పాకిస్తాన్-ఇండియా యుద్ధం: భారత్‌లో యుద్ధఖైదీ పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఎలా అయ్యారు?

హెచ్ఎస్ పనాగ్, పర్వేజ్ హెన్నా ఖురేషీ

ఫొటో సోర్స్, HS PANAG, BHARATRAKSHAK.COM

ఫొటో క్యాప్షన్, హెచ్ఎస్ పనాగ్, పర్వేజ్ హెన్నా ఖురేషీ
    • రచయిత, రేహన్‌ ఫజల్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది 1971 భారత్‌-పాకిస్తాన్ యుద్ధకాలానికి చెందిన కథ. ఇండో-పాక్‌ వార్‌ మొదలు కావడానికి 11 రోజుల ముందు అంటే నవంబర్‌ 21న కీలకమైన ఘట్టాలు జరిగాయి.

అంతకు రెండు రోజుల ముందు నాలుగో సిఖ్‌ పటాలం (ఫోర్త్‌ సిఖ్‌ రెజిమెంట్) సైనికులు యుద్ధ ట్యాంకులతో తూర్పు పాకిస్తాన్( ప్రస్తుత బంగ్లాదేశ్‌)లోని చౌగాచ పట్టణంవైపు కదిలారు.

ఒక కంపెనీ సైన్యం ట్యాంకులతో ముందు నడవగా, మరో మూడు కంపెనీల సైన్యం దానిని అనుసరించింది.

పాకిస్తా‌న్‌కు చెందిన 107 ఇన్‌ఫాంట్రీలోని సైనికులు సిఖ్ రెజిమెంట్‌పై దాడి చేయడానికి రగిలిపోతున్నారు.

కానీ భారత సైనికులు చాలా జోష్‌లో ఉన్నారు. ‘జోయ్‌ బంగ్లా’ అంటూ స్థానికులు వారికి స్వాగతం పలకగా, ఫోర్త్‌ సిఖ్‌ రెజిమెంట్ సైనికులు ‘జో బోలో సో నిహాల్‌’ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు.

చూడటానికి అక్కడి దృశ్యమంతా హాలీవుడ్‌ సినిమా ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ది బల్జ్‌’లో సన్నివేశంలాగా ఉంటుంది. సాయంత్రానికి భారత సైనికులు చౌగాచలోని కబదాక్‌ నది ఒడ్డుకు చేరుకున్నారు.

సిఖ్‌ రెజిమెంట్‌లోని డి-కంపెనీకి చెందిన సైన్యం వంతెనను దాటడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ ఆ సైనికులు అక్కడికి చేరుకోక ముందే పాకిస్తా‌న్‌ ఆ వంతెనను కూల్చేసింది.

వంతెనకు పడమరవైపున భారతీయ యుద్ధ ట్యాంకు ఒకటి ఇసుకలో కూరుకు పోయింది. దాన్ని బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

యుద్ధ విమానం

ఫొటో సోర్స్, Asad saeed khan

నాలుగు సేబర్‌ జెట్‌ విమానాలతో దాడి

“నవంబర్‌ 22న పొగమంచు అప్పుడప్పుడే తగ్గుతున్న సమయంలో పాకిస్తా‌న్‌ వైమానిక దళానికి చెందిన నాలుగు సేబర్‌ జెట్‌ విమానాలు సిఖ్‌ రెజిమెంట్‌పై దాడులు ప్రారంభించాయి.

కూలిన వంతెన సమీపంలో ఇరుక్కుపోయిన ట్యాంకర్‌ను నాశనం చేయాలన్నది పాకిస్థాన్‌ వైమానిక దాడుల ప్రధాన లక్ష్యం’’ అని భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ చేసిన ఫోర్త్‌ సిఖ్‌ రెజిమెంట్‌ చెంది అడ్జూటెంట్‌ కెప్టెన్‌ హెచ్‌.ఎస్‌. పనాగ్ ఇటీవల ప్రచురించిన 'ది ఇండియన్ ఆర్మీ: రెమినిసెన్సెస్, రిఫామ్స్‌ అండ్ రోమాన్స్' అన్న పుస్తకంలో పేర్కొన్నారు.

