‘రొమ్ములు ఉన్నప్పుడు, లేనప్పుడు మాతృత్వం ఎలా ఉంటుందో నాకు తెలుసు’- శస్త్ర చికిత్స ద్వారా రెండు రొమ్ములు తొలగించుకున్న తల్లి కథ

ఫొటో సోర్స్, @MACAFONO
- రచయిత, ఫెర్నాండా పాల్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
తన రొమ్ములో ప్రాణాంతక కణితి ఉందని గుర్తించినప్పడు మెకరినా రోడ్రిగ్జ్ లాన్స్ వయసు 31 ఏళ్లు.
కణితి ఉందన్న విషయం తెలిసిన తర్వాత సర్జరీలో రెండు రొమ్ములు తొలగించుకోవాలా వద్దా.. అన్నది నిర్ణయించుకోవడం ఆమెకు చాలా కష్టమైంది.
అయితే, తీవ్రంగా ఆలోచించిన తర్వాత చివరికి రెండు రొమ్ములూ తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఒక రొమ్ములో అప్పటికి క్యాన్సర్ లక్షణాలు ఏమీ లేకపోయినప్పటికీ ఆ రొమ్ములోనూ ప్రాణాంతక కణితి ఏర్పడుతుందన్న భయంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
అప్పటికి ఆమె ఏడాది వయసున్న బాబుకు తల్లి.
కొందరు డాక్టర్లతో పాటు, ఆమె చుట్టూ ఉండేవారు అలా చేయొద్దని సూచించారు. అయినా, ఆమె శారీరకంగా, మానసికంగా తన బాగోగుల గురించి ఆలోచించుకున్నారు.
స్పీచ్ థెరపీలో గ్రాడ్యుయేట్ అయిన మెకరినా తన కథను బీబీసీకి వివరించారు.
బిడ్డలకు పాలివ్వడంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొన్న తల్లులు, భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సిన అమ్మల కోసం తాను ఇదంతా చెప్తున్నానని మెకరినా అన్నారు.
‘‘పిల్లల కోసం చేయాల్సింది చేయలేకపోయామన్న ఆలోచన నుంచి బయటపడాలి. మీకున్న అవకాశాలు, వనరులను బట్టి మీరేం చేయగలరో అది చేయాలి’’ అని ఆమె చెప్పారు.


ఫొటో సోర్స్, @MACAFONO
కణితి ఉందని ఎలా తెలిసిందంటే...
ఆమె ఇంకా ఏం చెప్పారో ఆమె మాటల్లోనే..
నా కథను బయటకు చెప్పడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది.
నేను తీసుకున్న నిర్ణయం చాలా కష్టమైనది. అయితే ఆ నిర్ణయాన్ని నేను సమర్థించుకుంటున్నాను. దీనిపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.
2014లో నాకు మొదటి బాబు జన్మించిన తర్వాత ఇదంతా మొదలైంది.
నేనొకసారి స్నానం చేస్తుండగా.. నాకేదో అనుమానంగా అనిపించింది. నా రొమ్ములను నాకు నేనుగా పరీక్షించుకున్నాను. నా రొమ్ములో పెద్ద కణితి ఉన్న విషయాన్ని చాలా తేలిగ్గా గుర్తించగలిగాను.
ఆ క్షణం నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది. నేను స్నానం చేసి వచ్చిన వెంటనే మంచం చివరన కూర్చుని ఆలోచిస్తూ.. ‘‘ఇప్పుడు నేనేం చేయాలి?’’ అని భయపడ్డాను.
వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను.
అక్కడ గైనకాలజిస్ట్ నాకు పరీక్షలు చేశారు. భయపడాల్సిందేమీ లేదంటూ చాలా ప్రశాంతంగా చెప్పారు. బాబుకు పాలిస్తుండటం వల్ల ఇలా జరిగి ఉంటుందని చెప్పి... ఇంకేం మాట్లాడకుండా నన్ను ఇంటికి పంపించారు.
