ఆంధ్రప్రదేశ్: పులి, ఎలుగుబంట్లు, ఏనుగులు... ఊళ్ళ మీద ఎందుకు పడతాయి... అవి ఎదురైతే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, VARUN THAKKAR
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పులి, ఏనుగు, ఎలుగుబంటి...ఇవే గత మూడు నెలల నుంచి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు బెంబేలెత్తిస్తున్నాయి.
ఎలుగుబంట్లు మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలను తీస్తూంటే, పులి పశువుల మీద దాడులు చేస్తోంది. ఏనుగులేమో పంటలను నాశనం చేస్తున్నాయి.
అసలు ఇవి జనావాసాల్లోకి ఎందుకొచ్చాయి? ఎలా వచ్చాయి? గతంలో లేని విధంగా ఇప్పుడు దాడులెందుకు చేస్తున్నాయి?
వీటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే వివరాలను విశాఖ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, పి. రామ్మెహన్ రావు బీబీసీకి వివరించారు.
‘సాధారణంగా పులి దాడి చేయదు’
ఏ జంతువుకైనా దానికి అనుకూలమైన, అలవాటైన నివాస ప్రాంతముంటుంది. అక్కడ దానికి కావలసిన ఆహారం, నీరు, జత కట్టే మరో జంతువు అన్నీ ఉంటాయి. అలాంటి ప్రాంతాన్ని వదిలి జంతువులు మరో చోటుకు వెళ్తున్నాయంటే అక్కడేదో సమతుల్యత దెబ్బతిందని అర్థం చేసుకోవాలని పి. రామ్మెహన్ రావు చెబుతున్నారు. ఇలాంటి జంతువులను ఎటువంటి గాయాలు కాకుండా పట్టుకోవడమే పెద్ద టాస్క్ అని అన్నారు.
“మనం పులి వార్తలు నిత్యం వింటున్నాం. ఇదిగో పులి, అదిగో పులి అంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి పులులు ఉండటానికి ఒకరకమైన వాతావరణం కావాలి. ఆహరం దొరకడంతోపాటు, దానిని తినడానికి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉండాలి. డిస్ట్రబెన్స్ ఉంటే అది ఆహారాన్ని తినదు, ఆ ప్రాంతంలో ఉండదు. మనిషికి తారస పడకుండా ఉండేందుకు పులి ప్రయత్నిస్తుంది. దాడి చేయాలని ఎప్పుడు అనుకోదు. కాకపోతే ఆహారం కోసం పశువులను, జింకలపై దాడి చేస్తుంది”అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, P. Rammohan Rao
‘అది తోడుని వెదుక్కుంటూ వచ్చింది’
‘‘గత మూడు నెలలుగా నాలుగు జిల్లాల్లో కలియ తిరుగుతున్న పులి, దాని అడుగుల బట్టి చూస్తే అది మగ పులి అని, అది ఒక తోడుని వెతుక్కుంటూ ఈ ప్రాంతాలకు వచ్చి ఉంటుందని అర్థమవుతోంది. అలాగే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పులి కాదు. అది ఒడిశా నుంచి వచ్చి ఉంటుంది. పులి చాలా తెలివైన జంతువు, అది రోజూ 30 కిలోమీటర్ల రేడియస్‌లో తిరుగుతూ ట్రాప్‌కు చిక్కడం లేదు’’అని పి. రామ్మెహన్ రావు చెప్పారు.
“పులి ఒడిశాలోని లకేరి అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుంది. రాయపూర్ నుంచి విశాఖపట్నం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఆ రోడ్డు కొంత ఒడిశాలోని ఫారెస్ట్ ఏరియా నుంచి కూడా వస్తుంది. రోడ్డు పనుల వలన అక్కడ సమతుల్యత దెబ్బతినడంతో పులి ఆ ప్రాంతాన్ని వదిలి ఇటువైపు వచ్చినట్లుంది. మన వద్ద పులులు ఉండే అవకాశం లేదు. గతంలో విజయనగరం జిల్లాలో చిరుత పులులను చూశాం కానీ, పెద్ద పులి తారస పడలేదు. కానీ ఈ ఏడాది ఏఫ్రిల్ 11న మెంటాడ దగ్గర కనిపించింది పెద్దపులేనని, అక్కడ లభించిన పాద ముద్రల సైజ్ (14x14 అంగుళాలు) బట్టి ప్రాథమికంగా నిర్ధారించాం.”
