జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు కిడ్నాప్ చేసి చంపేశారా

ఫొటో సోర్స్, Vijay Kumar
- రచయిత, సీతు తివారీ
- హోదా, బీబీసీ కోసం
బిహార్‌లోని మధుబని జిల్లాలో సగం కాలిన మృతదేహం లభించింది. అది జర్నలిస్టు బుద్ధినాథ్ ఝా మృతదేహం.
స్థానిక నర్సింగ్ హోంలు, ఆస్పత్రులకు వ్యతిరేకంగా ఆయన అనేక ఫిర్యాదులు చేశారు. ఆస్పత్రుల నిర్వహకులే బుద్ధినాథ్‌ను చంపేశారని బాధితుడి బంధువులు ఆరోపించారు.
బుద్ధినాథ్‌ను హత్య చేశారని బేనిపట్టి ఏరియా ఎస్‌హెచ్ఓ అర్వింద్ కుమార్ ధ్రువీకరించారు.
ఈ హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఆయన బీబీసీతో చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, కొందరిని అదుపులోకి తీసుకున్నామని కూడా ఆయన తెలిపారు.
అయితే, అదుపులోకి తీసుకున్న నిందితులు ఆస్పత్రులకు చెందిన వారా కాదా అనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
ప్రైవేటు నర్సింగ్ హోంలపై బుద్ధినాథ్ ఝా తరచూ ఫిర్యాదులు చేసేవారని మధుబని జిల్లా సివిల్ సర్జన్ సునిల్ కుమార్ ఝా బీబీసీతో చెప్పారు.
బుద్ధినాథ్ ఫిర్యాదులతో బేనిపట్టిలో ఉన్న నాలుగు నర్సింగ్ హోంలకు కొన్ని నెలల క్రితం 50 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారని ఆయన వెల్లడించారు.

ఫొటో సోర్స్, Vijay kumar
అసలేం జరిగింది?
22 సంవత్సరాల బుద్ధినాథ్ ఝా మధుబని జిల్లాలోని బేనిపట్టిలో బీఎన్ఎన్ న్యూస్ పోర్టల్‌లో జర్నలిస్టుగా పనిచేసేవారు.
బేనిపట్టికి చెందిన ఆయన గత రెండు సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
"గతంలో బుద్ధినాథ్ ఒక క్లినిక్ ప్రారంభించారు. బయటి నుంచి డాక్టర్లు వచ్చి ఆ క్లినిక్‌లో రోగులను పరీక్షించేవారు. కానీ స్థానిక నర్సింగ్ హోం నిర్వహకులు బుద్ధినాథ్‌ను వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆయన తన క్లినిక్‌ను మూసేశారు. అప్పటి నుంచి ఫేక్ నర్సింగ్ హోంల వ్యాపారాలను మూసివేయించాలని బుద్ధినాథ్ కంకణం కట్టుకున్నాడు" అని ఆయన అన్న త్రిలోక్ ఝా చెప్పారు.

ఫొటో సోర్స్, BJ Bikash
బుద్దినాథ్ గత మూడేళ్లుగా, స్థానికంగా ఉన్న నర్సింగ్ హోంలపై ప్రజా సమస్యల పరిష్కార (పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రెసల్) అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
2016 జూన్ 5 నుంచి బిహార్‌లో పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రెసల్ చట్టాన్ని అమలు చేస్తున్నారు. పలు సమస్యలపై ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు తీసుకుని, 60 పనిదినాల్లో వాటిని పరిష్కరించడం ఈ చట్టం లక్ష్యం.
దీనితో పాటు బుద్ధినాథ్ సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉపయోగించుకున్నారు.
గత మూడు సంవత్సరాలుగా బుద్దినాథ్ ఎన్నో ప్రైవేటు నర్సింగ్ హోంలు, మెడికల్ ల్యాబ్‌లపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులతో దర్యాప్తు జరిపి, కొన్ని నర్సింగ్ హోంలపై చర్యలు కూడా తీసుకున్నారని మూడేళ్లుగా బేనిపట్టిలో ఇంచార్జి మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్ఎన్ ఝా చెప్పారు.
బుద్ధినాథ్ నిరంతర పోరాటం వల్ల 19 ల్యాబ్‌లు, నర్సింగ్ హోంలను మూసివేయాలంటూ 2021 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బుద్ధినాథ్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన అధికారులు.. 2019 డిసెంబర్‌లో మరో 9నర్సింగ్ హోంలు, ల్యాబ్‌లను మూసివేశారు.
2021 ఆగస్టులో నాలుగు ప్రైవేటు నర్సింగ్ హోంలకు 50వేల చొప్పున జరిమానా విధించారు.

