నమ్మకాలు-నిజాలు: బిడ్డకు తల్లిపాలు మంచివా? పోతపాలు మంచివా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ రొంపిచెర్ల భార్గవి
- హోదా, బీబీసీ కోసం
"అందాల నటి శిరీషకు పుత్రోదయం" వార్తా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించిన వార్త చదువుతూ,బిడ్డ ఏడుపు విని దగ్గరకు తీసి పాలివ్వబోయింది శిరీష. వెంటనే బిడ్డని లాక్కుని "పాలిస్తే అందం చెడిపోతుందమ్మాయ్, ఇప్పుడే డబ్బా పాలు పట్టించానులే, బిడ్డని నిద్రపోనీ" అంది తల్లి.
గర్భిణిగా ఉన్నప్పటి నుండీ, బిడ్డకు తన పాలే పట్టాలనీ,పోత పాలు పట్టగూడదనీ కృత నిశ్చయంతో వున్న కల్పన, కాన్పయిన తర్వాత ఎంత ప్రయత్నించినా పాలివ్వలేక పోతోంది, బిడ్డ కి రొమ్ము పట్టుకోవడానికి పట్టు చిక్కడంలేదు. కన్నీళ్ల పర్యంతమైన ఆమెను పరీక్షించిన డాక్టర్ ఆమెకు "రిట్రాక్టెడ్ నిపుల్ " అంటే ఆమె రొమ్ముల చివరి భాగాలు లోపలికి కూరుకు పోయాయన్నాడు.
పావని సమస్య ఇంకో రకం. బాబు పుట్టాక మూడు రోజుల పాటు పాలు బాగానే ఇచ్చింది. నాలుగవ రోజునుండీ రొమ్ము చివరలు చిట్లి, పాలివ్వడం అంటే బాధతో ప్రాణం మీదకు వచ్చినంత పనవుతోంది. డాక్టర్ పరీక్ష చేసి "క్రాక్‌డ్ నిపుల్స్ " అని చెప్పింది.
పాలిస్తే తల్లి అందం చెడిపోతుందా? "ఇన్వర్టెడ్ నిపుల్స్"కి నివారణ ఏమిటీ? "క్రాక్‌డ్ నిపుల్స్"కి కారణమేంటీ? బిడ్డకు తల్లిపాలు మంచివా, పోతపాలు మంచివా? పోతపాల వలనవచ్చే నష్టాలేమిటీ? తల్లి పాల వలన వచ్చే లాభాలేమిటీ? ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు అసలు ఈ పాలు ఎక్కడ ఎలా తయారవుతాయి, వాటి కథేంటో చూద్దామా?
మానవుడు, పిల్లలను కని పాలిచ్చి పెంచే క్షీరదాల జాతికి చెందిన వాడు.
ప్రతి స్త్రీ శరీరంలోనూ, ఛాతికి ఇరు ప్రక్కలా బిడ్డ ఆహారం కోసం యేర్పాటు చేసిన పాల గ్రంథులుంటాయి. వీటినే బ్రెస్ట్ (రొమ్ములు) అంటారు. ఇవి బిడ్డ ఆహారం కోసం అభివృద్ధి చెందిన మామరీ గ్లాండ్సే కానీ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే సాధనాలు కావు నిజం చెప్పాలంటే. ఇవి యవ్వనదశ నుండీ బిడ్డను కనే వరకూ అనేక మార్పులకు లోనవుతాయి.
వీటి పెరుగుదల మీద అనేక హార్మోనుల ప్రభావం వుంటుంది.
ప్రొజెస్టిరోన్ రొమ్ములలో పాలగ్రంథుల యెదుగుదలకు తోడ్పడుతుంది.
ఈస్ట్రోజన్ -మిల్క్ డక్ట్ ల ఎదుగుదలకు అవసరం.
