పాకిస్తాన్‌లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోదని, ఆదాయం కోసం ఆ దేశ ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని కూడా అద్దెకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. వీటిల్లో నిజమెంతో ఓ సారి పరిశీలిద్దాం.

పాక్‌ ప్రధాని నివాసంపై వార్తల్లో ఏముంది?

ఈ వార్తలకు మూలం పాకిస్తాన్ ఇంగ్లిష్ వెబ్‌సైట్ "సమా న్యూస్"లో వచ్చిన ఒక నివేదిక. భారత వార్తాపత్రికలు ఈ నివేదికను ఉటంకిస్తూ, దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని అద్దెకు ఇచ్చారని రాశాయి.

ఆదాయం కోసం కచేరీలు, పండుగలు, ఫ్యాషన్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ప్రధాని అధికారిక నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని ఆ దేశ కేబినెట్‌ నిర్ణయించినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రధాని బంగ్లా పాడైపోకుండా చూసేందుకు రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారని, సదరు మీడియా కథనాల సారాంశం.

"ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఇలాంటి సంకట స్థితి వచ్చింది. దీన్ని మరుగుపరచడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి" అంటూ ఒక న్యూస్ వెబ్‌సైట్ రాసింది.

మిగతా మీడియా సంస్థలు కూడా ఇలాటివే సంచలనాత్మక హెడ్‌లైన్స్ పెట్టి వార్తలు రాశాయి.

పాకిస్తాన్ ప్రధాని నివాసం

ఫొటో సోర్స్, AAMIR QURESHI/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రధాని నివాసం

అసలు ఏం జరిగింది?

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఇటువంటి ప్రతిపాదన చర్చకు వచ్చిందని ప్రధానమంత్రి సచివాలయ వర్గాలు బీబీసీకి వెల్లడించాయి.

అయితే, ఆ ప్రతిపాదన ఆమోదం పొందలేదని, ఇందుకోసం ఎలాంటి కమిటీలనూ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశాయి. ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.

ప్రధాని బంగ్లాలో ఉన్న విశాలమైన ప్రాంగణాలను ఉపయోగించుకునేందుకు ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో సహా పలువురు నేతలు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇమ్రాన్ ఖాన్ అధికారం చేపట్టిన కొన్ని వారాల తర్వాత ఇస్లామాబాద్‌లోని బనిగలలో ఉన్న సొంత నివాసంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుండి ప్రధాని అధికారిక నివాసం ఖాళీగానే ఉంది.

ప్రధాని అధికారిక నివాసం దేశ సంపద అని ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినవారు అభిప్రాయపడ్డారు. ప్రధాని బంగ్లా దేశ గౌరవానికి ప్రతీక అని, దానిని అద్దెకు ఇవ్వడం బహుశా ప్రధాన మంత్రి కార్యాలయ ప్రతిష్టను దిగజార్చడమేనని, అది పవిత్రతను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రధాని అధికారిక నివాసం దాదాపు 137 ఎకరాల విస్తీర్ణంలో ఇస్లామాబాద్ నడిబొడ్డున ఉంది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, REUTERS

ఇమ్రాన్ ఖాన్ సూత్రం 'నిరాడంబరత'

ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి నిరాడంబర జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయంగా మారుస్తానని వాగ్దానం చేశారు.

ఆడంబరాలతో ప్రజాధనం వృధా అవుతోందని, ఇవన్నీ వలస రాజ్య పాలన తాలూకా గుర్తులని, అక్కడ ఉండటమంటే రాజకీయ విలాసాల కోసం ప్రభుత్వ వనరులను దోపిడీ చేస్తున్నట్లేనని విమర్శించారు.

ఆగస్టు 2019లో ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన కొద్ది రోజుల తర్వాత, ఇమ్రాన్ ఖాన్ అధికార నివాసం నుంచి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నారు.

"నేను సాధారణ జీవితాన్ని గడుపుతాను, నేను మీ డబ్బును ఆదా చేస్తాను" అని ఆయన వాగ్దానం చేశారు.

ఎన్నికైన తర్వాత దేశాన్ని ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగంలో ‘మిలటరీ సెక్రటరీ నివాసమైన మూడు బెడ్‌ రూముల ఇంట్లో’ ఉంటానని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

"ప్రధాన మంత్రి అధికార నివాసాన్ని ఓ యూనివర్సిటీగా మలచాలని కోరుకుంటున్నట్లు" ఆ సమయంలో ఖాన్ పేర్కొన్నారు. తర్వాత ఆయన తన సొంత ఇంటికి మారిపోయారు.