“సమీపంలోనే రిజర్వాయర్‌తోపాటు పశువులు కూడా ఉండటంతో ఆహారం, నీటి సమస్య లేదు. అలా తోడుని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా ఉంది. విజయనగరం నుంచి నర్సీపట్నం, అక్కడ నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని పత్తిపాడు, ఇప్పుడు తిరిగి తుని, అనకాపల్లిలో దీని ఉనికి కనిపిస్తుంది. అంటే తిరిగి మళ్లీ ఒడిశా వైపు వెళ్తుందని అర్థమవుతోంది. తూర్పు గోదావరిలో పులులున్నాయి. కానీ ఈ పులి చారలు, బరువుతో పోల్చి చూస్తే మ్యాచ్ కావడం లేదు. అంటే ఇది ఇక్కడి పులి కాదు. పులులున్నాయంటే అడవి బాగుందని, పులులు తగ్గిపోతున్నాయంటే అడవి కూడా తగ్గిపోతుందని, అడవి నుంచి పులులు బయటకు వస్తున్నాయంటే అక్కడేదో డిస్ట్రబెన్స్ ఉందని అర్థం. ఏ జంతువుకైనా ఇదే లెక్క.”

ఫొటో సోర్స్, ugc
‘మనం పండించే చెరకు, అరటి ఏనుగులు తింటాయి’
“నిజానికి ఏనుగులు మన దగ్గర లేవు. ఒడిశాలో ఉన్నాయి. వేలూరులో ఉన్నాయి. కానీ మనదగ్గరకు ఎందుకొచ్చాయి? అక్కడ సమతుల్యత దెబ్బతింది. అందుకే అక్కడ నుంచి ఇటు వచ్చాయి. ఇక్కడ మనం చెరుకు, అరటి పండిస్తాం. అవి ఏనుగులు తింటాయి.
ఒడిశా నుంచి విజయనగరం, శ్రీకాకుళం వైపు ఏనుగులు వస్తే...సరిహద్దు ప్రాంతంలోనే నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. అందుకే అవి క్రమంగా ఇటువైపుకు వలసలు వస్తున్నాయి. అలా వస్తున్న క్రమంలోనే పంటలను నాశనం చేస్తాయి. అడవిలో ఉండే ఏ జంతువైనా వాటికి కావలసిన కనీస అవసరాలు ఎక్కడ ఉండే అవకాశం ఉందో వాటి బట్టే అవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తాయి”అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, ugc
‘పులి, ఏనుగు కంటే ఎలుగుబంటే ప్రమాదకరం’
‘‘పులి, ఏనుగులు, ఎలుగుబంట్లలో...ఎలుగుబంట్లతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి దాడి చేసే స్వభావం కలిగి ఉంటాయి. పులి, ఏనుగు మాత్రం మనుషులకు ఎదురు పడకుండా జాగ్రత్తపడుతుంటాయి. పులి రాత్రి సమయంలోనే ప్రయాణిస్తుంది. ఉదయం సమయాల్లో గుహల్లో, దట్టమైన పొదల్లో దాక్కుంటుంది. ఏనుగులు పిల్లలను కనే సమయంలో దాడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి’’అని అటవీ శాకాధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో వజ్రాపుకొత్తూరు, కిడిసిగిలో ఎలుగుబంటి వరుస దాడులు చేసింది. అందులో ఒక వ్యక్తి మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గత మూడేళ్లుగా ఎలుగుబంట్లు తమ ప్రాంతంలో ఉన్నాయని, అయితే ఇప్పుడే ఎందుకు ఇలా దాడి చేస్తున్నాయో తెలియడం లేదని వజ్రాపుకొత్తూరు గ్రామస్థులు అన్నారు. ఎలుగుబంటి దాడి జరిగినప్పుడు పారిపోయే అవకాశం కూడా చిక్కలేదని చెప్పారు.