“మాపై దాడి జరుగుతోందని, మాకు ఎయిర్ కవర్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగాం. కానీ మా డిమాండ్‌ను వారు అంగీకరించ లేదు. ఎందుకంటే అప్పటికి అధికారికంగా యుద్ధం ప్రకటించ లేదు. మేం పాకిస్తా‌న్‌ విమానాలపై లైట్‌ మెషిన్‌ గన్స్, ఇతర తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపాం" అని పనాగ్ ఆ పుస్తకంలో రాశారు.

సేబర్స్‌తో పోరాటానికి వచ్చిన నేట్‌ (Gnat)విమానం

దమ్‌దమ్‌ విమానాశ్రయంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ లాజరస్‌, మరో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ సునీత్‌ సోరేస్‌తో స్క్రాబుల్‌ ఆడుతున్నారు. మధ్యాహ్నం 2.37 గంటలకు ఎయిర్‌బేస్‌లో సైరన్‌ మోగడం ప్రారంభమైంది. లాజరస్‌, సువారెస్ ఆటను వదిలేసి యుద్ధ విమానాలవైపు పరుగెత్తారు.

మరోవైపు ఫ్లైట్‌ లెఫ్టినెంట్స్‌ రాయ్‌ ఆండ్రూ మాసే, ఎం.ఎ.గణపతి కూడా తమ విమానాలవైపు పరుగెత్తారు.

పాకిస్తా‌న్‌ సేబర్‌ జెట్లు సిఖ్‌ రెజిమెంట్‌పై దాడి చేసిన ప్రాంతం కోల్‌కతాలోని దమ్‌దమ్‌ ఎయిర్‌బేస్‌కు ఈశాన్యంగా 50మైళ్ల దూరంలో ఉంది. ఈ నాలుగు ‘నేట్‌’ విమానాలు అక్కడికి చేరుకోవడానికి 8-9 నిమిషాలు పట్టింది.

మరోవైపు అప్పుడే కెప్టెన్‌ పనాగ్‌ సైనిక ఏర్పాట్లను పరిశీలించి, తన జీపు వద్దకు వస్తున్నారు."

అది మధ్యాహ్నం 3 గంటల సమయం. 1800 అడుగుల ఎత్తులో ఎగురుతున్న మూడు సేబర్‌ జెట్‌లు మాపై బాంబులు వేయడానికి 500 అడుగుల దాకా కిందికి దిగవచ్చాయి.

తూర్పు వైపు నుంచి వచ్చిన విమానాలు చెట్టు ఎత్తులో ఎగురుతున్నట్లు అనిపించింది. అది నా దగ్గర్లలోనే బాంబులు వేసింది. నా జీప్‌ కదిలిపోయింది. నేను దాని నుంచి ఎలాగోలా తప్పించుకున్నాను’’ అని పనాగ్‌ గుర్తు చేసుకున్నారు.

"మమ్మల్ని ఆపడానికి పాకిస్తా‌న్‌ సైన్యం ఎక్కువ దళాలను నియమించినట్లు లేదు. మాకు రక్షణగా వచ్చిన ‘నేట్‌’ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సేబర్‌ జెట్‌లను వెంటాడటం ప్రారంభించాయి.

ఈ విషయాన్ని సేబర్‌ పైలట్లు గమనించలేదు. నాకు కూడా ‘నేట్‌’ ఎయిర్‌క్రాఫ్ట్‌లు రంగంలోకి దిగాయని అప్పుడే తెలిసింది. నేను జీపును ఆపి ఈ వైమానిక పోరాటాన్ని చూడటం ప్రారంభించాను" అని పనాగ్‌ రాశారు.

పనాగ్ పుస్తకం

ఫొటో సోర్స్, Westland

మొదటి దాడి చేసిన ఆండ్రూ మాసే

పాకిస్తా‌న్‌తో జరిగిన యుద్ధం గురించి చరిత్రకారులు పి.వి.ఎస్.జగన్మోహన్‌, సమీర్‌ చోప్రాలు “ఈగిల్స్‌ ఓవర్‌ బంగ్లాదేశ్‌” అనే పుస్తకంలో సవివరంగా రాశారు.

“సేబర్‌ విమానాల కోసం వెతుకుతున్నారు. సోరెస్‌ చాలా దూరంలో ఉన్నారు. మాసే, గణపతి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో వెళుతున్నారు.