కానీ, నాకు నమ్మకం కుదరలేదు. తర్వాత మరో గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లాను. అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.
ఆ స్కానింగ్ రిపోర్టులో కనిపించిన కణితిని పరిశీలించిన డాక్టర్.. దానిపై అనుమానం వ్యక్తం చేశారు. మరింత నిశితంగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు.
రెండు వారాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఆ సమయంలో నేను ఇంట్లో నా చిన్న బాబుతో కలిసి ఒంటరిగా ఉన్నా.
ఆ సమయంలోనే డాక్టర్ ఆ విషయం చెప్పారు. ఆ కణితి ప్రాణాంతకమైనదని, నాకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
అది భరించలేని క్షణం, నేను ఏడవడం మొదలుపెట్టాను. మా అబ్బాయి నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. నాకు చాలా భయం వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కఠినమైన నిర్ణయం
నా రొమ్ములో కణితి చనుమొనల కింద ఉంది. అది చాలా పెద్దది.
ఆ కణితి శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించే అవకాశముందని డాక్టర్లు అంచనా వేశారు.
శస్త్రచికిత్స చేయించుకుని కణితి ఉన్న రొమ్మును తొలగించుకోవాలని డాక్టర్లు సూచించారు.
నేను కణితి లేని నా మరో రొమ్ము గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. అందులో కూడా మరో కణితి పెరిగే ప్రమాదం ఉందన్న ఆలోచన నాకు వచ్చింది. ఇలా రెండు రొమ్ముల్లోనూ కణితులు ఉన్న కేసులు నాకు చాలా తెలుసు.
ఆ విషయం తెలుసుకోవడానికి నాకు క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పారు. ఒకవేళ ఆ పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే, నేను మళ్లీ ఆపరేషన్ గదిలోకి వెళ్లి మొదటి రొమ్ము తొలగించుకున్నట్టుగానే రెండో రొమ్ము తీసేయించుకోవాలి.
రెండోసారి ఆపరేషన్ గదికి వెళ్లడమంటే.. శస్త్రచికిత్స సమయంలో పడే బాధలన్నీ మరోసారి భరించాలి. దీంతో పాటు చిన్న బాబును జాగ్రత్తగా చూసుకోవాలి.
అంతేకాకుండా ఇంకో రొమ్మును అలాగే ఉంచుకుంటే, రోగనిరోధకత కోసం యాంటీ-ఈస్ట్రోజెన్‌లు ఇవ్వాలి. దీనివల్ల తొందరగా మెనోపాజ్ వస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రెండు రొమ్ములు తొలగించుకోవాలని నేను నిర్ణయించుకున్నా.
నా నిర్ణయాన్ని మిగిలిన వాళ్లంతా అర్థం చేసుకునేలా చేయడానికి నేను కొంచెం పోరాడాల్సివచ్చింది. రెండో రొమ్ము తొలగించుకోవద్దని చాలా మంది నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘‘నీకు మళ్లీ పిల్లలు పుడితే, వాళ్లకు ఎలా పాలివ్వగలవో ఆలోచించుకో’’ అని అన్నారు.
నేను నిజాయితీగా చెప్తున్నా. నాకు ఎక్కువమంది పిల్లలు కావాలని ఉన్నప్పటికీ, ఆ క్షణాన మాత్రం నేను నా కొడుకు గురించి మాత్రమే ఆలోచించా. తను మరిన్ని పుట్టిన రోజులు జరుపుకునేటప్పుడు నేను తన దగ్గర ఉండగలగాలని అనుకున్నా.
అలా నాకు నేను నచ్చజెప్పుకుని ఆపరేషన్ చేయించుకున్నా.
కణితి శరీరంలోని మరే భాగానికీ వ్యాపించలేదని డాక్టర్లు చెప్పారు. అంటే, నాకిక వేరే చికిత్సలతో అవసరం లేదు.
కణితి ఉన్న రొమ్మును పూర్తిగా తొలగించారు. చనుమొన స్థానంలో టాటూ వేయించుకున్నా.
