ఉత్తరాంధ్రలో ఏనుగుల గుంపులు: దాడి సంకేతాలను ముందే గుర్తించడం ఎలా

- రచయిత, విజయ్ గజం, బీబీసీ కోసం
- హోదా, సంగీతం ప్రభాకర్, ప్రొడ్యూసర్
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఏనుగులు వణికిస్తున్నాయి. ఏనుగుల గుంపులు పంట చేలను నాశనం చేయడంతో పాటు, అప్పుడప్పుడూ మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి.
రెండు నెలల్లో ఐదుగురు వ్యక్తులు ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏనుగుల విధ్వంసం గురించి తెలుసుకొనేందుకు బీబీసీ తెలుగు బృందం పార్వతీపురం అటవీ ప్రాంతంలో పర్యటించింది.
ఏనుగుల స్వైరవిహారం
విజయనగరం జిల్లా పార్వతీపురం అటవీ రేంజ్ పరిధిలో ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒడిశాలోని లకేరీ అభయారణ్యం నుంచి ఎనిమిది ఏనుగుల గుంపు 2017లో విజయనగరం వచ్చింది. వాటిలో రెండు చనిపోగా, ఆరు ఏనుగులు తిరుగుతున్నాయి. ఇవేకాకుండా, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంతంలో మరో నాలుగు ఏనుగుల గుంపు తిరుగుతోంది.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలను ఇవి నాశనం చేశాయి.
విజయనగరం జిల్లాలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తున్న కురుపాం, పార్వతీపురం, కొమరాడ, జియమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లోని 40 గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. ఏనుగుల వల్ల ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి, జామ తోటలతో పాటు వరి, చెరకు, కూరగాయలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వ్యవసాయం మానేయాలేమో
''వరి వేస్తే నష్టాలు ఎక్కువ వస్తున్నాయని, బొప్పాయి, జామలాంటి పళ్లు, కూరగాయల పంటలు వేశాం. ఇప్పుడు ఏనుగులు ఆ తోటలను నాశనం చేశాయి. మా బొప్పాయి తోటతో పాటు, పక్క రైతుల కూరగాయల పంటలను కూడా ధ్వంసం చేశాయి" అని బాలకృష్ణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
"ఏనుగులు కుమ్మరి గుంటలోని అరటి తోటలో తిష్టవేశాయి. ఎనిమిది రోజులు నరకం చూపించాయి. చెదరగొడదామంటే దాడిచేసి చంపేస్తాయని భయం. వాటి బలం ముందు మేమెంత? మరోసారి ఏనుగులు ఇటు వచ్చాయంటే ఇక మేమంతా వ్యవసాయం మానెయ్యాల్సిందే'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
బాలకృష్ణ ఒక్కరే కాదు, ఇక్కడ ఏ రైతును కదిలించినా ఇదే ఆవేదన.
"ఏనుగులు పంటచేలను నాశనం చేయడమే కాదు, ఎంతో ఖర్చుపెట్టి వేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. విద్యుత్ స్తంభాలను కూల్చేస్తున్నాయి. పొలానికి రావాలంటేనే శ్మశానానికి వచ్చినట్లు భయపడాల్సి వస్తోంది" అన్నారు మరో రైతు అచ్యుతరావు.
ఏనుగుల వల్ల ఒక్క విజయనగరం జిల్లాలోనే ఈ ఏడాది 1,736 ఎకరాల్లో పంట ధ్వంసమైంది. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
విజయనగరం జిల్లాలో ఏనుగుల కారణంగా నష్టపోయిన 1100 మంది రైతులకు అధికారులు ఈ ఏడాది ఇప్పటిదాకా రూ. 80 లక్షల వరకూ పరిహారం అందించారు. మరో రూ.23 లక్షల వరకూ పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపించారు.
ఈ రెండు జిల్లాల్లో గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో 10 మంది దాకా చనిపోగా, గడచిన రెండు నెలల్లోనే విజయనగరంలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు మరణించారు.