“మేం సాయంత్రం పొలాల్లో నుంచి గ్రామంలోకి వస్తుంటే అప్పటికే గుడి దగ్గరున్న ఎలుగుబంటి ఒకతనిపై దాడి చేస్తూ కనిపించింది. అతడ్ని కాపాడదామని మాకు దొరికిన కర్రలతో కొడుతుంటే మాపై దాడి చేసింది. అలా మేం ఒకరి తర్వాత మరొకరం ఎలుగుబంటి దాడికి గురైయ్యాం. పారిపోడానికి అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో ఎలుగుబంటిని తప్పించుకుని పోలేకపోయాం. అంతకు ముందైతే మా పక్క నుంచే ఎలుగుబంటి వెళ్లిపోయేది కానీ, దాడి చేసేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు దాడి చేస్తుందో తెలియడం లేదు” అని వజ్రాపుకొత్తూరు గ్రామానికి చెందిన మోహన్ కుమార్ బీబీసీతో చెప్పారు

ఫొటో సోర్స్, ugc
‘పరుగెత్తకూడదు, పడుకుండిపోవాలి, పొగ పెట్టాలి’
జంతువులు దాడి చేసినప్పుడు, దాడి చేసే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రామ్మెహన్ వివరించారు. ఏ జంతువుకైనా అగ్ని అంటే భయమని, అందుకే జంతువుల భయం ఉన్న ప్రాంతాల్లో తిరిగే వారు అగ్గిపెట్టె లేదా లైటర్‌ను తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఎలుగుబంటి, ఏనుగు, పులి ఏదైనా అగ్గి చూస్తే భయపడతాయని చెప్పారు.
“ఎలుగుబంటి ఎదురుపడి, తప్పించుకునే అవకాశం లేకపోతే పరుగెత్త కూడదు. అక్కడే నేలపై బార్ల పడుకుండిపోవాలి. అలా చేస్తే అది దాడి చేసినా వీపు భాగాన్ని గాయపర్చగలదు. అదే పొట్ట భాగం కనిపిస్తే చీరేస్తుంది. అది చాలా ప్రమాదం. అలాగే ఏనుగు నుంచి తప్పించుకోవాలంటే...అది వస్తుందని తెలియగానే ఎండు మిరపకాయల్ని మంటల్లో వేసి పొగ పెట్టాలి. ఆ వాసనకి ఏనుగు ఆ వైపుగా రాదు. ఏనుగుకి ఎంత దూరంలో ఉన్నా వాసనను పసిగట్టే గుణం ఉంది. ఇక పులి వస్తే చెట్టు ఎక్కేయాలి. పులి త్వరగా చెట్లు ఎక్కలేదు”అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, P. Rammohan Rao
‘పులి తిరిగి ఒడిశాకు వెళ్లిపోతూ ఉంది’
పులి ఒడిశా లకేరి అటవీ ప్రాంతం నుంచి వచ్చింటుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ 11న విజయనగరంలోని మెంటాడలో కనిపించిన పులి, మే 1న నర్సీపట్నంలోని నాతవరంలో కనిపించింది. అక్కడ పశువులపై దాడి చేసింది. ఆ తర్వాత మే 29న తూర్పో గోదావరి పత్తిపాడులో కనిపించి ఆ సమీప ప్రాంతాల్లోనే నెల రోజులు ఉంది. ట్రాప్‌కి చిక్కినట్లే చిక్కి మిస్సైంది. ఆ తర్వాత జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా తుని మీదుగా జూన్ 29న అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారమందింది.
“ఒడిశా అడవుల నుంచి ఆడ పులి కోసం ఇటువైపు వచ్చి ఉంటుంది. దీన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. రాత్రి సమయాల్లో పులి సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైట్ విజన్ పరికరాల ద్వారా దాని జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అలా కనిపించినప్పుడు పులికి కూడా మత్తు ఇంజక్షన్ ఇవ్వొచ్చు. కానీ ఆ మత్తులో ఏ కొండపైనుంచైనా అది పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీళ్లు, ఎత్తైన ప్రదేశాలు లేని చోట పులి కనిపిస్తేనే మత్తు ఇంజక్షన్‌ను దూరం నుంచి ప్రయోగిస్తాం”అని రామ్మోహన్ రావు చెప్పారు.
‘పులి ప్రవర్తన అర్థం కావడం లేదు’
‘‘ఒకరోజులో పులి 30 కిలోమీటర్ల రేడియస్‌లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. అలాగే పులిని పట్టుకునేందుకు దాని ప్రవర్తనను అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే దాని ప్రవర్తన అర్థం కాని విధంగా ఉంది’’అని పి. రామ్మెహన్ రావు చెప్పారు. పులి దినచర్య ఒకే ప్రాంతానికి రెండు, మూడు రోజులు కూడా పరిమితం కావడం లేదు. ఏరోజుకారోజూ కొత్త ప్రాంతానికి పులి పయనిస్తోంది.
‘‘కొన్ని రోజుల క్రితం వరకు రెండు పులులున్నాయనే అనుమానాలుండేవి, అయితే ప్రస్తుతం అది వచ్చిన, వెళ్తున్న దారిని బట్టి చూస్తే అది ఒకటే పులి అని అర్థమవుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో డ్రోన్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగించలేకపోతున్నాం. పైగా దానికి నివాసయోగ్యమైన కొండలు ఉండటం, అక్కడ మంచి ఆహారం పులికి లభిస్తుంది”అని రామ్మోహన రావు చెప్పారు.
