నూర్ హుస్సేన్: ఒక్క ఫొటో ఒక నియంత మెడలు వంచి, బంగ్లాదేశ్ చరిత్రను ఎలా మలుపుతిప్పిందంటే..

ఫొటో సోర్స్, DINU ALAM
అది 1987. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్న ఒక యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. బుల్లెట్ గాయం ఉన్న అతడి శవాన్ని జైల్లో పడేశారు. అదే యువకుడి ఒక ఫొటో ఆ విప్లవం దిశనే మార్చబోతోందని, నియంత మెడలు వంచబోతోందని ఎవరూ ఊహించలేదు.
అదే రోజు ఆ ఫొటోలోని వ్యక్తి శవం ఉన్న పక్క సెల్‌లో బీబీసీ ప్రతినిధి మోజ్జమ్ హుస్సేన్ ఉన్నారు. ఫొటోలో ఉన్న యువకుడికి సంబంధించిన వాస్తవాలను, అతడి మొత్తం కథను ఆయన వివరించారు.
1987 నవంబర్ 10 వరకూ ఒక వారంపాటు ఢాకా నగరం అట్టుడికింది. అధ్యక్షుడు హుస్సేన్ మహమ్మద్ ఇర్షాద్ రాజధాని ఢాకాకు, దేశంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలను తెంచేశారు. విద్యా సంస్థలు మూసేశారు.
రాజకీయ వ్యతిరేక ప్రదర్శనలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఇర్షాద్ ఒక సైనిక నియంత. ప్రజాస్వామ్య మద్దతుదారులను, కార్యకర్తలను జైల్లో పెట్టడానికి ఆయన తన అత్యవసర శక్తులను ఉపయోగిస్తున్నారు.
మరోవైపు, రాజీనామా చేసేలా అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకురావడానికి అటు మిగతా రాజకీయ శక్తులు వేల సంఖ్యలో మద్దతుదారులను కూడగడుతున్నాయి. నవంబర్ 10న ఉదయం నేను ఆ వేలాది కార్యకర్తల్లో ఒకరుగా ఉన్నాను.
ఉదయం 9 గంటలకు నన్ను, మిగతా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మమ్మల్ని దారుణంగా కొట్టి, ఒక లారీలో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు.
రోజులు గడిచేకొద్దీ రాజకీయ ఖైదీల సంఖ్య పెరుగుతోంది. ఢాకాలో అక్కడక్కడా హింసాత్మక ఘర్షణలు జరిగేవి.
కొంతమంది ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిపారు. వారి శరీరాలపై లోతైన గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిని కొందరిని సెల్లో వేశారు. ఆ శవాల మధ్య అర్ధనగ్నంగా ఉన్న ఒక యువకుడి శరీరం ఉంది. దానిపై నినాదాలు రాసున్నాయి. నిర్జీవంగా ఉన్న అతడి చామనచాయ శరీరంపై తెల్ల రంగులో మెరిసే మాటలు మాలో ఒక మరింత శక్తిని నింపాయి.
అతడి చాతీపై బంగ్లాలో "సాయరాచార్ నితపత్ జక్"(నిరంకుశత్వం నశించాలి) అని రాసి ఉంది. అతడి పేరు నూర్ హుస్సేన్.
అతడు ఎవరో మాకు అప్పటివరకూ తెలీదు. ఆ యువకుడిపై కాల్పులు జరిగిన ప్రాంతానికి భవిష్యత్తులో అతడి పేరే పెడతారని, ఆ యువకుడి త్యాగం, బలిదానం శాశ్వతంగా నిలిచిపోతుందని, అతడిపై పుస్తకాలు, కవితలు రాస్తారని, సినిమాలు వస్తాయని ఊహించలేదు. అతడి పేరున పోస్టల్ స్టాంప్ విడుదలవుతుందని కూడా మాకు అప్పుడు తెలీదు.
