నఖ్చివాన్: ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?

నఖ్చివాన్

ఫొటో సోర్స్, Anar Aliyev/Getty Images

    • రచయిత, డేవిడ్ మెక్‌ఆర్డల్
    • హోదా, బీబీసీ ట్రావెల్

నఖ్చివాన్.. ఈ ప్ర‘దేశం’ పేరు చాలామంది విని ఉండరు. గత కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతూ వార్తలకెక్కిన అర్మేనియా, అజర్‌బైజాన్‌లతో సంబంధం ఉన్న ప్రాంతం ఇది.

అజార్‌బైజాన్‌లోని అటానమస్ రిపబ్లిక్ ఇది.. అయితే, భౌగోళికంగా చూస్తే అజర్‌బైజాన్, నఖ్చివాన్ మధ్య అర్మేనియా ఉంటుంది.

నాహ్చివాన్‌కు ఈశాన్య సరిహద్దు అర్మేనియా కాగా వాయువ్యంలో టర్కీ.. నైరుతిలో ఇరాన్ ఉన్నాయి.

4,50,000 మంది జనాభాగల ఈ చిన్న ప్రాంతానికి సరకుల సరఫరా, రాకపోకలకు అర్మేనియా ఇబ్బందులు కలిగించిన నేపథ్యంలో ఎన్నో ఇక్కట్లు పడింది.

కకాసియా పీఠభూమి ప్రాంతంలో మీద నెలకొన్న ఆర్మేనియా, ఇరాన్, టర్కీ దేశాల మధ్యలో ఉన్న అజర్ బైజాన్ ఒక స్వతంత్ర రిపబ్లిక్ దేశం. ఒకప్పటి సోవియట్ యూనియన్ కి ఈ ప్రాంతం ఒక అవుట్ పోస్ట్ గా ఉండేది. ఇక్కడికి యాత్రీకులు వెళ్లడం చాలా అరుదైన విషయం.

నఖ్చివాన్

ఫొటో సోర్స్, PeterHermesFurian/Getty Images

సరిహద్దులు ఉన్న ప్రతి వైపూ భూమి ఉన్న అతి పెద్ద దేశం ఇదే అని చెప్పవచ్చు. సోవియట్ అపార్ట్మెంట్ బ్లాక్ లు, బంగారపు పూతతో కూడిన గోపురాలతో ఉన్న మసీదులు, నల్ల సముద్రం , కాస్పియన్ సముద్ర తీరం లో ఉన్న ఎరుపు రంగు పర్వాతాలు కూడా ఈ ప్రాంతపు ప్రత్యేకతలు. భౌగోళికంగా 80 - 130 కిలోమీటర్ల మేర అర్మేనియా ఈ ప్రాంతాన్ని అజర్ బైజాన్ నుంచి వేరు చేస్తోంది.

మత ప్రవక్త నోవాకి ఇక్కడ ఎత్తైన సమాధి ఉంది. పర్వత శిఖరంపై నెలకొన్న మధ్యయుగానికి చెందిన కోటను, లోన్లీ ప్లానెట్ ‘యురేషియా మచ్చు పిచ్చు’ గా సంబోధించింది.

పరిశుభ్రతకు మారు పేరుగా నిలిచిన ప్రశాంతమైన ఈ దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులు కూడా చెట్లు నాటడం, వారాంతంలో వీధులు తుడవడం లాంటి పనులు చేస్తూ ఉంటారు.

సోవియట్ యూనియన్ విచ్చిన్నమవుతున్న దశలో స్వాతంత్య్రం ప్రకటించుకున్నతొలి దేశాలలో ఇదొకటి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న 15 రోజుల్లోనే అజర్‌బైజాన్ తో విలీనం అయింది.

ఈ వివరాలన్నీ ఆ దేశంలోని నఖ్చివాన్ నగరంలోకి అడుగు పెట్టేవరకు నాకు కూడా తెలియదు.

