AbortionLaw: అబార్షన్లు చేయించుకోవద్దని నిజంగా బైబిల్‌లో ఉందా, సమర్ధించేవారు ఏమంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎడిసన్ వీగా
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ దేశాల్లోని చాలావరకు మతాలకు ఆధారమైన బైబిల్‌లో అబార్షన్‌ల గురించి చూచాయగా ప్రస్తావించారు. భిన్నరకాల వాదనలు, వివరణలు దీని నుంచి పుట్టుకొస్తున్నాయి.
మతాచారాలను విశ్వసించే వ్యక్తుల్లో చాలా మంది అబార్షన్‌లను పాపంగా పరిగణిస్తారు. దీన్ని దైవానికి వ్యతిరేకమైన చర్యగా చెబుతారు. దీని కోసం ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లోని రెండు పేరాలను వారు ఉటంకిస్తుంటారు.
ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లోని యిర్మియా ప్రవక్త క్రీ.పూ. ఏడో శతాబ్దంలో చెప్పినట్లుగా ఉన్న వ్యాఖ్యలను వారు ఎక్కువగా ఉదహరిస్తుంటారు. ‘‘గర్భాశయంలో నువ్వు రూపుదిద్దుకోకముందు నుంచే నాకు తెలుసు. నేను ఎప్పుడో నిన్ను పరిశుద్ధుడిని చేశాను’’అని దేవుడు చెప్పినట్లుగా ఆ పేరాలో పేర్కొన్నారు.
మరోవైపు బైబిల్‌కు అనుబంధంగా ఉండే గీతాల్లోనూ పుట్టకకు ముందు జీవితం గురించి రాశారు.
దేవుడిని స్తుతిస్తూ 139వ గీతంలో ఇలా రాశారు. ‘‘నువ్వు పూర్తిగా రూపుదిద్దుకోకముందే నీ కళ్లు నా శరీరాన్ని చూశాయి. నీ పుస్తకంలో నేను అన్నీ ముందే రాశాను’’అంటూ ఆ గీతం సాగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కడ మొదలవుతుంది?
ఈ అంశంపై కొందరు నిపుణులతో బీబీసీ మాట్లాడింది. జీవితం ఎక్కడ మొదలవుతుంది? అనే ప్రశ్నకు ఫిలాసఫీ నుంచి మొదలైన సమాధానాలు బయాలజీ వరకు వెళ్లాయి.
‘‘మానవ జీవితం విలువను నొక్కి చెబుతూ అబార్షన్ల గురించి బైబిల్‌లో ప్రస్తావించారు. తల్లి గర్భాశయంలో పుట్టకముందే దేవుడు మనల్ని సృష్టించాడు’’అని సవ్‌పాలో పొంటిఫికల్ క్యాథలిక్ యూనివర్సిటీ(పీయూసీ-ఎస్‌పీ)కి చెందిన థియాలజీ మాస్టర్ ఫాదర్ రెనాటో గోన్జాల్వేజ్ డా సిల్వా చెప్పారు.
‘‘ఇక్కడ ప్రసవానికి ముందు అనే వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మానవ జీవితం అనేది దేవుడి ఆజ్ఞ. ఆయన సర్వాంతర్యామి. కడుపులో ఉన్నప్పుడే మనల్ని ఆయన పరిశుద్ధులను చేశాడు’’అని సిల్వా చెప్పారు.
మానవ సృష్టి అనేది దైవిక చర్య అని ఆయన నొక్కి చెప్పారు. చుట్టుపక్కల ప్రపంచంలో పరిస్థితులతో సంబంధం లేకుండా మనం దేవుడి ఆజ్ఞను శిరసావహించాలని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మిగతావారు ఏమంటున్నారు?
బైబిల్‌లోని పాత నిబంధనలో పేర్కొన్న అంశాలతోపాటు గీతాల్లో చెప్పిన అంశాలపై మెకింజీ ప్రెస్బిటేరియన్ యూనివర్సిటీకి చెందిన చరిత్రకారుడు, ఫిలాసఫర్, థియోలజియన్ గెర్సన్ లీట్ డే మోరేస్ కూడా స్పందించారు.