ఇంకా ప్లాసెంటల్ లాక్టోజన్, కార్టిసాల్, ఇన్సులిన్ బ్రెస్ట్ లోని కణజాలాల ఎదుగుదలకూ, పరిణతి చెందడానికీ తోడ్పడితే, ప్రసవం జరిగాక పాలు ఏర్పడటానికీ, అవి బయటికి రావడానికీ వరసగా ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్లు తోడ్పడతాయి.
బిడ్డ పుట్టిన దగ్గర నుండీ దాదాపు ఆరు నెలల వయసు వచ్చే వరకూ తల్లి పాలే ప్రధాన ఆహారం .ఆ పాలల్లో బిడ్డకు కావలసిన అన్ని రకాల పదార్థాలూ ఉంటాయి. ఆరు నెలల తర్వాత బిడ్డ ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను, అంటే జావలూ, ఇతర ఘన పదార్థాలనూ అరిగించుకునే శక్తి కలిగి వుంటుంది. ఈ కార్యక్రమమంతా నెమ్మదిగా క్రమేణా జరిగేటట్టు చూడాలి. ఇలా పాల నుండీ ఇతర పదార్థాలకూ, అన్నానికీ అలవాటు చేయడాన్ని "వీనింగ్ "అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
తల్లి పాలల్లో ఉండే పదార్థాలు:
- కార్బోహైడ్రేట్స్ 7.1%
- ఫాట్స్ 4.5%
- ప్రోటీన్స్ 0.9%
- మినరల్స్ 0.2%
- డైజెస్టివ్ ఎంజైమ్స్
- హార్మోన్లు
- విటమిన్లు
- యాంటీ బాడీలు
- లింఫోసైట్లు
తల్లిపాలను తప్పని సరిగా తాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమండ్ చేస్తోంది.
తల్లిపాలు ఎలా విడుదలవుతాయి:
బిడ్డ స్పర్శ తల్లి రొమ్ముకు తగలగానే కానీ, బిడ్డ ఏడుపు విన గానే కానీ, తల్లిలో కొన్ని హార్మోన్లు విడుదలయి పాలు వస్తాయి.
ఆ హార్మోన్లు...
ప్రొలాక్టిన్ పిట్యూటరీ గ్రంథి ముందు భాగం నుండీ వస్తుంది. రొమ్ముల్లో పాలు తయారవడానికి కారణమవుతుంది.
ఆక్సిటోసిన్ - పిట్యూటరీ గ్రంథి వెనక భాగం నుండీ వస్తుంది. పాలు పాల నాళాలనుండీ బయటకు రావడానికి తోడ్పడుతుంది.
ముర్రుబాలు
కొలోస్ట్రమ్ - ఇది రొమ్ములనుండీ స్రవించే చిక్కటి పసుపు పచ్చటి ద్రవం. ప్రసవమయిన మొదటి రోజు నుండీ నాలుగు రోజుల వరకూ వస్తుంది. ఆ తర్వాతే తెల్లటి పాలు వస్తాయి. ఈ కొలోస్ట్రమ్‌నే "ముర్రుబాలు" అంటారు. దీనిలో అధికమైన ప్రోటీన్లూ, Ig A యాంటీ బాడీ వుంటాయి. ఇది బిడ్డకు బలాన్నీ, రోగ నిరోధక శక్తి నీ కలిగిస్తుంది. దీనిని పిండి పారబొయ్యకూడదు. దీనిని తాగించడం ద్వారా బిడ్డను కొన్ని జబ్బులనుండీ రక్షించ వచ్చు.
రోజుకు ఎన్ని పాలు వస్తాయి?
ఆరోగ్యంగా వున్న స్త్రీ నుండీ రోజుకు సుమారు 600ml పాలు వస్తాయి. బిడ్డ పుట్టినప్పుడు తడవకు ఇరవై ముప్పై మి.లీ చొప్పున అయిదారు సార్లు తాగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
బిడ్డకు పాలు ఎప్పుడు, ఎలా ఇవ్వాలి?
బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పొట్ట మీద కానీ పక్కలో గానీ పడుకోబెట్టాలి. ఆ విధంగా తల్లీ బిడ్డలకుఒక శారీరక అనుబంధం ఏర్పడేట్టు చేయాలి దానివలన కొన్ని హార్మోన్లు రిలీజ్ అవుతాయి.
