‘వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - ముఖ్యమంత్రి బాబాయి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి వెల్లడించిన వివరాలు

వైఎస్ వివేకానంద రెడ్డి

ఫొటో సోర్స్, YSRCONGRESS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు శనివారం బయటపడ్డాయి.

2019 ఎన్నికలకు ముందు మార్చి 15 అర్ధరాత్రి తరువాత వివేకా తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు.

వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి ఈ ఏడాది(2021) ఆగస్ట్ 31న కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ప్రతులు శనివారం వివిధ ప్రసార మాధ్యమాలలో, సోషల్ మీడియాలో కనిపించాయి.

వివేకానందరెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేమిటి? హత్యకు పథక రచన చేసిందెవరు? హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు.. ఎలా హత్య చేశారు? హత్య అనంతరం కేసును తప్పుదారి పట్టించేందుకు ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పినట్లుగా ఈ పత్రాల్లో ఉంది.

అంతకుముందు సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది.

దస్తగిరి

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, దస్తగిరి

వివేకా వద్ద దస్తగిరి ఎలా చేరాడంటే..

అసలు తాను వివేకానందరెడ్డి వద్ద ఎలా చేరానన్నదీ దస్తగిరి వివరించారు. ''పులివెందులలో గత 15 ఏళ్లుగా మేం నివాసం ఉంటున్నాం. మా మామ షేక్ రసూల్ 2016 డిసెంబరులో నన్ను వైఎస్ వివేకానందరెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. ఆ తరువాత 2017 ఫిబ్రవరి నుంచి 2018 డిసెంబరు వరకు నేను వివేకా వద్ద డ్రైవరుగా పనిచేశాను. అదే సమయంలో నాకు వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డితో పరిచయమైంది. వివేకా ఎక్కడకి వెళ్లినా గంగిరెడ్డి ఆయనతో పాటు ఉండేవారు. గంగిరెడ్డితో పాటు యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఆయన సోదరుడు గజ్జల జగదీశ్వర్ రెడ్డిలతోనూ పరిచయమైంది. నేను వివేకా దగ్గర డ్రైవరుగా పని మానేసిన తరువాత కూడా వీరితో పరిచయం కొనసాగింది. తరచూ ఫోన్లో మాట్లాడడం, కలుసుకోవడం చేసేవాళ్లం'' అని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పారు.

జగన్, వివేకా

ఫొటో సోర్స్, Y.S.VIVEKANANDA.REDDY.MLC/FACEBOOK

2017 ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమితో..

''2017 ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు. గంగిరెడ్డి, డి.శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి సక్రమంగా పనిచేయకపోవడం వల్లే ఓడిపోయానని వివేకా నాతో చెప్పారు. ఆ తరువాత ఆయన వారిపై ఆగ్రహించారు. అనంతరం ఆయనకు వరుసకు సోదరుడైన భాస్కర్ రెడ్డి ఇంటికి కూడా వివేకానంద వెళ్లారు. అప్పుడు అక్కడ శంకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో వివేకా.. భాస్కర్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహించారు'' అని దస్తగిరి చెప్పారు.

ఎర్ర గంగిరెడ్డి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఎర్ర గంగిరెడ్డి

భూవివాదం సెటిల్మెంట్..

కడపకు చెందిన రాధాకృష్ణమూర్తి, ఆయన కుమారుడు ప్రసాదమూర్తిలకు చెందిన స్థలం సెటిల్మెంట్ కోసం గంగిరెడ్డితో కలిసి వివేకానందరెడ్డి 2017-18 మధ్య చాలాసార్లు బెంగళూరు వెళ్లారు.

వాళ్ల స్థలానికి సమీపంలోనే బెంగళూరులో ఉన్న గెస్ట్‌హౌస్‌లో కోడూరు రమణ, లక్ష్మీకర్‌లను వివేకా కలిసేవారు.

ఆ భూవివాదం సెటిల్మెంట్ తరువాత రూ. 8 కోట్లు వివేకానందరెడ్డికి ఇవ్వాలన్నది ఒప్పందం.

ఈ సెటిల్మెంట్ కోసం వివేకాతో గంగిరెడ్డి కూడా వచ్చేవారు. ఒక్కోసారి గంగిరెడ్డి ఒక్కరే వచ్చేవారు.