‘‘ఇక్కడ పూర్తిగా రూపుదిద్దుకోని జీవం గురించి ప్రస్తావించారు. అంటే అక్కడ జీవం ఉందని చెబుతున్నారు. కానీ, అసలు ప్రశ్న ఏమిటంటే? ఈ జీవాన్ని వ్యక్తిగా గుర్తించాలా? వద్దా? అసలు జీవం ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేదే ప్రశ్న’’అని మోరేస్ వ్యాఖ్యానించారు.
‘‘అబార్షన్లను వ్యతిరేకించేవారు మొదటగా చెప్పే మాట ఏమిటంటే.. కడుపులో గర్భధారణ అయినప్పటి నుంచే పిండాన్ని వ్యక్తిగా చూడాలని అంటారు. ఇదంతా దేవుడే సృష్టించాడని, దీనిలో దేవుడు ఆత్మను ప్రవేశపెట్టాడని, దీనిపై అన్ని హక్కులూ దేవుడికే ఉంటాయని అంటారు’’అని ఆయన అన్నారు.
‘‘దేవుడికి గతం, ప్రస్తుతం, భవిష్యత్ అన్నీ తెలుసు. దీని ప్రకారం.. అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న దైవ ప్రసాదాన్ని హత్య చేయడం నేరం అని అంటారు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ వివరణ అనేది ఇప్పటిది కాదు. దీన్ని సమర్థిస్తూ చాలా ఫిలాసఫీ పుస్తకాలు కూడా వచ్చాయి.
ఇదే కోణంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ (క్రీ.పూ.384 నుంచి క్రీ.పూ.322) ప్రతిపాదించిన ‘‘ద మెటాఫర్ ఆఫ్ ద సీడ్’’ కూడా ఉంటుందని మోరేస్ వివరించారు.
‘‘ఆ విత్తనానికి చెట్టుగా మారే శక్తి ఉంటుంది. ఇదే విధానం మనుషులకూ వర్తిస్తుంది. గర్భధారణ సమయంలో కాళ్లు, చేతులు, కళ్లు రూపుదిద్దుకోనప్పటికీ, ఈ పిండానికి పూర్తి మనిషిగా మారే శక్తి ఉంటుంది. ఎందుకంటే తొమ్మిది నెలల్లో ఈ పిండం నుంచి పూర్తి జీవం బయటకు వస్తుంది’’అని ఆయన చెప్పారు.
అబార్షన్ల గురించి బైబిల్‌లో పేర్కొన్న వాక్యాలకు భిన్నరకాల వివరణలు ఉన్నాయనే వాదనను మోరేస్ కూడా అంగీకరించారు. అయితే, ఇవన్నీ కడుపులోని జీవంపై హక్కు ఎవరికి ఉంటుందనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంటాయని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
హక్కు ఎవరికి?
అబార్షన్‌ను నేరపూరిత చర్యగా చెప్పేందుకు బైబిల్‌లోని అంశాలను ఉపయోగించుకోకూడదని ద నెట్‌వర్క్ ఆఫ్ క్యాథలిక్స్ ఫర్ ద రైట్ టు డిసైడ్ సంస్థ చెబుతోంది. సెక్సువల్, రీప్రొడక్టివ్ హక్కుల కోసం సంస్థ పోరాడుతోంది.
‘‘అబార్షన్ అనేది బైబిల్ అంశం కాదు. సామాజిక నిబంధనలు, జీవితానికి సంబంధించిన సూత్రాలు బైబిల్‌లో పేర్కొన్నారు’’అని సోషయాలజిస్టు, పీయూసీ-ఎస్‌పీ ప్రొఫెసర్ మారియా జోస్ రోసాడో చెప్పారు.
‘‘బైబిల్ మన జీవితంపై పూర్తి హక్కులను మనకు ఇస్తోంది. ఇక్కడ పూర్తి హక్కులు అంటే సెక్సువాలిటీతోపాటు రీప్రొడక్టివ్ హక్కులు కూడా ఉంటాయి’’అని ఆమె చెప్పారు.
