క్రిస్మస్: బైబిల్‌ను తొలిసారిగా తెలుగులోకి అనువాదం చేసింది విశాఖపట్నంలోనేనా?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలోని ఓ చర్చి గంటకు 'ఆనంద సునాద్' అనే ఓ కన్నడ వ్యక్తి పేరును పెట్టారు.
క్రైస్తవులు పవిత్రంగా భావించే బైబిల్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడంలో చేసిన కృషికి గుర్తుగా ఆ వ్యక్తి పేరును ఆ గంటకు పెట్టారు.
‘‘బైబిల్ తొలి తెలుగు అనువాదానికి వేదిక విశాఖపట్నమే. విశాఖ రేవు పట్టణం కావడంతో ఇక్కడికి వందల సంవత్సరాలుగా వ్యాపారం కోసం అనేక మంది వచ్చేవారు. అలా వచ్చిన వారు తమ వ్యాపారంతో పాటు మతాన్ని కూడా వ్యాపి చేసేవారు. ఆంగ్లేయులు కూడా ఇలాగే చేశారు. వర్తకంతో పాటు క్రైస్తవ మత వ్యాప్తి కోసం కూడా బ్రిటిష్ అధికారులు పని చేసేవారు’’ అని ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం రిటైర్డ్ ఫ్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.
"వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా, మతాన్ని వ్యాప్తి చేయాలన్నా స్థానికులతో కలిసిపోవాలనే విషయాన్ని వారు గమనించారు. అందుకోసం తెలుగును సైతం నేర్చుకున్నారు. తెలుగులోనే మత భోధనలు చేసేవారు. అప్పటీకే విశాఖ పెద్ద నగర హోదా కలిగి ఉండేది. అప్పట్లో నిమ్నవర్గాల కంటే అగ్రవర్ణాల వారే క్రైస్తవం పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యేవారు. అప్పడున్న జమిందారీ వ్యవస్థ కూడా అందుకు కారణం’’ అని ఆయన అన్నారు.
‘‘స్త్రీ విద్య, ఆంగ్ల భాష వారిని ఆకర్షించేవి. 1800 సంవత్సరం నుంచి క్రైస్తవ మిషనరీల తాకిడి ఎక్కువైంది. బైబిల్‌ను తెలుగులో అచ్చు వేయించడం ద్వారా మరింత ఎక్కువ మందిని ఆకర్షించి...తమ మతాన్ని విస్తరించే అవకాశం ఉందని అప్పటీ మిషనరీలు భావించాయి" అని వివరించారు.

ఎవరీ ఆనంద రాయర్?
"1805లో విశాఖ కేంద్రంగా ఆంగ్గేయుల వర్తక, వ్యాపారాలు మొదలయ్యాయి. అదే సమయంలో విశాఖకు వచ్చిన మిషనరీలు కూడా బైబిల్ తెలుగు అనువాదంపై దృష్టి పెట్టాయి. అప్పటి జమీందార్ల మద్దతు లభించడంతో మిషనరీల కార్యకలాపాలు విస్తృతంగా సాగాయి. అందులో భాగంగా అగస్టస్ డెస్ గ్రాంజెస్, జార్జ్ క్రాన్‌లు విశాఖ వచ్చారు. ఇక్కడ ఉంటున్న బ్రిటిష్ సైనికాధికారులకు ఆరాధన కార్యక్రమాలు నిర్వహించేవారు. వారిద్దరూ కొద్ది కాలానికే తెలుగును బాగా నేర్చుకున్నారు. అనంతరం బైబిల్‌ను తెలుగులోకి అనువదించే కార్యక్రమానికి పూనుకున్నారు" అని ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు.
"వారికి అప్పటీకే విశాఖలో ఉంటున్న టిప్పు సుల్తాను సంస్థానంలో ఉన్నతోద్యోగిగా ఉన్న సుబ్బారాయర్ సహాయం చేశారు. అతను క్రైస్తవ మతం స్వీకరించి, పేరు మార్చుకుని ఆనంద రాయర్‌గా మారారు. ఆనంద రాయర్ కన్నడిగుడైనా, తెలుగు మీద మంచి పట్టుంది. అంతే కాకుండా స్థానిక మండలీకం, వాడుక పదాలపై మంచి పట్టు సంపాదించారు. దాంతో క్రైస్తవ భక్తి సాహిత్యంలో స్థానిక తెలుగు వాడుక భాషని బైబిల్ అనువాదంలో వినియోగించారు. ఆయన గౌరవార్థం విశాఖ చర్చి గంటకు 'ఆనంద సునాద్' అని పేరు పెట్టారు" అని సూర్యనారాయణ వివరించారు.