వాతావారణం బాగుందని ఇక్కడే సెటిలైపోయాయి
పదేళ్ల క్రితం ఒడిశాలోని లఖేరీ అభయారణ్యం నుంచి ఏనుగులు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు ప్రాంతాలు ఒడిశాను ఆనుకొని ఉండటంతో పర్లాకిమిడి మీదుగా శ్రీకాకుళం, అక్కడి నుంచి విజయనగరంలోకి ఈ ఏనుగుల గుంపులు ప్రవేశిస్తున్నాయి.
గతంలో ఏనుగులు వచ్చినా, మళ్లీ తిరిగి ఒడిశా వెళ్లిపోయేవి. కానీ, రెండేళ్ల క్రితం విజయనగరం వచ్చిన 8 ఏనుగుల గుంపు మాత్రం కురుపాం, పార్వతీపురం అటవీ ప్రాంతాల్లో తిష్ట వేసింది.
వీటిని తిరిగి ఒడిశాకు పంపాలని అధికారులు ప్రయత్నించినా ఆశించిన ఫలితం లేదు. విజయనగరం జిల్లా అటవీ ప్రాంతం ఏనుగులకు అనుకూలంగా ఉండటం ఆహారం, నీరు పుష్కలంగా దొరకడంతో అవి ఇక్కడే ఉండిపోయాయి.
అయితే, ఈ ఏనుగుల గుంపులో రెండు ఏనుగులు వివిధ కారణాలతో మరణించాయి. మిగిలిన ఆరు ఏనుగులు నదీ పరివాహక ప్రాంతాల్లో తిరుగుతూ పంటలు చేతికి అందకుండా చేస్తున్నాయి.

గజరాజుల స్టైలే వేరు
ఏనుగులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. తమ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నీరు ఎక్కడుందో పసిగట్టగలవు. రెండు కిలోమీటర్ల పరిధిలో ఆహారం ఎక్కడుందో కనిపెట్టగలవు. మనుషుల వాసనను కూడా పసిగడతాయి.
సాధారణంగా ఉదయం పూట ఏనుగులు బయటకు రావు. సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో నీళ్లు తాగి రాత్రి సమయంలో పొలాలు, పంటల మీద పడుతుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ ఏనుగులు దాడి చేసే స్టైల్ కూడా విభిన్నంగా ఉంటుందని, అవి మనిషుల మీద దాడి చేయబోతున్నాయని ముందుగానే తెలుసుకోవచ్చని అటవీ అధికారులు అంటున్నారు.
ఈ ఏనుగులకు కోపం వస్తే, అందుకు గుర్తుగా మొదట కాలు దువ్వుతాయి. ఆ తరువాత వాటికి ఆగ్రహం మరింత పెరిగితే, అందుకు సంకేతంగా చెవులను ముందుకూ వెనక్కూ ఊపుతాయి. కాలు దువ్వి మట్టిని తల మీద, వీపు మీద వేసుకుంటాయి. ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కి వేస్తాయి. తొండాన్ని పైకెత్తి తల ఊపుతాయి.
ఈ సంకేతాలు కనిపించాయంటే ఇక ఆ ఏనుగు దాడికి సిద్ధపడినట్లే అర్థం. ఏనుగులు నేరుగా మనిషి తలమీదే దాడి చేస్తాయి.

ఏనుగులకు ముద్దు పేర్లు
ఈ ఏనుగుల కదలికలను నిత్యం పరిశీలిస్తున్న అటవీ అధికారులు వాటికి పేర్లు కూడా పెట్టేశారు. ఎప్పుడూ దాడికి సిద్ధంగా ఉండే హరి (పైన వీడియోలో కనిపించేది ఈ ఏనుగే.. మేము వీడియో తీసే సంద్భంలో మా మీదికి దూసుకొచ్చింది) ఈ గుంపును ముందుండి నడిపిస్తాడు.
గుంపు రెండో లీడర్‌గా కూర్మ అనే ఏనుగు ఉంటుంది. ఇది దొంగచాటుగా దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అన్నిటి కంటే పెద్ద ఏనుగు రాజ్యలక్ష్మి అని, మధ్య ఏనుగును సాయమ్మ అని పిలుస్తారు ఇక్కడి అధికారులు. చిన్న ఏనుగులను రెండింటినీ బుడతలు అంటారు.
ఆ పేర్లతో అధికారులు పిలిచినప్పుడు ఏనుగులు స్పందించడం విశేషం.
2018 సెప్టెంబర్ 7న విజయనగరంలోకి ఏనుగులు వచ్చాయని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
"ఏనుగులు ప్రజల మీద దాడి చేయకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలలో 'యాంటీ డిప్లటేషన్ ప్లాంట్స్' ఏర్పాటు చేశాం. యాంటీ డిప్లటేషన్ ప్లాంట్స్ అంటే ఎలిఫెంట్ ట్రాకర్లు, అధికారులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేసేందుకు వేసిన కమిటీ. ఏనుగులు తిరుగుతున్న గ్రామాల్లోని ఇద్దరు ముగ్గురు యువకులకు అవి వస్తున్నప్పుడు ఎలా ఉండాలనే విషయంపై శిక్షణ ఇచ్చాం. దీంతో కొంతమేర ప్రమాదాలు తగ్గాయి. రాత్రి వేళల్లో ప్రజల సహకారంతో కారం, ఎండు మిరపకాయలతో మంటలు వేయడం, వాడిన ఆయిల్‌ను గోనె సంచులలో వేయడం వల్ల వచ్చే వాసనకు ఏనుగులు రాకుండా చూస్తున్నాం. గ్రామాల్లోకి రాకుండా టపాసులు, బాంబులు కాలుస్తున్నారు. దాంతో ఏనుగులు దూరంగా వెళ్లిపోతున్నాయి" అని ఎలిఫెంట్ మానిటరింగ్ సెల్ అధికారి ప్రేమ వివరించారు.