‘‘అబార్షన్లు చేయించుకునే హక్కును అడ్డుకోవడానికి బైబిల్‌లో కొన్ని వ్యాఖ్యలకు ఫండమెంటలిస్టు, కన్జర్వేటివ్, నియోకన్జర్వేటివ్ సంస్థలు తమకు అనుకూలంగా వివరణ ఇస్తున్నాయి’’అని మారియా అన్నారు.

ఫొటో సోర్స్, Thinkstock
‘‘ఇక్కడ బైబిల్‌ను మధ్యలోకి తీసుకురావడంలో ఎలాంటి అర్థమూ లేదు. దీనికి బదులు మానవ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేలా బైబిల్‌లో వాక్యాలకు వివరణలు ఇవ్వాలని ఫెమినిస్టు థియోలాజియన్లు చెబుతున్నారు’’అని ఆమె చెప్పారు.
‘‘బైబిల్‌లో నేరుగా అబార్షన్ల గురించి ప్రస్తావించలేదు. గర్భస్రావాలను అడ్డుకోవాలని కూడా ఎక్కడా చెప్పలేదు. గర్భంలో జీవం ఎలా పుడుతుంది? పుట్టక ముందు నుంచే దేవుడు ఎలా ప్రేమ చూపిస్తున్నాడు? లాంటి అంశాలకు తమదైన శైలిలో వివరణలు ఇస్తున్నారు’’అని సవ్‌పాలో ఫెడరల్ యూనివర్సిటీ రీసెర్చర్ థియాగో మేర్కి చెప్పారు.
‘‘వీటినే చాలా మంది మత విశ్వాసులు తమకు అనుకూలంగా వివరిస్తున్నారు. అబార్షన్ అనేది నేరమని చెబుతున్నారు’’అని ఆయన అన్నారు.
‘‘ఇది బైబిల్‌లో వాక్యం కాదు. ఆ వాక్యానికి వివరణ మాత్రమే. చాలాసార్లు ఆ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వాక్యాలకు వివరణలు, భాష్యాలు ఇస్తున్నారు’’అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Alamy
ఎలా చూడాలి?
కొత్తగా పుట్టుకొస్తున్న ఈ వివరణలు, భాష్యాలు.. బైబిల్ పరిణామక్రమంలో భాగంగా వచ్చినవేనని బయాలజిస్టు, సోషియాలజిస్టు ఫ్రాన్సిస్కో బార్బా రీబెరియో నేటో చెప్పారు. పీయూసీ-ఎస్‌పీలో ఫెయిత్ అండ్ కల్చర్ విభాగం కోఆర్డినేటర్‌గా ఆయన పనిచేస్తున్నారు.
‘‘క్యాథలిక్కులు మొదట్నుంచీ అబార్షన్‌లను వ్యతిరేకిస్తున్నారు. గర్భస్రావాన్ని వారు హత్యగానే పరిగణిస్తున్నారు. అయితే, గర్భధారణకు సంబంధించిన శాస్త్రీయ అవగాహన మారుతూ వస్తోంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో అబార్షన్లను పూర్తిగా నిషేధించాలని పాత గ్రంథం(ఓల్డ్ టెస్ట్‌మెంట్)లో ఎక్కడా పేర్కొనలేదు’’అని ఆయన వివరించారు.
‘‘ఇలా నిషేధం గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో మధ్యయుగంలో చాలా మంది క్రైస్తవులు గర్భస్రావాలకు మద్దతు పలికేవారు. అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. నిషేధం విధించాలంటూ డిమాండ్లు చేస్తున్నవారు కూడా మారాలి’’అని ఆయన అన్నారు.
‘‘కొంతమంది క్యాథలిక్‌లమని గర్వంగా చెప్పుకుంటారు. అయినప్పటికీ అన్ని విషయాల్లోనూ చర్చితో వారు ఏకీభవించరు. నేటి ప్రపంచంలో భిన్నత్వానికి మనం ఇచ్చే ప్రాధాన్యంతో ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇండివిడ్యులిజం, ఇండివిడ్యువల్ అటానమీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ సిద్ధాంతాలు అబార్షన్ హక్కులను నొక్కి చెబుతున్నాయి’’అని ఆయన వివరించారు.
