మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వెరోనిక్ గ్రీన్ వుడ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
సాధారణంగా గర్భిణీలు అకస్మాత్తుగా ఐస్ క్రీం కానీ, పచ్చళ్ళు కానీ తినాలని అడుగుతూ ఉండటం మనమందరం వింటూనే ఉంటాం. చాలా సార్లు అర్ధరాత్రి వేళలో కూడా కూడా బాగా వేపిన చికెన్ తినాలని ఉందని, లేదా ఒక ప్రత్యేక బ్రాండ్ చాక్లెట్ తినాలనో లాంటి కోరికలు కోరుతూ కుటుంబ సభ్యులను అవి సమకూర్చమని అడుగుతూ ఉంటారు. గర్భంతో లేని వారికి కూడా అకస్మాత్తుగా ఏదో ఒక ఆహార పదార్ధం తినాలనే కోరిక విపరీతంగా కల్గుతుంది.
"ఇలా తినాలనిపించే ఆహార పదార్ధాల ద్వారా గర్భం దాల్చిన మహిళలకు కావల్సిన పోషకాలు అందుతాయని భావించేవారు. కానీ, అదొక శారీరక అవసరం. ఇలా అకస్మాత్తుగా తినాలని ఎందుకనిపిస్తుందో తెలుసుకోవడం ఒక కష్టతరమైన ప్రక్రియ”.
అయితే, ఈ అంశంపై జరిగిన శాస్త్రీయ పరిశోధనని పరిశీలిస్తే, ఆసక్తికరమైన విషయాలు బయట పడతాయి.
గర్భిణీలందరికీ ఏదో ఒకటి తినాలనిపించడం అన్ని సంస్కృతుల ప్రజల్లో లేదని, పరిశోధకులు గుర్తించారు.
తూర్పు దేశాలలో గర్భిణీలను పరిశీలిస్తే వారి కోరికలు పశ్చిమ దేశాలలో మహిళలు తినాలనుకునే ఆహార పదార్ధాలకు భిన్నంగా ఉంటాయి.
ఉదాహరణకు, జపాన్ లో గర్భిణీ మహిళలకు అన్నం తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందని గుర్తించారు.
సాధారణంగా గర్భం దాల్చినప్పుడు తినాలనిపించే ఆహారా పదార్ధాల్లో గర్భవతులకు పనికొచ్చే ప్రత్యేక పోషకాలు కూడా ఏమి లేవని పరిశోధనలు తేల్చాయి. పోషకాల మాట పక్కన పెట్టి, అతిగా ఏదైనా తినాలని కోరిక కలిగిన వారు బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీంతో వేరే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఇలా రకరకాల ఆహారం తినాలనే కోరికకి శరీరంలో జరిగే వివిధ రసాయన చర్యలు మాత్రమే కారణమని చెప్పలేము.
కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్ధాలనే ఎందుకు తినాలని అనుకుంటారో పరిశీలిస్తే కొంత సమాచారం తెలుస్తుందని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జూలియా హోర్మ్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రక రకాల పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైన ఆహారం తినాలనే కోరిక ఎందుకు కలుగుతుందో తెలుసుకోవడానికి ఆమె ఒక అధ్యయనం నిర్వహించారు. ఉదాహరణకు అమెరికాలో 50 శాతం మహిళలు నెలసరికి ఒక వారం ముందు చాక్లెట్ తినాలని ఆసక్తి చూపిస్తారని హోర్మ్స్ చెప్పారు.
చాక్లెట్లో లభించే పోషకాలు నెలసరి సమయంలో ఆరోగ్యానికి ఉపకరిస్తాయా లేదా కేవలం హార్మోన్ల మార్పు వలన ఇలా జరుగుతుందా అనే అంశాన్ని పరిశోధకులు పరిశీలించారు.
ఒక ప్రయోగంలో ఒక మానసిక శాస్త్రవేత్త ఒకామెకు కొన్ని రకాల చాక్లెట్ బాక్సులు ఇచ్చి అతిగా తినాలనిపించినప్పుడు తినమని చెప్పారు. కొన్ని బాక్స్ లలో అన్ని పోషకాలు ఉన్న మిల్క్ చాక్లెట్, కొన్ని కోకో లేని వైట్ చాక్లెట్ లు, కొన్ని కోకో సమృద్ధిగా ఉన్న చాకొలెట్లు ఇచ్చారు.
ఈ ప్రయోగంలో వైట్ చాక్లెట్ తినాలనే కోరిక అధికంగా కలిగినట్లు తేలింది. కోకో చాక్లెట్ లలో ఉన్న పోషకాల వలన తినాలనే కోరిక కల్గుతుందని చెప్పలేము.
కొన్ని ఇతర అధ్యయనాలు చాక్లెట్ తినాలనే కోరికకు, శరీరంలో మార్పు చెందే హార్మోన్ స్థాయిలకు సంబంధం లేదని తేల్చాయి.
నిజానికి మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు చాక్లెట్ తినాలని అనిపిస్తుందని అంటూ ఉంటారని హోర్మ్స్ చెప్పారు.