నఖ్చివాన్

ఫొటో సోర్స్, Hemis/Alamy

గత 15 సంవత్సరాలుగా సోవియట్ యూనియన్ లో వివిధ ప్రాంతాలలో తిరుగుతూ నేను రష్యా భాష నేర్చుకున్నాను. ట్రాన్స్ నిస్ట్రియా లాంటి చిన్న చిన్న దేశాలు కూడా సందర్శించాను. తజికిస్తాన్, కిర్గిస్తాన్ లాంటి దేశాలలో జరిగిన ఎన్నికల సరళిని పర్యవేక్షించాను.

కానీ, నఖ్చివాన్ పర్యటన మాత్రం అంతు చిక్కని విశేషం.

ఇది టర్కీ ,ఇరాన్ తో సరిహద్దులు కలిగి ఉండటం వలన సోవియట్ లో ఉన్న చాలా మంది ప్రజలకు కూడా ఇది ఒక రహస్య ప్రాంతమే. యుఎస్ఎస్ఆర్ నుంచి వేరుపడి 30 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ప్రాంతం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

అజర్ బైజాన్ దేశపు వీసా ఉన్నవారెవరైనా ఇక్కడకు రావచ్చు. ఇక్కడ భద్రత విషయంలో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ అధికారులు మాత్రం ఎవరైనా కొత్త వారు కనిపిస్తే అప్రమత్తంగా వ్యవహరిస్తారు.

నేను అజర్‌బైజాన్ ఎయిర్ పోర్ట్ లో దిగి బయటకు రాగానే, “పోలీసులు.... నీ గురించే మాట్లాడుకుంటున్నారు” అని ఒక వ్యక్తి నా చెవిలో రహస్యంగా చెప్పారు. “నేనెవరో వాళ్ళకెలా తెలుసు” అని అడిగాను. ఎరుపు రంగు షార్ట్ లు ధరించి ఒక బ్రిటిష్ వ్యక్తి వస్తున్నట్లు వారికి సమాచారం అందింది అని చెప్పారు.

అజర్ బైజాన్ లోని బాకు ఎయిర్ పోర్ట్ నుంచి భద్రతా అధికారులు నా గురించి సమాచారం అందించి ఉండవచ్చని అనుకున్నాను.

"నఖ్చివాన్ పరిసరాల్లో ఎక్కడా చెత్తా చెదారం విసిరేసి కనిపించదు" అని ఎయిర్ పోర్ట్ లోంచి బయటకు వస్తుండగా నా టాక్సీ డ్రైవర్, టూర్ గైడ్ మీర్జా ఇబ్రహిమోవ్ చెప్పారు.

నఖ్చివాన్ తరువాత పెద్ద నగరమైన ఒర్దుబాద్ కి వెళ్ళాను.

నఖ్చివాన్

ఫొటో సోర్స్, Toghrul Rahimli

అతను చెప్పింది అక్షరాలా నిజం. ఆ ప్రాంతంలో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అక్కడ ఉన్న శుభ్రత . ఆ వీధులు, కూడళ్లు, సోవియట్ కాలం నాటి భవనాలు అంత పరిశుభ్రంగా ఎలా ఉన్నాయో అడగాలనుకున్నాను. కానీ, అష్టభుజాకారంలో ఉన్న ఎత్తైన ఇస్లాం కట్టడం నా దృష్టిని మరల్చింది. స్థానికుల మనస్సులలో ఆ కట్టడానికి చాలా ప్రాముఖ్యం ఉందని ఇబ్రహిమోవ్ చెప్పారు.

ప్రపంచంలో ఉన్న అయిదు నోవా సమాధులలో ఇదొక్కటి. కానీ, స్థానికులు తమ దేశాన్ని నోవా కి చెందిన భూమిగానే చూస్తారు.

ఈ ప్రాంతానికి నఖ్చివాన్ అనే పేరు ‘అవతరించిన స్థలం’ అనే అర్ధం వచ్చే రెండు ఆర్మేనియా పదాల వలన వచ్చిందని కొంత మంది పరిశోధకులు చెబుతారు.

