 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఆమె కోన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ రుగ్మత ఉన్నవారు ఎక్కువకాలం బతకరని, రెండేళ్లలోపే ఆమె జీవితం ముగుస్తుందన్నారు. కానీ, ఇప్పుడు ఆమె వయసు 59 ఏళ్లు. అంటే, డాక్టర్లు అలా చెప్పి 20 ఏళ్లు అవుతోంది.
''నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను ఇంకా జీవించి ఉండడం చాలా బాగనిపిస్తోంది'' అని మార్షా చెప్పారు.
ఆమె పూర్తి పేరు మార్షా మెక్ కార్టీ-కూంబ్స్. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన ఆమె ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు.
కోన్స్ సిండ్రోమ్‌ను ప్రైమరీ అల్డొస్టరోనిజం అని కూడా పిలుస్తారు. అడ్రినల్ గ్రంథులు అల్డొస్టరోన్ అనే హార్మోన్‌ను అధికస్థాయిలో ఉత్పత్తి చేయడంతో తీవ్రస్థాయి రక్తపోటు వస్తుంది.
2005లో ఏం చెప్పారంటే..
అందుబాటు ధరల్లో లబించే ఆభరణాల బ్రాండ్‌ను ఆమె ప్రారంభించారు. దాని ద్వారా వచ్చిన డబ్బును స్థానిక చారిటీ సంస్థలకు ఇస్తూ బ్రిస్టల్ సమాజానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2005లో లండన్‌లోని తన ఇంట్లో ఆమె ఒక్కసారిగా కుప్పుకూలిపోయారు. అలా ఆరోగ్యం కోసం ఆమె పోరాటం మొదలైంది. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పార్క్ రాయల్ ఆస్పత్రిలో ఆరు నెలలు ఉన్న తర్వాత కూడా ఆమె అనారోగ్యానికి కారణమేంటో తెలియలేదు.
అనేక పరీక్షలు, డాక్టర్ల దగ్గరకు చాలాసార్లు వెళ్లిన తర్వాత చివరకు ఆమె కోన్స్ సిండ్రోమ్ బారిన పడ్డట్టు గుర్తించారు.
''ఇంటికి వెళ్లి అన్ని పేపర్లు సిద్ధం చేసుకోవాలని డాక్టర్లు నాకు చెప్పారు. ఎందుకంటే నేను 40వ పుట్టిన రోజు చేసుకుంటానని వారు నమ్మలేదు'' అని మార్షా గుర్తుచేసుకున్నారు.
ఏదో దుర్భరమైనది జరగబోతోందని తనను తాను సిద్ధం చేసుకోవడానికి బదులుగా, ఆమె 40వ పుట్టిన రోజు వేడుకల్లో కుటుంబమంతా తిరిగి కలుసుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. ధైర్యం కోల్పోలేదు.


ఫొటో సోర్స్, Supplied
కోన్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
అధిక రక్తపోటు ఉన్నవారిలో 5 నుంచి 10శాతం మందికి ఈ పరిస్థితి తలెత్తవచ్చని, మహిళలకు ఇది ఎక్కువగా సోకుతుంటుందని ది క్లెవెలాండ్ క్లినిక్ తెలిపింది.
తక్కువ పొటాషియం స్థాయిలు, అధిక రక్తపోటు, తలనొప్పి, కండరాల తిమ్మిరి, విపరీతమైన దాహం వంటి లక్షణాలు కూడా ఈ జబ్బులో ఉంటాయి.
చాలా మందిలానే మార్షా కూడా తన లక్షణాలను గుర్తించలేకపోయారు.
‘‘వాళ్లు నాకు వ్యాధి సోకినట్టు గుర్తించినప్పుడు నేను లక్షణాలు గుర్తించేందుకు ప్రయత్నించలేదు. నాకు మెనోపాజ్ తొందరగా వచ్చిందని నేననుకున్నా’’ అని ఆమె చెప్పారు.
ఈ రుగ్మత వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నిరంతరాయంగా రక్తస్రావం అవుతుంది. ఇది గర్భాశయం తొలగింపుకు దారితీస్తుంది.

ఫొటో సోర్స్, Supplied
కణితులు గుర్తింపు
కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువవడం వల్ల కలిగే మరో హార్మోనల్ డిజార్డర్ కషింగ్స్ సిండ్రోమ్ కూడా మార్షాకు ఉన్నట్టు తర్వాత గుర్తించారు.
దీనివల్ల క్యాన్సరేతర కణితులు పెరుగుతాయి. ఆమె మెదడులో రెండు, గొంతులో రెండు కణితులు ఏర్పడ్డాయి.
వ్యాప్తి చెందే ప్రమాదముందన్న ఉద్దేశంతో డాక్టర్లు రెండో దాన్ని తొలగించకూడదని నిర్ణయించుకున్నారు.
ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నప్పటికీ పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నించానని మార్షా చెప్పారు.
సరసమైన ధరలకు లభించేలా ఆమె క్వీన్స్ ఆఫ్ జ్యుయెలరీ అనే ఆభరణాల బ్రాండ్ ప్రారంభించారు. పశ్చిమ ఇంగ్లండ్ అంతటా చారిటీలకు నిధులు సేకరిస్తూ తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు సాయమందించేందుకు ఆమె ఇది స్థాపించారు.
50 పౌండ్ల నుంచి 25 పౌండ్ల ధర ఉండే ఆమె ఉత్పత్తులు అందరికీ అందుబాటులో ఉంటాయి.
''రోజువారీ జీవనం కోసం పోరాడడమా, చికిత్స పొందడమా అనేది ఎంచుకోవడంలో ఒంటరి తల్లిగా ఎంత సమస్య ఉంటుందో నాకు తెలుసు'' అని ఆమె అన్నారు.
''అందరికీ అందుబాటులో ఉండేలా ఏదైనా చేయాలని నేననుకున్నా'' అని ఆమె చెప్పారు.
బ్రిస్టల్‌కు చెందిన గృహహింసపై పోరాడే సంస్థ మిస్సింగ్ లింక్ వంటి చారిటీ సంస్థలకు ఆమె ప్రయత్నాల వల్ల లాభం కలిగింది.

ఫొటో సోర్స్, Supplied
ఆరు నెలలకోసారి టెస్టులు
తన పరిస్థితిని ఎదుర్కోవడం సమస్యతో కూడుకున్నదని మార్షా చెప్పారు. అయితే ఓ ఫార్మాసిస్ట్ సహకారంతో ఆమె ఒకప్పుడు 32 ఔషధాలు తీసుకోవాల్సిన స్థితి నుంచి వాటిని ఎనిమిదికి తగ్గించుకోగలిగారు.
''ప్రతి ఆరు నెలలకోసారి నేను పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తాను. ప్రతి సంవత్సరం నా కన్సల్టంట్ నా పరిస్థితిని గుర్తుచేస్తారు'' అని ఆమె తెలిపారు.
ఆమె జుట్టు పోగొట్టుకున్నారు. కదలిక ఆగిపోతోంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. అయినప్పటికీ మార్షా మౌనంగానే ఉంటారు. ''నొప్పి, బాధతో ఎలా పోరాడాలో నేను నేర్చుకున్నా. జీవించి ఉన్నందుకే నేను చాలా సంతోషపడుతున్నా'' అని ఆమె చెప్పారు.
తన బలం నిరంతరం భర్తేనని, తనకు అడ్డుచెప్పకుండా తనవైపు నిలబడ్డారని మార్షా తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