ఇదంతా పరిశీలిస్తే ఏదైనా అతిగా తినాలనిపించడానికి మానసిక, సాంస్కృతిక కారణాలు కూడా దోహదం చేస్తాయని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
వెన్నతో చేసిన బిస్కట్లు , చాక్లెట్ బార్లు, బాగా వేపిన పదార్ధాల లాంటివి తినాలనే కోరిక ముందు ఒక ఆలోచనలా వచ్చి నెమ్మదిగా ఒక వ్యామోహంలా తయారవుతుంది. ఇక దానిని నియంత్రించుకోవడం కష్టంగా మారుతుంది. అమెరికా లాంటి దేశాలలో ఐస్ క్రీం, మాకరోని చీజ్ తో చేసిన పదార్ధాలు తింటున్నప్పుడు వాటిలో ఉండే కేలరీల వలన చాలా న్యూనతా భావం వేధిస్తుంది.
దీని గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని హోర్మ్స్ చెప్పారు. "ముందు ఈ కోరికను తీర్చుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది. అలాగే, ఫలానా చాక్లెట్ తినకూడదని నా సంస్కృతి చెబుతోంది. నాకు తినాలని ఉంది. కానీ నేను తినకూడదు - ఇలాంటి ప్రక్రియను చాలా సార్లు సంస్కృతి ప్రభావితం చేస్తుంది”.
ముఖ్యంగా ఏదైనా తినాలనే కోరికను చాలా రోజుల నుంచి నియంత్రించుకుంటున్నట్లైతే , అలాంటి ఆహారం తినడానికి మిమ్మల్ని అనుమతించరని తెలిసిన తర్వాత, ఒక్క సారి తినడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం కష్టమైపోతుంది.
అందుకే ఒక్క కేక్ తిన్నాక అక్కడితో ఆగకుండా మళ్ళీ ఇంకొక మూడు కేకులు తినేస్తారు.
మహిళలైతే వాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ సూచనల మేరకు గాని, ఆరోగ్యం రీత్యా గాని సుషి , డెలి మాంసం లాంటి కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం మానేస్తారు.
ఇలాంటి కారణాలన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన ఆహరం తినాలనే కోరికకు దారి తీస్తాయి. వీటి వలన బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
గర్భం దాల్చినప్పుడు కలిగే కోరికలను కఠినంగా విశ్లేషించలేము. "కొన్ని సంస్కృతుల్లో సాధారణంగా తినవద్దని చెప్పే ఆహారాలను కూడా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు తినేందుకు అనుమతిస్తారు” అని హోర్మ్స్ అన్నారు.
"పిఎంఎస్, గర్భంతో ఉన్నప్పుడు మహిళలు ఏమి చేసినా సాంఘికంగా ఆమోదం లభిస్తుంది."
ఏదైనా తినాలనే కోరికను చాలా రోజులు అణిచిపెట్టుకోకుండా ఉండటం వలన ఒకే సారి ఎక్కువగా తినే పరిస్థితి ఏర్పడదని హోర్మ్స్ చెప్పారు.
ఈ పరిస్థితిని నియంత్రించాలంటే, వేరే వాటి మీద దృష్టి మరల్చుకోవడం లేదా మెడిటేషన్ చేసి, కోరికను గుర్తించి నెమ్మదిగా మర్చిపోవడం లాంటివి చేయవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒక వేళ చాక్లెట్ తినాలని ఉంటే నాణ్యమైన చాక్లెట్ తెచ్చుకుని, రోజుకు కొంచెం కొంచెం తినవచ్చని సూచిస్తున్నారు.
గర్భం దాల్చిన మహిళలు తొమ్మిది నెలలు తమకి కావల్సింది తినకుండా ఉండటం కష్టం.
టాంజానియా మహిళలపై చేసిన ఒక అధ్యయనంలో వారు మాంసం, చేపలు, తృణ ధాన్యాలు, పళ్ళు, కాయగూరలు తినాలనే ఆసక్తిని కనబర్చినట్లు వెల్లడైంది. వారికి కావల్సింది సమకూర్చడం వారికి కుటుంబం నుంచి భర్త నుంచి లభించే సాంఘిక మద్దతుకి సూచికగా నిలుస్తుంది.
అర్ధరాత్రి ఒంటిగంటకు వేపిన చికెన్ తినాలని ఉందంటే, తెచ్చి పెట్టేవారు కూడా ఉండాలి. ఈ ఆహారం కన్నా మీరు ప్రేమించే మనుషులు మీకు కావల్సిన ఆహారాన్ని.. మీకు అవసరమైనప్పుడు సమకూర్చారంటే వారందించే ప్రేమ.. కేలరీలు అందించే శక్తి కన్నా ఎక్కువ శక్తిని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఈ ఇంజెక్షన్ తీసుకుంటే 3 నెలలు గర్భం రాదు
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- ఆస్పత్రుల్లో గర్భిణులకు ఉండే హక్కులు
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- దిల్లీలో కరోనా కేసులు తగ్గడానికి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెరగడానికి కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








