రాజభటుల టోపీ వివాదం: ఎలుగు బంట్లను చంపి తయారు చేస్తున్నారా, ఖర్చు మీద విమర్శలేంటి?

బ్రిటన్ రాజకుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్: టోపీలు ధరించి మార్చ్‌లో పాల్గొంటున్న కింగ్స్ గార్డ్స్
    • రచయిత, సీన్ కౌలాన్
    • హోదా, రాయల్ కరెస్పాండెంట్

బకింగ్‌హామ్ ప్యాలెస్ బయట విధులు నిర్వహించే సైనికులు ఎలుగుబంటి జుత్తుతో అలంకరించిన టోపీలు పెట్టుకుంటారు. బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కో టోపీ ధర 2 వేల పౌండ్ల (రూ.2,19,262) కన్నా ఎక్కువ.

వేడుకల సమయంలో సైనికులు ధరించే ఆ టోపీలను నల్ల ఎలుగుబంట్ల చర్మం మీద ఉండే జుత్తుతో తయారు చేస్తారు. ఒక ఏడాదిలో ఈ టోపీల ధర 30 శాతం పెరిగింది. సమాచార హక్కు చట్టం కింద జంతు సంక్షేమ ఉద్యమకారులు ఈ వివరాలను రాబట్టారు.

ఎలుగుబంట్ల జుత్తును ఉపయోగించడాన్ని జంతువుల సంక్షేమ బృందం ‘పెటా’ వ్యతిరేకిస్తోంది. ఇది ఇప్పుడు నైతికతతో పాటు ఖర్చుకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయిందని వాళ్లు అంటున్నారు.

ఎలుగుబంటి జుత్తుతో తయారు చేసే టోపీల కోసం ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక మిలియన్ పౌండ్లు ( సుమారు రూ.11 కోట్లు ) ఖర్చు చేసిందని వారు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎలుగుబంటి జుత్తుతో రాజభటుల టోపీలను తయారు చేస్తారు.

కెనడాలో ఎలుగుబంట్లను వేటాడి...

ఎలుగుబంట్ల జుత్తుకు ప్రత్యామ్నాయం దొరికితే, దాన్ని ఉపయోగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

భద్రత, నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా, ఈ ప్రత్యామ్నాయ జుత్తు ఉండాలని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. కానీ ఇప్పటిదాకా అలాంటి ప్రత్యామ్నాయం కనిపించలేదని ఆయన అన్నారు.

టోపీల కోసం చేసుకున్న ఒప్పందంలో జరిగిన మార్పు వల్లే ధర బాగా పెరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గార్డులు పెట్టుకునే ఒక్కో టోపీ ధర 2022లో 1,560 పౌండ్లు ( సుమారు రూ.1.70 లక్షలు ) ఉండగా, 2023 నాటికి అది 2,040 పౌండ్ల (సుమారు రూ.2.23లక్షల)కు చేరింది.

టోపీలన్నీ కెనడాలో వేటాడిన ఎలుగుబంట్ల జుత్తు నుంచే తయారు చేశారని పెటా అంటోంది. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని వన్యప్రాణులను వధించి తయారు చేసే టోపీలకు వృథాగా ఖర్చు పెట్టడం మానేయాలని ఆ సంస్థకు చెందిన ఎలీసా అలెన్ రక్షణ మంత్రిత్వ శాఖను కోరారు. వెంటనే దీనికి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.

బ్రిటన్ రాజకుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కింగ్స్ గార్డ్స్

టోపీల కోసం పదేళల్లో రూ.10 కోట్లకు పైగా ఖర్చు

విలక్షణంగా ఉండే ఈ పొడవైన టోపీలను రక్షకభటులు ‘ట్రూపింగ్ ద కలర్’ అని పిలిచే రాజు పుట్టినరోజు వేడుకలు వంటి వాటిలో ధరిస్తారు. 2023లో 24 కొత్త టోపీలను, 2022లో 13 కొత్త టోపీలను కొనుగోలు చేశారని రక్షణ శాఖ తెలిపింది. గడచిన దశాబ్దంలో టోపీలను మార్చడానికి ఒక మిలియన్ పౌండ్లు ( సుమారు రూ.11కోట్లు ) ఖర్చు చేసినట్లు వెల్లడించింది.

అయితే, ఎలుగుబంట్ల జుత్తుతో టోపీలు తయారు చేయడాన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. మిలటరీకి సంబంధించి అరుదైన సందర్భాల్లో సైనికులు ఆ టోపీలు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందని, అవి చాలా కాలం మన్నుతాయని వాళ్లు అంటున్నారు.

రాజభటులు నిజమైన ఎలుగుబంటి జుత్తుతో తయారు చేసిన టోపీలు పెట్టుకోవడం క్రూరమైనదని, అవి పెట్టుకోవాల్సిన అవసరమే లేదని జంతు సంక్షేమ ప్రచారకులు వాదిస్తున్నారు.

టోపీల తయారీకీ నిజమైన జుత్తును ఉపయోగించాలన్న నిర్ణయంలో బ్రిటన్ రాజకుటుంబం కన్నా రక్షణ మంత్రిత్వ శాఖదే ప్రధానపాత్ర. అయితే ఈ సంవత్సరం దీనికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన జుత్తుతో ఉన్న టోపీలు, దుస్తులను మాత్రమే కొనాలని రాణి కెమెల్లా చెప్పారని గతంలో బీబీసీ వెల్లడించింది.

నిజమైన జుత్తుతో తయారు చేసే దుస్తులు ఏవీ ధరించబోననని ఆమె ఓ లేఖలో తెలిపారు.

నల్లని ఎలుగుబంట్లను పట్టుకుని చంపడంపై ‘పెటా‘ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయితే, తాము ఉపయోగించే ఎలుగుబంటి జుత్తు మొత్తం అన్ని అనుమతులు ఉన్న కెనడా మార్కెట్‌లో లభించేదేనని, టోపీల కోసం ఎలుగుబంట్లను వేటాడడం లేదని రక్షణ శాఖ తెలిపింది.

బ్రిటన్ రాజకుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ రక్షణ శాఖ కార్యాలయం ఎదుట ‘పెటా’ కార్యకర్తల నిరసన ప్రదర్శన

ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు

ఎలుగుబంటి జుత్తుకు తక్షణమే ప్రత్యామ్నాయాలను వెదకాలని గత ఏడాది ప్రతిపక్షంలో ఉన్న, ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న స్టెప్‌హానియె పీకాక్ ఆదేశించారు. ఒప్పందాలు, ఖర్చులపై లోతుగా అధ్యయనం జరపాలని కోరారు.

సంప్రదాయాలు కొనసాగించాలంటే, కాలానికి తగ్గట్టు వాటిలో మార్పులు చేయడం చాలా చాలా ముఖ్యమని హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆమె చెప్పారు.

ఈ జుత్తుకు ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తామని, టెస్టింగ్ నిర్వహిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

టోపీలు తయారు చేయడానికి ఎంచుకునే ప్రత్యామ్నాయ మెటీరియల్‌కు నీటిని పీల్చుకోవడం, ఆకారం మారకుండా ఉండడం వంటి లక్షణాలు ఉండాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)