సోరేస్‌ రేడియోలో 'కాంటాక్ట్' అని పెద్దగా అరిచారు. 'గానా డోని' అనే కోడ్‌వర్డ్‌ చెప్పారు. దాని అర్ధం మీ కుడివైపున 4000 అడుగుల ఎత్తులో సేబర్‌ జెట్‌ ఉంది అని. కానీ గణపతికి సేబర్‌ జెట్‌ కనిపించలేదు. మళ్లీ సోరెస్‌ రేడియోలో “ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎట్‌ టూఓ క్లాక్‌, మూవింగ్‌ టు వన్‌ ఓ క్లాక్‌, త్రీ కిలోమీటర్స్‌ ఎహెడ్‌’’ అని కోడ్‌ లాంగ్వేజ్‌లో చెప్పారు"

ఈలోగా మాసే సేబర్‌ జెట్‌ను చూశారు. సుమారు 800 గజాల దూరంలో తన క్యానన్‌ నుంచి సేబర్‌వైపు బుల్లెట్‌ను వదిలారు.

ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రాయ్‌ మాసే, ఎం.ఎ.గణపతి, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ డాన్‌ లాజరస్‌

ఫొటో సోర్స్, Bharatrakshak.com

ఫొటో క్యాప్షన్, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రాయ్‌ మాసే, ఎం.ఎ.గణపతి, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ డాన్‌ లాజరస్‌

సేబర్‌కు 150 గజాల దూరంలో లాజరస్‌

భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో ‘నేట్‌’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపిన నలుగురిలో ఒకరైన ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ లాజరస్‌ ప్రస్తుతం మలేషియాలో నివసిస్తున్నారు. ఆయన ఇప్పటికీ ఆ పోరాటాన్నిమరువలేరు. అది తనకు నిన్ననే జరిగినట్లుగా ఉంటుందని అంటుంటారు.

“నేను మూడో సేబర్‌ను చూశాను. దాని వెంటపడ్డాను. కేవలం 150 గజాల దూరం నుంచి దానిని కాల్చాను. నా క్యానన్‌ నుంచి కేవలం 12 బుల్లెట్లే వచ్చేవి’’ అని ఆయన వివరించాను.

“ఐ గాట్‌ హిమ్‌, ఐ గాట్‌ హిమ్‌’’ అని రేడియోలో అరిచాను. నా ముందు వెళుతున్న సేబర్‌ జెట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. నా ‘నేట్’ ఎయిర్‌క్రాఫ్ట్‌కు అతి దగ్గర్లోనే అది పేలిపోయింది. దాని శిథిలాలు నా విమానానికి తగిలాయి’’ అని లాజరస్‌ వివరించారు.

మరోవైపు మాసే ఫైరింగ్‌ చేస్తుండగా, రెండో రౌండ్‌ ఫైరింగ్‌ సందర్భంగా అతని క్యానన్‌ జామ్‌ అయ్యింది. మూడో బులెట్‌ సేబర్‌ 'పోర్ట్‌ వింగ్'లో దూరింది. వెంటనే దాని నుంచి పొగరావడం మొదలైంది.

విమానం కూలుతున్న విషయాన్ని చెప్పేందుకు ఉపయోగించే కోడ్‌ వర్డ్‌ ‘మర్డర్‌, మర్డర్‌’ అని మాసే రేడియోలో చెప్పారు.

పుస్తకం

ఫొటో సోర్స్, Happercollins

పాక్‌ సైనికుడిని రక్షించిన పనాగ్‌

మైదానంలో ఈ దృశ్యాలను చూస్తున్న పనాగ్‌కు రెండు సేబర్‌ జెట్లు పడిపోవడం, అందులోంచి ఇద్దరు పైలట్‌లు పారాచూట్‌లతో దిగడం కనిపించింది.

"మా సైనికులు బంకర్ల నుండి బయటకు వచ్చి పడిపోతున్న పారాచూట్‌లవైపు పరుగెత్తారు. యుద్దోత్సాహంలో ఉన్న మా సైనికులు ఆ పాకిస్తా‌న్‌ పైలట్లకు హాని తలపెడతారని నేను భయపడ్డాను. నా జీపు ఎక్కాను. కానీ దానికన్నా పరుగెత్తుకుంటూ వెళ్లడమే మంచిదనుకున్నాను.

