ఈమె అమ్మాయిల ముఖాలకు ముసుగేసి ఫొటోలు ఎందుకు తీస్తున్నారు

ఫొటో సోర్స్, SHAMS JERIN
మహిళలుగా.. మేం అందంగా కనిపించాలి అన్న ఒత్తిడి మాపై ఉంటుంది'' అని 29 ఏళ్ల హబీబా నౌరోజ్ అంటున్నారు. 29 ఏళ్ల హబీబా ఒక ఫొటోగ్రాఫర్. బంగ్లాదేశ్‌లో మహిళలు.. తాము ఆకర్షణీయంగా కనిపించడం కోసం వారు ఎదుర్కొంటున్న ఒత్తిడిని చిత్రించడానికి హబీబా ప్రయత్నిస్తున్నారు.
''అందంగా కనిపించాలన్న ప్రయత్నంలో మమ్మల్ని మేము కోల్పోవలసివస్తోంది. మాకు మేము అనామకులుగా మిగిలిపోతున్నాం. మా అస్తిత్వం మరుగున పడుతోంది'' అని హబీబా అన్నారు.
హబీబా ఫొటోల్లోని మహిళలు మంచి శరీర వర్ఛస్సు కలిగి ఉంటారు. కానీ వారి ముఖాలు మాత్రం కనిపించవు. బాహ్యసౌందర్యం కోసం ప్రయత్నించి.. ప్రయత్నించి, ఆత్మను కోల్పోయాం అన్న భావన ప్రతిఫలించేలా, ముఖాలు కనిపించకుండా ముసుగు ధరించి ఉంటారు.

ఫొటో సోర్స్, HABIBA NOWROSE
అలా ముసుగు ధరించిన మహిళలను ఆమె ఫొటోలు తీస్తున్నారు.
'ఇతరుల ఆనందం కోసం బంగ్లాదేశ్ మహిళలు ఎలా రాజీ పడవలసి వస్తోందో..' ఆ అంశంపై అందరి దృష్టినీ మళ్లించడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.
జీవితంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం నుంచి ఈ ఆలోచన పుట్టిందని బీబీసీతో మాట్లాడుతూ హబీబా చెప్పారు.

ఫొటో సోర్స్, HABIBA NOWROSE
''యూనివర్సిటీలో చదువు పూర్తయ్యాక, నా చుట్టూవున్నవాళ్లకు నాపై ఎన్నో అంచనాలు ఉండటం గమనించాను. చదువయ్యాక పెళ్లి చేసుకోవాలి, మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించాలి ఇలా ఎన్నో ఆశలు, అంచనాలు. నాకు మాత్రమే కాదు.. నా చుట్టూవున్న ఎందరో అమ్మాయిల పరిస్థితి ఇలానే ఉండటం చూశాను. నిజంగా వాళ్లకు ఏం కావాలో కూడా మరచిపోయేట్లు చేస్తారు'' అని హబీబా అన్నారు.
ఫొటోగ్రాఫర్‌గా జీవితం ప్రారంభించిన మొదటి ఏడాదిలో ఎంత కష్టపడి పని చేనిసినా, తనకు గుర్తింపు రాలేదంటారు హబీబా.

ఫొటో సోర్స్, HABIBA NOWROSE
''ఉద్యోగంలో.. ఒక మహిళ తనను తాను నిరూపించుకోవాలని భావిస్తే, ఒక పురుషుడి కంటే రెండింతలు ఎక్కువగా కష్టపడాలి. ఒక మనిషిగా నా అస్తిత్వం కోల్పోతున్నట్లు అనిపించేది. అప్పటినుంచి నా ఆనందం కోసం పనిచేయడం మొదలుపెట్టాను'' అని హబీబా అన్నారు.
ఫొటోగ్రాఫర్‌గా 6 సంవత్సరాలు పని చేశాక, 'Concealed' (గుప్తమైన) పేరుపై, మహిళల ఫొటో సిరీస్ ప్రారంభించారు.
''నాకు, నా తోటి మహిళలకు ఎదురైన చేదు అనుభవాలను వ్యతిరేకిస్తూ, మహిళలపై ఇతరుల ఆశలు, అంచనాలను విభేదిస్తూ ఈ సిరీస్‌ను ప్రారంభించాను'' అని హబీబా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, HABIBA NOWROSE
హబీబా.. తన ఫొటోలను 2016లో ఢాకాలో ప్రదర్శించారు. ఆ ప్రదర్శన పట్ల చాలామంది ఆసక్తి కనబరిచారు. ఈ ఫొటోల వెనకున్న సందేశాన్ని మహిళలు సులువుగానే అర్థం చేసుకున్నారు కానీ, పురుషులకు కాస్త వివరించాల్సి వచ్చిందని హబీబా అంటున్నారు.

ఫొటో సోర్స్, HABIBA NOWROSE
''నేను చెప్పాలనుకున్న విషయాన్ని మహిళలు త్వరగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ విషయం చాలామంది మహిళలకు అనుభవమై ఉంటుంది. కానీ పురుషులకు ఇలాంటి అనుభవం లేకపోవడం సహజమేకదా..''

ఫొటో సోర్స్, HABIBA NOWROSE
బంగ్లాదేశ్‌లో ఎక్కువమంది మహిళా ఫొటోగ్రాఫర్‌లు లేరు. అది కూడా ఒక సమస్య. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయని హబీబా అంటున్నారు.
''మహిళా ఫొటోగ్రాఫర్ల సృజనాత్మకతకు విలువ ఇచ్చే వ్యక్తులు కూడా ఈ రంగంలో ఉంటారు. బంగ్లాదేశ్ మహిళలు ఎప్పటిలాగే బలవంతులుగా ఉండాలని, మిత్రులెవరో, శత్రువులెవరో పసిగట్టగలిగేలా ఉండాలని ఆశిస్తున్నాను'' అని హబీబా అన్నారు.
ఇంటర్వ్యూ: షైదుల్ ఇస్లామ్, బీబీసీ బెంగాలి
ఇవి కూడా చదవండి
- సౌదీ కథలు: 'ఆ నరకం భరించలేక ఏందన్నా తాగి సచ్చిపోదాం అనిపిస్తుంది సార్’
- తెలుగునాట కుల రాజకీయాలు: ఆ రెండు కులాల మధ్యే ప్రధాన పోటీ
- Reality Check: నరేంద్ర మోదీ హామీలు నిలబెట్టుకున్నారా?
- ఆ ఊళ్లో బతకాలంటే ఆపరేషన్ తప్పనిసరి
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- ‘లేపాక్షి’తో ఎకరం 3 లక్షల నుంచి 30 లక్షలకు పెరిగింది కానీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








