బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
'ఆర్థిక స్వాతంత్ర్యం'తో రాజకుటుంబంలో సభ్యులుగా ఉంటామని ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతులు చెప్తున్నారు. మరి ప్రస్తుతం వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతులు.. తమ రాజవిధుల నుంచి వైదొలగుతున్నామని ప్రకటించటం సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. రాజవంశం నివసించే బకింగ్‌హామ్ ప్యాలస్‌ను కలత పెట్టింది.
డ్యూక్ ఆఫ్ ససెక్స్ హ్యారీ, డచెస్ ఆఫ్ ససెక్స్ మేగన్‌లు.. తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ విషయం ప్రకటించారు. రాజకుటుంబంలో 'సీనియర్ సభ్యుల' హోదా నుంచి తాము వైదొలగుతున్నామని, తమ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తామని వారు చెప్పారు.
మరైతే.. ఇప్పుడు వారికి అవసరమైన డబ్బులు ఎలా వస్తున్నాయి? భవిష్యత్తులో తమ జీవనానికి అవసరమైన వ్యయాన్ని ఎలా సంపాదించుకోవాలన్నది వారి ప్రణాళిక?
ప్రస్తుతం హ్యారీ, మేగన్‌లకు డబ్బులు ఇచ్చేది ఎవరు?
ఈ దంపతులు తమకు లభించే నిధుల్లో 95 శాతం ప్రిన్స్ ఆఫ్ వేల్స్ - అంటే హ్యారీ తండ్రి చార్లెస్ నుంచి వస్తున్నాయని చెప్తున్నారు.
ప్రిన్స్ హ్యారీ, మేగన్ దంపతులతో పాటు.. ప్రిన్స్ విలియం, కేథరీన్ దంపతుల ప్రజా విధులకు సంబంధించిన వ్యయంతో పాటు.. వారి వ్యక్తిగత ఖర్చుల్లో కొంత మేర ప్రిన్స్ చార్లెస్ చెల్లిస్తారు.
మేగన్ అధికారికంగా రాజకుంటుంబంలో చేరిన 2018-19 సంవత్సరంలో ప్రిన్స్ చార్లెస్ నుంచి హ్యారీ, మేగన్ దంపతులకు లభించిన నిధులు దాదాపు 50 లక్షల పౌండ్లుగా (సుమారు రూ.46 కోట్లు) ఉన్నాయి.
ప్రిన్స్ చార్లెస్‌కు డచీ ఆఫ్ కార్న్‌వెల్‌లో భాగంగా గల విస్తారమైన ఆస్తులు, ఆర్థిక పెట్టుబడుల నుంచి లభించే ఆదాయం నుంచి ఈ నిధులు కేటాయించారు. గత ఏడాది డచీ ఆఫ్ కార్న్‌వెల్ ద్వారా 2.16 కోట్ల పౌండ్ల (సుమారు రూ.200 కోట్ల) ఆదాయం లభించింది.
ఇక డ్యూక్, డచెస్ ఆఫ్ ససెక్స్‌ల ఆదాయంలో దాదాపు 5 శాతం.. సావరీన్ గ్రాంట్ నుంచి అందుతాయి. సావరీన్ గ్రాంట్ అంటే.. రాజ కుటుంబం అధికారిక విధులకు, రాజ ప్రసాదాల నిర్వహణకు అయ్యే వ్యయం కోసం ప్రభుత్వం చెల్లించే నిధులు.
వీరి భద్రతా వ్యయాలు అదనం. దానికి వేరేగా కేటాయింపులు జరుగుతాయి.
ఈ సావరీన్ గ్రాంట్‌కు నిధులను.. క్రౌన్ ఎస్టేట్ ద్వారా లభించే లాభాల నుంచి కేటాయిస్తారు. క్రౌన్ ఎస్టేట్ అంటే.. క్రౌన్ యాజమాన్యంలోని - రాజవంశం యాజమాన్యంలోని వాణిజ్య ఆస్తులు.
రాచరిక విధుల నుంచి తప్పుకోవటం ద్వారా.. ఈ నిధులు తీసుకోవటం నిలిపివేస్తామని హ్యారీ, మేగన్‌లు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత?