ఒకసారి సునీల్ యాదవ్‌తో కలిసి వివేకా వచ్చారు. ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో ఉమాశంకర్ రెడ్డిజ ోక్యం కూడా ఉంది. వీరంతా కలిసి ఈ సెటిల్మెంట్ చేస్తే వచ్చే డబ్బు గురించి మాట్లాడుకునేవారు. 2018లో ఒకసారి సెటిల్మెంట్ డబ్బుల విషయంలో వివేకా, గంగిరెడ్డి మధ్య గొడవ జరిగింది. అప్పుడు గంగిరెడ్డిని గెస్ట్‌హౌస్‌లోనే విడిచిపెట్టి వివేకా పులివెందులకు వచ్చేశార''ని దస్తగిరి చెప్పారు.

వివేకా డ్రైవరుగా పనిచేయడం వల్ల తనకీ విషయాలు అన్నీ తెలుసని దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పారు.

దస్తగిరి వాంగ్మూలం

ఫొటో సోర్స్, UGC

'వివేకాను చంపమని గంగిరెడ్డి చెప్పారు'

''2018లో వివేకా వద్ద పని మానేశాను. ఆ తరువాత కూడా గంగిరెడ్డి, సునీల్ యాదవ్ తదితరులను కలిసేవాడిని. 2019 ఫిబ్రవరి 10న సునీల్ యాదవ్ నన్ను గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి నాతో.. 'బెంగళూరు భూమి సెటిల్మెంట్ విషయంలో వివేకానందరెడ్డికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. వివేకాను నువ్వు చంపేయ్' అని నాతో చెప్పారు.

అయితే, నేను ఆయన్ను చంపలేనని చెప్పాను. కానీ.. 'నువ్వొక్కడివే కాదు, నీతో మేమూ వస్తాం. దీని వెనుక పెద్దవాళ్లు వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్ రెడ్డి రూ. 40 కోట్లు ఇస్తాడు. అందులో నీకు రూ. 5 కోట్లు ఇస్తాం' అని గంగిరెడ్డి చెప్పారు. ఆ తరువాత సునీల్ యాదవ్ ద్వారా నాకు రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చారు. అందులో రూ. 25 లక్షలు సునీల్ మళ్లీ ఇస్తానని తీసుకున్నాడు. మిగతా 75 లక్షలు నా స్నేహితుడి దగ్గరు ఉంచాను. ఆ డబ్బులు ఉంచినందుకు ఆయనకు రూ. 5 లక్షలు కమీషన్ ఇస్తానన్నాను'' అని దస్తగిరి చెప్పారు.

దస్తగిరి వాంగ్మూలం

ఫొటో సోర్స్, UGC

వైఎస్ వివేకా హత్య ఎలా జరిగిందంటే..

''సునీల్ చెప్పడంతో కదిరి వెళ్లి గొడ్డలి కొనుక్కొచ్చాను. వివేకా ఇంట్లో ఎవరూ లేరని గంగిరెడ్డి చెప్పగా సునీల్, నేను వివేకా ఇంటి సమీపంలోకి వెళ్లి అక్కడే మద్యం తాగాం. రాత్రి 11.40కి కారులో వివేకా ఇంటిలోకి వెళ్లడాన్ని చూశాం. ఆ తరువాత ఉమాశంకర్ రెడ్డి బైక్‌పై గంగిరెడ్డిని వివేకా ఇంటి దగ్గరకు తెచ్చారు.

రాత్రి 1.30కి మేం వివేకా ఇంటి వెనక ప్రహరీ దూకి లోనికి వెళ్లాం. అక్కడ వాచ్‌మన్ రంగన్న నిద్రపోతున్నారు. పక్క తలుపు తట్టగా గంగిరెడ్డి తలుపు తెరిచి మమ్మల్ని లోనికి పిలిచారు. ఆ సమయంలో వివేకా మమ్మల్ని చూసి వీళ్లంతా ఎందుకొచ్చారని అడిగారు. డబ్బుల విషయం మాట్లాడేందుకు వచ్చారని గంగిరెడ్డి చెప్పారు.

అనంతరం వివేకా హాలు నుంచి బెడ్ రూంలోకి వెళ్లగా వెనుకే వెళ్లిన గంగిరెడ్డి.. భూసెటిల్మెంటులో తనకూ వాటా డబ్బు కావాలని అడిగారు.

