ప్రిన్సెస్ లతీఫా: దుబాయ్ పాలకుడి కుమార్తె 'నిర్బంధం' వ్యవహారంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

దుబాయ్ యువరాణి లతీఫా

ఫొటో సోర్స్, Princess Latifa

ఫొటో క్యాప్షన్, లతీఫా రహస్యంగా రికార్డు చేసిన వీడియో స్క్రీన్ షాట్
    • రచయిత, బీబీసీ పనోరమ
    • హోదా, రిపోర్టింగ్ బృందం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

దుబాయి యువరాణి షేక్ లతీఫా 'నిర్బంధం' అంశాన్ని యూఏఈ ముందు లేవనెత్తనున్నట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది.

దుబాయ్ పాలకుని కుమార్తె షేక్ లతీఫా 2018లో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించారు. ఆమెను పట్టుకుని, తిరిగి దుబాయ్ తీసుకొచ్చిన తరువాత, లతీఫా తన స్నేహితులకు రహస్య వీడియో సందేశాలను పంపించారు.

తన తండ్రి తనను గృహనిర్బంధంలో ఉంచారని, తన ప్రాణాలకు ఆపద ఉందని ఆ వీడియోల్లో తెలిపారు.

లతీఫా తన స్నేహితులకు పంపిన రహస్య వీడియోలను, వారు బీబీసీ పనోరమాతో షేర్ చేసుకున్నారు.

తాను పడవలో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా కమాండోలు తనకు మత్తు మందు ఇచ్చి, వెనక్కి తీసుకొచ్చి, నిర్బంధంలో ఉంచారని యువరాణి లతీఫా అల్ మక్తూమ్ ఆ వీడియో ఫుటేజ్‌లో చెప్పారు.

యువరాణి లతీఫా నుంచీ ఈ రహస్య సందేశాలు ఆగిపోవడంతో.. తన ఆచూకీ కనుక్కునేందుకు ఐక్యరాజ్య సమితి సహకరించాలని ఆమె స్నేహితులు విజ్ఞప్తి చేశారు.

అయితే, ఆమె ఇంట్లోనే క్షేమంగా, కుటుంబంతో కలిసి ఉందని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ప్రభుత్వాలు గతంలో తెలిపాయి.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల శాఖ మాజీ హై కమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షురాలు మేరీ రాబిన్సన్‌ 2018లో లతీఫాను కలిసిన తరువాత "ఆమె మానసిక స్థితి సరిగా లేదని" పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు "ఆమె కుటుంబం చేతిలో భయంకరంగా మోసపోయిందని" అంటున్నారు.

ప్రస్తుతం లతీఫా ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ఉన్నారో కనిపెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని మేరీ రాబిన్సన్‌ పిలుపునిచ్చారు.

"లతీఫా గురించి చాలా ఆందోళనగా ఉంది. చాలా విషయాలు జరిగిపోయాయి. తన ఆచూకీ కనిపెట్టాల్సిన అవసరం ఉంది" అని ఆమె అన్నారు.

దుబాయ్ యువరాణి లతీఫా
ఫొటో క్యాప్షన్, 2018 నాటి చిత్రం

దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు అయిన లతీఫా తండ్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాధినేతలలో ఒకరు.

లతీఫాను బంధించి దుబాయ్ తీసుకొచ్చిన ఒక ఏడాది తరువాత, ఆమెకు రహస్యంగా ఒక ఫోన్ అందింది. దాని సహాయంతో ఆమె కొన్ని నెలలపాటూ వీడియోలు రికార్డ్ చేశారు.

ఆమె పడవలో పారిపోతున్నప్పుడు అడ్డుకున్న సైనికులతో ఎలా పోరాడారో ఈ వీడియోల్లో వివరంగా తెలిపారు.

కమాండోలను గుద్దుతూ, తన్నుతూ ఫైట్ చేశానని, ఒక కమాండో భుజాన్ని గట్టిగా కరిచేశానని ఆమె తెలిపారు.

ఆమెకు మత్తు మందు ఇచ్చిన తరువాత స్పృహ కోల్పోయారు. ఒక ప్రైవేట్ జెట్‌లో దుబాయ్ తీసుకొచ్చేంతవరకూ ఆమెకు తెలివి రాలేదని చెప్పారు.

ఆమెను ఒక పెద్ద భవనంలో బంధించి ఉంచారని, వైద్య సహాయం కానీ, న్యాయ సహాయం కానీ అందే వీలు లేకుండా చేశారని లతీఫా తెలిపారు. భవనానికి కిటీకీలు, తలుపులు బిగించి వేశారని, బయట భద్రతా అధికారులు కాపలా కాస్తున్నారని చెప్పారు.