సాధారణ కాన్పు అయిన గంటలోగా, ఆపరేషన్ కాన్పుల్లో ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా బిడ్డకు పాలిప్పించాలి.
మొదటి రెండు రోజులూ అనుభవం కలిగిన నర్సులు గానీ పెద్ద వారు కానీ పక్కనే ఉండి తల్లీ బిడ్డలకు సహాయం చేయాలి.
తల్లి విశ్రాంతిగా, ప్రశాంతంగా, సౌకర్యంగా కూర్చుని గానీ, ఒక పక్కకు తిరిగి పడుకుని గానీ బిడ్డకు పాలివ్వాలి.
అనవసరమైన ఆందోళనా, అసౌకర్యమైన పొజిషన్ వలన ఒళ్లునెప్పులే కాక, పాలు కూడా తక్కువొస్తాయి.
పాలు ఇచ్చే ముందు ఏం చేయాలి?
పాలిచ్చే ముందు గోరు వెచ్చని నీటిలో ముంచిన శుభ్రమయిన బట్టతో రొమ్ములు తుడుచుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవడం వలన పాలు సులభంగా వస్తాయి.
పాలివ్వబోయే ముందు రెండు గ్లాసుల మంచి నీరు కానీ, ఒక గ్లాసుడు పాలు గానీ తాగితే నీరసం అనిపించదు. డీహైడ్రేషన్ రాదు.
బిడ్డ పైపెదవికి నిపుల్ తాకించి నోరు తెరుచుకునేట్టు చేసి, నిపుల్ చుట్టూ వుండే నల్లటి భాగమైన ఏరియోలా మొత్తం బిడ్డ నోట్లోకి వెళ్లేట్లుగా పట్టుకోవాలి దీనినే "లాచింగ్ "అంటారు.
బిడ్డ సరిగ్గా లాచింగ్ చెయ్యాలి. తల్లి రొమ్ముని కరిచిపట్టి, తన క్రింది దవడతో చప్పరిస్తూ తాగడం వలన, పాలు ఎక్కువ పరిమాణంలో రావడం తోబాటు, నిపుల్ చివరలు చిట్లి "క్రాక్ "లు రాకుండా వుంటాయి.
బిడ్డ సరిగా కరుచుకోక పోతే వాతావరణంలోని గాలి కడుపులోకి పోయి, బిడ్డ పొట్ట ఉబ్బరమూ, కడుపు నెప్పీ రావడమే కాక, పాలు కూడా తక్కువగా వస్తాయి.
పాలు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి?
బిడ్డ పాలు తాగుతూ మధ్యలో నిద్రపోతే బుగ్గ మీద చిటికె వేసిగానీ, అరికాలులో తట్టి గానీ లేపాలి.
పాలివ్వడం అయిపోగానే తల్లి తన చిటికెన వేలితో బిడ్డ నోటినుండీ సున్నితంగా నిపుల్‌ని బయటకు తీసుకోవాలి.
పాలివ్వడం అయిపోయాక రొమ్ముల్లో మిగిలిన పాలని, చేత్తో కానీ బ్రెస్ట్ పంపుతో కానీ పిండి పారబొయ్యాలి. అలా చేయక పోతే తర్వాత పాలు తగ్గి పోవడమే కాక, పాలు గడ్డలు కట్టి వాపుకీ, చీముగడ్డ తయారు కావడానికీ కారణమవ్వవచ్చు.
పాలు తాగిన తర్వాత బిడ్డను భుజం మీద వేసుకుని తేనుపు వచ్చాక మాత్రమే పడుకోబెట్టాలి. దీనినే "బర్పింగ్ "అంటారు. ఇలా చేయకుండా పడుకోబెడితే పాలు వాంతయి, అవి ఊపిరితిత్తులలోకి పోయి ప్రాణప్రమాదం సంభవించవచ్చు.
