పాకిస్తాన్: కిడ్నాప్ చేసి, సంకెళ్లు వేసి 12 ఏళ్లకే పెళ్లి చేసుకోమని బెదిరించారు...

తండ్రితో ఫరా
ఫొటో క్యాప్షన్, తండ్రితో ఫరా
    • రచయిత, మైక్ థామ్సన్
    • హోదా, బీబీసీ న్యూస్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఫరా ఫైసలాబాద్ లోని తన ఇంట్లో ఆమె తాత, ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరిలతో కలిసి ఉండగా అకస్మాత్తుగా కిడ్నాపర్లు వారి ఇంటి తలుపు తట్టి, లోపలకు దూసుకుని వచ్చి ఆమెను బలవంతంగా వ్యాన్ లో ఎక్కించి తీసుకుని వెళ్లిపోయారు. ఈ సంఘటన గత ఏడాది జూన్ 25వ తేదీన జరిగింది.

"ఆమెను వెతికి ఇంటికి తిరిగి తేవాలని చూస్తే మేము చేసిన పనికి మమ్మల్ని జీవితాంతం బాధపడేలా చేస్తామని బెదిరించి వెళ్లారు" అని ఫరా తండ్రి ఆసిఫ్ చెప్పారు. ఆమె అపహరణకు గురయిన సమయంలో ఆయన పనిలోకి వెళ్లారు.

ఈ నేరాన్ని ఫిర్యాదు చేయడానికి నేరస్థుల వివరాలతో సహా ఆయన దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి వెళ్లారు. ఫరా తాత అపహరణకారులను గుర్తు పట్టారు. కానీ, వారికి సహాయం చేయడానికి పోలీసులు ఆసక్తి చూపించలేదని ఆయన చెప్పారు.

పోలీసులు నేరాన్ని నమోదు చేయడానికి అంగీకరించలేదని ఆయన చెప్పారు. "వాళ్ళు నన్ను బయటకి తోయడమే కాకుండా, మాటలతో కూడా వేధించారు" అని చెప్పారు.

పదే పదే పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగగా చివరకు నేరం జరిగిన 3 నెలలకు పోలీసులు ఫిర్యాదును నమోదు చేసారు. కానీ, దాని పై వారెటువంటి చర్యను తీసుకోలేదు.

ఫరాను ఇంటి నుంచి ఎత్తుకుని వెళ్లిన తర్వాత అక్కడ నుంచి 70 మైళ్ళ దూరంలో హఫీజాబాద్లో ఉన్న ఒక ఇంటికి తీసుకుని వెళ్ళినట్లు ఫరా చెప్పారు. ఆ సమయంలో ఆమెను సంకెళ్లతో కట్టి, అత్యాచారం చేసి, ఒక బానిసలా చూసేవారని చెప్పారు.

"నన్ను చాలా సార్లు సంకెళ్లతో కట్టేసేవారు. నన్ను అపహరించిన వ్యక్తి ఇంటిని శుభ్రపరచమని ఆదేశిస్తూ వారి ఇంటి బయట ఉన్న జంతువుల సంరక్షణ కూడా చూడమని ఒత్తిడి చేసేవారు. అది చాలా భయానకమైన పరిస్థితి" అని ఆమె చెప్పారు.

"నా కాళ్లకు సంకెళ్లు వేసేవారు. తాడుతో కట్టేసేవారు. చాలా సార్లు తెంచుకోవాలని ప్రయత్నించాను. ప్రతి రాత్రీ.. 'దేవుడా నన్ను కాపాడు' అని ప్రార్ధిస్తూ ఉండేదాన్ని" అని ఫరా చెప్పారు.

కోర్టు వెలుపల సోదరితో ఫరా
ఫొటో క్యాప్షన్, కోర్టు వెలుపల సోదరితో ఫరా

పాకిస్తాన్లో చివరి సారి జనాభా లెక్కలు జరిగిన సమయానికి దేశంలో సుమారు 20 లక్షల మంది క్రైస్తవ మతస్థులు ఉన్నారు. ఇది దేశ జనాభాలో 1 శాతం.