లతీఫా నిర్బంధం గురించి ఆమె స్నేహితురాలు టీనా జౌహియైనెన్, తల్లివైపు కజిన్ మార్కస్ ఎస్సాబ్రి, మానవ హక్కుల ప్రచారకులు డేవిడ్ హైగ్ బీబీసీకి తెలియజేశారు. వీరంతా లతీఫా విడుదల కోసం పోరాడుతున్నారు.

లతీఫా భద్రత గురించి ఆందోళనగా ఉండడంతో ఈ వీడియోలు విడుదల చేయాలనే కఠిన నిర్ణయం తీసుకున్నామని వారంతా తెలిపారు.

లతీఫాను దుబాయ్‌లో ఉన్న భవనంలో నిర్బంధించాక తనను కాంటాక్ట్ చేసేందుకు వీరంతా ప్రయత్నించారు.

లతీఫాను బంధించి ఉంచిన ప్రదేశం వివరాలను బీబీసీ పనోరమా స్వతంత్రంగా ధ్రువీకరించింది.

దుబాయ్ నగరాన్ని అభివృద్ధి పరచడంలో షేక్ మొహమ్మద్ విజయవంతమయ్యారు కానీ, ప్రభుత్వానికి విరుద్ధమైన ఆలోచనలను, అసమ్మతిని సహించే పరిస్థితులు లేవని, కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మహిళల పట్ల వివక్ష చూపించగలదని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

షేక్ మొహమ్మద్‌కు గుర్రపు పందాలు నిర్వహించే పెద్ద సంస్థ ఉంది. అందులో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతుంటారు. అలాంటి ఒక కార్యక్రమం రాయల్ అస్కాట్‌లో ఎలిజబెత్ రాణితో తీయించుకున్న ఫొటో కూడా ఉంది.

అయితే, యువరాణి లతీఫా విషయంలోనే కాక, 2019లో తన ఇద్దరు పిల్లలతో లండన్ పారిపోయిన ఆమె సవతి తల్లి యువరాణి హయా బింట్ అల్ హుస్సైన్ విషయంలో కూడా షేక్ మొహమ్మద్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

లతీఫా ఫిట్‌నెస్ ట్రైనర్
ఫొటో క్యాప్షన్, లతీఫా ఫిట్‌నెస్ ట్రైనర్

పడవలో ఎలా తప్పించుకున్నారంటే...

ప్రస్తుతం లతీఫాకు 35 సంవత్సరాలు. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడే ఒకసారి దేశంనుంచీ తప్పించుకుని పారిపోవాలనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు.

2011లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త హెర్వ్ జాబర్ట్‌ను కలిసిన తరువాతే పారిపోవడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దీనికి జౌహియైనెన్ సహాయం అందించారు. జౌహియైనెన్ లతీఫాకు బ్రెజీలియన్ మార్షల్ ఆర్ట్స్ నేర్పేవారు.

2018 ఫిబ్రవరి 24న లతీఫా, జౌహియైనెన్ ఇద్దరూ గాలి నింపిన పడవలోనూ, జెట్ స్కీలోనూ ప్రయాణించి, దూరంలో తెరచాప పడవతో వీరి కోసం వేచి చూస్తున్న జాబర్ట్‌ను కలుసుకున్నారు.

కానీ ఎనిమిది రోజుల తరువాత, భారత తీరానికి కొద్ది దూరంలో దుబాయ్ కమాండోలు వీరిని పట్టుకున్నారు. పొగ గ్రెనేడ్లు వదలడంతో డెక్ కింద బాత్రూంలో దాక్కున్న తామిద్దరం బయటకి రావలసి వచ్చిందని జౌహియైనెన్ వివరించారు. లతీఫాకు, తనకు తుపాకీలు గురి పెట్టారని ఆమె చెప్పారు.

లతీఫాను దుబాయ్ తీసుకెళ్లిన తరువాత, ఇప్పటివరకూ ఆమె నుంచీ ఎటువంటి సమాచారం లేదు.

జౌహియైనెన్‌ను, ఆ పడవలో ఉన్న మిగతా సిబ్బందిని రెండు వారాల తరువాత విడిచిపెట్టారు.

ఇందులో భారతదేశం పాత్ర ఎంతవరకూ ఉందన్న విషయంపై భారత ప్రభుత్వం ఎప్పుడూ పెదవి విప్పలేదు.

2018లో తప్పించుకోవడానికి ప్రయత్నించే ముందు కూడా లతీఫా ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆమెను నిర్బంధించిన తరువాత ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

"ఈ వీడియోను మీరు చూస్తున్నటైతే అది ఏమంత మంచి విషయం కాదు. ఇప్పటికే నేను చనిపోయి ఉన్నానని లేదా చాలా, చాలా ప్రమాదాకర స్థితిలో ఉన్నానని అర్థం" అని ఆ వీడియోలో ఆమె చెప్పారు.

