నోబెల్ ప్రైజ్: మొబైల్ ఫోన్లలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలు అభివృద్ధి చేసిన ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ రింకన్
- హోదా, సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్ వెబ్‌సైట్
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాహనాల్లో విరివిగా వాడే లిథియం-అయాన్ బ్యాటరీల అభివృద్ధికి కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి నోబెల్ రసాయనశాస్త్ర పురస్కారానికి ఎంపికయ్యారు.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికైన జాన్ బి.గుడ్ఇనఫ్, ఎం.స్టాన్లీ విటింగ్‌హామ్, అకీరా యోషినోలలో గుడ్‌ఇనఫ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఆయన 97 ఏళ్ల వయసులో దీనికి ఎంపికయ్యారు.
నోబెల్ ప్రైజ్ చరిత్రలో అత్యధిక వయసులో ఈ పురస్కారానికి ఎంపికైన వ్యక్తి గుడ్‌ఇనఫే. ఆయన జర్మనీలో పుట్టిన అమెరికన్.
గుడ్‌ఇనఫ్ ప్రస్తుతం అమెరికాలోని ఆస్టిన్‌లో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

ఫొటో సోర్స్, U TEXAS / BINGHAMPTON / AF
లిథియం-అయాన్ బ్యాటరీలు మొబైల్ ప్రపంచ వృద్ధికి ఊతమిచ్చాయని నోబెల్ కమిటీ సభ్యుడు ఒలోఫ్ రమ్‌స్ట్రోమ్ వ్యాఖ్యానించారు.
విజేతలు ముగ్గురికీ కలిపి 90 లక్షల క్రోనార్ల (దాదాపు 6.48 కోట్ల రూపాయల) నగదు బహుమానంగా లభిస్తుంది.
లిథియం-అయాన్ బ్యాటరీ తక్కువ బరువుండే, మళ్లీ మళ్లీ ఛార్జి చేయడానికి వీలైన శక్తిమంతమైన బ్యాటరీ. ఇది 'రీఛార్జబుల్ ప్రపంచాన్ని' సృష్టించిందని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
ప్రపంచవ్యాప్తంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి, పని చేయడానికి, చదువుకోవడానికి, సంగీతం వినడానికి, విజ్ఞానాన్ని అన్వేషించడానికి వాడే అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను నడిపించేది లిథియం-అయాన్ బ్యాటరీలేనని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీ జనరల్ గోరన్ కె.హాన్సన్ మాట్లాడుతూ- ఈ బ్యాటరీల అభివృద్ధితో ప్రపంచం మరింత మెరుగ్గా మారిందన్నారు. ఈ సంవత్సరం నోబెల్ పురస్కారాల ప్రకటనకు ఇప్పటివరకు ఈ అకాడమీయే వేదిక.
సౌర శక్తి, పవన శక్తి లాంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఈ బ్యాటరీలు గణనీయంగా నిల్వ కూడా చేసుకోగలవు.
చమురు సంక్షోభ సమయంలో అంకురార్పణ
లిథియం-అయాన్ బ్యాటరీల అభివృద్ధికి 1970ల్లో చమురు సంక్షోభ సమయంలో పునాదులు పడ్డాయి.
బ్రిటన్లో జన్మించిన శాస్త్రవేత్త స్టాన్లీ విటింగ్‌హాం- పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడని ఇంధన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు కృషి సల్పారు.

