'నోబెల్ శాంతి బహుమతి నాకు రావాల్సింది... ఎవరికో ఇచ్చేశారు' - డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి విషయంలో తన పేరు మరిచిపోయారన్న భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి.
''నోబెల్ శాంతి బహుమతి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం చెబుతాను. నేనో ఒప్పందం కుదిర్చాను. ఓ దేశాన్ని కాపాడాను. అయితే, ఆ దేశాధినేతే కాపాడారంటూ ఆయనకు ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ఇస్తున్నారు. కానీ, మీకు తెలుసు. వాస్తవమేంటనేది మనకు తెలియడమే ప్రధానం. నేనొక పెద్ద యుద్ధాన్ని ఆపాను. కొన్ని దేశాలను రక్షించాను'' అన్నారాయన.
గురువారం సాయంత్రం ఒహాయోలోని టోలెడోలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో తన మద్దతుదారులతో ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి ట్విటర్‌లో షేర్ అవుతోంది. అందులో ఆయన ఇదంతా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంతకీ ట్రంప్ ఎవరిని అన్నారు?
ట్రంప్ తన మాటల్లో నోబెల్ శాంతి బహుమతి విజేత పేరు కానీ, తాను కాపాడానని చెబుతున్న దేశం పేరు కానీ ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఆయన ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ గురించి మాట్లాడారన్నది సుస్పష్టం.
43 ఏళ్ల అబీ అహ్మద్ ఆఫ్రికా దేశాల అధినేతల్లో అత్యంత పిన్న వయస్కులు.
సుదీర్ఘకాలం సాగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల అనంతరం అప్పటి ప్రధాని రాజీనామా చేయాల్సిరావడంతో 2018 ఏప్రిల్‌లో అబీ అహ్మద్ ఆ పదవిలోకి వచ్చారు.
ప్రభుత్వ నియంత్రణలు అధికంగా ఉండే ఆ దేశంలో అబీ అహ్మద్ ప్రధాని పదవి చేపట్టాక సరళీకరణ విధానాలు అమలుచేశారు.
జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది విపక్ష యాక్టివిస్ట్‌లను విడిచిపెట్టడంతో పాటు విదేశాల్లో తలదాచుకుంటున్న అసమ్మతివాదులనూ దేశంలోకి రానిచ్చారు.
మీడియా స్వేచ్ఛగా పనిచేసుకునేలా ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు మహిళలను కీలక పదవుల్లో కూర్చోబెట్టారు.
2019 అక్టోబరులో నోబెల్ కమిటీ ఆయనకు శాంతి బహుమతి ప్రకటించింది. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తరువాత ప్రపంచంలో ఓ దేశాధినేతకు నోబెల్ శాంతి బహుమతి దక్కడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, AFP
నోబెల్ బహుమతి ఆయనకు ఎందుకిచ్చారు?
పొరుగుదేశం ఎరిట్రియాతో సరిహద్దు సంక్షోభాన్ని పరిష్కరించడంలో అబీ అహ్మద్ చూపిన నిర్ణయాత్మక చొరవకు గాను శాంతి బహుమతి ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
ఆ రెండు దేశాల మధ్య 1998-2000 మధ్య భీకర యుద్ధం జరిగింది. యుద్ధంలో వేల మంది మరణించారు. 2000లో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా 2018 జులై వరకు ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు యుద్ధాన్నే తలపించేవి.
2018 జులైలో అబీ అహ్మద్, ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయిస్ అఫ్వెర్కిల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో రెండు దశాబ్దాలుగా ఎన్నో కుటుంబాలను విడదీస్తూ, వాణిజ్య అవకాశాలు లేకుండా చేస్తూ మూసుకున్న సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయి.
ఈ శాంతి ఒప్పందం రెండు దేశాల ప్రజల మధ్య శాంతికి కారణమవుతుందని ఆశిస్తున్నట్లు నోబెల్ కమిటీ చెప్పింది. ఎరిట్రియాతో శాంతి ఒప్పందం తరువాత అబీ అహ్మద్ పలు ఇతర ఆఫ్రికా దేశాల్లోనూ శాంతి ప్రక్రియల్లో పాలుపంచుకున్నారని నోబెల్ కమిటీ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చారా
‘‘అదేం లేదు.. ఎరిట్రియా, ఇథియోపియా మధ్య శాంతి చర్చలపై అమెరికా ప్రభావం చాలా స్వల్పం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ దేశాలను కలపడంలో కీలకంగా వ్యవహరించింద’’ని ఇథియోపియాలో బీబీసీ మాజీ కరస్పాండెంట్ ఎమాన్యుయల్ ఇగుంజా చెప్పారు.
ఈ వివాదం ముగించడానికి సౌదీ అరేబియా కూడా కృషి చేసిందన్నారాయన.
2009 నుంచి ఆంక్షలను ఎదుర్కొంటూ చితికిపోయిన ఎరిట్రియాను బయటపడేసేందుకు ఈ శాంతి ఒప్పందం ఉపయోగపడింది.
శాంతి ఒప్పందం కుదిరిన నాలుగు నెలల తరువాత 2018 నవంబరులో ఐక్యరాజ్య సమితి ఎరిట్రియాపై ఆంక్షలు తొలగించింది.

ఫొటో సోర్స్, AFP
మరి, ట్రంప్ ఎందుకిలా చెప్పుకొంటున్నారు?
2019 అక్టోబరు 11న అబీ అహ్మద్‌కు నోబెల్ బహుమతి ప్రకటించారు.. డిసెంబరు 10న ఆయన నార్వేలోని ఓస్లోలో నోబెల్ కమిటీ వద్ద తన అంగీకార ఉపన్యాసం చేశారు కూడా.
అబీ అహ్మద్‌కు ఈ బహుమతి వచ్చిన తరువాత ట్రంప్ ఆయన్ను అభినందించలేదు. అయితే, ట్రంప్ కుమార్తె, ఆయన సలహదారు అయిన ఇవాంకా ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోలు మాత్రం అబీని అభినందించారు.
అయితే, అనేక ఇతర కార్యక్రమాలతో పాటు ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అణ్వస్త్రాలను వీడేలా ఒప్పించడంలో కృషి చేసినందున తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని ట్రంప్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కణాలు ఆక్సిజన్ స్థాయులను ఎలా గుర్తిస్తాయో పరిశోధించిన శాస్త్రవేత్తలకు వైద్యంలో నోబెల్
- హైదరాబాద్: 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- ఇరాన్ ప్రకటన: 'ఉక్రెయిన్ విమానాన్ని 'పొరపాటున' మేమే కూల్చాం'
- అమిత్ షా ర్యాలీలో CAA వ్యతిరేక బ్యానర్ పట్టుకున్న అమ్మాయి ఏమన్నారు...
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: నిప్పును నిప్పుతోనే నియంత్రించడం సాధ్యమా...
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