నూర్ చనిపోయే కొన్ని క్షణాల ముందు తీసిన అతడి ఒక ఫొటో బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం కోసం, మా కొత్త తరం కోసం జరిగిన రక్తసిక్త పోరాటానికి ఒక చిహ్నంగా మిగిలిపోతుందని మేం అనుకోలేదు.

ఫొటో సోర్స్, PAVEL RAHMAN
ప్రజాస్వామ్య పోరాటాలకు స్ఫూర్తి
నేను గత 33 ఏళ్లలో నూర్ హుస్సేన్ ఫొటోలు ఎన్నోసార్లు చూశాను. వాటిలో అతడి దృఢ నిశ్చయం కనిపిస్తుంది. అతడి శరీరంపై రాసిన నినాదాలు ఎండలో కూడా మెరుస్తున్నట్టు ఉంటాయి.
చనిపోయే సమయానికి నూర్ వయసు 26 ఏళ్లు. అతడు చనిపోయిన తర్వాత రోజు నూర్ ఫొటోలు బంగ్లాదేశ్ పత్రికల్లో మొదటి పేజీల్లో కనిపించాయి. అవి అప్పటి ప్రభుత్వానికి షాక్ ఇవ్వడంతోపాటూ, కొన్ని లక్షల మందిలో స్ఫూర్తి నింపాయి.
1987లో నూర్ పాల్గొన్న ఒక వ్యతిరేక ప్రదర్శనను హింసాత్మకంగా అణచివేశారు. కానీ, మూడేళ్ల తర్వాత జనం మరోసారి ఆందోళనకు దిగారు. అధ్యక్షుడు ఇర్షాద్ మెడలు వంచడంలో విజయం సాధించారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న చాలామంది నిరసనకారులు నూర్ హుస్సేన్ ఫొటో నుంచే పోరాట స్ఫూర్తిని పొందారు.
ఢాకాలో ఒక కార్మిక కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో ఎందుకు పాల్గొన్నాడు అని నేను అప్పుడప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను.
నియంతృత్వానికి వ్యతిరేకంగా నూర్ స్ఫూర్తితో తిరుగుబాటు మొదలైంది. అతడి 30వ వర్ధంతి రోజు నేను నూర్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకాలని ప్రయత్నించాను.

నూర్ హుస్సేన్ తండ్రి ముజీబుర్ రహమాన్ అప్పట్లో ఢాకా ఓల్డ్ సిటీలో ఆటో నడిపేవాడు. ఆయన 15 ఏళ్ల క్రితం చనిపోయారు. కానీ, నేను నూర్ సోదరుడు అలీని కలిశాను. ఆయన నూర్ చివరి రోజులను గుర్తుచేసుకున్నారు.
"మా నాన్న నూర్ రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని కోరుకునేవారు. తను తరచూ ఇంటికి దూరంగా ఉండేవాడు. రాజకీయ ర్యాలీల్లో పాల్గొనేవాడు. రెండ్రోజులు రాకపోయేసరికి అమ్మా నాన్నా కంగారు పడ్డారు. 1987 నవంబర్ 10న నూర్ వాళ్లకు ఒక మసీదులో కనిపించాడు. ఇంటికి రమ్మంటే, తర్వాత వస్తానన్నాడు. అతడిని వాళ్లు చూడడం అదే ఆఖరిసారి" అన్నారు.
తర్వాత నూర్ ఆందోళనకారులతో కలిశారు. వారి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపై ఇటుకలు, నాటు బాంబులు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. నూర్ హుస్సేన్‌తోపాటూ మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
నూర్‌కు బుల్లెట్ తగిలిందని అతడి కుటుంబానికి తర్వాత రోజు మధ్యాహ్నం సమాచారం అందింది. దాంతో నూర్ తండ్రి, సోదరుడు నిరసనలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. చివరికి నూర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిసింది.
