క్యాన్సర్లు, గుండె పోటును దూరం చేసే ఇది వంటగదిలోనే ఉంటుంది.. కానీ ఎక్కువ మంది తినడం లేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళఘర్
- హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరెస్పాండెంట్ - బీబీసీ న్యూస్
మీరు ఎక్కువ కాలం జీవించటానికి సూపర్‌ఫుడ్ ఒకటి సూచిస్తే.. మీరేమంటారు?
ఇది సహజంగానే.. గుండె పోటు, మెదడు పోటు అవకాశాలతో పాటు.. జీవిత కాలం వేధించే టైప్-2 డయాబెటిస్ వంటి వ్యాధులనూ దూరంగా ఉంచుతుంది.
మీ శరీర బరువు, రక్త పోటు, కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండటానికి దోహదం చేస్తుంది.
అంతేకాదు.. అది చాలా చౌకైన ఆహారం. సూపర్‌మార్కెట్‌లో విస్తారంగా దొరుకుంది.
అదేమిటి?
ఫైబర్ - అంటే పీచు పదార్థం. ఇది అత్యంత ఆకర్షణీయమైన ఆహారమేమీ కాదు. కానీ మనం ఎంత ఫైబర్ తినాలి అనే అంశం మీద చేసిన పరిశోధనల్లో.. దీనివల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించారు.
‘‘దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. పరిస్థితులను పూర్తిగా మార్చివేయగలదు. దీని గురించి జనం గట్టిగా పట్టించుకోవటం మొదలుపెట్టాలి’’ అని ఆ పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ జాన్ కమ్మింగ్స్ బీబీసీ న్యూస్‌తో పేర్కొన్నారు.
మలబద్ధకాన్ని ఈ ఫైబర్ తగ్గిస్తుందనేది బాగా తెలిసిన విషయమే. కానీ దీనివల్ల అంతకన్నా విస్తృతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మనకు ఎంత ఫైబర్ అవసరం?
ఒక వ్యక్తి రోజుకు కనీసం 25 గ్రాముల ఫైబర్ తినాలని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో, యూనివర్సిటీ ఆఫ్ డుండీ పరిశోధకులు చెప్తున్నారు.
ఆరోగ్యం మెరుగుపడటానికి ఇది ‘‘తగినంత’’ మొతాదు అని.. అయితే రోజుకు 30 గ్రాముల ఫైబర్ తినటం వల్ల ఇంకా అధిక ప్రయోజనాలు ఉంటాయని వారు పేర్కొన్నారు.
అంతేనా?
ఒక అరటిపండు సుమారు 120 గ్రాముల బరువు ఉంటుంది. కానీ అది మొత్తం ఫైబర్ కాదు.
అందులో ఉన్న సహజమైన చక్కెరలు, నీటితో సహా అంతా తీసేస్తే.. కేవలం మూడు గ్రాముల ఫైబర్ మాత్రమే తేలుతుంది.
ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు రోజుకు 20 గ్రామాుల కన్నా తక్కువ ఫైబర్ తింటున్నారు.
బ్రిటన్‌లో ప్రతి 10 మంది వయోజనుల్లో ఒకరి కన్నా తక్కువ మంది మాత్రమే రోజుకు 30 గ్రాముల ఫైబర్ తింటున్నారు.
సగటున మహిళలు రోజుకు 17 గ్రాములు, పురుషులు 21 గ్రాములు ఫైబర్ తింటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలేమిటి?
పండ్లు, కూరగాయలు, పూర్ణధాన్యాలతో చేసిన బ్రెడ్, బీన్స్ వంటి పప్పులు, సెనగలు, గింజలు వంటి వాటిల్లో ఫైబర్ ఉంటుంది.
సులభమైన చిట్కాలున్నాయా?
- బంగాళాదుంపలను తోలుతో సహా ఉడికించటం
- పోరిడ్జ్ ఓట్స్ వంటి అధిక ఫైబర్ ఉన్న తృణధాన్యాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవటం
- సెనగలు, బీన్స్, పూర్ణధాన్యాలను కూరల్లో కలిపి వండుకోవటం
- మధ్యమధ్యలో శ్నాక్స్‌గా గింజలు, తాజా పండ్లు తినటం
- రోజుకు కనీసం ఐదో వంతు పండ్లు, కూరగాయలు తినటం
ఫైబర్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?
పరిశోధకులు 185 అధ్యయనాలను, 58 క్లినికల్ ప్రయోగాలను విశ్లేషించి.. ఫలితాలను ద లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించారు.
రోజుకు 15 గ్రాముల కన్నా తక్కువ ఫైబర్ ఆహారం తీసుకునే 1,000 మందిని.. రోజుకు 25 నుంచి 29 శాతం ఫైబర్ తీసుకునేలా మార్చితే.. దానివల్ల 13 మరణాలు, ఆరు గుండె పోట్లను నివారించవచ్చునని ఆ అధ్యయనం చెప్తోంది.
టైప్-2 డయాబెటిస్ స్థాయి తక్కువగా ఉండటం, పెద్ద పేగు క్యాన్సర్ అవకాశాలు తగ్గిపోవటంతో పాటు.. బరువు, రక్తపోటు, కొవ్వు స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి.
అంతేకాదు.. ఎంత ఎక్కువ ఫైబర్ తింటే అంత మంచిదని ఆ అధ్యయనం సూచిస్తోంది.
మన శరీరంలో ఈ ఫైబర్ ఏం చేస్తుంది?
ఫైబర్ వల్ల శరీరానికి పెద్దగా ఉపయోగం లేదని.. మానవ శరీరం దానిని జీర్ణం చేసుకోలేదని గతంలో భావించేవారు.
కానీ.. ఫైబర్ వల్ల మన కడుపు నిండినట్లు అనిపిస్తుంది. చిన్న పేగు కొవ్వును గ్రహించే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక పెద్దపేగుల్లో కోట్ల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియాకు ఆహారం లభిస్తుంది.

పెద్ద పేగులో బ్యాక్టీరియా ఫైబర్‌ను పులియబెడుతూ అనేక రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.
అందులో ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. అవి శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతాయి.
ఇప్పుడిది ఎందుకు అవసరం?
ఫైబర్, ముడి ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఆరోగ్యకరమైన ఆహారం అనే విషయం కొత్తదేమీ కాదు.
అయితే.. తక్కువ కార్బోహైడ్రేడ్లు ఉండే ఆహారాలు ప్రజాదరణ పొందటంతో ఫైబర్‌ను ప్రజలు విస్మరిస్తుండటం మీద ఆందోళన వ్యక్తమవుతోంది.
‘‘ఈ అధ్యయనాన్ని మనం సీరియస్‌గా పట్టించుకోవాల్సిన అవసరముంది. దీర్ఘ కాలం ఆరోగ్యంగా ఉండటానికి ఫైబర్, ముడి ధాన్యాలు తీసుకోవటం ముఖ్యమని ఈ పరిశోధన నిర్ధారిస్తోంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ నీటా ఫోరోహి పేర్కొన్నారు.
ప్రజలు తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఎంత మొత్తం ఫైబర్ తినాలి అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను రూపొందించటం కోసం ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ మార్గదర్శకాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ఇవి చూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