"ఏనుగుల కదలికలను పర్యవేక్షించే కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. జిల్లాలోని అన్ని అటవీ రేంజ్‌లకు చెందిన సిబ్బందితో ఏనుగుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ఏనుగులు గ్రామానికి వస్తే విద్యుత్‌ను ఆపించడం, ప్రజలకు హెచ్చరికలు చేసేందుకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో గ్రామాలలో దండోరాలు వేయించడం వంటివి చేస్తున్నాం. 30 మంది యువకులతో ఎలిఫెంట్ ట్రాకర్స్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. ప్రధానంగా ఏనుగులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకోవడంతో పాటుగా అవి ఎక్కడ సంచరిస్తున్నాయో కనుక్కొని అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడం వారి పని'' అని ప్రేమ చెప్పారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు.
''గతంలో అనేకసార్లు ఏనుగులను ఒడిశా అడవులకు పంపాలని ప్రయత్నించి విఫలం అయ్యాం. ఏనుగుల కొసం ప్రత్యేకంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. పార్వతీపురం మండలం జంతికొండ ప్రాంతంలో 1,300 ఎకరాల విస్తీర్ణంలో అడవి వుంది. అక్కడ ఏనుగులకు సరిపడినంతగా ఆహారంతో పాటు, ఏనుగులు బాగా ఇష్టపడే వెదురు వంటివి సమృద్ధిగా దొరుకుతాయి. ఇక్కడ ఎప్పుడూ నీరు ఉండేలా చెరువులను తవ్వించడంతో పాటూ ఇతర సదుపాయాలు కల్పించాలనుకుంటున్నాం. ఆ జంతికొండ అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు బయటకు రాకుండా సోలార్ ఫెన్సింగ్‌తో పాటు, ట్రెంచ్‌లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే, ఆ ప్రాంతాన్ని సాంచురీగా మారుస్తాం. దాని వల్ల కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి'' అని జిల్లా అటవీశాఖ అధికారి డీఎఫ్ఓ లక్ష్మణ రావు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాంధ్ర: కనీస సౌకర్యాలను నోచుకోని గిరిజన పల్లెలు
- ఉత్తరాంధ్ర వలసలు: ‘ఏ దేశం వెళ్లినా ఈ మూడు జిల్లాల వలస కార్మికులు కనిపిస్తారు’
- చిదంబరం అరెస్టుకు.. తొమ్మిదేళ్ల కిందట అమిత్‌షా అరెస్టుకు సంబంధమేమిటి
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- ఎడిటర్స్ కామెంట్: ప్రత్యేక హోదా.. మళ్లీ అదే డ్రామానా? మార్పేమైనా ఉంటుందా?
- సిక్కోలు మత్స్యకారులు బంగాళాఖాతాన్ని వదిలి పాక్ తీరం దాకా ఎందుకెళ్తున్నారు? అక్కడ అరెస్టయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?
- E69: ఈ హైవే ఎక్కితే ప్రపంచం అంచులకు వెళ్తాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