మేగన్ ఆస్తుల మొత్తం విలువ సుమారు 50 లక్షల డాలర్లు (సుమారు రూ.35 కోట్లు)గా ఫార్చ్యూన్ మేగజీన్ అంచనా వేసింది.
అది.. లీగల్ డ్రామా 'సూట్స్'లో నటించటం ద్వారా ఆమె సంపాదించారని.. ఒక్కో ఎపిసోడ్‌కి 50,000 డాలర్ల చొప్పున పారితోషికంగా ఆర్జించారని చెప్తారు.
మేగన్ ఒక లైఫ్‌స్టైల్ బ్లాగ్ కూడా నడిపారు. ఒక కెనడా బ్రాండ్‌కు తన సొంత ఫ్యాషన్ డిజైన్‌ను కూడా అందించారు.
ఇక హ్యారీ ఆస్తి విలువ కనీసం 2.50 కోట్ల డాలర్లు (సుమారు రూ.177 కోట్లు) ఉంటుందని 'వెల్త్ ఎక్స్' అనే విశ్లేషకులు అంచనా వేశారు.
హ్యారీ, ఆయన సోదరుడు విలియంల ఆస్తుల్లో సింహ భాగం.. వారి తల్లి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా ద్వారా లభించింది.
హ్యారీకి 2014లో 30 ఏళ్లు వచ్చినపుడు.. డయానా నెలకొల్పిన ఒక ట్రస్ట్ ఫండ్ ద్వారా ఆయనకు కోటి పౌండ్లు లభించాయని ఫార్చ్యూన్ మేగజీన్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
'ఆర్థిక స్వాతంత్ర్యం' అంటే అర్థమేమిటి?
సావరీన్ గ్రాంట్ తీసుకోవటం తాము ఆపివేస్తామని.. అది తమ ఆదాయం మొత్తంలో 5 శాతం వరకే ఉంటుందని హ్యారీ, మేగన్‌లు తమ వెబ్‌సైట్‌లో చెప్పారు.
అయితే.. ఇతర రూపాల్లో తమకు అందే నిధులను కూడా వదులుకుంటారా లేదా అనే అంశం మీద స్పష్టత లేదు.
ఈ దంపతులకు ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే మెట్రోపాలిటన్ పోలీస్ అందించే భద్రత కొనసాగుతుంది. అందుకు అయ్యే వ్యయాన్ని ఆ సంస్థ వెల్లడించదు.
ఉత్తర అమెరికా - బ్రిటన్‌ల మధ్య ప్రయాణించాలన్నది తమ అభిలాషగా ఈ దంపతులు చెప్పారు. అందుకు మరింత వ్యయం అవుతుంది. అయితే ఈ వ్యయాన్ని వీరే చెల్లించే అవకాశముంది.
తమ ప్రైవేటు ప్రయాణాలకు అయ్యే ఖర్చును ఎల్లప్పుడూ తామే భరిస్తున్నామని ఈ దంపతులు చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. అంటే.. అధికారిక పర్యటనల కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించటం కొనసాగుతుందని ఈ విషయం సూచిస్తోంది.
బ్రిటన్‌లో తమ ఇల్లైన విండ్సర్‌లోని ఫ్రాగ్మోర్ కాటేజ్‌ని వీరు తమ వద్దే ఉంచుకుంటారు. ఈ ఇంటిని గత ఏడాది 24 లక్షల పౌండ్ల (సుమారు రూ.22 కోట్ల) ప్రభుత్వ నిధులతో నవీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజవంశీకులు సొంతంగా ఆర్జించేందుకు అనుమతి ఉందా?
రాజవంశంలో సీనియర్ సభ్యులుగా హ్యారీ, మేగన్‌లు ఏ రూపంలోనైనా ఆదాయం ఆర్జించటానికి అనుమతి లేదు.
అయితే.. రాజ కుటుంబంలో పూర్తి కాలపు ఉద్యోగాలు చేస్తున్న ఇతర సభ్యులు ఉన్నారన్న విషయాన్ని ఈ దంపతులు ఉటంకిస్తున్నారు.
ఉదాహరణకు.. ప్రిన్సెస్ బియాట్రిస్, ప్రిన్సెస్ యూజినీలు ''విధుల్లో ఉన్న రాజవంశీకులు'' కాదు.