‘‘ఒకప్పుడు కడుపులోని బిడ్డను కూడా పూర్తి మనిషిగా భావించేవారు. కానీ, ఇప్పుడు కడుపులోని బిడ్డ కంటే తల్లి హక్కులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ కడుపులోని బిడ్డ హక్కులు తల్లి హక్కులకు లోబడి ఉంటాయి’’అని నేటో చెప్పారు.
‘‘సాంస్కృతికంగా వచ్చే మార్పులు క్యాథలిక్ సిద్ధాంతాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. దీంతో కొన్ని క్యాథలిక్ వర్గాలు ఈ మార్పులను స్వాగతిస్తున్నాయి’’అని ఆయన చెప్పారు.
అయితే, పుట్టకముందు నుంచే మనిషి జీవితానికి చాలా విలువ ఉంటుందని ఫాదర్ సిల్వా నమ్ముతున్నారు. ‘‘ఇది దేవుడు ఇచ్చిన బహుమతి’’అని ఆయన అంటున్నారు. ‘‘దేవుడు నిన్ను సృష్టించాడు. కడుపులో ఉన్నప్పుడే నీకు రూపునిచ్చాడు’’అని యెషయా ప్రవక్త వ్యాఖ్యలను ఆయన ఉటంకిస్తున్నారు.
మనుషులందరినీ దేవుడు ఎలా సృష్టించాడో ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయని సిల్వా అంటున్నారు. ‘‘బైబిల్‌ను నమ్మేవారు కడుపులో ఉన్నప్పటి నుంచే బిడ్డకు అన్ని హక్కులు ఉంటాయని, ఆయన దేవుడి కుమారుడని భావిస్తారు’’అని ఆయన అంటున్నారు.
అయితే, బైబిల్‌లో ఈ విషయాన్ని చూచాయగా ప్రస్తావించారనే విషయాన్ని ఆయన అంగీకరించారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.
‘‘బైబిల్ లాంటి పవిత్ర గ్రంథాలలో మానవ జీవితం పవిత్ర గురించి ఎక్కువ నొక్కి చెబుతారు. మంచి మాటలతోనే అబార్షన్లు తప్పని చెప్పేందుకు ప్రయత్నిస్తారు. మరోవైపు దీన్ని తప్పు అని గొప్ప వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్‌ను చదివేవారికి ఇది అర్థం అవుతుంది’’అని ఆయన అన్నారు.
ప్రాచీన క్రైస్తవులు అబార్షన్లను నేరంగా పరిగణించేవారా? మొదటి శతాబ్దంలో రాసిన డీడకే గ్రంథంలో అబార్షన్లను నేరంగా పేర్కొన్నారు. దీన్ని గురించి సిల్వా మాట్లాడుతూ.. ‘‘మొదటి శతాబ్దంనాటి క్రైస్తవులు అబార్షన్లను నేరంగా పరిగణించేవారు. అప్పట్లో గ్రీకులు, రోమన్లలో అబార్షన్లు ఎక్కువగా జరిగేవి’’అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అమ్మాయి పెళ్లికి రూ.71 లక్షలు పొందే మార్గం ఇది
- కండోమ్ వాడకంపై ఏపీ, తెలంగాణ పురుషులు ఏమంటున్నారు?
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- ప్రేమలో పడిపోవడం సరే, మరి బయటపడడం ఎలా? 18వ శతాబ్దికి చెందిన ఓ సన్యాసి చెప్పిన రహస్యాలు
- జగనన్న కాలనీలు: నిర్మాణ సమస్యలపై లబ్ధిదారులు ఏమంటున్నారు, కొందరు పట్టాలు వెనక్కి ఇచ్చేస్తున్నారెందుకు?
- అల్లూరి సీతారామరాజు: బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంగారు పెట్టించిన మన్యం వీరుడు, 27 ఏళ్లకే ఎలా కన్నుమూశారో తెలుసా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