ఈ ప్రకటన చేసిన కొన్ని వారాలకు, పాక్ కేబినెట్ మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏటా 47 కోట్ల రూపాయలు ప్రధాన మంత్రి అధికార నివాస నిర్వహణకి ఖర్చవుతోందని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నివాసం వెనుక ఉన్న భూమిలో అదనపు నిర్మాణం చేపడతామన్నారు. తర్వాత దాన్ని అత్యున్నత విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు.

జూలై 2019లో ప్రధాని అధికార నివాసాన్ని యూనివర్సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్‌లో తగిన మార్పులు చేయడానికి ఫెడరల్ కేబినెట్ ఆమోదం తెలిపింది.

అంతకుముందు తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌లో ప్రధాని నివాసం ఉన్న జీ-5 సెక్టర్లో విద్యాసంస్థలకోసం భవనం నిర్మించే అవకాశం లేదు. ఈ ప్రాంతం ప్రభుత్వ, పరిపాలనా భవనాలకు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత, యూనివర్సిటీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.

కాబట్టి ప్రధానమంత్రి నివాసాన్ని పబ్లిక్ బిల్డింగ్‌గా మార్చాలనే ప్రతిపాదన పరిశీలనకు రావడం ఇదే మొదటిసారి కాదు.

బులెట్ ప్రూఫ్ కార్ల శ్రేణిని ఉపయోగించడ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆపేశారు
ఫొటో క్యాప్షన్, బులెట్ ప్రూఫ్ కార్ల శ్రేణిని ఉపయోగించడ కూడా ఇమ్రాన్ ఖాన్ ఆపేశారు

పొదుపులో భాగంగా కార్లు, గేదెల విక్రయం

తన పొదుపు చర్యల్లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ తన భద్రత కోసం ప్రధాని కార్యాలయం ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ కార్లకు సైతం స్వస్తి చెప్పారు. దీంతో ఆ కార్లను వేలం వేశారు. 61 లగ్జరీ, మిగులు వాహనాల వేలంతో ఖజానాకు 20 కోట్ల రూపాయలు సమకూరాయి.

ప్రధాని కోసం రిజర్వ్ చేసిన 524 మంది సహాయకులకు బదులుగా కేవలం ఇద్దరిని మాత్రమే తాను ఉపయోగిస్తానని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పారు. ప్రధాని ఇంటికి చెందిన ఎనిమిది గేదెలను కూడా విక్రయించారు. దీంతో 25 లక్షలు ఆదా అయ్యాయి.

పొదుపుపై ​​టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ప్రధాని నివాసం పక్కనే ఉన్న, ఇతర ప్రభుత్వ భవనాల సమూహాన్ని పబ్లిక్ సంస్థలుగా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో ముర్రీ, రావల్పిండిల్లోని పంజాబ్ హౌస్‌లు, లాహోర్, కరాచీలోని గవర్నర్ నివాసాలు, అన్ని ప్రావిన్సుల్లోని ముఖ్యమంత్రుల నివాసాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు.

షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాదరణ కోసమా లేక ఆర్థిక సమస్యలకు పరిష్కారమా?

ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన పొదుపు చర్యల కారణంగా ప్రధాని నివాసం ఖర్చులు తగ్గాయి. ఈ నిర్ణయాలను విశ్లేషకులు సైతం ప్రశంసించినా, కుంటుపడిన దేశ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి పరిష్కార మార్గం కాదని అంటున్నారు.

ఆర్థిక పునరుద్ధరణ విషయంలో ఇమ్రాన్ ఖాన్‌కు దూరదృష్టి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ పొదుపు చర్యలన్నీ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న రాజకీయ జిమ్మిక్కులేనంటూ కొట్టిపడేశాయి.

ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఆయన ప్రజాకర్షక విన్యాసాలు చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.

ధనికులు, పేదల మధ్య తారతమ్యాల్ని రూపుమాపేందుకు ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటని ఆయన పార్టీ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అంటోంది. ప్రజా ధనానికి విలువ ఇస్తూ సమసమాజాన్ని స్థాపించడమే ఇమ్రాన్ లక్ష్యమని చెబుతోంది.

అయితే, ప్రభుత్వాన్ని నడిపిన వారు పొదుపు చర్యలను ప్రోత్సహించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం పొదుపు చర్యలను ప్రోత్సహించారు, కానీ ఇవి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపలేకపోయాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)