ఫొటో సోర్స్, Vijay Kumar
నవంబర్ 9న కిడ్నాప్
ప్రైవేటు నర్సింగ్ హోంలపై బుద్ధినాథ్ ఝా నిరంతరం ఫిర్యాదు చేసేవారు. 'నవంబర్ 15న గేమ్ మళ్లీ మొదలుకాబోతోంది' అంటూ నవంబర్ 7న ఫేస్‌బుక్‌లో ఆయన ఒక పోస్ట్ చేశారు.
ఈ పోస్టు తర్వాత నవంబర్ 9 నుంచి బుద్దినాథ్ కనిపించకుండా పోయారని బీఎన్ఎన్ న్యూస్ పోర్టల్ హెడ్, బుద్దినాథ్ కజిన్ బీజే వికాస్ బీబీసీతో చెప్పారు.
ఆ మరుసటి రోజే మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ నవంబర్ 11న కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు.
రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 58 నిమిషాల వరకు ఇంటి ముందున్నప్రధాన రోడ్డుపై బుద్దినాథ్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. రాత్రి 10 గంటల 10 నిమిషాలకు మార్కెట్ వద్ద చివరిసారిగా కనిపించారు.
ఆ మరుసటి రోజు బుద్దినాథ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుద్ధినాథ్ సెల్‌ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేశారు పోలీసులు. బేనిపట్టి పోలీస్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెతౌన గ్రామంలో ఆ సెల్‌ఫోన్ లొకేషన్ ఉన్నట్లు తెలిసింది.
కానీ నవంబర్ 10న ఉదయం 9 గంటల తర్వాత బుద్దినాథ్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్లారు. కానీ అక్కడ వాళ్లకు ఎలాంటి క్లూస్ దొరకలేదు.

ఫొటో సోర్స్, BJ Vikash
బుద్ధినాథ్ కనిపించడం లేదన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఒక గుర్తుతెలియని శవం దొరికిందని పొరుగున ఉన్న ఉడెన్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నవంబర్ 12న బుద్దినాథ్ కజిన్ బీకే వికాస్‌కు ఫోన్ చేసి చెప్పారు.
ఆ బాడీ సగం కాలి ఉంది. ఉంగరం, కాలిపై ఉన్న పుట్టుమచ్చ, మెడలో ఉన్న గొలుసు ఆధారంగా శవాన్ని గుర్తుపట్టామని వికాస్ తెలిపారు.
బుద్దినాథ్ కనిపించకుండా పోయినప్పుడు అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు నర్సింగ్ హోంలు, క్లినిక్‌లపై అనుమానాలు వ్యక్తం చేశారు.
అనుమానాస్పద స్థితిలో బుద్దినాథ్ డెడ్‌బాడీ దొరకడం జర్నలిస్టుల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
మధుబని జిల్లా మెజిస్ట్రేట్‌తో జర్నలిస్టు హత్య గురించి మాట్లాడినప్పుడు.. ఆ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు.
మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఏమాత్రం భద్రత లేదని బిహార్ శ్రమజీవి పత్రకార్ యూనియన్ దర్భంగా డివిజన్ సెక్రటరీ అన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
సుమారు ఒక నెల రోజుల క్రితం తూర్పు చంపారన్‌లో సమాచార హక్కు కార్యకర్త విపిన్ అగర్వాల్ కూడా హత్యకు గురయ్యారు.
కోవిడ్ సమయంలో వైద్య రంగంలో అవినీతిని బయటపెట్టిన వ్యక్తిని చంపేశారని సమాచార హక్కు కార్యకర్త మహేంద్ర యాదవ్ అన్నారు.
ఉన్నతాధికారుల సాయం లేకుండా ఈ పని చేయడం వీలుకాదు. మీరు మంచి పాలన అందించాలనుకుంటే ముందుగా సమాచారా హక్కు కార్యకర్తలకు రక్షణ కల్పించాలని మహేంద్ర డిమాండ్ చేశారు.
11 సంవత్సరాల్లో బిహార్‌లో 20 మంది ఆర్టీఐ కార్యకర్తలు హత్యకు గురయ్యారని హిందూ పత్రిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
- ఆఫీస్ టైమ్ ముగిశాక ఉద్యోగులకు బాస్‌లు మెసేజ్‌లు పంపటానికి వీల్లేదు.. అమల్లోకి కొత్త చట్టం
- గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే
- డయాబెటిస్ రివర్స్ చేయడం సాధ్యమేనా?
- తేళ్లు కుట్టడంతో ముగ్గురు మృతి, వందల మంది ఆస్పత్రి పాలు - Newsreel
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