స్టేషన్లో పోలీసులు వారిని లోపలికి వెళ్లనీలేదు. ప్యాంట్ మాత్రమే ఉన్న ఒక యువకుడి శవం లోపల ఉందని, దానిని బయటకు ఇస్తే అల్లర్లు పెరగవచ్చని వారితో అన్నారు.
నూర్ హత్యలో అధికారులెవరినీ నిందితులుగా చేర్చలేదు. జనరల్ ఇర్షాద్ పాలనలో అధికారుల మీద ఏ ఆరోపణలూ ఉండేవి కావు. కానీ, ఈ ఆందోళనల్లో పోలీసుల చర్యల్లో ఎంతోమంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
నూర్ శరీరంపై ఆ నినాదాలు ఎవరు రాశారో మీకు గుర్తుందా అని నేను అతడి సోదరుడు అలీని అడిగాను.
అతడి పేరు ఇక్రామ్ హుస్సేన్ అని ఆయన చెప్పారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇక్రామ్ అప్పట్లో అధ్యక్షుడు ఇర్షాద్ స్టాఫ్ క్వార్టర్‌లో ఉండేవారు. అతడి సోదరుడు అధ్యక్షుడి దగ్గర పనిచేసేవారు. అలీ తర్వాత అలీ నాకు ఇక్రామ్ నంబర్ కూడా ఇచ్చారు.

నినాదాలు రాసిన పెయింటర్
నేను ఇక్రామ్‌కు ఫోన్ చేసినపుడు, నూర్ శరీరంపై ఆ నినాదాలు రాసింది తనే అని ఆయన నాకు చెప్పారు.
1987లో ఇక్రామ్ వయసు 18 ఏళ్లు. ఆయన ఒక సైన్ బోర్డ్ ఆర్టిస్ట్. కుటుబంతోకలిసి బంగభవన్‌లో ఉండేవారు. మోతీఝీల్ ప్రాంతంలో అతడికి ఒక చిన్న షాపు ఉండేది. అక్కడ ఇక్రామ్ సైన్ బోర్డులు, బ్యానర్లు రాసేవారు.
"నాకు నూర్ హుస్సేన్ గుర్తున్నాడు. ఆయన పాత ఆఫీస్ ఫర్నిచర్ అమ్మే ఒక కంపెనీలో పనిచేసేవాడు. అయితే మేం ఎక్కువగా మాట్లాడుకోలేదు. రోజూలాగే నవంబర్ 9న నా పనిలో ఉన్నా. సాయంత్రం దాదాపు ఐదు గంటలకు షాపు మూసేసే సమయంలో నూర్ హుస్సేన్ వచ్చాడు. నన్ను ఒక ఇరుకు గల్లీలోకి తీసుకెళ్లి, గోడపై చాక్‌తో ఒక నినాదం రాశాడు. చొక్కా తీసి, దానిని తన శరీరంపై రాయమన్నాడు" అని చెప్పారు.
నూర్ అలా చెప్పగానే ఇక్రామ్‌కు చాలా భయమేసింది.
"నేను అది రాయనని చెప్పాను. మా అన్న అధ్యక్షుడి కోసం పనిచేస్తాడు. మేం చిక్కుల్లో పడిపోతాం. ఇది చూస్తే, మిమ్మల్ని అరెస్ట్ చేయచ్చు, కాల్చి చంపేయవచ్చు అన్నా. కానీ నూర్ అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చాడు. 'నువ్వేం, కంగారుపడకు రేపు ఇలా రాసుకున్న కొన్ని వేలమంది ఉంటారులే' అన్నాడు. దాంతో నేను రాశా’’ అని చెప్పారు ఇక్రామ్.
తన చాతీపై బంగ్లాలో 'నిరంకుశత్వం నశించాలి' అనే నినాదం రాయించుకున్న నూర్, వీపుపై 'ప్రజాస్వామ్యానికి విముక్తి కల్పించండి' అనే నినాదం రాయమన్నారు.
