సూపర్ ఫుడ్స్: బీట్‌రూట్, వెల్లుల్లి, పుచ్చకాయ తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుందా

బీట్‌రూట్, వెల్లుల్లి, పుచ్చకాయ

ఫొటో సోర్స్, Getty Images

బీట్‌రూట్, వెల్లుల్లి, పుచ్చకాయ తినడం వల్ల నిజంగానే బీపీ (రక్తపోటు) అదుపులో ఉంటుందా అనే అంశాన్ని బ్రిటన్ డాక్టర్ క్రిస్ వాన్ టుల్లేకెన్ పరీక్షించారు. అసలు ఇందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం.

ఈ మూడు ఆహార పదార్థాల గురించి వినిపిస్తోన్న మాటలు నిజమైతే గనక ఇవి 'ప్రాణ రక్షకులు'గా నిలిచిపోతాయి.

కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ ఆండీ వెబ్ కూడా ఈ వాదనల్లోని నిజాన్ని తెలుసుకోవడానికి పెద్ద ప్రయోగం నిర్వహిస్తున్నారు.

నిజానికి ఇవి ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో అర్థం చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: WHO సురక్షిత ఆహారం గురించి చెప్పిన 5 సూత్రాలు

ఈ ప్రయోగం ఎలా జరిగింది?

బీపీతో బాధపడుతోన్న మొత్తం 28 మంది వాలంటీర్లను ఈ ప్రయోగం కోసం ఎంచుకున్నారు. వీరందరూ 130mm పైగా రక్తపోటును కలిగి ఉన్నారు. ఆరోగ్యవంతుడైన సాధారణ మనిషిలో బీపీ గరిష్టంగా 120mmగా ఉంటుంది. ఈ వాలంటీర్లను మూడు గ్రూపులుగా విభజించారు.

మొదటి వారంలో, గ్రూప్-1లో ఉన్న వాలంటీర్లకు ప్రతీరోజు రెండు వెల్లుల్లి రెబ్బలను ఇచ్చారు. గ్రూప్-2 వాలంటీర్లకు పెద్ద పరిమాణంలోని రెండు పుచ్చకాయ ముక్కలను తినిపించారు. అదే సమయంలో గ్రూప్-3లోని సభ్యులకు రెండు బీట్‌రూట్‌లను ఇచ్చారు.

రెండు, మూడు వారాల్లో ప్రతీ గ్రూపు సభ్యులకు ఇచ్చే ఆహారపదార్థాలను పరస్పరం మార్చారు. దీనివల్ల, మూడు వారాల వ్యవధిలో ప్రతీ గ్రూపులోని వాలంటీర్లందరూ మూడు రకాల ఆహారపదార్థాలను తీసుకున్నారు.

పుచ్చకాయ

ఫొటో సోర్స్, STEVE EVANS/ WIKIMEDIA COMMONS

వెల్లుల్లి, బీట్‌రూట్, పుచ్చకాయ ప్రత్యేకత ఏంటి?

మీడియాలో వినిపించే 'సూపర్ ఫుడ్స్' అనే పదాన్ని మనం పెద్దగా పట్టించుకోం. మనం తినే, తాగే చాలా పదార్థాలు మన శరీరంపై చాలా మంచి ప్రభావం చూపుతాయనేది నిజం.

వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే ఈ మూడు పదార్థాలను పరీక్షించాం.

సిద్ధాంతపరంగా చూస్తే, మనం తినే ఈ మూడు పదార్థాలు రక్తపోటును తగ్గిస్తాయి.

పుచ్చకాయ, బీట్‌రూట్, వెల్లుల్లి తినడం వల్ల మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్తసరఫరా సులభంగా జరుగుతుంది. ఈ విధంగా ఇవి రక్తపోటును తగ్గించడంలో కృషి చేస్తాయి. కానీ ఈ మూడు పదార్థాలు తినడం వల్ల కలిగే ప్రభావం ఒకే రకంగా ఉండదు.

వీడియో క్యాప్షన్, కూరగాయలు పండిస్తూ లక్షలు సంపాందిస్తున్న మహిళలు

పరీక్షలో ఏం తేలింది?