బిడ్డను ఒక పక్కకు పడుకోబెట్టడం, తల కొంచెం పల్లంగా వుండేట్టు చూడటం మంచిది. అందువలన ఒకవేళ వాంతి అయినా ఊపిరితిత్తులలోకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పాలివ్వడం వలన తల్లీ బిడ్డలకు కలిగే ప్రయోజనాలు ఏంటి?
తల్లికి కలిగే ప్రయోజనాలు...
- గర్భసంచీ తొందరగా ముడుచుకుని ,సాధారణ పరిమాణానికి వస్తుంది
- అధిక రక్తస్రావం అవకుండా వుంటుంది
- ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవ్వడం వలన, మానసిక ప్రశాంతత వస్తుంది
- ఊబకాయం రాకుండా నిరోధిస్తుంది (పాలివ్వడం వలన కాలరీలెక్కువ ఖర్చవడం ఒక కారణం)
- బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి
- గుండె సమస్యలూ, షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి
పిల్లలకు కలిగే ప్రయోజనాలు...
- బ్రెస్ట్ మిల్క్ పరిశుభ్రమైనవి
- అలెర్జీలూ, ఆస్త్మా రాకుండా రక్షణ కలిగిస్తాయి
- తల్లితో మానసిక అనుబంధం ఏర్పడుతుంది/పెరుగుతుంది
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు, రోటా, వైరల్ డయేరియాలతో పాలు పలు వ్యాధుల నుండీ రక్షణ లభిస్తుంది
- ఇ.కోలై వంటి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండీ రక్షణ లభిస్తుంది
- ఊబకాయం ,డయాబెటిస్ నుండీ రక్షణ లభిస్తుంది
- మలబద్ధకం ఉండదు
- విటమిన్స్ (ఒక్క విటమిన్ కె, విటమిన్ డి తప్ప) అన్నీ అందుతాయి
- సడెన్ ఇన్ ఫాంట్ డెత్ సిండ్రోమ్ ---SIDS (అంటె హఠాత్తుగా కారణం తెలీకుండా పిల్లలు చనిపోవడం) నివారింపబడుతుంది
- తెలివి తేటలు బాగుంటాయి
- కొన్ని రకాల క్యాన్సర్ల నుండీ కూడా రక్షణ దొరుకుతుంది
పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
పాలూ, ఆకుకూరలూ, పళ్లూ, పప్పులూ, గుడ్లూ, చేపలు కలిగిఉన్న పరిశుభ్రమయిన సమతులాహారం, సమృద్ధిగా మంచినీళ్లూ తీసుకోవాలి.
కొన్ని రకాలయిన బెర్రీలూ, టమాటాలూ, ఉల్లి, క్యాబేజీ ఫామిలీకి చెందినవీ బిడ్డకు సరిగా జీర్ణమవక విరేచనాలకి దారి తీయవచ్చు. అలాంటి వాటిని తగ్గించు కోవాలి.
పాలిచ్చినన్నాళ్లూ సుమారు ఆరు నెలలు డైటింగ్ చేయకూడదు.
తల్లి పాలు ఎప్పుడు ఇవ్వకూడదు?
ఇన్ని ప్రయోజనాలు సమకూర్చే తల్లి పాలను కొన్ని పరిస్థితులలో ఇవ్వవద్దు అని చెబుతాం అవేవంటే...
- రొమ్ము మీద చీము గడ్డలు, ఒళ్లంతా చీము వ్యాపించినప్పుడు
- టి.బీ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు
- ఎయిడ్స్ వ్యాధి తల్లికి వుండి, బిడ్డకు లేకపోతే
- ఆల్కహాలు, మత్తుమందులు తీసుకున్నప్పుడు
- కొన్ని రకాల మందులు వాడేటప్పుడు... అవి పాలల్లో వస్తాయనుకుంటే
- కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు, క్యాన్సర్ మందులు వాడేటప్పుడూ
- యాంటీ థైరాయిడ్ మందులూ, రేడియేషన్ మందులూ తీసుకునేటప్పుడూ

తల్లి, బిడ్డ ఆరోగ్యం గురించి కొన్ని కథనాలు...