రెండో రొమ్ము చనుమొనను కొద్ది మొత్తంలో ఉంచారు. దీనివల్ల కణాలు మొత్తం చనిపోకుండా ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
రొమ్ములు లేకుండా తల్లి కావడం
కొన్నేళ్ల తర్వాత 2017లో రెండోసారి గర్భవతినయ్యాను.
ఆ సమయంలో నాకు మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. అది చాలా కష్టమైన సమయం. ఆలోచనలు మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. రొమ్ములు లేకుండా తల్లికాబోతున్నానన్న నిజాన్ని నేను అంగీకరించాల్సి వచ్చింది. పుట్టబోయే బిడ్డకు నేను పాలు ఇవ్వలేను.
మొదటి కాన్పు సమయంలో నాకు చికిత్స అందించిన డాక్టర్, ఫార్ములా పాలు విషం లాంటివని నాతో చెప్పారు.
మనకు పిల్లలుంటే తప్పనిసరి పరిస్థితులుంటేనే వాళ్లకు ఫార్ములా పాలు పట్టించాలి.
నేను ఫార్ములా పాల గురించి సమాచారం సేకరించడం మొదలుపెట్టా.
తల్లిపాలు తాగిన పిల్లలకు, ఫార్ములా పాలు తాగిన పిల్లలకు మధ్య ఆరోగ్యంలో పెద్ద తేడా ఏమీ లేదు. శ్వాసకోస సంబంధిత సమస్యలు కొన్ని కనిపించాయి. అంతకు మించి ఇంకేమీ తేడా కనిపించలేదు.
తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వేల కథనాలు ఉన్నాయి. ఫార్ములా పాల గురించి మాత్రం కొన్నే ఉన్నాయి. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా బాగానే ఉంటుంది’’ అని నాతో ఎవరన్నా చెబితే బాగుండనిపించింది.
ఏ బాటిళ్లు అయితే బాగుంటాయి? చనుమొన ఆకారానికి దగ్గరగా ఏ బాటిళ్లుంటాయి? అన్నది కూడా వెతికాను.
అయితే, నాకు రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఇంటి దగ్గరున్న సమయంలో ఒక బాధాకరమైన ఘటన జరిగింది.
‘‘నీ షర్ట్ తడిసిపోయింది’’ అని నా భర్త నాతో చెప్పారు. నేను ఆ విషయం నమ్మలేకపోయా. నా రెండో రొమ్ములో మిగిలిపోయిన అతికొద్ది భాగం నుంచి పాలు వస్తున్నాయి.
నా రెండో బిడ్డకు ఆ పాలివ్వాలని నేను ఎంతగానో అనుకున్నా. డాక్టర్ కూడా బిడ్డకు పాలు ఇవ్వాలని నాకు చెప్పారు. కానీ కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత ‘ఇది సరైనది కాదు. నా శరీరం ఇంతకు ముందటిలా లేదు. రెండో బిడ్డకు పాలివ్వలేను’ అని అనిపించింది.
అదృష్టవశాత్తూ నేను బిడ్డకు పాలివ్వడానికి ప్రయత్నించలేదు. నాకు రొమ్ము ఇన్ఫెక్షన్ సోకే అవకాశముందని తర్వాత గైనకాలజిస్ట్ చెప్పారు.
రొమ్ము నుంచి పాలు రాకుండా ఉండేందుకు డాక్టర్లు నాకు మందులు ఇచ్చారు. ఇది నాకు రెట్టింపు బాధ మిగిల్చింది.

ఫొటో సోర్స్, @MACAFONO
భారంగా గడిచిన రోజులు
తర్వాతి నెలలు అంత తేలిగ్గా గడవలేదు.
నేను తిరిగి జాబ్‌లో జాయినయ్యాను. నాకు సైకాలజిస్టుతో కలిసి ఓ ప్రాజెక్టు కేటాయించారు. ఆస్పత్రుల్లో వెయిటింగ్ రూమ్స్ దగ్గరకు వెళ్లి మేం తల్లలకు సలహాలు ఇవ్వాలి.