అంటే.. రాజ కుటుంబ సభ్యులుగా వారు అధికారిక ప్రజా విధులు నిర్వర్తించరు.
ప్రిన్సెస్ బియాట్రిస్ ఆర్థిక విభాగంలో పనిచేస్తున్నారు. ప్రిన్సెస్ యుజినీ ఒక ఆర్ట్ గ్యాలరీకి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
అయితే.. వీరికి సంబంధించిన కొన్ని ఖర్చులను - 2018లో ప్రిన్సెస్ యూజినీ వివాహానికి భద్రత వంటివి ప్రభుత్వ ఖజానా నుంచే భరిస్తారు.
హ్యారీ, మేగన్‌లు భవిష్యత్తులో నిధులు ఎలా సమకూర్చుకుంటారనేది చర్చనీయాంశమని.. రాజవంశ ఆర్థిక లావాదేవీలపై ఒక పుస్తక రచయిత డేవిడ్ మెక్‌క్లూర్ పేర్కొన్నారు.
''పుస్తకాలు రాయటం ద్వారా వారు డబ్బులు సంపాదించుకోవచ్చునని నేను అనుకుంటున్నా. టెలివిజన్ ద్వారా కూడా ఆదాయం లభించవచ్చు. హ్యారీ, మేగన్‌లు ఒప్రా విన్‌ఫ్రేతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వినిపిస్తోంది. కాబట్టి.. డబ్బులు సంపాదించటానికి అదొక అవకాశం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వీరి తదుపరి అడుగులు ఎలా ఉండొచ్చు?
ఈ దంపతులు తమ భవిష్యత్ ప్రాధాన్యాలలో.. ఓ కొత్త స్వచ్ఛంద సంస్థను ప్రారంభించటం ఒకటని చెప్పారు.
వీరు గత ఏడాది.. తాము డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్‌తో భాగస్వాములుగా ఉన్న 'రాయల్ ఫౌండేషన్' నుంచి బయటకు వచ్చారు.
2009లో స్థాపించిన రాయల్ ఫౌండేషన్.. ప్రిన్స్ విలియంకు ఇష్టమైన అంశాలు - సైనిక బలగాలు, పర్యావరణ పరిరక్షణ, మానసిక ఆరోగ్యం వంటి వాటి మీద కృషి చేస్తుంది.
బ్రాండింగ్..
హ్యారీ, మేగన్ దంపతులు గత ఏడాది జూన్‌లో 'రాయల్ ససెక్స్' బ్రాండ్‌కు ట్రేడ్‌మార్క్ పొందారు. పెన్సిల్ బాక్సులు మొదలుకుని, క్రీడా కార్యకలాపాలు, విద్యా శిక్షణ వంటి డజన్ల కొద్దీ వస్తువులకు ఈ బ్రాండ్ వర్తిస్తుంది.
ప్రపంచంలో అత్యంత ప్రముఖ దంపతులు అయినందున.. వీరి బ్రాండ్‌కు విపరీతంగా ఆకర్షించగలదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో వీరి సంయుక్త అకౌంట్ @sussexroyal కి కోటి మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఇక బ్రిటన్‌లో గత ఏడాది అత్యధికంగా గూగుల్ చేసిన వ్యక్తిగా మేగన్ నిలిచారు.
ఆదాయ వనరులుగా అవకాశమున్న ఈ మార్గాల్లో దేనినైనా ఉపయోగించుకుంటారా.. అసలు ఈ దంపతులకు ఆర్థిక స్వతంత్ర్యం అవసరమవుతందా.. అన్నది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నంకు ఆ పేరు ఎలా వచ్చింది? వైజాగ్‌గా ఎలా మారింది? చరిత్ర ఏం చెబుతోంది?
- 'నోబెల్ శాంతి బహుమతి నాకు రావాల్సింది... ఎవరికో ఇచ్చేశారు' - డోనల్డ్ ట్రంప్
- విమానం చక్రాల వెనుక దాక్కుని ప్రయాణం.. పదేళ్ల బాలుడి మృతి
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
- డోనల్డ్ ట్రంప్‌ను ఇష్టపడే దేశాలు, వ్యతిరేకించే దేశాలు ఇవి.. మరి, ఇండియా ఏమనుకుంటోంది?
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి...
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