ఈ వీడియో అంతర్జాతీయ స్థాయిలో చర్చలు రేకెత్తించింది. లతీఫాను విడుదల చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కార్యకర్తలు పిలుపునిచ్చారు.

ఈ విషయంలో యూఏఈ మీద తీవ్ర ఒత్తిడి పెరగడంతో మేరీ రాబిన్సన్‌తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

2018 నాటి చిత్రం

ఫొటో సోర్స్, Princess Latifa

ఫొటో క్యాప్షన్, 2018 నాటి చిత్రం

రాబిన్సన్‌తో మీటింగ్

తన స్నేహితురాలు యువరాణి హయా అభ్యర్థన మేరకు రాబిన్సన్ 2018 డిసెంబర్‌లో దుబాయ్ వెళ్లారు. భోజన సమయంలో ఆమె లతీఫాను కలుసుకున్నారు.

లతీఫాకు బైపోలార్ డిజార్డర్ ఉందని తనకు, యువరాణి హయాకు చెప్పారని, నిజానికి లతీఫాకు అలాంటి వ్యాధి ఏదీ లేదని రాబిన్సన్ బీబీసీకి తెలిపారు.

ఆరోజు లతీఫా ఉన్న పరిస్థితికి ఏమైనా అడిగితే తన గాయాలను మళ్లీ రేపినట్టవుతుందని భావించి తన బాగోగుల గురించి విచారించలేదని రాబిన్సన్ తెలిపారు.

ఆ తరువాత, తొమ్మిది రోజులకు రాబిన్సన్‌తో పాటూ లతీఫా ఉన్న ఫొటోలను యూఏఈ విదేశాంగ శాఖ విడుదల చేస్తూ.. 'యువరాణి లతీఫా సురక్షితంగా ఉన్నారని నిరూపించడానికి ఇదే ఆధారం' అని పేర్కొంది.

"ఆ ఫొటోలు పబ్లిక్‌లోకి వచ్చిన తరువాత నాకు జరిగిన మోసం అర్థమైంది. నేను షాక్ అయిపోయాను. వాటిని ఇలా వాడుకుంటారని ఊహించలేదు" అని రాబిన్సన్ అన్నారు.

2019లో దుబాయ్ పాలక కుటుంబంలోని ఆందోళనకర పరిస్థితులు ఇంగ్లండ్ హై కోర్టు ముందుకొచ్చాయి.

ప్రిన్సెస్ హయా 2020లో హైకోర్టుకు వెళుతూ...

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రిన్సెస్ హయా 2020లో హైకోర్టుకు వెళుతూ...

షేక్ భార్యల్లో ఒకరైన యువరాణి హయా, తన ఇద్దరు బిడ్దలతో సహా బ్రిటన్ పారిపోయి.. తనకు షేక్ నుంచీ రక్షణ కల్పించాలని, తనపై వేధింపులను అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు అప్పీల్ చేశారు.

గత ఏడాది ఇంగ్లండ్ హై కోర్టు ఈ కేసుకు సంబంధించి పలు తీర్పులను వెలువరించింది.

షేక్ మొహమ్మద్ 2002, 2018లలో పారిపోవడానికి ప్రయత్నించిన లతీఫాను బలవంతంగా వెనక్కు రప్పించారని, అదే విధంగా 2000 సంవత్సరంలో దేశంనుంచీ పారిపోయిన లతీఫా అక్క యువరాణి షంషాను బ్రిటన్ నుంచీ చట్టవిరుద్ధంగా అపహరించి తీసుకొచ్చారని కోర్టు తన తీర్పులలో వెల్లడించింది.

"ఈ ఇద్దరు యువతుల స్వేచ్ఛను అపహరిస్తూ షేక్ మొహమ్మద్ తన పాలన కొనసాగిస్తున్నారని" కోర్టు తెలిపింది.

ఈ కోర్టు తీర్పులన్నీ లతీఫాకు ఉపకరిస్తాయని ఆమె స్నేహితులు ఆశపడ్డారు.

కానీ, అలా జరగకపోయేసరికి లతీఫా పంపిన రహస్య వీడియో సందేశాలు బయటపెట్టాలని ఆమె స్నేహితులు నిర్ణయించుకున్నారు.

"తన దగ్గరనుంచీ ఏ సందేశం రాక చాలా కాలమైపోయింది. మేము తన కోసం పోరాడాలని. ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకోకూడదని లతీఫా ఆశిస్తూ ఉంటారు" అని జౌహియైనెన్‌ తెలిపారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)