బ్రిటన్ రాజవంశం: మేగన్ మార్కెల్‌ను ప్రిన్సెస్ డయానాతో ఎందుకు పోల్చుతున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మేగన్ లాటన్
- హోదా, న్యూస్ బీట్ రిపోర్టర్
బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతులు రాచ విధుల నుంచి తాము వైదొలగుతున్నామంటూ చేసిన ప్రకటనతో ఇప్పుడు హ్యారీ తల్లి డయానా పేరు చర్చనీయమవుతోంది.
మీడియా తమతో వ్యవహరించిన తీరును గతంలో ఈ రాజకుటుంబ దంపతులు విమర్శించారు.
గత ఏడాది విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రిన్స్ హ్యారీ... ఒకప్పుడు తన తల్లితో మీడియా వ్యవహరించినట్లే ఇప్పుడు తన భార్యతోనూ వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రిన్సెస్ డయానా బతికున్న రోజుల్లో మీడియా నిత్యం ఆమెపై ఫోకస్ చేసేది. ఆమె ధార్మిక కార్యక్రమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా నిత్యం ప్రపంచవ్యాప్తంగా పత్రికల్లో పతాక వార్తలుగా ఉండేది.
ఒకవేళ ఇప్పుడు ఆమె ఉంటే తన కుమారుడు, కోడలి చర్యలకు ఆమెకు మద్దతు పలికేదా లేదా అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.
డచెస్ ఆఫ్ ససెక్స్ మేగన్‌పై జరుగుతున్న నిర్దాక్షిణ్య ప్రచారం చూస్తుంటే చరిత్ర పునరావృతం అవుతున్నట్లుగా ఉందని హ్యారీ అన్నారు.
''నేను నా తల్లిని కోల్పోయాను. ఇప్పుడు నా భార్య కూడా అదే బలమైన శక్తులకు బలవుతుండడాన్ని చూస్తున్నాన''ని హ్యారీ వ్యాఖ్యానించారు.
2018లో మేగన్ మార్కెల్, హ్యారీలు వివాహం చేసుకున్న తరువాత మేగన్ తన తండ్రి థామస్ మార్కెల్‌కు రాసిన లేఖను ఆదివారం 'డైలీ మెయిల్' ప్రచురించిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరి హ్యారీ చెబుతున్నట్లు మేగన్‌తో మీడియా వ్యవహరిస్తున్న తీరు డయానాతో వ్యవహరిస్తున్న తీరు ఒకేలా ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది
''డయానా ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ రాజకుటుంబ చిహ్నంగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందార''ని రాజకుటుంబ రచయిత కేటీ నికోల్ రేడియో-1 న్యూస్‌బీట్‌తో చెప్పారు.
అయితే, ప్రపంచం ఆమె పట్ల కనబరిచిన ఆసక్తి అన్నిసార్లూ సానుకూలంగా లేదని కేటీ అన్నారు.
''మీడియాలో డయానాపై తరచూ విమర్శలు వచ్చేవి. అప్పట్లో ప్రపంచంలోనే ఆమె అత్యంత ప్రముఖురాలిగా ఉండేవారు, ఆమె కుమారులు ప్రిన్స్ విలియమ్, ప్రిన్సి హ్యారీ జీవితాలపైనా మీడియా నిత్యం ఆసక్తి చూపేది'' అన్నారు కేటీ.
రాజకుటుంబ వ్యవహారాలపై పట్టున్న పాత్రికేయుడు జేమ్స్ బ్రూక్స్ ఈ మాటలను అంగీకరిస్తూనే ''కొన్నిసార్లు మీడియాతో ఆమెకు సత్సంబంధాలు ఉండేవి.. వారు కూడా ఆమె పక్షానే ఉండేవారు. కానీ, మరికొన్నిసార్లు ఆమె మీడియా తన పట్ల అనుచితంగా వ్యవహరిస్తోందనేవారు. డయానా, మీడియా మధ్య సంబంధాలు ఒక్కోసారి ఒక్కోలా ఉండేవి'' అన్నారు.
అనంతర కాలంలో ప్రిన్సెస్ డయానా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆమె ప్రచారాన్ని కోరుకుంటున్నారని.. మీడియా దృష్టి తనపై ఉండాలని కోరుకుంటున్నారని కొందరు అనేవారు.
డయానా మీడియాను వాడుకున్న, ఆడుకున్న సందర్భాలున్నాయని.. కానీ, చివరకు అది రెండు పక్షాలకూ అతి అయ్యిందని కేటీ అన్నారు.
మరోవైపు మేగన్ రాజకుటుంబంలోకి వచ్చిన తరువాత తన పర్సనల్ బ్లాగ్‌ను ఆపేశారు. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూలన్నీ కూడా చాలావరకు ఆమె చేపట్టే ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినవే ఉంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
డయానా మరణం
ప్రిన్సెస్ డయానా మరణం నాటి రోజుల ఆధారంగా ప్రిన్స్ హ్యారీ మీడియాపై అభిప్రాయాన్ని ఏర్పచుకున్నారని జేమ్స్ అన్నారు.
