ఆంధ్రప్రదేశ్: వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు-ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, YSRCongress
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలకమలుపు తిరిగిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
వివేకానంద రెడ్డిని హత్య చేసేందుకు వినియోగించిన మారణాయుధాల్ని ఓ కాలువలో పడేసినట్లు సీబీఐ గుర్తించింది.
ప్రస్తుతం కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా మారణాయుధాల్ని వెలికితీసే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
సీబీఐ అధికారులు సునీల్ యాదవ్‌ను శనివారం పులివెందులకు తీసుకెళ్లారు. ఆయుధాలు పడేసిన ప్రదేశాన్ని అతను సీబీఐ అధికారులకు చూపించాడు.
పారిశుద్ధ్య కార్మికుల్ని తెప్పించి... నీళ్లు తోడించి: కాలువలో నుంచి మారణాయుధాల్ని వెలికితీయడానికి పులివెందుల పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య కార్మికుల్ని సీబీఐ అధికారులు రప్పించారు.
8 అడుగుల వరకు లోతు ఉండటంతో కాలువలోని లక్ష లీటర్ల మురుగునీటిని యంత్రాలతో తోడారు. ఇంకా మూడు అడుగుల లోతున మురుగునీరు ఉండటంతో ఆదివారం కూడా తోడుతారు.
ఆదివారం మారణాయుధాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివేకా ఇంటినుంచి కాలువ వద్దకు వెళ్లేందుకు రెండు దారులున్నాయి.
ప్రధాన రహదారి మీదుగా వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి. దాంతో నిందితులు కెమెరాలు లేని మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా సీబీఐ గుర్తించింది.
ఆయుధాల్ని పడేశాక సమీపంలోని రింగురోడ్డుపైకి వెళ్లి.. అటు నుంచి పరారైనట్లు నిర్ధారణకు వచ్చింది.
శనివారం వివేకా మాజీ డ్రైవరు దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, కడప రైల్వేస్టేషన్ మేనేజర్ మోహన్‌రెడ్డిని సీబీఐ బృందాలు విచారించాయని ఈనాడు రాసింది.

ఫొటో సోర్స్, FACEBOOK/DISTRICTCOLLECTORCHITTORE
ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించారని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పినట్లు సాక్షి కథనం ప్రచురించింది.
శ్రీ భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ అలసత్వం వల్లే.. సకాలంలో ఆక్సిజన్ అందక తిరుపతి 'రుయా' ఘటన జరిగిందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
ఈ ఘటనపై చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం హైకోర్టు ముందుంచింది.
మరణాలకు కారణమైన సదరు కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు ఉత్తర్వులిచ్చినట్లు ప్రభుత్వం వివరించింది.
రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితులు చనిపోయిన ఘటనకు బాధ్యులైన అధికారులు, యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత మోహనరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిత్తూరు కలెక్టర్‌తో పాటు ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలను తమ ముందుంచాలని ఆదేశాలిచ్చింది.
దీంతో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ అఫిడవిట్ దాఖలు చేశారని పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, Reuters
జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతి
జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులు ఇచ్చినట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.
మరికొన్ని రోజుల్లో మరో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది.
టీకాను అత్యవసర వినియోగానికి వాడవచ్చునని కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనాబారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసింది.
ఈ సంస్థ 'జాన్సన్' పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తోనే కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారని సాక్షి రాసింది.

ఫొటో సోర్స్, fb/Telangana CMO
సచివాలయం త్వరగా పూర్తి చేయాలి-సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లో నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.
హైదరాబాద్‌లో జరుగుతున్న సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సీఎం ఆదేశించారు.
శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. కాలినడకన నలుమూలలా కలియదిరిగి పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించి పలు సూచనలుచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడేండ్ల తెలంగాణలో సాగుతున్న ఆదర్శవంతమైన పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే సెక్రటేరియట్ నిర్మాణకౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా, గౌరవం ఉట్టిపడేలా ఉండాలని సీఎం అన్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో, సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకొనే విధంగా సచివాలయం ఉండబోతున్నదన్నారు.
ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకొంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగంగా పూర్తిచేయాలని సీఎం అన్నారు.
దివ్యాంగులు, వయోవృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్‌కు వచ్చే వీఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సీఎం వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- వొడాఫోన్- ఐడియా భారత టెలీకాం మార్కెట్‌కు టాటా చెప్పబోతోందా?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