ఈ దేశంలో ప్రతి ఏడాది కనీసం 1000 మంది క్రైస్తవ, హిందూ, సిక్కు మతాలకు చెందిన అమ్మాయిలు అపహరణలకు గురవుతున్నట్లు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఇందులో చాలా మందిని ఇస్లాం మతంలోకి మారమని బలవంతపెడుతూ ఉంటారు. షరియా చట్టాల చట్టాల ప్రకారం పాకిస్తాన్ లో వివాహం చేసుకునే వారిద్దరూ ముస్లిం మతానికి చెందిన వారే అయితే 16 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవడం నేరం కాదు. ఫరా విషయంలో ఇదే జరిగింది. ఆమెను మత మార్పిడి చేసుకోమని బలవంతం చేసి పెళ్లి చేసుకున్నారు.

ఇలాంటి అపహరణల సంఖ్య పెరుగుతోందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ పాకిస్తాన్ పేర్కొంది.

"ఇలాంటి అమ్మాయిలు వందల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి నేరాలను చాలా మంది చేస్తున్నారు. కానీ, అధికారులు ఈ అంశాల పట్ల తగిన రీతిలో స్పందించటం లేదు" ఎన్‌సీపీపీ కార్యదర్శి బిషప్ విక్టర్ అజారియా అన్నారు.

అయితే, ఫరా తండ్రి విచారంతో స్థానిక చర్చి సహాయాన్ని అర్ధించారు. చర్చి అధికారులు కుటుంబానికి కావల్సిన న్యాయ సహకారాన్ని అందే ఏర్పాటు చేసారు.

అపహరణకు గురి చేసిన వ్యక్తి గురించి పదే పదే అధికారుల దృష్టికి తేగా, చివరకు అయిదు నెలల తర్వాత డిసెంబరు మొదట్లో ఫరాను అపహరణకు గురి చేసిన వ్యక్తిని అరెస్టు చేసారు.

ఫరాను వారి చెర నుంచి విడుదల చేయడానికి పోలీసులు చివరకు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు.

"నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి ఇంటికి నలుగురు పోలీసులు వచ్చి కోర్టు నన్ను పోలీసు స్టేషన్ కి రమ్మని ఆదేశించినట్లు చెప్పారు" అని ఫరా వివరించారు.

సంకెళ్ల వల్ల ఫరా కాళ్లకు గాయాలు
ఫొటో క్యాప్షన్, సంకెళ్ల వల్ల ఫరా కాళ్లకు గాయాలు

డిసెంబరు 05న ఆమె కేసు ఫైసలాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ జరిగే లోపు ఆమెను కోర్టు మహిళల షెల్టర్ హోంకి పంపించే ఏర్పాట్లు చేసింది.

కానీ, ఫరా కుటుంబం కోర్టు తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉండగా, విచారణను నిలిపివేస్తున్నట్లు పోలీసులు ఫరా తండ్రికి తెలియచేశారు.

ఫరా ఆ వివాహానికి, మత మార్పిడికి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదే విషయాన్ని ఫరా కోర్టులో జనవరి 23న తెలిపారు. కానీ, ఆమెను అలా చెప్పమని ఎవరైనా బలవంతం చేస్తున్నారేమోనని కోర్టు అనుమానించింది. అదే జరిగిందని ఫరా తెలిపారు.

"నేను అలా చెప్పని పక్షంలో నన్ను, తర్వాత నా కుటుంబ సభ్యులందరినీ హతం చేస్తాను" అని అపహరణకారుడు బెదిరించినట్లు ఫరా చెప్పారు. "నిజంగానే అతను అన్నంత పని చేస్తారేమో అని భయపడి అలా చెప్పాల్సి వచ్చింది" అని ఫరా చెప్పారు.

సరిగ్గా ఆమెను ఇంటి నుంచి అపహరించిన 8 నెలలకు ఫిబ్రవరి 16న ఆమె వివాహం సరైన పద్దతిలో నమోదు కాలేదని, ఆ వివాహం చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది.