అనువాదానికి ఆటంకాలు
‘‘క్రైస్తవ మతగ్రంథం బైబిల్ తెలుగులో అనువాదమై 200 సంవత్సరాలు దాటింది. ఈ అనువాద కార్యక్రమానికి వేదిక విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ ప్రాంతమే. ప్రస్తుతం ఉన్న సీబీఎం హై స్కూల్ ప్రాంగణాన్ని మిషన్ గార్డెన్/బంగ్లా అనేవారు. ఇందులోనే గ్రీకు నుంచి తెలుగులోకి బైబిల్ అనువాదం జరిగింది. ఇది బైబిల్ కొత్త నిబంధన గ్రంథం. ఈ అనువాద ప్రక్రియ అంత సులువుగా జరగలేదు’’ అని చరిత్ర పరిశోధకులు ఎడ్వార్డ్ పాల్ బీబీసీతో చెప్పారు.
"క్రైస్తవ మిషనరీల తరఫున బైబిల్ తెలుగు అనువాద కార్యక్రమం చురుగ్గా చేస్తున్నఅగస్టస్ డెస్ గ్రాంజెస్ 1809, జార్జ్‌క్రాన్ 1810లో మరణించారు. అప్పటికే కొంత భాగం అనువాదం పూర్తయ్యింది. ఆ అనువాద భాగాలైన ముత్తయి, మార్క్, లూకా అధ్యాయాలు పూర్తయ్యాయి. అయితే బెంగాల్‌లోని సీరాంపూర్‌లో అన్ని స్థానిక భాషల్లో బైబిల్‌ను ముద్రించే పనిలో ఉన్నారు విలియం కేరీ. నాలుగు భాగాలుగా ఉన్న అనువాదంలో మూడు భాగాలను చనిపోయిన డెస్ గ్రాంజెస్, జార్జ్ క్రాన్ జ్ఞాపకార్థం ముద్రించాలని విలియం కేరీ భావించారు. దీంతో పూర్తయిన మూడు అధ్యాయాలు 1812లో విలియం కేరీ ఆధ్వర్యంలోని మిషనరీ ప్రెస్‌లో ముద్రించారు. ఆనంద్ రాయరే స్వయంగా అనువాదాలను తీసుకుని వెళ్లి ముద్రించి మళ్లీ విశాఖకు తీసుకుని వచ్చారు. బైబిల్‌కి సంబంధించిన కొంత భాగం మొట్ట మొదటి సారి తెలుగులో ముద్రణ శ్రీరాంపురం (సీరాంపూర్, బెంగాల్)లో జరిగింది" అని పాల్ చెప్పారు.

‘విశాఖ అనువాదమే బెస్ట్’
"ఆ తరువాత లండన్ మిషనరీ నుంచి వచ్చిన గార్జెన్, ప్రిట్జెట్‌లు మిగతా భాగాన్ని అనువాదం చేయడం ప్రారంభించారు. ఆనంద్ రాయర్ వీరికి కూడా సహాయం చేశారు. వీరు అనువాద కార్యకలాపాలన్నీ ప్రస్తుతం నగరంలో ఉన్న ఎల్‌ఎంఎం (లండన్ మిషనరీ మెమోరియల్) చర్చి కేంద్రంగా కొనసాగించారు" అని ఎడ్వార్డ్ పాల్ చెప్పారు.
"మరో వైపు బైబిల్‌ను అన్ని భాషల వారికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ''బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ'' అనే సంస్థ లండన్‌లో ఏర్పడింది. బైబిల్ అనువాదాలు, పంపిణీ చేసే ఇతర సొసైటీలకు ఈ సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుంది. ఈ బ్రిటిష్ సంస్థకు అనుబంధంగా భారత్ లో 1811లో కలకత్తాలో బైబిల్ సొసైటీ ఏర్పడింది. ఈ సమయంలోనే సీరాంపూర్‌లోనూ, విశాఖపట్నంలోనూ బైబిల్ తెలుగు అనువాదాలు కొనసాగుతూ వచ్చాయి. రెండు అనువాదాలూ 1818 నాటికి పూర్తయ్యాయి" అని ఆయన వివరించారు.
"రెండు అనువాదాలను కలకత్తా బైబిల్ సొసైటీ ఆమోదం కోసం పంపారు. ఆ ప్రతులను మద్రాసులోని తెలుగు పండితులుగా పేరుపొందిన థామ్సన్, క్యాంప్ బెల్‌లతో పాటు మరో తెలుగు పండితుడికి పంపించారు. వారిద్దరూ విశాఖపట్నంలో గ్రీకు బాష నుంచి తెలుగులోకి అనువాదమే బాగుందని తీర్మానించారు. వాడుక బాషలో ఉండటం అనేది దీనికి కలిసొచ్చిన అంశం. ఈ ఘనత అంతా ఆనంద రాయర్‌కే చెందుతుంది. దీంతో విశాఖ ప్రతినే ఎడ్వార్డ్ ప్రిచ్జెట్ ఆధ్వర్యంలో మద్రాసులో ముంద్రించారు. అలా నాలుగు అధ్యాయాలతో కూడిన పూర్తి తొలి తెలుగు బైబిల్ అనువాదం విశాఖలో జరిగి, ముద్రణ మద్రాసులో పూర్తి చేసుకుంది. 1818 నాటి ఈ తెలుగు బైబిల్, వాడుక భాషలో ముద్రణ జరిగిన తొలి పుస్తకంగా చెప్పవచ్చు" అని ఎడ్వార్డ్ పాల్ చెప్పారు.