ఫొటో సోర్స్, SPL
అధిక శక్తినిచ్చే 'టైటానియం డైసల్ఫైడ్' అనే మెటీరియల్‌ను విటింగ్‌హాం కనుగొన్నారు. లిథియం బ్యాటరీలో పాజిటివ్ టర్మినల్ అయిన 'కాథోడ్' తయారీకి ఆయన దీనిని ఉపయోగించారు.
బ్యాటరీలో నెగటివ్ టర్మినల్ అయిన 'యానోడ్'ను మెటాలిక్ లిథియం నుంచి విటింగ్‌హాం తయారుచేశారు. మెటాలిక్ లిథియంలో ఎలక్ట్రాన్ల విడుదల ఎక్కువ. దీంతో ఇది బ్యాటరీల్లో వాడేందుకు బాగా అనువైనదిగా నిలిచింది.
ఇలా తయారుచేసిన డివైస్ రెండు వోల్టులను మాత్రమే విడుదల చేసింది. అయితే మెటాలిక్ లిథియం వల్ల దీనికి పేలుడు స్వభావం ఏర్పడింది.
బ్రిటన్లోని నాటింగ్‌హాంలో జన్మించిన విటింగ్‌హాం వయసు 77 సంవత్సరాలు. ఆయన ప్రస్తుతం అమెరికాలోని వెస్టల్‌లో బింగాంప్టన్ విశ్వవిద్యాలయంలో సేవలందిస్తున్నారు.
టైటానియం డైసల్ఫైడ్ నుంచి కాకుండా ఒక మెటల్ ఆక్సైడ్ నుంచి క్యాథోడ్‌ను తయారుచేస్తే క్యాథోడ్ పనితీరును మెరుగుపరచవచ్చని శాస్త్రవేత్త గుడ్‌ఇనఫ్ అంచనా వేశారు.

ఫొటో సోర్స్, AFP
సరైన మెటీరియల్‌ను గుర్తించేందుకు ఆయన పరిశోధనలు సాగించారు. 1980లో కోబాల్ట్ ఆక్సైడ్‌ను ఉపయోగించి లిథియం బ్యాటరీ సామర్థ్యాన్ని రెండు వోల్టుల నుంచి నాలుగు వోల్టులకు పెంచారు.
గుడ్ఇనఫ్ రూపొందించిన క్యాథోడ్‌ను ప్రాతిపదికగా చేసుకొని, జపాన్ శాస్త్రవేత్త అకీరా యోషినో 1985లో వాణిజ్యపరంగా అనువైన తొలి లిథియం-అయాన్ బ్యాటరీని తయారుచేశారు.
71 ఏళ్ల అకీరా యోషినో ప్రస్తుతం మీజో విశ్వవిద్యాలయంలో, అసాహీ కసీ గ్రూప్‌లో పనిచేస్తున్నారు.
గత ఐదేళ్లలో 'రసాయన' నోబెల్ విజేతలు
2018: కొత్త ఔషధాల తయారీకి, పర్యావరణహిత ఇంధనాల ఉత్పత్తికి ఉపయోగపడే కొత్త ఎంజైములను సృష్టించినందుకు ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ పి.స్మిత్, గ్రెగరీ వింటర్‌లకు.
2017: జీవాణువుల అభివృద్ధి, ఇవి ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే తీరును చూడగల 'క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ' అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు జాక్వస్ డబోషెట్, జోచిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లకు.

ఫొటో సోర్స్, GAVIN MURPHY/NATURE/SCIENCE PHOTO LIBRARY
2016: శరీరంలోకి ఔషధాలను తీసుకుని వెళ్లగల ప్రపంచంలోనే అతిచిన్న యంత్రాన్ని తయారు చేసినందుకు జీన్ పియెర్రా సావేజ్, ఫ్రేజర్ స్టాడర్ట్, బెర్నార్డ్ ఫెరింగాలకు.
2015: దెబ్బతిన్న డీఎన్‌ఏను శరీరం కణాల ద్వారా సరిచేసే విధానాన్ని కనుగొన్నందుకు థామస్ లిండా, పాల్ మోడ్రిచ్, అజీజ్ సన్కార్‌లకు.
2014: ఆప్టికల్ మైక్రోస్కోప్‌ల రిజల్యూషన్‌ను మెరుగుపరిచినందుకు ఎరిక్ బీట్జ్, స్టెఫాన్ హెల్, విలియం మోఎర్నర్‌లకు.
ఇవి కూడా చదవండి:
- సమ్మెలో ఉన్న ఉద్యోగులంతా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్న కేసీఆర్.. నోటీసులు ఇవ్వకుండా ఎలా తీస్తారన్న యూనియన్లు
- గున్న ఏనుగును కాపాడబోయి చనిపోయిన ఏనుగులు అయిదు కాదు 10
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- తెలంగాణ ఆర్టీసీ సంక్షోభానికి కారణాలు, పరిష్కారాలేంటి? యూనియన్లు, ప్రభుత్వం ఏమంటున్నాయి?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