తను రాసిన నినాదాన్ని వందల మంది మధ్య కూడా గుర్తుపట్టేలా ఇక్రామ్ ఆ నినాదం రాసి పక్కనే రెండు పుల్ స్టాపులు కూడా పెట్టారు.
కానీ, తర్వాత రోజు అక్కడ నిరసన ప్రదర్శనల్లో శరీరంపై నినాదాలు రాసుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. అతడే ఫొటోగ్రాఫర్ల దృష్టిలో పడ్డాడు. కానీ, ఆందోళనల మధ్య అందరి దృష్టినీ ఆకర్షించిన ఆ యువకుడు కాసేపటికే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.

ఫొటో సోర్స్, SHAHIDUL ALAM
ఒకే వ్యక్తి, ఇద్దరు ఫొటోగ్రాఫర్లు
అతడిని వెనుక నుంచి ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ పేరు పావెల్ రహమాన్. నేను అతడితో కలిసి ఢాకాలో ఒక పత్రికలో పనిచేసేవాడిని. పావెల్ గత 50 ఏళ్లుగా ఫొటోగ్రఫీలో ఉన్నారు. ఆరోజు నూర్ హుస్సేన్‌ను చూడగానే ఆయన గుండె పరుగులు తీసింది.
"నేను ఆరోజు అతడిని వెనకనుంచి చూశాను. ఆందోళనకారులు శరీరంపై నినాదాలు రాసుకోవడం నేను అప్పటివరకూ చూళ్లేదు. అతడు గుంపులో మాయమయ్యేలోపు నాకు రెండుసార్లు తనను వెనక నుంచి ఫొటో తీసే చాన్స్ వచ్చింది. అతడి చాతీపై కూడా అలాంటి నినాదం రాసుందనే విషయం నాకు తెలీదు" అన్నారు పావెల్.
ఆ రోజు సాయంత్రం రహమాన్ తన ఫొటోలు ప్రింట్ చేస్తున్నప్పుడు, అతడితో కలిసి పనిచేసే ఒక వ్యక్తి ఈ ఫొటోలో వ్యక్తి చనిపోయాడని చెప్పారు.
"అది తెలీగానే ఆ ఫొటో పత్రికలో ప్రింట్ చేయాలా, వద్దా అనేదానిపై కాసేపు చర్చ జరిగింది. అది చాలా ప్రమాదకరం కావచ్చని మా ఎడిటర్ అనుకున్నారు. దానిని వేస్తే ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపట్టవచ్చని భయపడ్డారు. కానీ చివరికి మేం ఆ ఫొటోను ముద్రించాలని నిర్ణయించాం" అన్నారు.
ఆ ఫొటో చూసి అధ్యక్షుడు ఇర్షాద్‌కు చాలా కోపం వచ్చింది. తర్వాత చాలా రోజులపాటు పావెల్ రహస్యంగా దాక్కోవాల్సి వచ్చింది.
పావెల్ తీసిన ఫొటో దేశమంతటా ఒక పోస్టర్‌లా మారింది. కానీ. పోస్టర్‌లో ఉన్న ఆ వ్యక్తి ఎవరనేది మరో ఫొటోగ్రాఫర్ టినూ ఆలమ్ ముందు నుంచి తీసిన నూర్ హుస్సేన్ ఫొటో బయటికొచ్చేవరకూ తెలీలేదు.
"నేను ముందు నుంచి అతడిని చాలా షాట్స్ తీశాను. కింద పడుకుని కాసేపు అతడి ఫొటోలు తీస్తూనే ఉన్నా. కానీ, అతడి వీపు మీద కూడా నినాదం రాసుందనే విషయం నాకు అప్పుడు తెలీదు. బహుశా, నేను నూర్ ఆఖరి క్షణాలను నా కెమెరాలో బంధించాను" అన్నారు టినూ.