పిల్లలను ఎలా పట్టుకుంటే పాలు సరిగ్గా ఇవ్వగలరు? పిల్లల పెదవులకు రొమ్ము ఎలా అందించాలి? వంటి వాటి గురించి వాళ్లల్లో చాలా మందికి నేను సలహాలు ఇవ్వాల్సి వచ్చింది.
తర్వాత నాకు నేను చేయలేనిదాని గురించి ఇతరులకు సలహాలిస్తున్నానన్న ఆలోచన వచ్చింది. చెప్తూ చెప్తూ ఆగిపోయి... నేను బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. కాసేపు ఏడ్చిన తర్వాత తిరిగి వచ్చి నా పని కొనసాగించేదాన్ని.
నా బిడ్డకు నేను పాలివ్వడం లేదని కొందరు విమర్శనాత్మకంగా చూసే చూపులు కూడా నేను గమనించాను.
కొన్నిసార్లు నేను పార్కుకు వెళ్లినప్పుడు.. ‘‘బిడ్డకు బాటిల్ పాలు ఎందుకు తాగిస్తున్నావు?’’ అని కొందరు అడిగేవారు. నేను అసలు విషయం చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయేవారు.
పిల్లల వైద్యులు ఒకరు నాతో అన్న మాట నాకిప్పటికీ గుర్తుంది. రెండు రొమ్ములు తొలగించుకోవాలని నేను అనుకున్నప్పుడు... ‘తల్లి పాలు తాగడం పిల్లల హక్కు. దానిని మీరు హరించివేస్తున్నారు’ అని ఆమె నాతో అన్నారు. ఆ మాట నేను భరించలేకపోయా.
తల్లి జీవించి ఉండడం, తల్లితో అనుబంధం కలిగి ఉండడం అనే నా పిల్లల హక్కులను నేను సంరక్షిస్తున్నానన్న విషయం మీకు తెలుసా? అని నేను ఆమెను ప్రశ్నించాను.
నా నిర్ణయాన్ని నేను సమర్థించుకున్నాను. సమర్థించుకుంటూనే ఉంటాను.
నేను నా కథ చెప్పాలనుకుంది కూడా ఇందుకే.
మాతృత్వాన్ని త్యాగంతో ముడిపెడుతుంటారు. ‘‘మీరు పాలు ఇవ్వగలిగితేనే మీరు మంచి తల్లి కింద లెక్క. లేకపోతే... మీరు చెడ్డ తల్లి, బద్ధకస్తురాలు’’ అని అంటుంటారు.
తల్లిపాల ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ చాలా మంది మహిళలు పిల్లలకు పాలు ఇవ్వలేరు. అలాంటి వాళ్లు తప్పు చేశామన్న భావం నుంచి బయటపడాలి. మనకున్న వనరులను బట్టి ఏం చేయగలమో అవన్నీ మనం చేస్తాం.
రొమ్ములు లేకుండా ఉన్నప్పుడు, రొమ్ములు ఉన్నప్పుడు మాతృత్వ భావన ఎలా ఉంటుందో నాకు తెలుసు. కంచెకు రెండువైపులా ఉండడం లాంటిది ఇది.
నా ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతున్నారని నేను చెప్పగలను. నేను పాలిచ్చిన నా మొదటి బిడ్డతో పోలిస్తే, పాలు ఇవ్వని మిగిలిన ఇద్దరు పిల్లలతో నా బాంధవ్యం వేరుగా ఉందని నేను చెబితే... అది అబద్ధం అవుతుంది.
కొందరి అభిప్రాయాలు, చూపులు కొన్నిసార్లు, కొన్ని విషయాలపై నాకు సందేహం కలిగించినప్పటికీ, నేను చెడ్డ తల్లినని నన్ను నేను ఎప్పుడూ అనుకోను.
నా ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి నేను పాలివ్వలేదన్నది నిజం. కానీ నేను వాళ్లకు మిగిలినవి చాలా ఇచ్చాను.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