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
- బహిరంగ ప్రదేశాల్లో తల్లులు పిల్లలకు పాలిస్తే తప్పేంటి?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- అమ్మ పాలు... బాటిల్ రూ.250
- #HisChoice: పాపకు తల్లిగా మారిన ఒక తండ్రి కథ
- కెనడా: ఆ మహిళలు ఇతరుల కోసం తల్లులవుతున్నారు... అదీ ఉచితంగా
- భారత్: పదేళ్లలో రెట్టింపైన సిజేరియన్ జననాల శాతం

పోత పాలు ఎప్పుడు ఇవ్వాలి?
బిడ్డకు తల్లి పాలు పట్టలేని పరిస్థితులలో ఉన్నప్పుడు పోత పాలు ఇవ్వాలి.
తల్లికి జబ్బుగా ఉన్నప్పుడూ
పాలు ఉత్పత్తి కానప్పుడూ
తల్లి దగ్గరలేనప్పుడూ... ఉద్యోగస్తులు, కొంతసేపు పోతపాలూ, కొంత సేపూ తల్లి పాలూ వారి అనుకూలాన్ని బట్టి ఇస్తూ ఉంటారు
ఇంకా కొన్ని పరిస్థితులలో తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా గేదె పాలు, ఆవు పాలు, డబ్బా పాలు ఇస్తూ ఉంటారు.
ఆవు పాలు తల్లిపాలతో సమానమా?
ఇక్కడొక మాట ఆవు పాలు తల్లిపాలతో సమానం అనుకుంటూ ఉంటారు అది తప్పు.
ఏ పాలూ తల్లిపాలతో సమానం కాదు.
ఆవు పాలల్లో కాల్షియమ్, సోడియం, క్లోరైడ్ లెవెల్సు ఎక్కువ. ఇవి చిన్న బిడ్డ కిడ్నీ మీద ప్రభావం చూపే ప్రమాదముంది.
అందు వలన డాక్టర్ సలహాతో బిడ్డకు ఏ పాలు మంచివో నిర్ణయించుకుని వాడాలి.

ఫొటో సోర్స్, Getty Images
పోతపాలతో ఇబ్బందులు
- పాలు పట్టే సీసాలు జాగ్రత్తగా స్టెరిలైజ్ చేసి వాడాలి
- పాలూ నీళ్లూ సమ పాళాల్లో కలపాలి
- విటమిన్లూ, ఖనిజాలూ సప్లిమెంట్ చేయాలి
- పోతపాల పిల్లలకి ఇన్ఫెక్షన్లూ, విరేచనాలూ ఎక్కువ
- మలబద్ధకం, ఊబకాయం ఎక్కువ
- కడుపు నొప్పి, అలర్జీలూ కూడా ఎక్కువే
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని... పోతపాలు పోసేవారు తగిన జాగ్రత్తలు తీసుకుని బిడ్డలను పెంచాలి.
పాలిచ్చే తల్లులలో వచ్చే సమస్యలు... నివారణ మార్గాలు
రిట్రాక్టెడ్ నిపుల్స్: గర్భిణిగా వున్నప్పుడే ఈ సమస్యను గుర్తించి, జెంటిల్ మసాజ్, బ్రెస్ట్ పంప్ ట్రాక్షన్‌తో ఈ సమస్యను నివారించాలి. అలా కాని పక్షంలో, కానుపయ్యాక కొంతకాలం నిపుల్ షీల్డ్ వాడాలి.
క్రాక్డ్ నిపుల్స్: దీనిని నివారించాలంటే బిడ్డకు సరైన పద్ధతిలో పాలివ్వాలి. డాక్టర్ సలహాతో ఆయింట్ మెంట్ వాడి, నిపుల్ షీల్డ్‌తో పాలివ్వాలి. లేదంటే తాత్కాలికంగా బ్రెస్ట్ పంపుతో పాలు తీసి పట్టాలి.