ప్రతీ వాలంటీర్ బీపీని ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు పరీక్షించారు. ప్రతీసారి మూడు చొప్పున రీడింగులను తీసుకొని వాటి సగటును లెక్కగట్టారు. దీనిద్వారా ఈ మూడు పదార్థాలు చూపించే ప్రభావాన్ని తెలుసుకోవడం సాధ్యమైంది. ఈ మూడింటిలో ఏ పదార్థం ఎక్కువగా ప్రభావం చూపుతుందో ఈ డేటా ద్వారా వెల్లడైంది.

ప్రయోగంలో పాల్గొన్న వాలంటీర్లు సాధారణ జీవితం గడుపుతున్నప్పుడు వారందరి సగటు రక్తపోటు 133.6 మి.మీగా నమోదైంది. ప్రయోగంలో భాగంగా బీట్‌రూట్ తిన్న వాలంటీర్ల సమూహం సగటు రక్తపోటు 128.7మి.మీ, వెల్లుల్లి తిన్న గ్రూపు సభ్యుల సగటు రక్తపోటు 129.3మి.మీ ఉన్నట్లుగా గుర్తించారు.

ఈ చిన్న సమూహంపై నిర్వహించిన ప్రయోగ ఫలితాలు, డాక్టర్ వెబ్ సహా ఇతర నిపుణులు చేసిన భారీ ప్రయోగాల ఫలితాలతో సరిపోలింది.

అధిక రక్తపోటు, గుండె జబ్బుల మధ్య ఉండే సంబంధంపై జరిపిన ఈ అధ్యయనాలు... వాలంటీర్ల బీపీలో నమోదైన తగ్గుదల ఇలాగే ఉంటే, హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని 10శాతం వరకు తగ్గించవచ్చని చెబుతున్నాయి.

వీటి తరహాలో పుచ్చకాయ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీనివల్ల అత్యుత్తమంగా బీపీ 129.8 మి.మీ వరకే తగ్గింది. ఎందుకంటే పుచ్చకాయలో అధిక శాతం నీరే ఉంటుంది. ఇందులో క్రియాశీల అంశాలు పెద్దగా లేవు.

ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

ప్రయోగం వల్ల మనకు ఏం తెలిసింది?

క్రమం తప్పకుండా బీట్‌రూట్, వెల్లుల్లిని తీసుకోవడం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని ఈ చిన్న అధ్యయనం ద్వారా తెలిసింది. అయితే రక్తపోటు తగ్గుదల అనేది కేవలం ఈ రెండు పదార్థాల వల్లే జరగదు.

బీట్‌రూట్‌లో ముఖ్యంగా నైట్రేట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఈ నైట్రేట్స్ అన్ని ఆకుపచ్చ కూరగాయలు, వాము, క్యాబేజ్, పాలకూర, బ్రాకోలీ, బచ్చలి ఆకుల్లో కూడా లభ్యమవుతాయి.

మరోవైపు వెల్లుల్లిలో ప్రధానంగా అల్లిసిన్ ఉంటుంది. ఇది ఉల్లిపాయలతో పాటు ఉల్లి తరహా జాతుల్లో సమృద్ధిగా ఉంటుంది.

ఈ పరీక్ష ద్వారా రక్తపోటును తగ్గించడానికి సహాయపడే అనేక వస్తువులు ఉన్నాయని కనుగొన్నారు. వాటిని మనం ఎలా ఉపయోగిస్తామన్న అంశంపై అవి ఎంత ప్రభావం చూపిస్తాయన్నది అధారపడి ఉంటుంది.

బ్రాకోలీ

ఫొటో సోర్స్, Getty Images

కూరగాయలు, ఆకుకూరల్లోని నైట్రేట్లను ఎలా పొందాలి?