కానీ, అజర్‌బైజన్లు మాత్రం నహ్ (నోవా) చివాన్ ( పర్షియా భాషలో ప్రాంతం) అంటే నోవాకి చెందిన ప్రాంతం అని అంటారు.

నఖ్చివాన్

ఫొటో సోర్స్, Hemis/Alamy

ఈ ప్రాంతానికి వరదలు వచ్చి తగ్గినప్పుడు ప్రవక్త నోవా ప్రయాణిస్తున్న నౌక ఐలాండగ్ పర్వతం అంచుల దగ్గరకు కొట్టుకు వచ్చిందని, అక్కడ ఇప్పటికీ కనిపిస్తున్న చీలికను దానికి ప్రతీకగా చెబుతారు. నోవా అతని అనుచరులు ఈ ప్రాంతంలోనే జీవించారని స్థానిక పురాణ కథలు చెబుతాయి. దాంతో, ఇక్కడ నివసించే వారంతా ప్రవక్త సంతతి కి చెందిన వారిగా తమను తాము భావిస్తారు.

ఈ ప్రాంత వాసులు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా పర్షియా. ఒట్టోమన్, రష్యా పాలనలో ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆర్మేనియా తో భూభాగ తగాదాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ విచ్చిన్నం అయిన తర్వాత ఇప్పటికీ తీరని సమస్యగా ఈ వివాదం నలుగుతోంది.

1988లో మాస్కో ఇతర రిపబ్లిక్ దేశాల పై తన పట్టును కోల్పోతున్న దశలో నఖ్చివాన్ పొరుగు దేశం నగార్నో కరాబక్, అర్మేనియా మధ్య యుద్ధం తలెత్తింది. 1994 లో సీజ్ ఫైర్ ప్రకటించే లోపు కనీసం 30, 000 మంది ప్రజలు మరణించారు.

దీనికి ప్రతీకారంగా భూభాగాన్ని నియంత్రిస్తున్న అర్మేనియా నఖ్చివాన్ ని అజర్ బైజాన్ తో, యుఎస్ఎస్ఆర్ తో అనుసంధానం చేసే రోడ్డు , రైల్వే లైన్లను 1988 లో మూసేసింది. ఇరాన్, టర్కీ దేశాలతో కలిపే అరాస్ నది పై నిర్మించిన రెండు చిన్న బ్రిడ్జిలు ఈ దేశ ప్రజలు ఆకలితో బాధపడి కరువు బారిన పడకుండా కాపాడాయి.

నఖ్చివాన్

ఫొటో సోర్స్, David McArdle

ఈ నేపథ్యంలో నఖ్చివాన్ ప్రజలు స్వయం సమృద్ధి బాట వైపు పయనించారు. ఆర్ధికంగా పక్క దేశాల మీద, బ్రిడ్జిల మీద ఆధార పడకుండా తమ ఆహారం తామే పండించుకోవడం, తమ ఉత్పత్తులను తామే తయారు చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ దేశం స్వయం సమృద్ధిగా తయారయ్యే దిశగా నిధులు మళ్లించింది.

అజర్ బైజాన్ భూభాగానికి అవతల ఉన్న ఈ దేశం ఇతరుల మీద, అంతర్జాతీయ వాణిజ్యం మీద ఆధారపడకుండా నిలదొక్కుకున్న ఆర్ధిక శక్తికి ఉదాహరణగా నిలిచింది. ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణ హితమైన ఆర్గానిక్ ఆహారం, దేశీయ ఆహార ఉత్పత్తులను పెంచడం ఈ దేశ ఆర్ధిక వ్యవస్థకు ఒక గుర్తింపుగా నిలిచాయి.

ఇక్కడ ఆహారాన్ని స్తుతిస్తారు. దానికొక కారణం ఉంది. ‘మేము కావాల్సినంత పండించగల్గుతుండటం వలనే మేమిలా తినగల్గుతున్నాం’ అని ఇబ్రహిమోవ్ స్నేహితుడు ఎలీషాద్ ఒక రోజు మధ్యాహ్న భోజనం చేస్తుండగా అన్నారు.