‘పాదముద్రలే ఆధారం’
పులిని పట్టుకునేందుకు అటవీ శాకాధికారులు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. పైగా పులి కూడా ట్రాప్ వరకు వచ్చి...అక్కడ నుంచి అన్ని తెలిసినట్లే వెనక్కి వెళ్లడం జరిగింది. పులి చాలా తెలివితేటలు కల జంతువు. ట్రాప్‌కి చిక్కకుండా పులి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తిరుగుతుంది. ఈ క్రమంలో దాని పాదముద్రలే దాని గమనాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడుతాయి’’అని రామ్మెహన రావు చెప్పారు.
“ఏదైనా పగ్ మార్క్ (పాద ముద్ర) 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉంటే అది దాదాపుగా పులిదేనని చెప్పవచ్చు. చతురస్రాకారంలో ఉంటే అది మగ పులి అని, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే అది ఆడ పులి అని అర్థమవుతుంది. 14 సెం.మీ. ఉండే అది పెద్ద పులే. అయితే ఈ ముద్రలు పొడి నేలలో అయితే రెండు రోజులు, తడి నేలలో అయితే దాదాపు నెల రోజుల వరకు ఉంటాయి. అలాగే పులి ఒకసారి ఆహారం తింటే మళ్లీ వారం రోజుల వరకు తినదు. మనుషులపై దాడి చేయదు. కేవలం పశువులు, జింకలనే వేటాడుతుంది.” అని చీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రామ్మెహన్ తెలిపారు.
‘ఈ జంతువులకు ప్రోటోకాల్ ఉంటుంది’
పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు అన్నీ వన్యప్రాణుల (క్షణ)చట్టం, 1972 కిందకు వస్తాయి. జనావాసాల్లో పులి, ఎలుగుబంటి, ఏనుగులు కనిపించినప్పుడు వాటిని మూకుమ్మడిగా అంతా కలిసి చంపడం, లేదా గాయపర్చడం ఈ చట్ట ప్రకారం నేరం. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలకు అందోళన కలిగిస్తున్న వన్య ప్రాణులను పట్టుకోవడానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తారు.
“పాత రోజుల్లో ఏనుగుల్ని పట్టుకోవాలంటే పెద్ద, పెద్ద గోతులు తీసి వాటిలో అవి పడేటట్లు చేసేవారు. వాటిని జాగ్రత్తగా బయటకు తీసి మచ్చిక చేసుకునే వాళ్లు. ఇప్పుడు ఏదైనా ఏనుగు జనావాసాల్లో కనిపిస్తే దానిని పట్టుకునేందుకు శిక్షణ పొందిన మరో ఏనుగుని వదులుతారు. ఈ ఏనుగు దానిని మచ్చిక చేసుకుని తీసుకుని వస్తుంది. దానిని అటవీశాఖ అధికారులు నిర్ణీత అటవీ ప్రాంతంలో తిరిగి వదిలేస్తారు”అని రామ్మోహన్ రావు చెప్పారు.
“జనాలకు ప్రాణాపాయం ఉన్న పరిస్థితులు ఉంటే వాటిని పట్టుకునేందుకు ట్రాంక్వలైజర్స్ వాడతాం. కానీ చాలా సార్లు వీటిని వాడడానికి ఇష్టపడం. ఎందుకంటే ఏనుగు, పులి, ఎలుగుబంటికి మత్తు మందు ఇవ్వడం కష్టం. ఎందుకంటే అవి కదులుతూ ఉంటాయి. పైగా కొన్ని సార్లు మత్తు ఎక్కించినా, మత్తుసరిపోక, మత్తు వీడిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించి చనిపోయిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే ట్రాంక్విలైజ్ చేయం. ఇటు ప్రజలు, అటు వన్య ప్రాణులు రెండూ ముఖ్యమే” అని రామ్మెహన్ తెలిపారు.
‘‘అందుకే అవి ఎలాగైతే వచ్చాయో, అలాగే అవి వచ్చిన ప్రాంతానికి వెళ్లేపోయే విధంగా వాటికి అవకాశమిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ వాటిని చూసి భయపడిపోయి, గందరగోళానికి గురై ఏదైనా హడావిడి చేస్తే ప్రాణాలకు నష్టం వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














