బీబీక్యూ బఫే: ఒకేసారి 4.5 కిలోల రొయ్యలు తిన్న వ్యక్తి.. మళ్లీ రావొద్దన్న రెస్టారెంట్

చైనా

ఫొటో సోర్స్, Getty Images

అతిగా తింటున్నానని తనపై ఓ గ్రిల్ బఫే రెస్టారెంట్‌ నిషేధం విధించిందని చైనా ఫుడ్ లైవ్ స్ట్రీమర్ వెల్లడించారు.

మిస్టర్ కాంగ్‌గా సుపరిచితుడైన ఆయన హునాన్ టీవీతో మాట్లాడారు. తనను చాంగ్‌షా సిటీలోని హండడి సీఫుడ్ బీబీక్యూ బఫే బ్యాన్‌ చేసిందని ఆయన వివరించారు.

తొలిసారి రెస్టారెంట్‌కు వచ్చినప్పుడు ఆయన 1.5 కేజీల పోర్క్ ట్రొట్టెర్స్ (పంది కాళ్లు) తిన్నారు. రెండోసారి వచ్చినప్పుడు 3.5 నుంచి 4.5 కేజీల రొయ్యలు తిన్నారు.

ఎక్కువగా తినే వారిపై ఈ రెస్టారెంట్ పక్షపాతం చూపిస్తోందని కాంగ్ అన్నారు.

‘‘నేను ఎక్కువగా తింటాను. అది నా తప్పా?’’అని ఆయన ప్రశ్నించారు. తాను ఆహారాన్ని వృథా చేయలేదని వివరించారు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్ వల్ల తమకు భారీగా నష్టం వస్తోందని రెస్టారెంట్ యజమాని ఓ రిపోర్టర్‌తో చెప్పారు.

‘‘ఆయన వచ్చిన ప్రతిసారీ, నాకు కొన్ని వందల యువాన్ల నష్టం వస్తోంది’’అని రెస్టారెంట్ యజమాని తెలిపారు.

‘‘సోయా మిల్క్ కూడా అతడు 20 నుంచి 30 బాటిళ్లు తాగుతాడు. పంది కాళ్లు తినేటప్పుడు, ట్రే మొత్తం ఖాళీ చేస్తాడు. రొయ్యలను తినేటప్పుడు ఎవరైనా స్టిక్స్‌ను ఉపయోగిస్తారు. ఆయన మాత్రం ట్రేను తెప్పించి, ఒకేసారి తినేస్తారు’’అని ఆయన వివరించారు.

తమ రెస్టారెంట్ నుంచి కాంగ్‌ను ఫుడ్ లైవ్‌లు చేయబోనివ్వమని ఆయన స్పష్టంచేశారు.

చైనా సోషల్ మీడియాలో ఈ స్టోరీ ట్రెండ్ అవుతోంది. వీబోలో ఈ స్టోరీకి 25 కోట్లకుపైనే వ్యూస్ వచ్చాయి. దీనిపై ప్రజలు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

విపరీతంగా తినేవారిని భరించలేనప్పుడు ఎంతైనా తినొచ్చని ఎందుకు పెట్టడం? అంటూ కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు రెస్టారెంట్ యజమానిని చూసి పాపం అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)