సోవియట్ నుంచి వేరుపడినప్పటి నుంచీ ఈ దేశం పండించే ఆహారంలో కచ్చితంగా ఎరువులు లేకుండా చూసుకోవాలని, సేంద్రియ ఆహారాన్నే పండించాలనే విధానాన్ని అవలంబిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తినే బాల్బస్ గొర్రె మాంసం, చేపలు, వంటల్లో వాడే సోంపు, తీపి తులసి కూడా నఖ్చివాన్ పొలాల్లో, కొండ ప్రాంతాల్లో, చెరువుల్లో పెంచేవే. ఆఖరికి వంటల్లో వాడే ఉప్పు కూడా ఇక్కడ భూగర్భంలో ఉన్న గుహల నుంచి సేకరిస్తారు.

మాకు వడ్డించిన లేత మాంసం, కాయగూరల సలాడ్లు, చీజ్, రొట్టెలు, అప్పుడే వేటాడిన మంచి నీటి చేపలు, పర్వత సానువుల్లో దొరికే మూలికలతో కలిపిన బీర్, వోడ్కా అన్నీ ఏదో ఒక ఆరోగ్య సమస్యలకు సహజ పరిష్కారాలుగా కనిపిస్తున్నాయి.

నఖ్చివాన్‌లో పాటిస్తున్న ఆర్గానిక్ ఆహార పద్దతుల గురించి ఆరా తీసినప్పుడు, ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసమే ఈ పద్దతులను అవలంబిస్తున్నట్లు హసనోవ్ చెప్పారు. "మేము ఆరోగ్యంగా ఉంటాం. గతంలో ఉండే ఆరోగ్య సమస్యలు మాకిప్పుడు లేవు. మేము సహజంగా లభించేవే తింటాం” అని ఆయన అన్నారు.

నేనా మాటలు వింటూ ఒక పెద్ద టమాటాని తిన్నాను. నేనిప్పటి వరకు అలాంటి టమాటాని రుచి చూడలేదని చెప్పగలను. అది అంత తీయగా ఉంది. ఎరువులు లేని పంటలు పండించడం వరకు మాత్రమే వీరి ఆరోగ్య రహస్యం పరిమితం కాదు.

నఖ్చివాన్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుహ్ దాగ్ ఉప్పు గుహల్లో ఒక ఖర్చు లేని అద్భుతమైన ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఈ ప్రాంతానికి చికిత్స కోసం వచ్చే యాత్రికులకు ఇక్కడ ఉండే 130 మిలియన్ టన్నుల సహజ ఉప్పు ఆస్తమా, బ్రాంకైటీస్ లాంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుందని ఈ గనులకు సంబంధించిన వెబ్‌సైట్ పేర్కొంటోంది.

పొగ తాగడం బాగా అలవాటు ఉన్న ఇబ్రహిమోవ్ ఆ గుహల్లో కి వెళ్ళగానే ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. "ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు. గత సంవత్సరం తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉరుగ్వే నుంచి వచ్చి చికిత్స తీసుకుని వెళ్లారు" అని ఆయన చెప్పారు.

మా నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ రాత్రంతా గుహల్లో గడపడానికి కొంత మంది స్కూల్ విద్యార్థులు వారి టీచర్ తో కలిసి గుహలకు వచ్చారు.

నఖ్చివాన్

ఫొటో సోర్స్, David McArdle

అజర్ బైజాన్ లో ఉన్న అన్ని ప్రాంతాలలో కెల్లా నఖ్చివాన్ అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఎటు చూసినా అన్నీ అమర్చినట్లు ఉంటాయి. వాహనాల రాకపోకలకు నిర్దేశిత దారులు, మురికి లేకుండా శుభ్రపరిచిన వీధులు, చక్కగా కత్తిరించిన వృక్షాలు, కలుపు మొక్కలను తొలగించిన ప్రదేశాలతో నిండి పచ్చదనంతో కళకళలాడుతోంది.