ఆ చిన్న కీలకమైన అంశం ఫరాను అపహరణకారుల చేతి నుంచి రక్షించి, ఆమెను తిరిగి కుటుంబంతో కలిపింది.

అపహరణకు గురయిన పిల్లలను రక్షించిన తర్వాత కూడా వారి కష్టాలు తీరినట్లు కాదు. చాలా సార్లు వారిని తిరిగి అపహరిస్తామని, లేదా కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపులు చేస్తూనే ఉంటారు. ఈ వేదన కొనసాగుతూనే ఉంటుంది.

14 సంవత్సరాల క్రైస్తవ అమ్మాయి మరియా షాబాజ్ విషయంలో ఇదే జరిగింది. ఆమె అపహరణకు గురైన తర్వాత అక్కడ నుంచి పారిపోయి వెనక్కి రాగల్గినప్పటికీ ఆమె కుటుంబం మొత్తం అపహరణకారుల నుంచి తమను చంపేస్తామని వచ్చిన బెదిరింపులు తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోవలసి వచ్చింది.

మరియాకు సహాయం చేయడం కోసం యూకెకి చెందిన ఎయిడ్ టూ ది చర్చి ఇన్ నీడ్ అనే స్వచ్చంద సంస్థ ఆమెకు మద్దతుగా 12500 మంది సంతకాలు సేకరించిన విన్నపాన్ని యూకె ప్రభుత్వానికి అందచేసింది.

దీని పై మరో 30 మందికి పైగా బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు, మతాధికారులు కూడా సంతకాలు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించాలని ఆ విన్నపంలో కోరారు.

పాకిస్తాన్లో అపహరణకు గురైన అమ్మాయిల పరిస్థితి దయనీయంగా ఉందని ఎయిడ్ టూ ది చర్చి ఇన్ నీడ్ ప్రతినిధి జాన్ పాంటిఫెక్స్ చెప్పారు.

అపహరణకు గురైన పిల్లలు విడుదలయిన తర్వాత కూడా వారి కుటుంబాలు ఎదుర్కొనే బెదిరింపులు వారి వేదనను మరింత పెంచుతాయి. మరియా లాంటి వారికి యూకె లాంటి దేశాలలో ఆశ్రయం లభిస్తే అదే వారు సురక్షితంగా ఉండేందుకు ఒక ఆశలా నిలుస్తుంది.

ప్రధానంగా ముస్లిం జనాభా ప్రధానంగా ఉండే ఈ దేశంలో జరుగుతున్న బలవంతపు మత మార్పిడుల గురించి విచారణ జరిపించాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు.

"బలవంతపు పెళ్లిళ్లు, బలవంతపు మత మార్పిళ్లు, ఇతర మతాలకు చెందిన మైనర్ పిల్లలను అపహరించడం లాంటి చర్యలను సహించబోమని ప్రభుత్వ మత సామరస్య ప్రత్యేక ప్రతినిధి స్పష్టం చేశారు.

కానీ, ఇది జరగడానికి చాలా దూరం ఉందని, ఆసిఫ్ అనుభవం చెబుతోంది. ఆయన కూతురుని అపహరించిన ముగ్గురు వ్యక్తుల పై చట్ట రీత్యా చర్యలు తీసుకునేలా పోరాడతానని ఆసిఫ్ అంటున్నారు.

ఫరాకు ఇప్పుడు 13 సంవత్సరాలు. ఆమె ఇంటికి తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది. కానీ, ఆమె చవి చూసిన అనుభవపు వేదన నుంచి మాత్రం ఇంకా కోలుకోలేదు. ఇందుకోసం ఆ పాప మానసిక వైద్యుల సహాయం తీసుకుంటోంది. మిగిలిన అమ్మాయిలకు అలాంటి గతి పట్టకుండా నేరస్థుల పై చర్య తీసుకుంటారని ఆ చిన్నారి ఆశిస్తోంది.

"పాకిస్తాన్ లో ఉన్న పిల్లల్నందరినీ దేవుడు రక్షించాలని, వారందరినీ కనిపెట్టుకుని ఉండాలని నేను ప్రార్ధిస్తున్నాను" అని ఫరా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)