బ్రెస్ట్ ఎంగార్జ్ మెంట్: ఎప్పటికప్పుడు బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలు పిండి పారబొయ్యటం ద్వారా ఈ సమస్య రాకుండా నివారించ వచ్చు.
మాస్టైటిస్: రొమ్ము ఎర్రపడి వాచి, జ్వరం వస్తుంది. దీనికి నివారణ వేడి నీళ్ల కాపడం. పాలు పిండి పారబొయ్యడం. పెయిన్ కిల్లర్లూ. యాంటీ బయొటిక్సూ వాడాలి. దీనికి కారణం బిడ్డ నోట్లోనూ, ముక్కులోనూ ఉండే బాక్టీరియా. అందుకే బిడ్డను పరిశుభ్రమయిన వాతావరణంలో పెంచాలి.
బ్రెస్ట్ యాబ్సెస్: మాస్టైటిస్ తగ్గక పోతే చీముగడ్డగా మారు తుంది. దీనికి నివారణ డాక్టర్ సలహాపై చీము తీయించుకుని తగిన మందులు వాడటం.
పాలు మాన్పించడం: బిడ్డకు ఆరునెలల వయసు దాటాక నెమ్మదిగా తల్లి పాలు తగ్గిస్తూ ప్రత్యామ్నాయ ఆహారానికి అలవాటు చెయ్యాలి. దీనినే "వీనింగ్ "అంటారు. ఈ ఆహారాలు మార్కెట్‌లో దొరికేవి కానీ... మెత్తగా గుజ్జుగా ఉడికించిన అన్నం, పప్పులూ కానీ అయిఉంటాయి. ఆరునెలలు దాటాక తల్లి పాలలో బలం చాలదు. మాన్పించ కుండా ఇస్తుంటే బిడ్డ ఆ వచ్చిన కొంచెమే తాగి బలహీనమవుతుంది. కాబట్టి నెమ్మదిగా ఆ అలవాటు మాన్పించి, రెండో ఏడు వచ్చేసరికి పూర్తిగా అన్నం తినడం మొదలు పెట్టేలా చూడాలి.
చివరగా చెప్పేదేమంటే ,తల్లిపాలు అన్నిటికంటే ఉత్తమమయినవి.
పాలివ్వడం వలన సౌందర్యానికేమీ లోపం ఉండదు, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే.
పైపెచ్చు బోలెడన్ని ఆరోగ్య సమస్యలనుండీ తల్లీ బిడ్డలకు రక్షణ దొరుకుతుంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తప్పని సరి పరిస్థితులలో తప్ప పోతపాలకి తావివ్వకుండా ఉంటే తల్లీ బిడ్డలు అయిన వారి ఆరోగ్యం బాగుంటుంది.
ఇవి కూడా చదవండి:
- ఇవి తింటే.. మీ జుట్టు భద్రం!
- వైన్‌తో ‘దంత సమస్యలు దూరం’!
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
- నిమ్మకాయ ఎక్కడ పుట్టిందో తెలుసా?
- గుజరాత్లో అరుదైన శిలాజాలు కనుగొన్న తెలుగు ప్రొఫెసర్
- రక్తదానం, అవయవదానాలు సరే.. అండదానం తెలుసా!
- భయం ఎందుకు వస్తుంది? సైన్స్ ఏం చెబుతోంది?
- ఫేక్‌న్యూస్ గురించి పిల్లలకు ఎలా చెప్పాలి?
- ఎండోమెట్రియాసిస్: లక్షణాలు ఏంటి.. ఎంత ప్రమాదకరం?
- ఊబకాయం కేన్సర్‌కు దారితీయొచ్చు... జాగ్రత్త
- మలేరియా: దోమలపై దోమలతో యుద్ధం
- స్వలింగ సంపర్కానికి, వేళ్ల పొడవుకు సంబంధం ఉందా?
- క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది కానీ ఎక్కువ మంది తినడం లేదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