''హ్యారీ, విలియమ్స్‌లకు మీడియాపై ఏర్పడిన అభిప్రాయాలు తన తల్లి మరణం వల్ల కలిగిన వేదన నుంచి కలిగినవి. పత్రికా ఫొటోగ్రాఫర్లు వెంటాడిన మూలంగానే తమ తల్లి మరణించిందన్నది ఇప్పటికీ వారి దృష్టిలో ఉన్నద''ని ఆయన చెప్పారు.
పారిస్‌లో 1997 ఆగస్ట్ 31న పాంట్ డి అల్మా సొరంగ మార్గంలో కారు ప్రమాదంలో డయానా మరణించేనాటికి హ్యారీ వయసు పన్నెండేళ్లు.
ఆ ప్రమాదం జరిగినప్పటికి డ్రైవర్ హెన్నీ పౌల్ తాగి ఉండడంతో పాటు పత్రికా ఫొటోగ్రాఫర్లు మోటార్‌సైకిళ్లపై ఆమె కారును వెంబడిస్తున్నారు.
డ్రైవర్, పత్రికా ఫొటోగ్రాఫర్ నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని విచారణలు తేల్చాయి.
2017లో బీబీసీతో హ్యారీ మాట్లాడుతూ తన తల్లి మరణంలో పత్రికా ఫొటోగ్రాఫర్ల పాత్ర ఉందని అన్నారు.
''జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే, ఆమె కారును వెంబడించిన ఫొటోగ్రాఫర్లే ప్రమాదంలో ఆమె చనిపోయి వెనుక సీట్లో నిర్జీవంగా ఉన్నప్పుడు ఆమె చిత్రాలను తీశారు'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
నెగటివ్ కవరేజ్
2019 అక్టోబరు నాటి ప్రిన్స్ హ్యారీ ప్రకటనకు విరుద్ధంగా కేటీ ''డయానాను వెంబడించినట్లుగా మేగన్‌ను పత్రికా ఫొటోగ్రాఫర్లెవరూ వెంబడించడం లేదు'' అన్నారు.
అయితే, మేగన్‌ను విమర్శిస్తూ వస్తున్న కథనాలతో విసిగిపోయిన హ్యారీ ఈ ప్రకటన చేసి ఉంటారని కేటీ అన్నారు.
''తన భార్య గురించి క్రమం తప్పకుండా వ్యతిరేక కథనాలు వెలువరిస్తున్నారని భావిస్తున్న పాత్రికేయులను ఆయన విమర్శిస్తున్నారు''
''మేగన్ దుబారా గురించి అనేక వ్యతిరేక కథనాలొచ్చాయి. దేశంలో పన్నులు కట్టేవారి డబ్బులను వృథా చేస్తూ తమ ఇంటికి కొత్త హంగులు దిద్దుతున్నారని, డిజైనర్ దుస్తుల కోసం ఆమె వేల పౌండ్లు ఖర్చు చేస్తున్నారని కథనాలు వచ్చాయి''

ఫొటో సోర్స్, Getty Images
మేగన్ తనపై అందరి దృష్టి ఉండాలని కోరుకుంటూ ఉండొచ్చని.. ఆమె డయానాలా కాకుండా రాజ కుటుంబీకుడిని పెళ్లాడడానికి ముందే సెలబ్రిటీ అని పలువురు చెబుతారు.
''వివాహానికి ముందే ఆమెది సెలబ్రిటీ లైఫ్ స్టైల్.. రాజ కుటుంబంలోకి రావడం వల్ల ఆమె ఇప్పుడలాంటి లైఫ్ స్టైల్‌లోకి వచ్చారని నేను భావించడం లేదు'' అంటారు కేటీ.
''అయితే, ఆమె పెళ్లికి ముందే సెలబ్రిటీ అయినప్పటికీ ఏంజెలినా జూలీ, నికోల్ కిడ్మన్ మాదిరి టాప్ యాక్ట్రెస్ ఏమీ కాదు. ఇంత పబ్లిసిటీ ఆమెకు ముందెన్నడూ లేదు. రాజకుటుంబంలోని మిగతావారిపై మీడియా దృష్టి ఉన్నట్లే ఈమెపైనా ఉంది. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కూడా పత్రికలవారితో ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి'' అన్నారు కేటీ.
హ్యారీ, మేగన్ దంపతులంటే ప్రజలకు ఆసక్తి ఉంది.. అయితే, దానికి ఒక పరిమితి ఉంటుంది. రాజకుటుంబానికి సంబంధించిన అంశాలను కవర్ చేయడం మీడియా విధి కావొచ్చు కానీ అది ఒక పద్ధతి ప్రకారం, నిష్పాక్షికంగా ఉండాలని కేటీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- అల వైకుంఠపురములో సినిమా రివ్యూ
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- డబ్బుతో పని లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- 2019లో అంతరిక్ష అందాలను కళ్లకు కట్టిన అత్యద్భుత ఛాయా చిత్రాలు ఇవి
- ధనత్రయోదశి: బంగారం కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనా
- నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