ఫొటో సోర్స్, DINU ALAM
రాత్రి 2 గంటల తర్వాత ఖననం
తర్వాత రోజు పత్రిక మొదటి పేజీలో నూర్ ఫొటో చూడగానే, ఇక్రామ్ హుస్సేన్ షాక్ అయ్యారు. అతడి మరణానికి తనే కారణం అనుకుని కుమిలిపోయారు.
"నూర్ శరీరంపై ఆ నినాదాలు రాయకుండా ఉంటే, బహుశా, అతడు బతికుండేవాడేమో అని నాకు అనిపించిందని" చెప్పారు.
తనను తాను రక్షించుకోడానికి ఇక్రామ్ కొన్నేళ్ల పాటు ప్రభుత్వం, అధికారులకు దొరక్కుండా తిరిగారు. మూడేళ్ల తర్వాత అధ్యక్షుడు ఇర్షాద్ పాలన అంతమయ్యాక నూర్ కుటుంబాన్ని కలిసి జరిగిందంతా చెప్పారు. వారిని క్షమించమని అడిగారు.
కానీ "మీ ఇద్దరి వల్లే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నువ్వు కూడా నా కొడుకులాంటి వాడివేన"ని నూర్ తండ్రి ఇక్రామ్‌ను హత్తుకున్నారు.
నూర్ తల్లిదండ్రులకు కొడుకును ఎక్కడ ఖననం చేశారనేది వారం తర్వాత తెలిసింది. కాల్పుల్లో చనిపోయిన మరో ఇద్దరు ఆందోళనకారులతోపాటూ నూర్‌ను ఒక శ్మశానంలో రహస్యంగా ఖననం చేశారు. ఆరోజు నూర్ శవాన్ని ఖననం చేసిన వ్యక్తి ఆ విషయం అతడి కుటుంబ సభ్యులకు చెప్పారు.
అతడి పేరు ఆలంగీర్, అతడిని కలిసిన నేను ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తుందా అని అడిగాను.
"వాళ్లు శవాలు తీసుకొచ్చినపుడు రాత్రి రెండున్నర అవుతోంది. నేను రాత్రి కాపలాలో ఉన్నాను. రాత్రి 11 తర్వాత ఖననం చేయకూడదని వాళ్లకు చెప్పాను. కానీ, వాళ్లు మేం ప్రభుత్వ అధికారులం అని బలవంతంగా చేయించారు. నేను శవాలకు స్నానం చేయిస్తున్నప్పుడు, వాళ్లు గొయ్యి తవ్వారు. నూర్ చాతీపై రాసిన నినాదానికి కింద ఒక బుల్లెట్ గాయం ఉంది" అని ఆలంగీర్ చెప్పారు.
నూర్ చనిపోయిన చాలా ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి ఆయన తల్లిదండ్రులను కలవడానికి వచ్చారు. ఆయన వారిని కలవడానికి ఏడేళ్లు వేచిచూశారు. 1997లో వారిని కలిసిన ఆ వ్యక్తి జనరల్ ఇర్షాద్. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన నూర్ అమ్మనాన్నలను కలిసి క్షమించమని అడిగారు.
ఆయన తర్వాత కొన్నేళ్ల వరకూ ఇర్షాద్ కుటుంబానికి డబ్బు కూడా పంపించారు. కానీ ఢాకా విశ్వవిద్యాలయంలో తన కొడుకు స్మారకం దగ్గర నిలబడి మజీబుర్ నియంతృత్వాన్ని ఖండిస్తూ ప్రకటన చేసిన తర్వాత ఆయన వారిని ఎప్పుడూ సంప్రదించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
జనరల్ ఇర్షాద్ నియంతృత్వం
నూర్ చనిపోయిన సుమారు దశాబ్దం తర్వాత 1999లో నేను జనరల్ ఇర్షాద్‌ను కలిశాను. అప్పుడు ఆయన విపక్షంలో ఉన్నారు. మళ్లీ ప్రజల మద్దతు కూడగట్టేందుకు దేశమంతా పర్యటిస్తున్నారు.