  • సలాడ్స్, కూరగాయలను ఉడికించకుండా పచ్చిగానే తినాలి. కూరగాయలను ఉడికించినా లేదా వేపినా వాటిలో ఉండే నైట్రేట్ల శాతం తగ్గిపోతుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరల ద్వారానే అధిక శాతం నైట్రేట్‌ను పొందవచ్చు.
  • నైట్రేట్లు నీటిలో కరుగుతాయి. కూరగాయలు, ఆకుకూరలను మనం ఉడికించినప్పుడు వాటిలోని కొన్ని నైట్రేట్లు నీటిలో కరిగిపోతాయి. పచ్చళ్ల రూపంలో తయారు చేసినా కూడా నైట్రేట్లు వృథా అవుతాయి.
  • ఒకవేళ మీరు బీట్‌రూట్‌ను ఉడికించాలి అనుకుంటే గనక అలాగే ఉడకబెట్టాలి. అంతేగానీ బీట్‌రూట్ పైభాగం, కింది భాగం కట్ చేసి ఉడికిస్తే అందులోని నైట్రేట్లను కోల్పోతాం.
  • బీట్‌రూట్ జ్యూస్ తాగండి. ఈ జ్యూస్‌లో అధిక శాతం నైట్రేట్లు ఉంటాయి.
  • సూప్‌గా కూడా తీసుకోవచ్చు. సూప్‌గా చేసుకోవడం వల్ల నీటిలో కరిగిన నైట్రేట్లను కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి సూప్ తాగడం మంచిది.
  • కూరగాయలు లేదా ఆకుకూరలను నీటిలో ఉడికించి తినడం కంటే ఆవిరిలో ఉడికించడం చాలా మంచిది. ఒకవేళ ఉడికించే తినాలనుకుంటే, వాటిని తక్కువ నీటిలో ఉడికించాలి. కూరగాయలు ఉడికించిన నీటితో సూప్‌ లేదా ఇతర ఆహార పదార్థాల్లో వినియోగించుకుంటే అందులోని నైట్రేట్లను పొందవచ్చు.
• వెల్లుల్లి

ఫొటో సోర్స్, VIBHURAJ/BBC

వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి?

  • వెల్లుల్లిని మెత్తగా రుబ్బుకోవాలి. లేదా వీలైనంత చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఎంత మెత్తగా రుబ్బితే, దాన్నుంచి అంత ఎక్కువగా అల్లిసిన్‌ను పొందవచ్చు.
  • వెల్లుల్లిని రుబ్బిన తర్వాత వీలైనంత త్వరగా దాన్ని వాడుకోవాలి. సూప్‌లలో లేదా రెడీ టు ఈట్ రెసిపీలలో ఉపయోగించుకోవచ్చు. టోస్ట్, మష్రూమ్ వంటి వాటిలో కూడా దీన్ని వాడుకోవచ్చు.
  • వెల్లుల్లిని తరిగిన తర్వాత, అందులో ఉండే అల్లిసిన్ వేగంగా క్షీణించడం ప్రారంభమవుతుంది. అందుకే వెంటనే ఉపయోగించాలి.
  • మైక్రోవేవ్‌లో వెల్లుల్లిని ఉంచవద్దు. వేడి చేసినప్పుడు అందులోని అల్లిసిన్ వేగంగా క్షీణిస్తుంది. ఇక మైక్రోవేవ్‌లో అయితే అది పూర్తిగా నశించిపోతుంది.

హెచ్చరిక: వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ బలహీనమవుతుంది.

రన్నింగ్

ఫొటో సోర్స్, Getty Images

జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కూడా బీపీని తగ్గించుకోవచ్చు

తమ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కొన్ని వారాల్లోనే బీపీని తగ్గించుకోవడంలో చాలామంది సఫలీకృతమయ్యారు. రక్తపోటు ఉన్నవారు కింది సూచనలు పాటించాలి.

  • శారీరక వ్యాయామాలు చేస్తూ చురుగ్గా ఉండాలి.
  • మంచి డైట్‌ను పాటించాలి. తక్కువ కొవ్వు ఉండే, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు తినాలి.
  • ఆల్కహాల్, స్మోకింగ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి.
  • బరువును అదుపులో ఉంచుకోవాలి.
  • ప్రతీరోజూ 6 గ్రాములకు మించి ఉప్పును తీసుకోకూడదు.
  • తక్కువ పరిమాణంలో కాఫీ, టీ, శీతల పానీయాలను తీసుకోవాలి. రోజుకు నాలుగు కప్పులకు మించి కాఫీ తాగితే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదముంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)