ప్రిన్సెస్‌ డయానా 1995లో ఇచ్చిన ఇంటర్వ్యూపై వివాదం... స్వతంత్ర దర్యాప్తు చేపట్టిన బీబీసీ

యువరాణి డయానా
ఫొటో క్యాప్షన్, 25 ఏళ్ల కిందట 1995లో యువరాణి డయానా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూను 2.3 కోట్ల మంది చూశారు. తమ పెళ్లిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ఆమె ఈ ఇంటర్వ్యూలోనే చెప్పారు.

ప్రిన్సెస్‌ డయానా 25 ఏళ్ల కిందట పనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూపై వివాదం చెలరేగడంతో దీనిపై బీబీసీ స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తుతో బీబీసీ మీద వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు బైటపడనున్నాయి.

డయానాను ఇంటర్వ్యూకు ఒప్పించడానికి బీబీసీ సీనియర్‌ జర్నలిస్టు మార్టిన్‌ బషీర్‌ తనకు తప్పుడు బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు చూపించారని డయానా సోదరుడు ఎర్ల్‌ స్పెన్సర్‌ ఈనెల ఆరంభంలో ఆరోపించారు.

దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా బ్రిటన్‌లో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులలో ఒకరైన లార్డ్‌ డైసన్‌ను బీబీసీ కోరింది. “ఈ ఆరోపణల వెనుకున్న నిజాలను బహిర్గతం చేయడానికి బీబీసీ కట్టుబడి ఉంది. అందుకే స్వతంత్ర విచారణకు ఆదేశించాం” అని బీబీసీ డైరెక్టర్‌ జనరల్‌ టిమ్‌ డేవి అన్నారు.

స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న బీబీసీ నిర్ణయాన్ని యువరాజు విలియమ్ స్వాగతించారు. ఈ విచారణ సరైన రీతిలో సాగడానికి ఇది మంచి నిర్ణయమని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విచారణకు నాయకత్వం వహిస్తున్న లార్డ్‌ డైసన్‌ బ్రిటన్‌లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి రిటైరయ్యారు.

యువరాణి డయానా

ఫొటో సోర్స్, Getty Imges/Anwar Hussein

ఆరోపణలు ఏంటి?

‘డైలీ మెయిల్‌’ పత్రిక కథనం ప్రకారం ఎర్ల్‌ స్పెన్సర్‌ టిమ్‌ డేవికి రాసిన లేఖలో డయానా సమాచారం ఇచ్చేందుకు రాజభవనం సిబ్బందిలోని కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారని జర్నలిస్ట్‌ మార్టిన్‌ బషీర్‌ (1995లో డయానాను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి) తనకు తప్పుడు బ్యాంకు పత్రాలు చూపించారని స్పెన్సర్‌ ఆరోపించారు.

“వీటిని చూసి ఉండకపోతే, నేను డయానా ఇంటర్వ్యూకు అనుమతించేవాడిని కాదు’’ అని స్పెన్సర్ చెప్పారు.

డైలీ మెయిల్‌కు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో “ నాతో జరిగిన సమావేశం సందర్భంగా, నా మెప్పు పొందడానికి బషీర్‌ మార్టిన్‌ రాజ కుటుంబంపై పరువు నష్టం కలిగించే అనేక ఆరోపణలు చేశారు’’ అని స్పెన్సర్‌ అన్నారు.

డయానా వ్యక్తిగత సంభాషణలను కొందరు చూస్తున్నారని, ఆమె కారును వెంబడిస్తున్నారని, ఆమె ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారని ఇలా అనేక అబద్ధాలు చెప్పారని స్పెన్సర్ ఆరోపించారు.అయితే దీనిపై స్పందించడానికి బషీర్‌ మార్టిన్‌ అందుబాటులో లేరు. కోవిడ్‌-19 కారణంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మార్టిన్ బషీర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్టిన్ బషీర్ యువరాణి డయానాను ఇంటర్వ్యూ చేశారు

ఈ వివాదంలో ఏయే అంశాలను పరిశీలిస్తారు.

  • 1995లో పనోరమ కోసం డయానా ఇంటర్వ్యూ పొందడానికి బీబీసీ, ముఖ్యంగా మార్టిన్‌ బషీర్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇందులోనే ఎర్ల్‌ స్పెన్సర్‌ చేసిన 'నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్ల' ఆరోపణలు కూడా దర్యాప్తు జరుపుతారు.
  • ఆమె ఇంటర్వ్యూ పొందడానికి తీసుకున్న చర్యలు బీబీసీ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా?
  • ఇంటర్వ్యూ సంపాదించడానికి బీబీసీ, ముఖ్యంగా మార్టిన్‌ బషీర్‌ ఆమెను ఎలా ఒప్పించగలిగారు?
  • 1995, 1996లలో ఈ తప్పుడు బ్యాంకు స్టేట్‌మెంట్ల గురించి బీబీసీకి ఎంత వరకు తెలుసు?
  • ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితులను బీబీసీ ఎంత వరకు సమర్ధించగలదు?

ఈ దర్యాప్తు అంశాలను విచారణకు నాయకత్వం వహిస్తున్న లార్డ్‌ డైసన్‌ నిర్ణయించగా, బీబీసీ వీటికి అంగీకరించింది. ఈ వివాదంపై దర్యాప్తు ప్రారంభమైందని, దీనికి సంబంధించిన అన్ని పత్రాలు సేకరిస్తున్నామని బీబీసీ తెలిపింది.

ఈ ఇంటర్వ్యూపై సంతృప్తి చెందినట్లు అప్పట్లో డయానా రాసిన ఒక నోట్‌ను బీబీసీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందానికి అందించింది.

లార్డ్‌ డైసన్‌ ఎవరు?

ఈ పరిశోధన కోసం మాస్టర్‌ ఆఫ్‌ రోల్స్‌ అయిన లార్డ్‌ డైసన్‌ను బీబీసీ ఎన్నుకుంది. ఇంగ్లాండ్‌, వేల్స్‌లలో ఇది రెండో అత్యున్నత పదవి. నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉన్న లార్డ్‌డైసన్‌ 2016 అక్టోబర్‌లో పదవీ విరమణ చేశారు.

25 సంవత్సరాల కిందట తీసుకున్న ఈ ఇంటర్వ్యూను అప్పట్లో 23 మిలియన్లమంది చూశారు. ఈ ఇంటర్వ్యూలో “తమ వైవాహిక జీవితంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు’’ అని డయానా అన్నారు.

తన భర్త ప్రిన్స్‌ చార్లెస్‌కు కెమిల్లా పార్కర్‌తో ఉన్న అనుబంధం గురించి ఆమె మాట్లాడారు. అప్పటికే ఆమె భర్త నుండి విడిగా ఉంటున్నారు. కానీ విడాకులు తీసుకోలేదు.

1997 ఆగస్టు 31న ప్రిన్స్‌ డయానా కారు ప్రమాదంలో మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)