థాయ్ జలపాతం నుంచి పడి చనిపోయిన ఏనుగులు ఆరు కాదు 11.. గున్న ఏనుగును కాపాడే ప్రయత్నంలో విషాదం

ఫొటో సోర్స్, THAILAND DNP
థాయ్‌లాండ్ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు చనిపోయిన ఏనుగుల సంఖ్య ఆరు నుంచి 11కు పెరిగింది.
జలపాతంపై నుంచి జారిపడిపోయిన గున్న ఏనుగును కాపాడే ప్రయత్నంలో ఈ ఏనుగులు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
థాయ్‌లాండ్ మధ్య ప్రాంతంలోని ఖావో యాయ్ నేషనల్ పార్క్‌లో ఉండే 'హేయూ నరోక్ (నరక జలపాతం)' వద్ద ఈ ప్రమాదం జరిగింది.
గత వారాంతంలో జలపాతం పాదం(బేస్) సమీపాన మూడేళ్ల పిల్ల ఏనుగు సహా ఆరు ఏనుగుల కళేబరాలు కనిపించాయి. దీనికి సమీపాన డ్రోన్ సాయంతో ఇప్పుడు మరో ఐదు ఏనుగుల మృతదేహాలను గుర్తించారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఏనుగుల గుంపు నది అవతలి వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని స్థానిక అధికారి బదిన్ ఛాన్‌స్రికమ్ 'రాయిటర్స్' వార్తాసంస్థతో చెప్పారు. చిన్న ఏనుగుల్లో ఒకటి జలపాతం పైనుంచి జారిపడిపోయి ఉండొచ్చని, పెద్ద ఏనుగులు దానిని కాపాడేందుకు ప్రయత్నించి నదీ ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయి ఉంటాయని తెలిపారు.
ఇటీవలి కాలంలో ఏనుగులు పెద్దసంఖ్యలో చనిపోయిన ఘటనల్లో ఇది ఒకటని బ్యాంకాక్ పోస్ట్ పత్రిక రాసింది.
ఏనుగులు ప్రవాహంలో పడిపోవడానికి కారణం తెలియదని స్థానిక మీడియా చెబుతోంది.
ఆరు ఏనుగుల కళేబరాలను గుర్తించినప్పుడు, ఇంకో రెండు ఏనుగులు కొండపై చిక్కుకుపోయి కనిపించాయి. వాటిని అధికార యంత్రాంగం కాపాడింది.

ఫొటో సోర్స్, KHAO YAI NATIONAL PARK
ఈ రెండు ఏనుగులూ శక్తి పుంజుకొని, అక్కడి నుంచి తిరిగి అడవిలోకి వెళ్లిపోయేలా చూసేందుకు వీటికి పార్క్ సిబ్బంది సప్లిమెంట్లతో కూడిన ఆహారం అందించారు.
దీర్ఘకాలంలో ఈ రెండింటి మనుగడ గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరస్పర రక్షణ, ఆహార అన్వేషణ కోసం ఏనుగులు సాధారణంగా పెద్ద పెద్ద గుంపులుగా తిరుగుతాయని, ప్రమాదం ఈ రెండు ఏనుగులపై ప్రభావం చూపిస్తుందని వైల్డ్‌లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ థాయ్‌లాండ్ వ్యవస్థాపకుడు ఎడ్విన్ వీక్ తెలిపారు.
ఈ రెండు ఏనుగుల భావోద్వేగ స్థితిపైనా ఈ ఘటన ప్రమాదం చూపించే ఆస్కారం ఉంది. గుంపులో ఏదైనా ఏనుగు చనిపోతే దాని తాలూకు బాధ మిగతా ఏనుగుల్లో కనిపిస్తుంది.
సగం కుటుంబాన్ని కోల్పోయిన భావన మిగిలిన ఏనుగులకు కలుగుతుందని ఎడ్విన్ వీక్ బీబీసీతో చెప్పారు.
థాయ్‌లాండ్‌లో సుమారు ఏడు వేల ఆసియా ఏనుగులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ఏనుగులు నిర్బంధంలోనే ఉన్నాయి.
ఈ పార్క్ ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇందులో దాదాపు 300 ఏనుగులు ఉన్నాయి. ఎలుగుబంట్లు, గిబ్బన్‌లు అనే ఏప్‌లు, ఇతర వన్యప్రాణులు ఇక్కడ ఉన్నాయి.
'హేయూ నరోక్' వద్ద ఇలాంటి ఘోర ప్రమాదాలు ఇంతకుముందు కూడా జరిగాయి.
1992లో జలపాతం పైనుంచి పడి ఒక గుంపులోని మొత్తం ఎనిమిది ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటనపై అప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఇవి కూడా చదవండి:
- మనుషుల జీవిత కాలం తగ్గిపోతోందా...
- ఉత్తరాంధ్రలో ఏనుగుల గుంపులు, బెంబేలెత్తుతున్న ప్రజలు
- ఒరాంగుటాన్ శాండ్రా: ఇది జంతువు కాదు, మానవ హక్కులున్న మనలాంటి మనిషే'
- ఒకేసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టించాలనే భారత్ ప్రయత్నం నెరవేరుతుందా?
- సమ్మెలో ఉన్న ఉద్యోగులంతా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్న కేసీఆర్.. నోటీసులు ఇవ్వకుండా ఎలా తీస్తారన్న యూనియన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