ఇప్పుడెక్కడుంది?
విశాఖలో బైబిల్ తొలి తెలుగు అనువాదం జరగడం, అందులోనూ ఎల్ఎంఎం చర్చి దానికి వేదిక కావడం చాలా ఆనందంగా ఉందని, అలాగే బైబిల్ తెలుగులో ముద్రణ జరిగి 202 ఏళ్లు పూర్తి చేసుకోవడం కూడా గర్వంగా అనిపిస్తోందని ఎల్ఎంఎం చర్చి కార్యదర్శి సదానంద్ మోజెస్ అన్నారు.
తొలిసారి తెలుగులో ముద్రితమైన బైబిల్ కాపీలు ఇప్పుడెక్కడున్నాయనే విషయంపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.... "1818లో బైబిల్ కొత్త నిబంధన మొత్తం రెండు భాగాలుగా ముద్రణ జరిగింది. అయితే ముద్రణ తరువాత వాటిని మళ్లీ 15 ఏళ్ల కిందట విశాఖ లండన్ మిషనరీ మెమోరియల్ చర్చికి తీసుకొచ్చారు. 2005లో ఎల్ఎంఎం చర్చి ద్విశతాబ్ది ఉత్సవాలకు లండన్ నుంచి వచ్చిన డిక్కర్ అనే వ్యక్తి నెదర్లాండ్స్‌లో భద్రపరచిన తెలుగు బైబిల్‌ను తీసుకొచ్చి చర్చికి బహుమతిగా ఇచ్చారు" అని గుర్తు చేశారు.

"అప్పటీకే 185 ఏళ్ల గడిచిన ఆ పుస్తకం లెదర్ బైండ్‌తో ఉన్నా చాలా పాతది కావడంతో పేజీలు చాలా పెళుసుగా తయారయ్యాయి. పేజీ తిప్పితే విరగిపోతున్న దశలో ఉన్న ఈ ప్రతిని భద్రపరిచేందుకు బెంగళూరులోని యునైటెడ్ థియలజికల్ కళాశాలకు పంపారు. విశాఖలోని చర్చిలో ప్రస్తుతం ఆ ప్రతి జిరాక్స్ ప్రదర్శనలో ఉంది" అని సదానంద్ చెప్పారు.
"విశాఖలో ముద్రణ లేకపోవడంతో 1818లో తెలుగు బైబిల్‌ను మద్రాసులో ముద్రించారు. 1860లో పాత నిబంధనతో సహా కొత్త నిబంధన గ్రంథాన్ని విశాఖలోనే ముద్రించారు. 1818 బైబిల్ కొన్ని మార్పులకు గురైనా ఇప్పటికీ తెలుగు బైబిల్‌కు ప్రమాణికంగా దీన్నే తీసుకుంటారు" అని తెలిపారు.
TELOOGOO, TELINGA
తెలుగుని ఆంగ్లేయులు 'తెలింగ' అని అనేవారు. దానికి ఆధారమే 1812లో అచ్చయిన బైబిల్ కవర్ పేజీపై ఉన్న చేతిరాత వాక్యాలు. అలాగే తెలుగు అనే పదాన్ని ఇంగ్లీషులో రాసేటప్పుడు TELOOGOO అని రాసేవారు. 1818లో ముద్రించిన కొత్త నిబంధన రెండు సంపుటాల్లోనూ అదే కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- తెలుగు బైబిల్‌కి 200 ఏళ్లు
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్‌దేవ్ ‘కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