సెటిల్మెంట్ చేస్తున్నది తానైతే నీకెందుకు డబ్బులివ్వాలని వివేకా అన్నారు. ఈలోగా ఉమాశంకర్ రెడ్డి కూడా వాటా అడిగారు. దీంతో గంగిరెడ్డిపై వివేకా ఆగ్రహించారు.

ఇంతలో సునీల్ బూతులు తిడుతూ వివేకా ముఖంపై కొట్టడంతో ఆయన కింద పడ్డారు. అదేసమయంలో ఉమాశంకర్ రెడ్డి నా దగ్గరున్న గొడ్డలి తీసుకుని వివేకా తలపై కొట్టారు. సునీల్ వివేకా గుండెలపై ఏడెనిమిదిసార్లు బలంగా మోదాడు.

గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్ రెడ్డిలు డాక్యుమెంట్ల కోసం ఇళ్లంతా వెతుకుతుండడంతో వివేకా వారిపై కేకలు వేశారు. దాంతో నేను వివేకా కుడి చేతిపై కొట్టి గాయపరిచాను.

డాక్యుమెంట్లు దొరికిన తరువాత హత్యను వివేకా డ్రైవర్ ప్రసాద్‌పై నెట్టేశాలా ప్లాన్ వేశాను. ప్రసాద్ తనను కొట్టిపారిపోయాడని వివేకాతో బలవంతంగా లేఖ రాయించి సంతకం పెట్టించాం. తరువాత వివేకాను బాత్‌ రూంలోకి ఈడ్చుకెళ్లి ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో కొట్టగా ఆయన చనిపోయారు. తరువాత అందరం అక్కడి నుంచి గోడదూకి వెళ్లిపోయాం'' అని దస్తగిరి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఉదయం 5 గంటలకు తాను, సునీల్ గంగిరెడ్డి ఇంటికి వెళ్లగా 'భయపడొద్దు.. శంకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలతో మాట్లాడాను. వాళ్లు అంతా చూసుకుంటామన్నారు. మీకివ్వాల్సిన మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తాను' అని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు.

సమగ్ర విచారణ కోరుతున్న వివేకా కుమార్తె

ఎన్నో మలుపులు..

వివేకా చనిపోయిన రోజు ఆయన ఇంట్లో ఒంటరిగానే ఉన్నారని.. ఆయన చనిపోయి పడి ఉన్న విషయం ఇంట్లో పని మనుషులు గుర్తించి చెప్పడంతో వెలుగులోకి వచ్చిందని పోలీసులు తొలుత చెప్పారు.

మొదట సహజ మరణంగా ప్రచారమైంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి కూడా వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్టు మీడియాకు తెలిపారు.

అనంతరం హత్యంటూ మీడియా సమావేశంలో టీడీపీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

అప్పటి సీఎం చంద్రబాబు, నారా లోకేష్, మంత్రి ఆది నారాయణ రెడ్డి మీద తమకు అనుమానాలున్నాయని అన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డికి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌ రెడ్డికి మధ్య ఉన్న విభేదాల వల్లే ఈ హత్య జరిగిందని అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.

వివేకా మృతి కేసు విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.

మృతుడి తలపై కుడి వైపున ఏడు లోతైన గాయాలు ఉన్నాయని, చేతి పైనా గాయాలున్నాయని ఆ బృందం గుర్తించింది. ఫోరెన్సిక్ నివేదిక మేరకు ఇది హత్య అనే నిర్ధరణకు వచ్చారు. 2020 ఫిబ్రవరి వరకూ దశల వారీగా విచారణ సాగింది.

2020 ఫిబ్రవరి వరకూ, అంటే హత్య తర్వాత ఏడాది వరకూ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాగించిన విచారణపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

హత్యకు గురైన వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె డాక్టర్ ఎన్. సునీతా రెడ్డి, అల్లుడు నారెడ్డి రాజశేఖర్ రెడ్డి తో పాటు సి.ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వంటి వారు ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ కేసులో విచారణ వేగవంతం చేసేందుకు సీబీఐకి అప్పగించాలని పలువురు కోరారు. హత్యకు సంబంధించిన అనేక అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కేసులో 2020 మార్చి 11న తీర్పు వెలువడింది. పిటిషనర్ల అప్పీల్ అంగీకరిస్తూ కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించింది.

తాజాగా దస్తగిరి వాంగ్మూలం వెలుగులోకి రావడంతో కేసు మరోసారి చర్చనీయమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)