జనరల్ ఇర్షాద్ 2019లో చనిపోయారు. ఆయన ఎన్నో కోణాలున్న ఒక ఆకర్షణీయమైన వ్యక్తి. 1982లో రక్తపాతం లేకుండా జరిగిన సైనిక తిరుగుబాటుతో ఆయన అధికారంలోకి వచ్చారు. తర్వాత దేశంలోని మత ఛాందసవాదులను ప్రసన్నం చేసుకోడానికి ఇస్లాంను బంగ్లాదేశ్ జాతీయ మతంగా మార్చారు. లౌకిక రాజ్యాంగాన్ని మార్చేశారు.
1986 ఎన్నికల్లో మోసాలు జరిగాయంటూ ఆయన విజయం చుట్టూ వివాదాలు కమ్మేశాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటును, రాజ్యాంగాన్ని రద్దు చేసిన, ఇర్షాద్ తన రాజకీయ ప్రత్యర్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. 1987 నిరసనలను కఠినంగా అణచివేశారు. నేను జైలుకు వెళ్లింది ఆ సమయంలోనే.
1990లో ఆయన తొమ్మిదేళ్ల పాలనకు తెరపడింది. ప్రజలు పెద్దఎత్తున తిరుగుబాటు చేయడంతో ఇర్షాద్ రాజీనామా చేశారు. తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు ఢాకా వీధుల్లో వేలమంది గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. 1971లో స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో అంత సంతోషం ఎప్పుడూ లేదు. దానిని తమ దేశానికి ఒక కొత్త ఉదయంగా బావించారు. కానీ బంగ్లాదేశ్ ప్రజల ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు.

ఫొటో సోర్స్, EPA
దేశంలోని రెండు ప్రధాన పార్టీలు అవామీ లీగ్, బీఎన్‌పీ మధ్య తర్వాత అధికార సంఘర్షణ మొదలయ్యింది. తర్వాత కొన్ని దశాబ్దాలపాటు రెండూ మార్చి మార్చి దేశాన్ని పాలించాయి. కానీ, ఆ పార్టీలు కూడా దాదాపుగా అంతకు ముందున్న, అలాంటి పాలననే రుచిచూపాయి.
బంగ్లాదేశ్ నేతల పాలన దేశంలో ప్రజలకు, ముఖ్యంగా జనరల్ ఇర్షాద్ పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాలు చేసివారిని బాధిస్తోంది.
"నాకు ఆరోజు కాసేపు చిమ్మ చీకటిలో పౌర్ణమి చంద్రుడిని చూస్తున్నట్లు ఆనందంగా అనిపించింది" అని ఇక్రామ్ ఆరోజును గుర్తు చేసుకున్నారు.
కానీ, ఇక్రామ్ ఇప్పటికీ సైన్ బోర్డుల పనిలోనే ఉన్నారు. ఆయన చిన్న షాపు 1987లో ఉన్న అదే ప్రాంతంలో ఉంది. నూర్‌ను పోలీసులు కాల్చి చంపిన ప్రాంతం, ఈ షాపుకు దగ్గర్లోనే ఉంటుంది. దాని పేరు ఇప్పుడు 'నూర్ హుస్సేన్ స్క్వేర్'.
ఆరోజు నూర్ శరీరంపై తను రాసిన ఆ అక్షరాలను ఇక్రామ్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
"నా హాండ్ రైటింగ్ అంత బాగుండదు, కానీ, ఇప్పటివరకూ నేను రాసినవాటిలో గొప్ప అక్షరాలు మాత్రం అవే" అన్నారు.

ఫొటో సోర్స్, SHAHIDUL ALAM
ఫొటోలు - బీబీసీ కోసం యూసఫ్ తుషార్
ఇవి కూడా చదవండి:
- జీహెచ్ఎంసీ: టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే మేయర్ పీఠం దక్కించుకోవచ్చా?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కంభం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చింది... స్థానిక రైతులు ఏం ఆశిస్తున్నారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