వారికి 50గజాల దూరంలో మా సైనికులు వారిని రైఫిల్‌ బట్‌ (రైఫిల్‌ వెనకభాగం)తో కొట్టడం కనిపించింది. నేను ఆపమని అరిచాను. ఆ పైలట్లను కొట్టకుండా అడ్డంగా నిలబడ్డాను. అలా వారిని రక్షించాను’’ అని పనాగ్ చెప్పారు.

వాలెట్‌లో భార్య ఫోటో

ఆ పైలట్లను బెటాలియన్ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. "నేను ఒక పైలట్‌ నుదిటిని చేతితో తాకి, టీ తాగమని అడిగాను. ఆ పైలట్ పేరు ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ పర్వేజ్‌ హెన్నా ఖురేషి. అతను మంచి పొడగరి. ఆరడుగులకు పైనే ఉంటాడు. అందగాడు కూడా. అప్పుడే యుద్ధం చేసి ఉన్నందున అతను కొంచెం ఆందోళనలో కనిపించాడు. కాసేపటి తర్వాత మామూలు మనిషయ్యాడు. అతను ఢాకాలోని పాకిస్థాన్‌ వైమానిక దళ 14వ స్క్వాడ్రన్‌ కమాండర్. పాకిస్థాన్ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ నుంచి “ స్వార్డ్‌ ఆఫ్‌ వార్‌’’ అవార్డును కూడా అందుకున్నాడు. ఈ అవార్డును ఉత్తమ సైనికులకు ఇస్తారు.

పనాగ్‌ ఆనాటి వివరాలను పంచుకున్నారు. “నేను అతని జేబులో ఉన్న పర్స్‌ను తీసి చూశాను. అందులో అతని భార్య ఫోటో ఉంది. ఇది మీ దగ్గరే పెట్టుకోమని అతనికి ఇచ్చేశాను. అతని వద్ద ఉన్న వస్తువుల జాబితాను తయారు చేసాను. ఒక గడియారం, 9ఎం.ఎం. పిస్టల్, 20 రౌండ్ల బుల్లెట్లు, 'సర్వైవల్‌ కిట్' ఉంది. మీరు ఇప్పుడు యుద్ధ ఖైదీ. జెనీవా ఒప్పందం ప్రకారం మీకు ట్రీట్‌మెంట్ ఉంటుంది అని అతనికి చెప్పాను. అక్కడి నుంచి బ్రిగేడియర్‌ కార్యాలయానికి తీసుకెళుతున్నప్పుడు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ అతని కళ్లను చూశాను. అవి కృతజ్జతలు చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది’’ అన్నారు పనాగ్‌.

ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే పాకిస్తా‌న్ అధ్యక్షుడు జనరల్ యాహ్యాఖాన్‌ పాకిస్థాన్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

మరో రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 25న "పది రోజుల్లో మన దళాలు భారత్‌తో యుద్ధం చేస్తాయి" అని యాహ్యఖాన్‌ ఒక ప్రకటన చేశారు.

పైలట్లకు స్వాగతం

ఫొటో సోర్స్, Bharatrakshak.com

ఫొటో క్యాప్షన్, పైలట్లకు స్వాగతం

దమ్‌దమ్‌ ఎయిర్‌ బేస్‌ వద్ద పైలట్లకు అపూర్వ స్వాగతం

పాకిస్తా‌న్‌ సైన్యంలోని ఎయిర్‌ఫోర్స్‌ విమానాలతో జరిగిన మొత్తం పోరాటమంతా రెండు, రెండున్నర నిమిషాలలోనే ముగిసింది.

భారతీయ నేట్‌ విమానాలు తిరిగి దమ్‌దమ్‌ విమానాశ్రయంలో దిగినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు వారిని చూసేందుకు ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు.

ఆ రోజు తాము వాడిన సంకేత పదాల గురించి లాజరస్‌ వివరించారు. “ కాక్టెయిల్‌-1 మర్డర్‌ మర్డర్‌’’ అంటే ఒక విమానం కూల్చేశామని అర్ధం. “ కాక్టెయిల్-2 నెగెటివ్‌’’ అంటే రెండో విమానాన్ని కూల్చినా అది మన భూభాగంలో పడలేదని అర్ధం. తర్వాత “కాక్టెయిల్-3 మర్డర్‌, మర్డర్‌’’ అంటే మూడో విమానాన్ని కూల్చేశామని అర్ధం. మేము ఎయిర్‌బేస్‌ దిగడానికి ముందే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది’’ అని లాజరస్‌ ఆనాటి సంఘటనను వివరించారు.