ఇక్కడ పని చేసే టీచర్లు, సైనికులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులే దీనికి కారణమని నార్వేజియన్ హెల్సింకి కమిటీ ప్రచురించిన నివేదిక పేర్కొంది. వీరంతా వారాంతంలో నగరం శుభ్రం చేసేందుకు స్వచ్చందంగా పని చేస్తారని ఈ నివేదిక తెలిపింది.

వీధులు శుభ్రపరచని సమయంలో ఇక్కడ ప్రజలు చెట్లు నాటే పనిలో మునిగిపోయి ఉంటారు. సోవియట్ కాలం నుంచే ఉన్న ఈ విధానాన్ని సబ్బోత్నిక్ అంటారు. శ్రమకు వేతనం లభించని విధానం ఈ సబ్బోత్నిక్.

ఒక రోజు పొలాల్లో సమూహాలుగా ఉన్న కొంత మంది పండ్ల మొక్కలను నాటుతూ ఉండటం చూసాను. ఇలా చేయడం వలన ఈ ప్రాంతానికి కావల్సిన పండ్లను వీరే పండించుకుని, ఈ ప్రాంత శ్వాస కోశ వ్యవస్థను విస్తరించుకుంటున్నారని అర్ధమయింది.

ఎవరైనా స్వచ్చందంగా పని చెయ్యని పక్షంలో వారు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి పదవీ విరమణ చేయవలసి ఉంటుందని హెల్సింకి కమిటీ పేర్కొంది. ఇలా ప్రజలతో ఉచిత శ్రమ చేయించుకుంటూ ఈ దేశ అధికారి వాసిఫ్ తలిబోవ్ చాలా ఆదాయాన్ని సంపాదిస్తున్నారని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు.

సింగపూర్ లా తక్కువ ఖర్చుతో లభించే కార్మికులు, ప్రభుత్వ చర్యల పట్ల భయం వలన ఈ ప్రాంతం కూడా పరిశుభ్రంగా, పచ్చగా ఉందా అని అనిపించింది. నఖ్చివాన్ నాకర్ధం కాని ఒక పజిల్ లా మిగిలిపోయింది. నిస్వార్ధంగా దేశాభివృద్ధి కోసం పని చేసే స్వచ్చంద సేవకులతో కూడిన దేశమా, లేదా జాగ్రత్తగా నిర్మించిన ఆశ్రమ కమతమా.. లేదా రెండిటి మిశ్రమమా? అర్ధం కాలేదు.

ఇక్కడ రెస్టారెంట్లలో యువత ఇప్పటికీ పక్క వారికి వినబడకుండా నెమ్మదిగా గుసగుసలాడుకుంటూ కనిపిస్తారు. సోవియట్ యూనియన్ కాలం నాటి అలవాటు మారకపోయినా, తమ ఆహారం గురించి మాత్రం పొలం నుంచి నేరుగా టేబుల్ పైకి వస్తుందని, ప్రభుత్వ ఉద్యోగులంతా వారాంతంలో దేశం కోసం పని చేస్తారని, వారి స్థూల జాతీయ ఉత్పత్తి గత 15 సంవత్సరాలలో 300 శాతం పెరిగిందని గొప్పగా చెప్పుకుంటారు. వారి సాంస్కృతిక వారసత్వాన్ని మత ప్రవక్త నోవా తో ముడి పెట్టుకుంటారు.

స్థానిక ఉత్పత్తులను ప్రేమించే ఈ దేశ ప్రజల భవిషత్తు ఎలా ఉందో నాకు తెలియదు కానీ, వారి దేశపు ద్వారాలు అందరి కోసం తెరిస్తే నేను కూడా భవిష్యత్తులో మరో సారి వెళ్లగలనని ఆశిస్తున్నాను.

నఖ్చివాన్

ఫొటో సోర్స్, Hemis/Alamy

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)