"మేము ఎయిర్‌ బేస్‌లో దిగేటప్పటికీ చాలామంది అక్కడికి చేరుకున్నారు. మా విమానాన్ని చుట్టుముట్టారు. సాధారణంగా నేట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు చిన్నవిగా ఉంటాయి. వాటికి నిచ్చెనలు ఉండవు. దిగాలంటే వాటి నుంచి కిందికి దూకాలి. కానీ మమ్మల్ని అక్కడున్నవారు దూకనివ్వలేవు. ఎత్తుకుని భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లారు" అని లాజరస్‌ వెల్లడించారు.

ఈ ఘటన తర్వాత ఆ పైలట్లంతా హీరోలుగా మారిపోయారు. వారు ఎక్కడికి వెళ్లినా జనం చుట్టుముట్టేవారు.

డియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షన్‌ పి.సి.లాల్ కోల్‌కతాకు వెళ్లి ఆ పైలట్లను అభినందించారు.

"అసలు యుద్ధం ప్రారంభానికి ముందే మనం వైమానిక యుద్ధంలో గెలిచాం" అని ఆయన అన్నారు.

తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పటి రక్షణమంత్రి బాబూ జగ్జీవన్‌ రామ్‌, తూర్పు వైమానిక దళ కమాండ్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ దివాన్‌ కూడా ఈ నలుగురు పైలట్లను, దమ్‌దమ్‌ ఎయిర్‌ బేస్‌ సిబ్బందిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు.

వారందరికీ దండలు వేసిన జగ్జీవన్‌రామ్‌ నేట్‌ విమానం ముందు నిల్చుని ఫోటోలు కూడా దిగారు.

పర్వేజ్ ఖురేషీ

ఫొటో సోర్స్, PAkistan air force

ఫొటో క్యాప్షన్, పర్వేజ్ ఖురేషీ

పాకిస్తాన్‌ వైమానిక దళాధిపతిగా పర్వేజ్‌ ఖురేషీ

ఈ యుద్ధంలో పాల్గొన్న పైలట్లు మాసే, గణపతి, లాజరస్, ఫ్లైట్‌ కంట్రోలర్‌ బాగ్చిలకు వీర్‌చక్ర అవార్డు లభించింది. ఫ్లైట్ లెఫ్టినెంట్‌ పర్వేజ్‌ ఖురేషి యుద్ధఖైదీగా గ్వాలియర్‌లో ఒకటిన్నర సంవత్సరాలు గడిపారు.

1997లో పర్వేజ్‌ ఖురేషిని పాకిస్థాన్‌ వైమానిక దళానికి అధ్యక్షునిగా చేశారు. ఆయన ఆ పదవిలో మూడేళ్లపాటు ఉన్నారు. 1999లో భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌ను సందర్శించినప్పుడు ప్రధాని నవాజ్‌ షరీఫ్ ఆయనను వాజ్‌పేయికి పరిచయం చేశారు.

కార్గిల్‌ యుద్ధానికి సంబంధించి అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌తో ఖురేషికి విభేదాలు ఉన్నాయని, కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ వైమానిక దళాన్ని చేర్చడానికి ఆయన నిరాకరించారని తరువాత తెలిసింది.

ఎయిర్‌ మార్షల్‌ ఖురేషీ కాక్‌పిట్‌ సీట్‌, అతని పారాచూట్, సేబర్‌ విమానం శిథిల భాగాలు ఇప్పటికీ ఫోర్త్ సిఖ్‌ రెజిమెంట్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి.

1971 యుద్ధానికి ముందే పర్వేజ్‌ హెన్నా ఖురేషీని ఫోర్త్ సిఖ్‌ బెటాలియన్‌కు చెందిన కెప్టెన్‌ హెచ్.ఎస్‌.పనాగ్‌ యుద్ధఖైదీగా చేశారు. కెప్టెన్‌ పనాగ్‌ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. అంతకు ముందు ఆయన నార్తరన్ అండ్‌ సెంట్రల్ కమాండ్‌కు జనరల్ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా కూడా పని చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)